13, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఏం పేరది

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
ఏం పేరది ? ట్రిప్లికేనా! ఎక్కడుంది ?
..................................................

భారతీయులకు ముఖ్యంగా పదహారణాల తెలుగువారికి భావదాస్యమెక్కువనే చెప్పాలి. ఇంగ్లీషువాడి కట్టుబట్టలను తెలుగోడు ఆచరించినట్టుగా ఇతరులెవరు ఆచరించరు.
అప్పటి ఇంగ్లీషువాడి మాటలను పదాలను నూటికి నూరుశాతం ఇంతవరకు తెలుగుభుజాల పైన మోస్తూనేవున్నాడు.

తెల్లోడికి తెనుగు పలకటానికి నోరు తిరక్క తెలుగు ఎలా వ్రాయాలో అర్థంకాక తనకు వచ్చినరీతిలో పలికడం, వ్రాసుకోవడం జరిగింది. అది వాడి సౌలభ్యమనుకోవాలి.

 మనవారికేమైంది తెలుగు స్వచ్ఛంగా పలకడం, శుభ్రంగా వ్రాయడం వచ్చుకదా! 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా వారి భావజాలాన్ని శరీరంపైన మనసులోనా మోస్తూనేవున్నాడు.

ఉదా॥ కొన్ని గ్రామనామాలు చూడండి.

సామర్లకోటను వాడు సామల్ కోట్ అంటే మనం కూడా నిర్లజ్జగా సామల్ కోట్ అంటున్నాం.
విజయనగరాన్ని విజియనగరం (Vizianagaram) అంటే మనం బుద్ధిలేకుండా అలానే వ్రాస్తూ పలుకుతున్నాం.
నూజివీడును వాడు Nuzvid అంటే అహాఓహో ఎంతమంచి పేరని అహ్వానిస్తున్నాం.
కందనవోలును కర్నూలు అనంటే చిత్తం దోర అంటూ కుర్నూల్ అని (Kurnool) వ్రాసుకొంటూ సంబరపడిపోతున్నాం.
గుత్తిని గూటి అనంటే ఇదే అసలైనపేరని మనం కోడైకూస్తున్నాం.
కూడేరు ను కుడైర్ అనంటే ఇంతకంటే మంచి పేరులోకంలోనే లేదని ఎలుగెత్తి చాటి వ్రాసుకొంటున్నాం.

ఇవన్ని ఒకెత్తైతే ఇంగ్లీసువాడి నోట్లో ఊడిపడ్డామా అనేటట్టుగా హైడ్రాబ్యాడ్ (హైదరాబాదు) అనంటపూర్ (అనంతపురం) ఈస్ట్ గోడావరి (తూ.గో) వెస్ట్ గోడావరి (ప.గో) హిండూపూర్ ( హిందూపురం) అని పలుకుతూ తెగ ఆనందపడిపోతున్నాము.
ఇలా మనం భ్రష్టుపట్టిస్తున్న పదాలు ఒకటా ? రెండా ? పదులా ? కాదు కాదు వందలలోనే వున్నాయి.

తెలుగు అకార, ఉకార, ఇకారంతమైన రమ్యమైన భాష. అంటే పదంలోని చివరి అక్షరం అ,ఉ,ఇ లతో అంతమైవుంటుంది. అలాగే పలకాలి కూడా.

ఉదా|| రాజంపేట్, ఖాదర్ పేట్, హైదరాబాద్, పాయకారావుపేట్, అనంతపూర్, కర్నూల్‌, గుంటూర్ అని పలుకరాదు, వ్రాయరాదు. రాజంపేట, ఖాదరు పేట, హైదరాబాదు . పాయకారావుపేట అనంతపురం, కర్నూలు, గుంటూరు, గుంతకల్లు, కొత్తపేట, వరంగల్లు, కరీంనగరు, ఖమ్మము అనే పలకాలి,వ్రాయాలి కూడా.

ఇకపోతే చెన్నైనగరంలో ట్రిప్లికేన్ (Triplicane) అనే వీధివుంది. ట్రిప్లికేన్ అసలు పేరు. తిరువల్లిక్కేణి. తమిళంలో తిరు అంటే పవిత్రమైన, శ్రీ అనే అర్థముంది. అల్లి అంటే పద్మమని, కేణి అంటే సరస్సు, కోనేరు అనే అర్థముంది. ఇక్కడ పల్లవులకాలం నాటి పార్థసారథి దేవాలయముంది. ఇక్కడి కోనేరులో దొరికే పద్మాలు స్వచ్ఛమైనవి, అంచేత వీటిని పార్థసారథి మూలవిరాట్టుకు భక్తులు సమర్పించేవారు. కనుక ఇక్కడున్న గ్రామానికి తిరు+ వల్లి + కేణి = తిరువల్లిక్కేణి అనే పేరు ఏర్పడింది.ఇంగ్లీషోడికి పలకడం, వ్రాయడం చేతకాక ట్రిప్లికేన్ అనంటే ఎంతమంచి పేరని ఇప్పటి నోరారా పిలుస్తున్నాం.

ఈ తిరువల్లిక్కేణి సెయింట్ జార్జి ఫోర్టు కన్నా ముందున్నదే. విజయనగర ప్రభువైన శ్రీరంగరాయలకాలంలో శ్రీకాళహస్తిని పరిపాలించే దామెర్ల వెంకటాద్రినాయుడు ఇంగ్లీషువారికి అంటే ఫ్రాన్సిస్ డే ద్వారా 1639 లో ఇపుడన్న చెన్నై ప్రాంతాన్ని ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనికి అద్దెకు ఇవ్వడం జరిగింది.

 వ్యాపారానికి పరిశ్రమల స్థాపనకు సముద్రతీరప్రాంతాన్ని తీసుకొన్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1644 లో సెయింట్ జార్జికోటను నిర్మించి ప్రధానకేంద్రంగా (రాజధానిగా) చేసుకోవడం జరిగింది. ఆ తరువాతనే మద్రాసు పట్టణం అభివృద్ధి చెందడమైంది..

1668లో తిరువల్లిక్కేణి మద్రాసులో కలవడం జరిగింది.

తెలుగు సోదరీసోదరులారా తెలుగులోనే మాట్లాడండి.

కామెంట్‌లు లేవు: