13, సెప్టెంబర్ 2020, ఆదివారం

బ్రహ్మానందం



🍁🍁🍁🍁🍁

ప్రతి మానవుని యొక్క ప్రధాన లక్ష్యం ఆనందంగా జీవించడమే. అలా భావించడం కూడా సహజమే!

 దాని కోసం జీవుడు దేహేంద్రియములతో బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలలో వెతుకుతున్నాడు.

  భ్రాంతితో తాత్కాలికమైన సుఖము, సంపదల పట్ల మోహితుడై, అనుభవిస్తూ వాటిలోనే ఆనందం ఉంది అని అనుకుంటాడు. అవే శాశ్వతం అని జీవుడిని ప్రభావితం చేస్తున్నాయి.

అసలు సమస్య జీవునిలోనే ఉంది. శాశ్వతమైన ఆనందం అనేది ఎక్కడో లేదు. ఆనందం సహజంగా లభించాలంటే, నిత్యము, శాశ్వతము, శుద్ధ చైతన్యవంతము, సత్యము, సహజమైన సత్ వస్తువు ప్రతి జీవునిలోనే ఉంది. దానిపై ఎరుకతో ఉండటమే ఆనందం! ఉన్నది ఒక్కటే, అదే స్వరూప ఆనందం! అదే సచ్చిదానందం! అదే బ్రహ్మానందం! అదే శాశ్వతమైన ఆనందం. మనస్సు అంతర్ముఖం అయినప్పుడే దాన్ని గ్రహించగలరు!

జీవుడు శుద్దత్వంతో జన్మిస్తాడు. సహజ సిద్దంగానే చైతన్య స్వరూపుడు. అజ్ఞానంతో (మాయ ప్రభావం వల్ల) తన స్వస్వరూపాన్ని గ్రహించలేక జీవిస్తున్నాడు! కానీ పుట్టుకతోనే చిత్తశుద్ధి ఉంటే ప్రతి జీవుడు ముక్తుడే. పరమాత్మ పరిపూర్ణ జ్ఞానం కలవాడు. జీవుడు పరిమితి జ్ఞానం కలవాడు. అంటే జడమైన భాగం శరీర రూపంలో ఉంది. పరమాత్మలోని చైతన్యం జీవాత్మగా ఉంది. ఈ రెండింటి యొక్క మిశ్రమ స్వరూపమే జీవుడు! పరిమితి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానంగా మార్చుకోవాలి!

బహిర్ముఖంగా ఉన్న మనస్సును శాశ్వతమైన ఆనందం కోసం అంతర్ముఖంగా అన్వేషణ చేయాలి. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖం అవుతుంతో, అప్పుడు జీవుడు తనకు తెలీనీ ఎన్నో రహస్యాలను గ్రహించగలడు. సూక్ష్మం లోనే ఉంది మోక్షం. ఒక్కసారిగా మనస్సుని అంతర్ముఖం చేయాలంటే చాలా కష్టం. దానికి కఠోర సాధన చేయాలి. చైతన్యవంతమైన జ్ఞానంతో బుధ్ధి ద్వారా మనస్సుని అదుపులోకి తెచ్చుకోవచ్చు! 

ఎన్నిరకాలుగా ప్రయత్నం చేసిన మనస్సును జయించడం జ్ఞానంతోనే సాధ్యము! చంచలమైన మనస్సుని అధీనంలోకి తెచ్చుకోవాలంటే, అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో నిరంతర అభ్యాసం ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు!

మనస్సును ఇంద్రియాలతో జోడించకపోతే, చిత్తవృత్తి నిరోధం కలిగి, ఆలోచనలు క్రమేపీ తగ్గి ఆలోచనా రహిత స్థితికి చేరతాడు. అదే తన స్వస్థితి, ఆత్మస్వరూపము! అదే బ్రహ్మానందం.

నిత్యం, శాశ్వతం, సత్యం అయినది పరమాత్మ ఒక్కటే! మనమందరం ఆ పరమాత్మ అంశములే! కావున మన స్వస్థితిని/ స్వరూపమును అనుభవ పూర్వకంగా గ్రహించి, అనుభూతి పొంది, తాను ఆ పరమాత్మ ఒక్కటే అని నిర్ణయంగా గ్రహించడమే అసలైన సత్యము. అదే అద్వైతసిద్ధి! అదే ఏకత్వం!! అదే మన అందరి లక్ష్యం!

కామెంట్‌లు లేవు: