*13.09.2020 ఆదివారం నాడు ఏర్పడు గ్రహ కూటమి – అపోహ దాని నివృత్తి*
నాకు ఒక మిత్రుడు క్రింది మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ వివరణ అడిగారు:
1850 నుండీ 2250 మధ్య ఒక్కసారి మాత్రమే రాబోతున్న అద్భుతమైన ఘడియలు:
13/09/2020 ఆదివారం ఉదయాన 11:00 నుండీ 11:45 మధ్య:
లగ్నం - అనూరాధ 2 - వృశ్చిక
రవి - సింహం - భావం10 - స్వక్షేత్రం
చంద్ర - కర్క - భావం 9 - స్వక్షేత్రం
కుజ - మేష - భావం 6 - స్వక్షేత్రం
బుధ - కన్య - భావం11 - ఉచ్ఛ
గురు - ధను - భావం 2 - స్వక్షేత్రం
శుక్ర - కర్క - భావం 9 - శత్రు
శని - మకర - భావం 3 - స్వక్షేత్రం
రాహు - మిధున - భావం 8 - సమ
కేతు - ధను - భావం 2 - సమ
జిల్లేడు ఆకుపై గోధుమలు ఉంచి, ప్రమిదలో దీపారాధన చేసి, దైవారాధనలో నిమగ్నమై ఈ అద్భుతమైన ఘడియలు సఫలీకృతం చేసుకోగలరు!
ఇదీ ఆ మెసేజ్. ఇప్పుడు ఈ మెసేజ్ వైరల్ అయ్యింది. మన మీడియా ఎంత అభివృద్ధి చెందిందంటే, చెప్పేవారు ఎవరో, వారి అర్హత ఏమిటో, ఇవేమీ లేకుండానే వారి సందేశాలు వైరల్ అవుతున్నాయి. దీన్ని సమీక్షిద్దాము:
13.09.2020 నాడు ఉదయం 10.45 నుండి 6 గ్రహాలు వాటి స్వక్షేత్రాలలో ఉంటున్నాయి. నిజానికి ఈ యోగం గొప్పదే. అరుదుగా వస్తుంది కూడాను. ఇట్టి యోగాలను *‘రాజ యోగాలు’* అని అంటారు. ఏ రాజయోగ మైనా సఫలీకృతం కావడానికి గాను *‘రాజయోగ భంగ’* యోగాలు ఉండరాదు. ఇది జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం. ఈ గ్రహ కూటమిలో ఒక్క బుధుడు మినహా మిగిలిన గ్రహాలన్నీ కూడా పాపగ్రహ ప్రభావంలో ఉన్నాయి. శుక్ర చన్ద్ర భ లను శని సప్తమ స్థానంలో ప్రభావితం చేస్తున్నాడు. గురు భ కేతువు మరియు రాహువుల ప్రభావంలో ఉన్నాడు. కావున ఇట్టి యోగము నిర్వీర్యమగు చున్నది. కొంత వరకు లేదా స్వల్ప ప్రమాణంలో మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, కాని ఎంతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. పాప గ్రహ ప్రభావంలో ఉన్న శుభ గ్రహాలు అద్భుతమైన ఫలితాలను ఏనాడు ఇవ్వవు. శని ఫలితాన్ని మందగిస్తాడు, రాహువు అనిశ్చితిని ఇస్తాడు.
*ఇక రెండవ అంశం* – ఈ గ్రహ కూటమి వృశ్చిక లగ్న వశాత్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ప్రచారం జరుగుచున్నది. ముహూర్తం నిర్ణయానికి గాను, ప్రస్తుత సమయంలో శుభ ముహూర్తాలు లేవు. ఈ ముహూర్తం సాధారణ పనులకు మాత్రమే పనికి వస్తుంది. ఎందుకంటే ఇవి *‘మహాలయ పక్షాలు’*. మహాలయ పక్షాలలో పితృ తర్పణాల మినహా ఇతర శుభ కార్యాలు ఉండవు. కావున ఈ ముహూర్తం సాధారణ పనులకు మినహాయించి ఇతర పనులకు పనికి రాదు. ఈ విధంగా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చక్కని గ్రహ యోగాలు వస్తాయి, కాని అవి వచ్చిన సమయం, కాలం ప్రధానమైనది. *ఆ సమయం శుభ ముహుర్తాలకు పనికి రానిది అయిన ఎడల వాటి వలన ప్రయోజనం ఉండదు*.
ఈ సమయంలో ‘జిల్లేడు ఆకుపై గోధుమలు ఉంచి, ప్రమిదలో దీపారాధన చేసి, దైవారాధనలో నిమగ్నమై ఈ అద్భుతమైన ఘడియలు సఫలీకృతం చేసుకోగలరు!’ అనే ప్రచారం జరుగుతుంది. సంపూర్ణ భక్తి, నిబద్ధత, శ్రద్ధ మరియు అంకిత భావం తో భగవానుడిని ధ్యానం చేస్తే, ఆయన ఎప్పుడైనా అనుగ్రహిస్తాడు. కామ్యాపేక్ష తో చేసే పూజలు, భక్తి, ధ్యానం ఇత్యాదివి అర్హతకు అనుగుణంగా మాత్రమే ఫలితాలను ఇస్తాయి. కావున వృశ్చిక లగ్నంలోనే కాదు, ఏ లగ్నంలో అయినా భక్తితో భగవంతుడిని పూజించ వచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. భగవంతుడి పూజకు, ధ్యానం చేసుకోవడానికి ‘ఫలానా సమయాలలోనే పూజించండి – అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి’ అని అనడం మూర్ఖత్వం. ఇది ముహూర్త శాస్త్రానికి వర్తిస్తుంది కాని భక్తికి వర్తించదు. భక్తికి ముహూర్త శాస్త్రానికి సంబంధం లేదు. ఏదో ప్రత్యేకమైన పూజ, వ్రతం మరియు క్రతువు ఇత్యాదివి చేసేటపుడు దుర్ముహూర్తాలు లేకుండా చూసి ప్రారంభించడం సాంప్రదాయం. ఇది నమ్మకం. ‘వృశ్చిక లగ్నంలో చేయండి సఫలీకృతం చేసుకోండి’ అని అనడం పొరపాటు. *అర్హత లేని భక్తుడికి సఫలీకృతం కాదు. అర్హత ఉన్నవాడు ఎప్పుడు చేసినా సఫలీకృతం అవుతుంది. అర్హత లేని వాడికి, సంకల్పిత కార్యం సిద్ధించక పోవుట వలన శాస్త్రం పై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కావున భగవంతుడి పూజకు భక్తి శ్రద్ధలు ప్రధానమైనవి అని గ్రహించ గలరు.*
*ప్రస్తుత గ్రహ యోగాలు ప్రపంచానికి చాలా ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. ఈ యోగ ప్రభావం గురు భ కుంభ రాశిలో ప్రవేశించు వరకు కూడా ఇదే విధంగా ఉంటాయి. కాని సెప్టెంబర్ 23 నాడు రాహువు వృషభ రాశిలో ప్రవేశించిన మొదలు కొంత ఉపశమనం లభించే అవకాశం మాత్రమే కలదు. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో భగవానుడిని ప్రార్థించడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. లోక రక్షకుడు ఆ భగవానుడు ఒక్కడే. అనవసరమైన ప్రచారాల ప్రభావంలో పడి సమయం వృధా చేసుకోకండి. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో భగవానుడిని ప్రార్థించండి.*
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति
https://www.srigayatrivedavision.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి