20, ఏప్రిల్ 2021, మంగళవారం

తపశ్శక్తి

 *తపశ్శక్తి...!*

                  ➖➖➖✍️



*మనిషి స్వప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు. అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి. అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు.*


*తపస్సు చేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెబుతాయి*


*నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారట.*


*పరమశివుణ్ని పతిగా పొందేందుకు గౌరీదేవి, గంగను భువికి తెచ్చేందుకు భగీరథుడు, పాశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు, మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సు చేసి సాధించారని మన పురాణాలు చెబుతాయి.*


*రామ నామం రామ పాదం రామ కార్యాలనే తపస్సుగా చేసుకుని, ఒక వానరుడు సముద్రాన్నే లంఘించగలిగాడు.*


*సీతాన్వేషణలో సఫలమై రావణ వధకు నాంది పలికాడు. రుద్రావతారుడిగా కీర్తి గడించాడు. హనుమ అనే ఈ వానర వీరుడి సుందర లీలల వర్ణనే రామాయణ మహాకావ్యంలో సుందరకాండగా ప్రత్యేకత సంతరించుకుంది.*


 *పఠించిన ఉత్తర క్షణం భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథమైంది. మహిషాసుర, భస్మాసుర, హిరణ్యకశిపుల వంటి ఎందరో రాక్షసులూ ఘోర తపస్సుతోనే శక్తులను, వరాలను పొందగలిగారు.*


✅*తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం.*✅


*మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణమూ ఉంది.*


*మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సుగా పెద్దలు చెబుతారు. *


*ఒక వస్తువుపై మనసున నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది.*

 

*మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది.*


*మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది.*


*మనసును నియంత్రించడమన్నది చాలా పెద్ద సమస్య.*


*మహాభారతంలోని శాంతిపర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది.*


*మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి. బాహ్య అంతఃకరణాలైన మనసు ఇంద్రియాలను సమాధాన పరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు.*


*మనిషిలోని మనోబలాన్ని,సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనఃశక్తిని ఎలా వినియోగించుకోవాలి- అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది. *


*లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది.*


*మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురులవలే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవి కీర్తికోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది.*


*తపస్సు,తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెబుతుంది తైత్తిరీయం.*


*దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు. నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే.*


*చిత్తశుద్ధి కోసం చేసే జపం, చిత్తశుద్ధితో చేసే ప్రతీపని తపస్సే అవుతుంది. సాధనా తపస్సే, సేవా తపస్సే.*


*తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్లు మూసుకుని చేసే మంత్ర జపాలు. ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే. మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుచేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి. మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి...✍️*

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                           🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

కామెంట్‌లు లేవు: