*ఆదిత్య హృదయం అప్పజెప్పడం..*
*(మూడవరోజు)*
శ్రీధరరావు, ప్రభావతి దంపతులు ఆ యోగీశ్వరుడి ముందు స్థిమితంగా కూర్చున్నారు..వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో చూస్తూ.."అమ్మా!..నన్ను మొదటి పిలుపులోనే "నాయనా"! అని పిలిచావు కదా?..నాలో నీ బిడ్డను చూసావా?.."అన్నారు..మొట్ట మొదటగా ఆ దంపతులిద్దరితో అడిగిన ప్రశ్న అది..
"ఔను నాయనా!..మా పెద్దబ్బాయిని చూసిన అనుభూతి కలిగింది..పైగా వయసుతో సంబంధం లేకుండా నాయనా అని పిలవడం నాకలవాటు.." చెప్పారు ప్రభావతి గారు..
"ఓహో!.. అమ్మా..ఈ మధ్య కాలంలో శ్రీధర రావు గారు నన్ను ఎన్నో మార్లు కలిశారు..నేను మౌనంలో వున్నా కానీ..ఆయన నాతో చాలా విషయాలే చెప్పారమ్మా..నీకు పూజలు ఎక్కువగా చేసే అలవాటు ఉందనీ..తెల్లవారుఝామునే లేచి..స్నానాధికాలు ముగించుకొని పూజ మొదలుబెడతావనీ..చెప్పారమ్మా..అంత ఘనంగా ఏ పూజలు చేస్తావు తల్లీ?.." అన్నారా యోగి..
ప్రభావతి గారికి లోపలినుంచి ఒక గర్వం బైటకు తన్నుకు వచ్చింది..తాను రోజూ ఎంతో నిష్ఠగా పూజ చేస్తాననే అహంకార పూరిత అజ్ఞానం ఆవిడను నిలువెల్లా కప్పేసింది..తాను చేస్తున్న పూజల లెక్క గబ గబా గుర్తుకుతెచ్చేసుకున్నది.."ఒకటేమిటి నాయనా!..తెల్లవారుఝామున స్నానం చేసి ఆదిత్య హృదయం మొదలుకొని..ఎన్నో సహస్రనామ స్తోత్రాలు..అష్టోత్తరాలు..అన్నీ నోటికి వచ్చు..విష్ణు, లలితా సహస్ర నామాలు..మా ఇలవేల్పు ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి అష్టోత్తర, సహస్ర నామ, కవచాలు.. నోటికి వచ్చు..అన్నీ కూడా పనీ పాటా చేసుకుంటూ నాలో నేను చదువుకుంటూ వుంటాను..రోజు మొత్తంమీద ఓ పదో పదకొండో సహస్రనామ స్తోత్రాలు..అష్టోత్తర స్తోత్రాలు చేస్తాను నాయనా..ప్రతి స్తోత్రమూ నోటికొచ్చు కాబట్టి..సులభంగా చేస్తాను.." అని చెప్పారు.. ఈ "నోటికొచ్చు.." అన్నమాట పదే పదే గర్వంగా చెప్పారు..
ఆ యోగి..(ఇకనుంచీ "శ్రీ స్వామివారు" గా వ్రాస్తాను!) తాను కూర్చున్న అరుగుమీద నుంచి లేచి నుంచుని..అదే చిరునవ్వుతో.."అమ్మా!..అన్ని స్తోత్రాలూ ఔపోసన పట్టానన్నావు కదా..మొదట ఆదిత్య హృదయం తో నీ పూజ మొదలవుతుందని చెప్పావు కదా?..ఏది తల్లీ..ఒక్కసారి ఆ ఆదిత్య హృదయం నాకు వినిపించు..ఒక్కసారి చదువమ్మా.." అన్నారు..
ప్రభావతి గారు శ్రీధరరావు గారిని చూసారు.."చెప్పమంటారా?"..అన్నట్లు గా ఆయన ను కళ్ళతోనే సైగ చేసి అడిగారు..
ఆయన వెంటనే.."చదువు ప్రభావతీ..నీవు రోజూ చేసేదేగా!.." అన్నారు..
ప్రభావతి గారు మళ్లీ ఒక్కసారి సర్దుకు కూర్చుని..
"తతో యుద్ధ పరిశ్రాంతం..సమరే చింతయాస్థితం.."
అని చెప్పబోయారు..అంతే!..శ్లోకం అంతకంటే ముందుకు గుర్తురావటం లేదు..
మళ్లీ.."తతో యుద్ధ పరిశ్రాంతం..సమరే...."
అక్కడే ఆగిపోతోంది..ఆవిడ నాలుక మొద్దుబారి పోయినట్లు..అంతకంటే ఒక్క ముక్క కూడా ఆ శ్లోకం లో గుర్తుకురావటం లేదు..మళ్లీ..మళ్లీ...ఊహూ!..ఏమీ గుర్తులేదు..ప్రతిరోజూ చేసే ఆ స్తోత్రం..మొదటి శ్లోకంలోని మొదటి పాదం వద్దే ఆగిపోయింది..నిద్రలో లేపి అడిగినా..టక టకా చెప్పే ప్రభావతి గారికి వాక్భందం జరిగినట్లు మాట రాక ఆగిపోయారు..ఐదు నిమిషాల పాటు తంటాలు పడ్డారు..ఏమీ లాభం లేదు..
ప్రక్కనే ఉన్న శ్రీధరరావు గారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు..ప్రతిరోజూ..ఇంట్లో పని చేస్తూ..పశువులకు మేత వేస్తూ..పాలు పితుకుతూ..మజ్జిగ చిలుకుతూ..ఇలా తన పని తాను చేసుకుంటూ కూడా అనుక్షణం స్తోత్రాలు వల్లే వేసే తన భార్య..ఇక్కడ ఈ నిమిషంలో..ఈ యోగిపుంగవుడి ముందు..ఏ స్తోత్రమూ అప్పజెప్పలేక సతమతమవుతోంది..ఏమిటీ మాయ?..అని ఆయన ఆలోచనలో పడ్డారు..
ఇక ప్రభావతి గారికైతే..తనకేమైందో తెలీదు..మొట్టమొదటి శ్లోకం కూడా గుర్తురానంతగా తన మెదడు మొద్దుబారిపోయింది..మెల్లిగా ఆవిడ అహంకారపు పొర తొలిగింది.."నాయనా!..నేను చెప్పలేకపోతున్నాను..నన్ను ఏదో శక్తి అడ్డగిస్తోంది..నేను అశక్తురాలినై పోయాను.."అని చెప్పి మౌనంగా కూర్చున్నారు..
అప్పటిదాకా వాళ్ళిద్దరి ముందూ నిలుచుని ఉన్న శ్రీ స్వామివారు..మళ్లీ పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి..అరుగుమీద పద్మాసనం వేసుక్కూర్చున్నారు..
ఇప్పుడు ఆయన మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది...
మంత్రోచ్ఛారణ..తత్వం..గురించిన బోధ రేపు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి