30, మే 2021, ఆదివారం

సుదాముడి భక్తి.)

 *నీ పాద కమల సేవయు,*

*నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం*

*తాపార భూత దయయును,*

*తాపస మందార నాకు దయసేయ గదే.!!*


(పోతన భాగవతము .. దశమ స్కంధము .. సుదాముడి భక్తి.)


తెలుగు భాగవతం లో ప్రసిద్ధ పద్యాల లో ఇది ఒకటి. 


ఒక్కో భక్తుడు ఒక్కో కోరికతో భగవంతుడిని పూజిస్తారు. కొద్దిమంది విలక్షణ మైన కోరికలు కోరతారు. 


పాండవుల తల్లి కుంతీ దేవి కష్టాలు పడీ పడీ అవి అలవాటవడమే కాకుండా కష్టాలకు addiction కూడా వచ్చినట్లుంది. ఆమె కృష్ణుడిని "నిరంతరం నాకు కష్టాలు ఉండేటట్లు అనుగ్రహించ వయ్యా అని ప్రార్ధిస్తుంది. కష్టాలు లేనప్పుడు నేను దేవుడిని మరచి పోతున్నాను అందుకని దేవుడు నిరంతరం గుర్తుండాలని ఈ కోరిక కోరానని చెపుతుంది". తమాషా కోరిక. 


ఏదడిగినా ఇస్తాడని తెలిసి కూడా మొహమాటం అడ్డొచ్చి ఏదీ అడగ కుండా వెళ్ళిపోయిన వాడు కుచేలుడు. 


శివుడి లాగా విష్ణుమూర్తి సాధారణంగా అంత తొందరగా భక్తులను అనుగ్రహించడు. పరీక్షలు పెట్టీ పెట్టీ, భక్తుడి దుంప తెంచీ, వాడు ఆయన పెట్టే అన్ని  పరీక్షల్లో నెగ్గితే ఆఖరకు అనుగ్రహిస్తాడు. 


సుదాముడనే వాడు మధురా నగర వాసి. కుచేలుడికి కూడా సుదాముడనే పేరుంది. ఇతను వేరు. ఇతను ఇంకో కృష్ణ భక్తుడు.  వాడు  ఎంత తపస్సు చేశాడు ఎన్ని పూజలు చేసాడు అనే వివరాలు,  భాగవతం లో లేవు.  ఇతను మాలాకారుడు అంటే పూల మాలలు తయారు చేసేవాడు. కుబ్జ కథ కు సరిగ్గా ముందు ఇతని కధ వస్తుంది.  స్వయంగా కృష్ణుడే అతని ఇంటికి వెళతాడు. ఆయన ఆతిధ్యం తీసుకుని మాలలు తీసుకుని, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అంటే అప్పటికే సుదాముడి కి పరీక్షలూ తపస్సులూ అన్నీ పూర్తయినాయన్న మాట. సుదాముడు కూడా వచ్చినవాడు భగవంతుడని గుర్తు పడతాడు. ఈ సందర్భం లో ఆయన కోరిన కోరికే పైన వ్రాసిన పద్యం. ఈయన కోరిన కోరిక విలక్షణ మైనది.  వ్యాసుడి శ్లోకం కంటే పోతన తెలుగు పద్యం బావుంది. అందుకే ఇది వ్రాసాను. దీని అర్థం గమనించండి. 


*తాపస మందార* :: పారి జాతము, సంతానము, కల్ప వృక్షము, మందారము, హరి చందనము ఇవి ఐదూ స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టుకు పేర్లు. తెలుగులో మందారమంటే దాసాని చెట్టు, హరిచందనమంటే గంధం చెట్టు ఇలాగ ఉంటాయి. సంస్కృత సమాసాలలో మాత్రం స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టు అని అర్థం. ఆశ్రిత పారిజాతమా భక్త మందారమా అంటే అదీ అర్ధము. నీకోసం తపించే (తపస్సు చేసే) వారి అన్ని కోరికలు తీర్చేవాడా అని అర్ధము. 


*నీ*:: భగవంతుడిని ఏకవచనం లో సంబోధించాలంటే ఆయన తనవాడు, తను ఆయన వాడిని అనే భావం పూర్తిగా వుండాలి. త్వమేవాహం అన్న స్థితి.  అది వున్న వాడే ఆవిధంగా భగవంతుడిని ఆత్మీయం గా ఏక వచనం లో పిలవ గలడు. అనన్యశరణత్వము, అనన్యా ర్హ శేషత్వము మొదలైన భావనలు ఉండడం. లేదా అలా పిలవడం ద్వారా ఆభావాలు అలవాటు చేసు కోడము అనుకోవాలి. 


*పాద కమల సేవయు*::  పాదాలను కవులు కమలాల తో పోలుస్తారు. Physical పోలిక ఉండదు. కావాలంటే బెంగుళూరు వంకాయలతో పోల్చుకోవచ్చు. కమలాల తో పోలికేమిటి. నిజానికి కోల ముఖం ఉన్న వాళ్ళను కూడా చంద్ర ముఖి అని పద్మ ముఖి అని పిలుస్తారు. ముఖం గుండ్రంగా ఉంటుందని కాదు. చంద్రుడి లోను, పద్మం లోనూ లక్ష్మీ కళ ఆకర్షణ ఉంటాయి. ఆగుణం తో పోలిక. ఆ పోలిక అనుభవించిన వాడికి దేవుడి పాదాలు వదల బుద్ధి కాదు. ముక్తులు చాలా రకాలు. అందులో సామీప్యం, సాలోక్యం అని రెండుంటాయి. విష్ణుమూర్తి పాదాలు చూస్తూ నిత్యం వాటిని సేవించాలంటే సామీప్య సాలోక్య ముక్తులు రెండూ ఉండాలి. సామీప్య సాలోక్య ముక్తులు రెండూ కావాలని లోపలి కోరిక.


*నీ పాదార్చకుల తోడి నెయ్యము* :: నీ భక్తులతో మాత్రమే సత్సంగత్వం కావాలి అని కోరిక. మన పక్క నుండేవాళ్ళు కూడా అదే కోరికతో వున్న వాళ్ళయితే మన భక్తి కి diversion కలగదు. భగవత్సేవ తో పాటు భాగవతుల సాంగత్యం కూడా కావాలి అని.


*నితాంతాపార భూత దయయును*:: అద్వేష్టీ సర్వ భూతానం .. భగవద్గీత గుర్తుంది కదా. ఆ శ్లోకాల కొసలో యోమే భక్తః సమే ప్రియః అని ఉంటుంది. భూతదయ కలగాలి దాని తరవాత దానివల్ల విష్ణుమూర్తికి తాను ఇష్టుడు కావాలి అని కోరిక. 


పద్యం అంతా ప్రధమ పురుష లో  (you)  నడుస్తుంది. భగవంతుడిని ఎదురుగా ఉన్నాడని భావించి మన మాట ఆయన వింటున్నాడనే నమ్మకంతో పలికే ప్రార్ధన ఇది. ఇందులో భగవంతుడు శివుడు రాముడు కృష్ణుడు అని ఏమీ ఉండదు. అమ్మవారి ముందు కూడా చెప్పుకోవచ్చు. స్తుతీ,  ప్రార్ధన,  సంకల్పమూ,  సంపూర్ణ శరణాగతీ అన్నీ ఈ పద్యం లో ఉన్నాయి. 


భగవంతుడు అడగలేదని కుచేలుడికి ఎగ గొట్టడు. అడిగింది కదా అని కుంతికి కష్టాలు ఇవ్వడు. ఎవరి కర్మఫలం వారికి తూచి సరిగ్గా ఇవ్వడం భగవంతుడి ప్రత్యేకత. ఈ కోరిక విని కృష్ణుడు నవ్వి  సుదాముడికి అడిగినవీ అడగనివీ అన్నీ ఇచ్చాడని భాగవతం లో ఉంది. 


మన కున్న కర్మ తాలూకు balance ఏమిటో మనకు తెలీదు. పోనీ నష్టం లేదు కనుక మనం కూడా సుదాముడు పద్ధతి లో ఓ application ఇస్తే సరిపోతుంది. మనం రోజూ పూజలో చదువు కోవచ్చు పిల్లలకు నేర్పించ వచ్చు... మంచి పద్యం... 


*పవని నాగ ప్రదీప్.*

*98480 54843*

కామెంట్‌లు లేవు: