30, మే 2021, ఆదివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పండితులు..పరామర్శలు..*


*(నలభై మూడవ రోజు)*


శ్రీ స్వామివారి గురించి క్రమంగా జనబాహుళ్యానికి తెలియడం మొదలైంది..ఎవరో ఒక యోగి ఇలా మొగలిచెర్ల గ్రామ సమీపంలో ఆశ్రమం నిర్మించుకుంటున్నారనీ..అందుకు శ్రీధరరావు దంపతులతో పాటు మరికొందరు స హకారం అందిస్తున్నారనీ.. నలుగురూ అనుకోవడం కూడా ప్రారంభం అయింది..


శ్రీ స్వామివారు ఎన్నడూ మహిమలు చూపడానికి ఇష్టపడేవారు కాదు..ఎవరైనా ఆయనను సంప్రదిస్తే..చాలా తేలికగా.."ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు!.." అని చెప్పి పంపించేసేవారు..అలా కోరికలతో వచ్చిన వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడటానిక్కూడా ఒప్పుకునేవారు కాదు..ఎంత దగ్గర వాళ్ళైనా..తన ధ్యానం ముగిసిన తరువాతే..వారితో ముచ్చటించేవారు..మితాహారం, మితభాషణం..ఈ రెండింటినీ పాటించేవారు..


జనవరి నెలలో సంక్రాంతి పండుగ దాటిన తరువాత ఒకరోజు మధ్యాహ్నం వేళ.. శ్రీధరరావు గారింటికి నెల్లూరు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు..అందులో ఒకాయన సంస్కృతాంధ్రములు రెండింటిలోనో పాండిత్యం కలవారు..ఆశువుగా ఛందోబద్ధంగా పద్యములు చెప్పగలరు..అష్టావధానం చేసిన అనుభవం కూడా ఉంది..ఇక పురాణాలు ఇతిహాసాల మీద మంచి పట్టు ఉంది..ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న వారు..ఇవన్నీ కాకుండా..శ్రీధరరావు దంపతులకు దూరపు చుట్టరికం కూడా ఉంది..(ప్రభావతి గారు ఆయనను బాబాయిగారూ అని పిలిచేవారు)..రెండవ వ్యక్తి ఈ పండితుడికి చేదోడుగా వచ్చాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు వాళ్ళను సాదరంగా ఆహ్వానించి..భోజనం పెట్టారు..భోజనం చేసిన తరువాత.. ఆ పెద్దాయన కుశలప్రశ్నల పరంపర ముగించి.."శ్రీధరా..ఎవరో ఒక స్వామిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారట గదా..ఆయనకు ఆశ్రమం కట్టుకోవడానికి పొలం కూడా ఇచ్చావుట!..మీ దంపతులు ఆయనకు పడి పడి మొక్కుతున్నారట..మనవాళ్ళు అనుకుంటుంటే విన్నాను..ఒకసారి మిమ్మల్ని చూసి, విషయం కనుక్కుని..ఆ స్వామిని కూడా చూసి..ఏపాటి వేదాంతం చెపుతాడో విని వెళ్లాలని వచ్చాను.."అన్నారు..


ఆయన మాటల్లో హేళన, వ్యంగ్యం ఎక్కువగా వినిపించాయి ఆ దంపతులకు..ప్రభావతి గారు వుండబట్టలేక.."ఏదోలే బాబాయిగారూ..మేము ఆయనను మహానుభావుడు అనుకుంటున్నాము..మా పూర్వపుణ్యం కొద్దీ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని..మా తృప్తి కోసం మేము చేస్తున్నాము.." అన్నారు..


"ఇప్పుడు వెళదామా..ఆయన్ను చూడాలని ఉంది.." అన్నారా వచ్చిన పండితుడు..శ్రీధరరావు గారు ఆసరికే బండి సిద్ధం చేయమని పనివాడికి పురమాయించారు..ప్రభావతి గారికి మాత్రం వీళ్ళను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లడం సుతరామూ ఇష్టం లేదు..అక్కడ  శ్రీ స్వామివారిని కించపరచినట్లు హేళనగా మాట్లాడితే..శ్రీ స్వామివారు నొచ్చుకుంటారేమో..తమ మీద చెడుగా భావిస్తారేమో నని ఆవిడ ఆలోచన..ఆమాటే మెల్లిగా శ్రీధరరావు గారితో ప్రక్కకు పిలచి అనేశారు కూడా..శ్రీధరరావు గారు మాత్రం నిబ్బరంగా.."నువ్వు అనుకున్నట్లు ఏమీ జరుగదు ప్రభావతీ..స్వామివారు అన్నీ సరి చేసుకోగలరు!.." అన్నారు..ప్రభావతి గారు లోపల పూజ గదిలోకి వెళ్లి..లక్ష్మీనరసింహ స్వామికి నమస్కారం చేసుకొని వచ్చి బండి ఎక్కారు..


మొగలిచెర్ల ఇంటి వద్ద నుంచి బండిలో.. శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకుంటున్న ఫకీరు మాన్యానికి దాదాపు ముప్పావు గంట ప్రయాణం..దారిలో తమకు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అయింది..తదనంతర పరిణామాలు అన్నీ క్లుప్తంగా శ్రీధరరావు గారు చెప్పారు..


అంతా విని.."బాగా తెలివిగల వాళ్ళం అని తలపోసేవారు కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తుంటారు..సరేలే..కాల మహిమ!.." అన్నారా పండితుడు సాలోచనగా..అంతటితో ఊరుకోలేదు..దొంగ స్వాములు..కుహనా యోగులు..ఇలా తనకు తెలిసిన వాళ్ళ గురించి..ఒక చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు..మొత్తంమీద శ్రీ స్వామివారిని నమ్మి ఈ దంపతులు తప్పు చేశారని తన వాదన ముగించాడు.. 

బండి ఫకీరు మాన్యం చేరింది..సమయం సాయంత్రం నాలుగు గంటలయింది..


బండి దిగి నలుగురూ శ్రీ స్వామివారు వున్న పూరిపాక దగ్గరకు వచ్చారు..ఆ సమయంలో శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని..నిటారుగా కూర్చుని..ధ్యానం చేసుకుంటున్నారు..తూర్పు ముఖంగా ఉన్న ఆ పాకలో ఉత్తరాభిముఖంగా శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారు పాక బైటనుంచే నమస్కారం చేసారు..ఈలోపల గొట్టిగుండాల గ్రామం నుంచి, ఆశ్రమ నిర్మాణం చేస్తున్న మీరాశెట్టి దంపతులు కూడా నడుచుకుంటూ అక్కడికి చేరారు..సుమారు పదమూడు కిలోమీటర్ల దూరం నడచి వచ్చిన ఆ దంపతులు కూడా బైట నుంచే శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొని..ఒక ప్రక్కగా నిలబడ్డారు..


ఒక అరగంట కాలం గడచిన తరువాత...శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి లేచారు..పూరిపాక బైటకు వచ్చి..అందరినీ చూసి.."మీరొచ్చి చాలా సమయం గడిచిందా?.." అన్నారు.."ఒక అరగంట అయిందని " శ్రీధరరావు గారు చెప్పారు..


"ఏమయ్యా..చాలా దూరం నుండి వచ్చినట్లున్నారే!..బాగున్నారా?.." అన్నారు పండితుల వారి వైపు ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారిలా చూస్తూ..శ్రీ స్వామివారు అలా చనువుగా  పలకరించడం శ్రీధరరావు దంపతులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది..


పాండిత్యమూ..పరామర్శా.. రేపటి భాగంలో కూడా..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: