8, మే 2022, ఆదివారం

కపిలుడి తత్త్వబోధ

 🙏🌹జయ గురు దత్త🌹🙏

🙏🌹శ్రీ మాత్రే నమః🌹🙏



🙏తల్లికి కపిలుడి తత్త్వబోధ🙏


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. 

భర్త సన్యసించి మోక్షగామియై

తపోవనాలకి వెళ్ళిపోయాడు. 

ఇక నా గతి ఏమిటి?’ 

అని చింతించిన 

దేవహూతి ఒకనాడు. 


ధ్యాననిష్ఠుడై వున్న 

కపిల మహర్షిని సమీపించింది. 

తల్లి రాకలోని 

ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు 

ప్రసన్న మందహాసం చేసి

”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న 

సంక్షోభాన్ని గుర్తించాను. 

స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. 

కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని

భర్తగా పొంది లోటులేని

సంసారజీవనం సాగించావు. 

పదిమంది సంతానానికి జన్మనిచ్చి

మాతృమూర్తిగా, గృహిణిగా

గృహధర్మాన్ని నిర్వర్తించావు. 

నీలాంటి ఉత్తమ జన్మ 

అనునది కోటికి ఒక్కరికి వస్తుంది.

‘లేదూ…’ అన్నది లేకుండా 

చక్కటి జీవితాన్ని గడిపిన నీకు

యీ దిగులు దేనికమ్మా?” 

అని అడిగాడు.


”నాయనా… నువ్వన్నది నిజమే.

నా తండ్రి స్వాయంభువ మనువు

అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. 

ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో 

నా బాల్య జీవితం గడిచింది.

అటుపై గృహస్థాశ్రమంలో 

నా భర్త చాటున ఏ కొరతా లేకుండా 

నా వైవాహిక జీవితం గడిచింది. 

తొమ్మిది మంది ఆడపిల్లలకి, 

ఒక సుపుత్రుడికి తల్లినైనందున

నా గృహస్థజీవితం కూడా

సంతృప్తిగా గడిచింది. 

నా అంతటి భాగ్యశాలి 

లేదనుకొని సంతోషిచాను. 


కానీ, నాయనా… 

నాకు వివాహం చేసి 

తన బాధ్యత తీరిందనుకున్నాడు 

నా తండ్రి. 

నన్ను సంతానవతిని చేసి,

వారి వివాహాలు చేసి 

తన బాధ్యత తీరిందని

తపోవనాలకి వెళ్ళిపోయాడు 

నా భర్త. 

వివాహాలుకాగానే భర్తలవెంట నడిచి 

తమ బాధ్యత తీర్చుకున్నారు. 

నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, 

దైవాంశ సంభూతడివైన 

నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే …

నువ్వు పుడుతూనే యోగివై,

విరాగివై, అవతార పురుషుడివై,

సాంఖ్యయోగ ప్రబోధకుడివై 

నా ఆశల మీద నీళ్ళు చల్లావు. 

నా తండ్రి, నా భర్త, 

కుమార్తెలు, కుమారుడు… 

ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని

నన్ను ఒంటరిదాన్ని చేశారు.

నన్ను కన్నందుకు నాతల్లిదండ్రులకి 

కన్యాదాన ఫలం దక్కింది. 

నన్ను వివాహమాడినందుకు 

నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, 

కన్యాదానఫలం దక్కింది. 

వివాహాలైన నా కూతుళ్ళకీ,

కుమారుడివైన నీకూ

పితృఋణఫలం దక్కుతుంది. 

ఏ ఫలం, ఫలితం ఆశించకుండా 

బాల్య, యవ్వన, కౌమార దశలు

గడిపి మీ అందరికీ సేవలు చేసిన

నాకు దక్కినఫలం ఏమిటి నాయనా? 

ఇక ముందు నా గతి ఏమిటి?”

అని వాపోయింది 

దేవహూతి గద్గద స్వరంతో.


కపిలుడు మందహాసం చేసి

”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో

యిలా మాట్లాడుతున్నావు.

ఇలాంటి భ్రాంతికి కారణం

నిరాహారం కావచ్చు. 

నువ్వు ఆహారం తీసుకుంటే

ఉపశమనం లభిస్తుంది కదమ్మా”

అన్నాడు కపిలుడు. 


దేవహూతి విస్మయంగా

కుమారుడి వైపు చూచి

"నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? 

నీ మాట కాదనలేక

నాలుగు కదళీఫలాలు

భుజించాను కదయ్యా” అంది.


”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” 

ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. 


దేవహూతి మరింత విస్తుబోతూ

”అదేమిటయ్యా … 

మన ఆశ్రమంలో రకరకాల

ఫలవృక్షాలను నాటాము. 

వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. 

ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో

కాసే పళ్ళు ఆ ఋతువులో

పండుతున్నాయి కదయ్యా” అంది. 


కపిలుడు తలపంకించి 

”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. 


‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. 


కపిలుడు 

తల్లి కళ్ళలోకి చూస్తూ 

”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. 


ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది

దేవహూతి.


”అమ్మా… 

ఋతువుకొక ధర్మం వుంది. 

అది ఏ కాలంలో ఏవి ఫలించాలో

వాటిని ఫలింపజేస్తుంది. 

అలా ఒక్కొక్క ఋతువులో

అందుకు తగ్గ ఆహారాన్ని 

మనకి ప్రసాదిస్తున్న ఋతువు

తన ధర్మానికి ప్రతిఫలంగా

మననించి ఏమాశిస్తోంది? 

కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” 

అని ప్రశ్నించాడు కపిలుడు. 


ఆ ప్రశ్నలకి తెల్లబోతూ 

”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? 

ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం 

ఋతుధర్మం కదా?” 

అని ఎదురు ప్రశ్నించింది.


కపిలుడు మందహాసం చేసి

"అంటే, ఋతువు 

ఎలాంటి ఫలం, 

కృతజ్ఞత ఆశించకుండా తన

ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట!

మరి, అరటి సంగతేమిటి?

అరటిచెట్టు కాయలిస్తోంది. 

పళ్లు యిస్తోంది. 

అరటి ఊచ యిస్తోంది. 

ఈ మూడూ మనకి ఆహారంగా

ఉపయోగపడుతున్నాయి. 

అలాగే అరటి ఆకులు మనకి

ఆరోగ్యానిస్తున్నాయి. 

శుభ కార్యాల సందర్భాల్లో 

అరటి పిలకలు తెచ్చి 

ద్వారాల ముందు నిలుపుతున్నాం. 

ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న 

అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? 

దాని ఆకులు నరుకుతున్నాం. 

కాయలు నరుకుతున్నాం. 

అరటిబోదె నరుకుతున్నాం. 

చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం.

మనం ఇన్ని విధాలుగా హింసించి

కృతఘ్నులం అవుతున్నా

అరటిచెట్టు తన ధర్మాన్ని 

తాను నెరవేరుస్తుంది… 

మననించి ప్రతిఫలం, కృతజ్ఞత

ఆశించకుండా ఋతువులు, 

చెట్లు వాటి ధర్మాన్ని అవి

నెరవేరుస్తున్నాయి. 

మరి, ఇన్నింటి మీద ఆధారపడిన 

యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, 

ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం 

ఆశపడేది కాదని గ్రహించలేవా 

తల్లీ…” 

అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా.


నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. 


కపిలుడు మందహాసం చేసి "అమ్మా… 

నువ్వు బాల్య, యవ్వన, కౌమార

దశలు గడిపి సేవలు చేశానన్నావు. 

‘నువ్వు’ అంటే ఎవరు? 

ఈ నీ దేహమా? 

దేహం ఎప్పటికైనా

పతనమైపోయేదే కదా!

నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? 

ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. 

మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. 

మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. 

ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? 

లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని 

ఎవరు నిర్మించారో నీకుతెలియదు. 

నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో 

నీకు తెలియదు. 

నీ ఈ దేహం ఎలా తయారైందో, 

నీ సంతానంగా చెప్పుకుంటున్న 

ఆ దేహాలు నీ గర్భవాసంలో

ఎవరు తయారుచేశారో 

నీకు తెలియదు. 

నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు 

నీది కాని పరాయి దేహాలపై

వ్యామోహం ఎందుకమ్మా?” 

అని అన్నాడు. 


దేవహూతి నిర్విణ్ణురాలైంది. 


కపిలుడు మందహాసం చేసి ఆమెకు...

సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు.


”అమ్మా… మనస్సు అనేది 

బంధ – మోక్షములకు కారణం. 

ప్రకృతి పురుష సంయోగం చేత 

సృష్టి జరుగుతుంది. 

ఆ పురుషుడే ప్రకృతిమాయలో పడి 

కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. 

నేను, నాది, నావాళ్ళు 

అన్న ఆశాపాశంలో చిక్కుకొని

జనన మరణ చక్రంలోపడి

అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. 

జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు.

ఏ జన్మకి ఆ జన్మలో 

‘ఇది నాది, ఈ దేహం నాది, 

నేను, నా వాళ్ళు’ 

అన్న భ్రమలో 

మునిగివుంటాడే గాని, 

నిజానికి ఏ జన్మా, 

ఏ దేహం శాశ్వతం కాదు. 

తనది కాదు. 

దేహంలోని జీవుడు

బయల్వెడలినప్పుడు,

మృత్యువు సంభవించినప్పుడు 

ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. 

ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే 

దేహాలు ఎందుకు అనుసరిస్తాయి?

దేహ త్యాగంతోటే 

దేహం ద్వారా ఏర్పడ్డ

కర్మబంధాలన్నీ తెగిపోతాయి. 

ఆఖరికి ఆ దేహంతోటి

అనుబంధం కూడా తెగిపోతుంది. 

ఇలా తెగిపోయే దేహబంధాన్ని,

నశించిపోయే దేహ సంబంధాన్ని

శాశ్వతం అనుకుని దానిపై

వ్యామోహం పెంచుకునేవారు 

ఇహ-పర సుఖాలకి దూరమై, 

జన్మరాహిత్య మోక్షపదాన్ని

చేరలేక దుఃఖిస్తుంటారు. 


కానీ ఆ జీవుడే తామరాకు మీది

నీటి బిందువువలె

దేహకర్మబంధాలకి అతీతుడై,

దేహధర్మానికి మాత్రం తాను 

నిమిత్తమాత్రుడై ఉండి,

ఆచరించినట్లయితే

కర్మబంధాలకు, దేహబంధాలకు

అతీతంగా, ఆత్మరూపుడై 

ద్వందాతీతుడవుతాడు.


అరటి పిలక మొక్క అవుతుంది. 

ఆకులు వేస్తుంది. 

పువ్వు పుష్పిస్తుంది. 

కాయ కాస్తుంది. 

కాయ పండు అవుతుంది. 

అది పరుల ఆకలి తీర్చడానికి

నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. 

అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. 

దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. 


ఈ పరిణామక్రమంలో 

ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ

దానికి లేదు. 

పుట్టడం, పెరగడం, పుష్పించడం, 

పరులకి ఉపయోగపడడం,

రూపనాశనం పొందడం… 

ఇది దాని సృష్టి ధర్మం.


"మానవజన్మ కూడా అంతే… 

దేహాన్ని ధరించడం... 

దేహానికి వచ్చే పరిణామ దశలను 

నిమిత్తమాత్రంగా అనుభవించడం…

దేహియైనందుకు 

సాటి దేహాలకి 

చేతనైనంత 

సేవ చెయ్యడం… 

చివరికి జీవుడు త్యజించాక

భూపతనమై, శిధిలమై నశించిపోవడం… 

ఇంతకు మించి ‘నేను… నాది…

నావాళ్ళు’ అన్న బంధం 

ఏ దేహానికీ శాశ్వతం కాదు.


ఇక దేహంలోకి వచ్చిపోయే

‘జీవుడు’ ఎవరంటే …. 

పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం 

అను పంచభూతముల

సూక్ష్మరూపమే జీవుడు. 

ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ 

‘ఆత్మ’ అనే పేరిట భాసిస్తుంటాడు.

ఇలాంటి కోట్లాది 

‘ఆత్మ’ల ఏకత్వమే 

‘పరమాత్మ’… 

ఈ పరమాత్మ తేజస్సులా

ప్రకాశించే నిరాకారుడు. 

ఇతడే ‘భగవంతుడు’. 

ఆది, అనాది అయినవాడు 

ఈ ‘భగవంతుడు.’ 

ఈ భగవంతుడు 

‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. 

ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి

సంకల్పించినప్పుడు… 

అప్పటి వరకు నిరాకారమైన

తాను ‘సాకారం’గా తనని తాను

సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. 

ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ 

అన్న పేరిట ‘ఆత్మ’గా 

తాను నివసించి 

ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… 

ఒక్కదేహం నించి 

కోట్లాది దేహాలు 

సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో

‘ఆత్మపురుషుడిగా’ తానుంటూ, 

ఆ దేహాల ద్వారా 

ప్రపంచనాటకాన్ని 

నడిపి వినోదిస్తాడు. 


ఒక్కొక్క దేహానిది 

ఒక్కొక్క కథ… 

కధకుడు

తానైనా ఏ కథతోనూ 

తాను సంబంధం పెట్టుకోడు. 

తామరాకు మీది నీటిబొట్టులా 

తాను నిమిత్తమాత్రుడై 

దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… 

ఏ దేహి కధని ముగిస్తాడో, 

ఆ దేహం రాలిపోతుంది. 


దేహం పతనమైనప్పుడు

అందులోని ఆత్మ బయటికి వచ్చి

తను నివసించడానికి

అనుకూలమైన మరో దేహం

దొరికేవరకూ దేహరహితంగా 

సంచరిస్తూ వుంటుంది.


ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు 

కనుకే ఆ పరమాత్మని

 ‘దేవుడు’ అన్నారు. 

ఈ దేవుడినే పురుషుడు అంటారు. 


ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. 

కనుక ఇతడిని...

‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. 

ఇతడిలో అంతర్గతంగా వుండి 

సృష్టికి సహకరించేది ప్రకృతి.

ఈ జీవసృష్టి పరిణామక్రమంలో

భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో 

తానే సృష్టి, స్థితి, లయములను

నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… 

ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. 

అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి

నశించిపోయే ఈ దేహం ఎవరిది? 

ఎవరికి దేనిపై హక్కు, 

అధికారం ఉంటుంది?”


కపిలుడు 

అలా వివరంగా ఉపదేశించి 

”అమ్మా… దేహం ఉన్నంతవరకే

బంధాలు – అనుబంధాలు. 

అట్టి దేహమే అశాశ్వతం అన్నప్పుడు 

దానితోపాటు ఏర్పడే భవబంధాల

కోసం ప్రాకులాడి ఏమిప్రయోజనం? 

తల్లీ, అందుకే జ్ఞానులైన వారు

తమ హృదయ మందిరంలో

శ్రీహరిని నిలుపుకొని 

నిరంతరం ధ్యానిస్తారు. 


అమ్మా! మనస్సే 

బంధ మోక్షములకు కారణం.

అరిషడ్వార్గాలను జయించగలిగితే 

మనస్సు పరిశుద్దమవుతుంది.

పరిశుద్దమైన మనస్సులో వున్న

జీవుడే... పరమాత్ముడు 

అన్న విశ్వాసం కలిగితే 

అది భక్తిగా మారుతుంది. 

భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. 

‘దేహముతో సహా కనిపించే

ప్రపంచమంతా’ మిధ్య అని,

అంతా వాసుదేవ స్వరూపమే నన్న 

దృఢభక్తితో సర్వ వస్తువులలో, 

సర్వత్రా పరమాత్మమయంగా

భావించి, అంతటా ఆ పరంధాముడిని 

దర్శించగలిగితే… దేహం ఎక్కడ? 

దేహి ఎక్కడ?  నేను – నాది 

అనే చింత నశించి … 

భక్తిమార్గంద్వారా అతిసులభంగా

మోక్షం లభిస్తుంది … 

అమ్మా, 

‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? 

ఏ ‘పరమాత్మ’నించి 

అణువుగా, ఆత్మగా విడివడ్డామో… 

ఆ ‘పరమ – ఆత్మ’లో 

తిరిగి లీనమైపోవడం.


తప్పిపోయిన పిల్ల తిరిగి 

తల్లిని చేరుకున్నప్పుడు 

ఎలాంటి ఆనందాన్ని

పొందుతుందో… 

అలాంటి బ్రహ్మానందాన్ని

అనుభవించడం” 

అని ఉపదేశించాడు.


దేవహూతికి ఆత్మానందంతో

ఆనందభాష్పాలు జాలువారాయి.


అప్పటివరకూ తనపుత్రిడిగా

భావిస్తున్న కపిలుడిలో ఆమెకి 

సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు

దృగ్గోచరమయ్యాడు.


”నారాయణా… 

వాసుదేవా… 

పుండరీకాక్షా…

పరంధామా… తండ్రీ… 

నీ దివ్యదర్శన భాగ్యం చేత 

నా జన్మధన్యమైంది.

లీలామానుష విగ్రహుడివైన 

నీ కీర్తిని సృష్టికర్తయైన

బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. 

సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన

చతుర్వేదాలు సహితం 

నీ మహాత్తులను వర్ణించలేవు. 

పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు 

అయిన నీవు నా గర్భమున

సుతుడవై జన్మించి నా జన్మను

చరితార్థం చేశావు.

సృష్టిరహస్యాన్ని బోధించి, 

నా అహంకార, మమకారాలను

భస్మీపటలం గావించి... నాకు 

జ్ఞానబోధ గావించావు. 

తండ్రీ…  ఈ దేహముపైన, 

ఈ దేహబంధాలపైన నాకున్న

మోహమును నశింపజేసి

అవిద్యను తొలగించావు. 

ఇక నాకే కోరికలు లేవు.

పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, 

జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని 

ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” 

అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.


కపిలుడు మందహాసం చేసి 

”తల్లీ! సర్వజీవ స్వరూపము

శ్రీమన్నారాయణుడు ఒక్కడే. 

కన్పించే యీ సృష్టి సమస్తం

శ్రీమన్నారాయణ స్వరూపం. 

చరాచర జీవరాసులు

అన్నిటియందు

శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని 

‘సర్వం వాసుదేవాయమయం’గా

భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది”

అని ప్రబోధించి తానే స్వయంగా

ఆమెకు మహామంత్రమైన 

”ఓం నమో నారాయణాయ” 

ఉపదేశం చేశాడు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: