8, మే 2022, ఆదివారం

పెద్దన్నయ్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     *🌷జీవితం మంచికధ🌷*        

              *పెద్దన్నయ్య*       

              

"దివాకర్. మీ అన్నయ్య వస్తున్నాడు" పక్కసీట్లోని అక్కౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్.

బ్యాంకు గేటునుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి.

బ్యాంకు స్టాఫ్ కొంతమంది శివరాంను చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు.  కొంతమంది పలకరిస్తున్నారు.  శివరాం తన దగ్గరికి రాగానే "కూర్చో అన్నయ్యా" అన్నాడు దివాకర్.

శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతిరుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.  అతని ముఖం వాడిపోయి ఉంది.

"ఏమిటి.. ఇలా వచ్చావు..? బ్యాంకులో ఏమైనా పనిబడిందా?" దివాకర్ అడిగాడు.

"మీ వదిన చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతూంది. ఈరోజు స్పెషలిష్ట్ దగ్గరకు తీసుకెళ్ళాను.  ఆపరేషన్ చేయాలన్నారు" అన్నాడు శివరాం దిగులుగా చూస్తూ.

"ఎంతవుతుందట..?"

"యాభైవేలు అవుతుందని చెప్పారు"

కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్.  తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి "చూద్దాం అన్నయ్యా., నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు.  వాళ్ళు మంచి సర్జన్లు కూడా.  వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుంటాను" అన్నాడు.

"ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నారు"

దివాకర్ ఇబ్బందిగా చూసి "ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెబితే నాకు ఏమీ తోచదన్నయ్యా.  పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు. సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడుతాను" అన్నాడు.

"అలాగే.. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు., మనం తర్వాత మాట్లాడుకుందాం.." అంటూ లేచాడు శివరాం.

అంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరాంని చూసి "నమస్తే సార్., నేను కుమార్ ని. సంతపేట హైస్కూల్ లో మీ శిష్యుణ్ణి" అన్నాడు రెండుచేతులూ జోడించి.

"నీ పేరు గుర్తులేదుగానీ నువ్వు గుర్తున్నావు..  బాగున్నావా..?" ఆప్యాయంగా అడిగాడు శివరాం.

"బాగున్నాను సార్..! ఈమధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చాను.  రాగానే దివాకర్సార్ ని మీ గురించి అడిగాను., కూర్చోండి సార్.. టీ తాగి వెళుదురుగాని" అంటూ బాయ్ ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్.

"ముందు కాస్త మంచినీళ్ళు ఇప్పించు కుమార్" అభ్యర్థనగా అడిగాడు శివరాం.  కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు.

టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూండిపోయాడు దివాకర్.

"టీ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి తోచిందిగానీ, తనకెందుకు తోచలేదు? ఎండనపడి వస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు?" అని తనను తాను ప్రశ్నించుకున్నాడు.  అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు.

     *          *          *           *

ఆరోజు సాయంత్రం మారుతీ కారు షోరూం నుంచి వచ్చిన రిప్రెజెంటేటివ్ దివాకర్ ని కలిశాడు.

"రేపు మీరు డ్రాఫ్ట్ సిద్దం చేసుకున్నారంటే, ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది" అన్నాడు దివాకర్ తో.

"అదేం పెద్ద పని కాదు., బ్యాంకు లోన్ తీసుకుంటున్నాను.  కాబట్టి ఓచర్లు నింపడమే నా పని.  నా మార్జిన్ ఎలాగూ సిద్దంగా ఉంది" అన్నాడు దివాకర్.  రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అక్కౌంటెంటు వేణు వచ్చి "ఎప్పుడు కొంటున్నావు కారు?" అని అడిగాడు, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

"రేపు లోన్ కోసం ఆప్లై చేస్తాను. ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు"

కాసేపు కారు రంగు, మోడల్, రేటు గురించి మాట్లాడుకున్నాక

"మీ అన్నయ్య ఈరోజు ఎప్పటిలా ఉత్సాహంగా కనిపించలేదు.  చాలా డల్ గా కనిపించారు" అన్నాడు వేణు.

"అవును. మా వదినకు ఆపరేషన్ చేయాలట.  అందుకు యాభైవేలు"

దివాకర్ మాట పూర్తికాకముందే "మీ అన్నయ్య వస్తున్నారు. నూరేళ్ళు ఆయుస్సు ఆయనకు..!" అన్నాడు వేణు గేటువైపు చూస్తూ!

దివాకర్ తలెత్తి చూశాడు. శివరాంని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది.

"నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు" అన్నాడు

వేణుతో.

"నేనెందుకు ఎత్తుతాను" అంటూ వేణు తనసీటుకు వెళ్ళిపోయాడు. అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.

దివాకర్ ని చూసి శివరాం నవ్వుతూ "ఈ రోజు పని పూర్తయిందా?" అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

"పని ఇంకా పూర్తికాలేదు. నేను ఇంటికొచ్చి మాట్లాడతానన్నాను కదా.. మళ్ళీ నువ్వు రావడం ఎందుకు..? వదిన ఆరోగ్యం గురించి నాకూ కన్సర్న్ ఉంది.  కానీ, నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు?"

దివాకర్ ముఖంపై నవ్వు పులుముకుని ఆ మాటలు అన్నా, అతని మాటల్లో అసహనం, విసుగును గ్రహించాడు శివరాం..

"సారీరా..! నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం...!"  శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు.  వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు.  అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది.

    *         *         *           *

దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి "శివరాం బావగారు ఫోన్ చేశారు" అని చెప్పింది.

"ఎన్ని గంటలకు చేశాడు"        విసుగ్గా అడిగాడు దివాకర్.

"ఏడు గంటలకు చేశారు. అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు.  మీరు బ్యాంకునుంచి వచ్చారా?  అని అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను."

"బ్యాంకుకు వచ్చి మాట్లాడాడ్లే. వదిన ఆపరేషన్ కు యాభైవేలు కావాలని అడిగాడు.."

"మీరేమని చెప్పారు?"

"ఆలోచించి చెబుతానన్నాను"

"బాగా ఆలోచించండి.  ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. కూతుర్ల దగ్గర ఆయన డబ్బులు తీసుకోరు.  యాభైవేలు మరి ఆయన ఎలా తీరుస్తారు?"

"అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?"

"అయిదో, పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి.."

"కానీ మనం కారు కొంటున్నాం"

"కాబట్టే డబ్బుకు ఇబ్బందని చెప్పండి.  ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే డబ్బులిచ్చేశామని చెప్పండి"

"అలాగే చెప్తా.  నాకు కాస్త త్రాగడానికి మంచినీళ్ళివ్వు" అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్..

       *           *         *         *

మరుసటి రోజు బ్యాంకు లోన్ తీసుకోవడం, డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వడం, తర్వాతి రోజు కారును ఇంటికి తీసుకురావడం, గుడికి తీసుకెళ్ళి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్.

ఆరోజు ఆదివారం కావడంతో క్రొత్తకారు డ్రైవ్ చేసుకుంటూ శివరాం ఇంటికి వెళ్ళాడు.  శివరాం ఇల్లు తాళంవేసి ఉండటంచూసి ఆశ్చర్యపోయాడు.  శివరాం ప్రక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు.

దివాకర్ ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ.  అతడు దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచిలో పనిచేస్తున్నాడు.

"చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు.  నాకు చాలా అనందంగా ఉంది" అన్నాడు రామకృష్ణ.

"నాకూ అలాగే ఉంది.  కొత్తకారు కొన్నాను.  నీకూ, అన్నయ్యకూ చూపిద్దామని తెచ్చాను"

"అలాగా...కంగ్రాట్స్"

"అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా..?"

"నీకు తెలుసో, తెలియదో నాకు తెలియదుగానీ... మీ వదినగారికి ఈమధ్య అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు."

"ఆపరేషన్ విషయం అన్నయ్య నాతో చెప్పాడు.  చెన్నైలో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు"

"ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు.  మీ అన్నయ్య స్టూడెంటు ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు.  ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టరట. మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని, తను ఆ కేసులో స్పెషలిష్టుననీ, తన హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకోమనీ, మందులూ ఇతర ఖర్చులూ భరిస్తే ఆపరేషను తను ఫ్రీగా చేస్తాననీ చెప్పి, వాళ్ళను ఒప్పించి, తనతోపాటే కారులో చెన్నై పిలుచుకెళ్ళారు.  మీ అన్నయ్య తరచూ అంటూండేవాడు "బీ గుడ్.., డూ గుడ్.., హి విల్ డూ గుడ్..," అని..! ఆ మాట ఆయన విషయంలో నిజమైంది.  ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు" అన్నాడు.  రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ "మీ ఆవిడ ఇంట్లో లేరా?" అని రామకృష్ణని అడిగాడు దివాకర్. "లేదు.  మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను. ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందనీ, మీ వదిన బాగున్నారనీ చెప్పింది.."

"తను ఊర్లో ఉండీ వాళ్ళకు ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో..?" అనుకున్నాడు దివాకర్.  ఆ తర్వాత "అన్నయ్య ఆపరేషన్ కు డబ్బు అడిగాడు. రెండురోజుల్నుంచీ రావాలని ప్రయత్నిస్తున్నా కానీ సమయం దొరకలేదు.  ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను.  వాళ్ళు లేరు" అన్నాడు నిరుత్సాహంగా.

"రాలేకపోయానని చెప్పు, ఒప్పుకుంటాను, కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను. రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా., స్నానం చేస్తున్నావా., భోజనం చేస్తున్నావా., కరెంట్ బిల్లు., టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా..? ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెస్తున్నావా., నీ భార్యకు, పిల్లవాడికి కావలసినవి అమర్చి పెడుతున్నావా..? మరి., వీటికి సమయం ఎక్కడనుంచి వచ్చింది నీకు..?  అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది. మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడంలేదు.  నీకు గుర్తుందా?  మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకుచిత్తూరుకు ట్రాన్స్ ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు.  అదృష్టవశాత్తూ ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను. అప్పట్నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది.  ఆయన్ను చూస్తూంటే నాకేమనిపించేదో తెలుసా?

"మనుషులు-నా బిడ్డ ఇంజనీర్ కావాలి., డాక్టర్ కావాలి., ఇంకోటి కావాలి. అని కోరుకుంటారు కానీ.. నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలి.. అని ఎందుకు కోరుకోరు..?' అనిపించేది.  మంచి పొరుగువారివల్ల ఇరుగుపొరుగు వాళ్ళకు ఎంత లాభమో మీ అన్నావదినలద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి., వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి., కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్విప్పుడు మరచిపోయినట్లున్నావు దివాకర్., ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి..? ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు. ఈ మూడేళ్ళలో ఎంత మార్పు నీలో..?  దీనికి కారణం ఏమై ఉంటుంది..? నీ ప్రొమోషనా..? లేక పెరిగిన నీ ఆర్థిక స్థితా..? మీ అన్నయ్య కూడా నీలాగే "నేనూ, నా భార్యాపిల్లలూ" అని గిరిగీసుకుని ఉండుంటే, మీరంతా ఎక్కడుండేవారో అలోచించు."

దివాకర్ మౌనంగా వింటూ ఉండిపోయాడు.

ఉన్నట్టుండి రామకృష్ణ లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు.  ఐదునిమిషాల తరువాత చేతిలో ఓ కవరుతో వచ్చాడు.

"నేను మీ అన్నయ్యవాళ్ళ ప్రక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోను చేసి చెప్పగానే, నువ్వు నాకు రాసిన ఉత్తరం ఇది.  ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు.  ఇది నీ గతాన్నీ, మీ అన్నయ్యతో నీ అనుబంధాన్నీ, ఆయన నీకు చేసిన సహాయాల్నీ గుర్తుకుతెస్తుందేమో ప్రయత్నించు."

దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు.  రామకృష్ణ కారువరకూ వచ్చి "దివాకర్, డబ్బు ఎంత సంపాదించినా... అది మనకు సంతోషాన్నీ, ధైర్యాన్నీ ఇవ్వగలదేమో గానీ, తృప్తిని ఇవ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వడం, కష్టాల్లో ఉంటే సహాయపడటంవల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు.  నిన్ను నొప్పించి ఉంటే సారీ.. గుడ్ నైట్" అన్నాడు..

"గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్..

    *          *          *          *

"రామకృష్ణా..

నువ్వు మా అన్నయ్య ప్రక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శుభసందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది. అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరువేసుకునే అవకాశం నాకు కూడా కలుగుతుంది.

శివరాం నా సొంత అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. నాన్నావాళ్ళు నలుగురు అన్నదమ్ములు. వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు., ఇద్దరివి చిరుద్యోగాలు. అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు.  ఇది ఆడవాళ్ళకు నచ్చేది కాదు.  క్రమంగా వాళ్ళ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఉమ్మడికుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది. మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు.  పెద్దల మధ్య విభేదాలు, పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి.,

అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీనుండి ఇంటికి వచ్చాడు.  ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు.  నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే, దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది.  ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కథలు, జోక్స్ చెప్పి నవ్విస్తూ.. ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు.  పెద్దలమధ్య కూర్చుని, వాళ్ళు చెప్పుకునే చాడీలు వింటూ, విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదనీ, చదువు చెడితే జీవితాంతం బాధపడాలనీ మాకు చెప్పేవాడు.  అందరూ బాగా చదువుకుని, ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చనీ, అందువల్ల తమ మధ్య విభేదాలు రావనీ, అందరూ ఐకమత్యంగా ఉండొచ్చనీ చెప్పాడు.  మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం.  ఆయన చెప్పినట్లే చేశాం., తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు.  వాళ్ళు ఏ పనిచెబితే ఆ పని చేశాడు. చదువుకోని ఆడవాళ్ళకు మాటలతోనే అన్ని విషయాలు వివరంగా తెలియజేసి, వాళ్ళలో సంస్కారాన్ని పెంచాడు.  త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు.  పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు.  అన్నయ్యను అభినందించారు. క్రమంగా పెద్దలమధ్య విభేదాలు దూరమయ్యాయి.  కాపురాలు వేరైనా పండుగల్ని కలసి జరుపుకునేవారు.  అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది.

"తనొక్కడు చదివి బాగుపడితే చాలు" అనుకోలేదు అన్నయ్య. మేమందరం కూడా చదువుకుని బాగుండాలని కోరుకున్నాడు. ఆయన తర్వాత మేము ఆరుగురం అన్నదమ్ములం. మాతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం.  అందరం ఉద్యోగాలు చేస్తున్నాం.  ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం., మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని, దగ్గరుండి మరీ జరిపించాడు అన్నయ్య.

మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో నాకు తెలియదుగానీ, తర్వాత హైస్కూల్ చదువు దగ్గర్నుంచి ఎం.ఎస్.సి.వరకు, తర్వాత ఉద్యోగంకోసం ఇంటర్వ్యూలకు తనొక్కడే వెళ్లేవాడు.  పెదనాన్నకు ఆఫీసు పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు.  తన స్నేహితులకు తోడుగా వచ్చిన తండ్రుల్నీ, సోదరుల్నీ చూసి తన తండ్రి కూడా తనతోపాటే వచ్చిఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా..! అనుకునేవాడు.  ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాలకోసం పోటీపరీక్షలకు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతోపాటుగా వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు.  ఒకరకంగా నాకు జీవితాన్నిచ్చింది మా అన్నయ్యే. నేను ఇంటర్ ఫస్టియర్ లో ఓ పరీక్ష తప్పాను. ఇంట్లో అందరూ బాగా తిట్టారు.  నేను హర్ట్ అయి, ఇల్లు వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నాను.  అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతూంటే.. ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను.

"ఎక్కడికి పోతున్నావ"ని అడిగాడు. సమాధానం చెప్పలేదు నేను.,

"పరీక్ష ఏమైందని" అడిగాడు. చెప్పాను.

"ఫరవాలేదులే., ఫస్టియరే కదా., సంవత్సరం వృధాకాదు.  ఈసారి ఇంకా బాగా చదివి రాయి" అన్నాడు.  నాకు ఎంతో ఆశ్చర్యంవేసింది.  చదువు ప్రాముఖ్యంగురించి అంతగా చెప్పే అన్నయ్య, నా ఫెయిల్యూర్ ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు..  అన్నయ్య నా భుజంపై చెయ్యివేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు, "మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు. ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు.  ఒక్కోసారి తారుమారవుతాయి కూడా. అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు."

ఆ మాట నేను ఏనాటికీ మర్చిపోలేదు.  నాకు ఎంతో ఓదార్పునూ, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చిన మాట అది.  తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లోనూ, డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను.  ఆరోజు అన్నయ్య స్టేషన్లో కనబడకపోయి ఉంటే.. నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో..? ఏమయ్యేవాడినో..? ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నానంటే, ఇది ఆయన పెట్టిన బిక్షే...!

అన్నయ్య ఎం.ఎస్.సి. చదివినా., మమ్మల్ని విడిచి వెళ్ళడం ఇష్టంలేక చిత్తూరులోనే టీచరు పోస్టులోనే   స్థిరపడిపోయాడు.  పైగా టీచరు పోస్టంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్ తో చేశాడు.  మా గురించి ఎలా పట్టించుకునేవాడో, తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు. తన పూర్తి సమయాన్ని వాళ్ళకోసం వెచ్చించి, వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు.  మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసేది.  ఇద్దరూ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లా ఉంటారు.

మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి, ఓసారి పనిఒత్తిడిలో సర్వీస్ చేయకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు., అరిచిపోయిన వాళ్ళున్నారు., కానీ, వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే., అభిమానపు పలకరింపులే., సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసుకు వెళ్ళినా...వాళ్ళ శిష్యులే కనపడతారు.  కావలసిన పని చేసిపెడతారు.

అన్నయ్య మాతో, ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటూండేవాడు - "ప్రతి మనిషీ ఓ అబ్దుల్ కలాం, ఓ రెహమాన్, ఓ తెందూల్కర్ కాలేరు.  కానీ, ప్రయత్నిస్తే ప్రతి మనిషీ ఓ మదర్ థెరెసా కాగలరు.  ఇందుకు మేధస్సు, ప్రతిభ అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టంపట్ల స్పందించే హృదయం ఉంటే చాలు!".అని.  ఈ మాట అనడమే కాదు, ఆచరించి చూపించాడు కూడా., ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు.  అందుకోసం అయ్యే వ్యయప్రయాసల్ని గురించి అస్సలు పట్టించుకునేవాడు కాడు.

మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు, క్రెడిట్లు, టార్గెట్లు.. ఇవే జీవితం అనుకుంటాం., అన్నయ్యలాంటివాళ్ళను చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసినది చాలా చాలా ఉందనిపిస్తుంది.  ఆయన మా అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతుంటాను.  అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే.  ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు. ఉంటాను.

నీ...దివాకర్.

ఉత్తరం చదవడం పూర్తిచేసిన దివాకర్ కంటిచివర నుంచి రాలిన కన్నీటిచుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి, అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనపడసాగింది.

     *        *         *         *

ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్ కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది.

"దివాకర్, మీ అన్నయ్య, వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు.." అని చెప్పాడు రామకృష్ణ.

"అలాగా.. నేను వచ్చి చూస్తాను. రామకృష్ణా..! నీవిచ్చిన నా ఉత్తరం చదివాను. 'పని ఒత్తిడి ' అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకుని, నామీద నేనే సానుభూతి చూపుకుంటూ, భార్య చెప్పిందే వేదమనుకుంటూ, ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ, అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకుప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళూ.  ఆ ఉత్తరం చదివాక,  అనుబంధం ఎంత తియ్యగా ఉంటుందో, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో., ఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో., మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను.  నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు"

"మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు.  నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు"

"తప్పకుండా.  నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉంటాను.."

తర్వాత భార్యకు విషయంచెప్పి, వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్.

హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నావదినల మాటలు వినిపించి, గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు.

"మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండీ..!

నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకుగానీ, స్నేహితులకు గానీ, ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు. బాధ, భయం, కష్టం, నష్టం అన్నీ మీరే భరించి, చివరికి విజయం సాధించారు..!" జానకి శివరాంతో అంటూంది.

"ఎక్కడో ఉన్నవాళ్ళకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు.  అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు. అతనూ తనవంతు సాయంచేసి తన మంచితనం నిరూపించుకున్నాడు"

"కానీ మీరు దివాకర్ దగ్గరకు వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరచింది. ఈమధ్య మన ఇంటివైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకెందుకు అనిపించింది?" "డాక్టరుగారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకు ఎంతో భయమేసింది.  నా భయం నీతో చెప్పుకోలేను., నువ్వే పేషంట్ వి కాబట్టి., ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు.  వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి, ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటిదగ్గర వదిలి, వెంటనే బ్యాంకుకు వెళ్ళాను.  వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను.  పాపం, వాడు అప్పుడూ బిజీనే!"

"అన్నయ్య బ్యాంకుకు వచ్చింది.. నన్ను డబ్బులు అడగటానికి కాదా?" అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్.

"కానీ, అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు?  మీరు దివాకర్ కు ఎంత చేశారు? అతని అభివృద్ది కోసం ఎంతగా తపించారు?  అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు" జానకి అంది.

"తప్పు జానకీ, అలా అనకు!  నేను ఏదో ఆశించి వాళ్ళకు చెయ్యలేదు., ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలనుకున్నాను. దివాకర్ స్వతహాగా మంచివాడే., పనిఒత్తిడిలో అలా మాట్లాడాడు. ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా.. తరువాత ఆలోచిస్తే, పనిఒత్తిడివల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్ గా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి, ఎంతో ఆనందించాను" అన్నాడు శివరాం.

దివాకర్ ఇక నిలబడలేకపోయాడు. పరుగునవెళ్ళి శివరాం చేతులు పట్టుకుని, ఆ చేతుల్లో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ...!

            🌷🌷🌷

*(2009 లో ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ఇంతటి హృద్యమైన, మానవ విలువలు కలిగిన కధను అందించిన రచయిత శ్రీచంద్రశేఖర్ గారు,*

నిజంగా అభినందనీయులు!

*(చివరివరకూ పూర్తిగా చదివినందుకు మీరు కూడా అభినందనీయులే!)*

*ధన్యవాదములతో!*

🙏🙏⚘🌺

*ఇది చాలా కాలం క్రితం పంపినదే ఐనా మరోసారి పంపడమైనది.

కామెంట్‌లు లేవు: