8, జులై 2022, శుక్రవారం

రామాయణానుభవం_ 81

 🌹రామాయణానుభవం_ 81


హనుమ యొక్క వాక్య కౌశల్యాన్ని రామచంద్రస్వామి అమితంగా ప్రశంసించాడు.


"లక్ష్మణా! ఎవ్వరిని మనము కలసికోవాలని ఇంతకాలం నుండి కోరుకొంటున్నామో  అటువంటి మహిమాత్ముడైన సుగ్రీవుని సచివుడు ఈ హనుమ.


*నానృగ్వేదవినీతస్య నాయజుర్వేదధారిణః,* *నాసామవేదవిదుష శ్శక్య మేవం ప్రభాషితుమ్.*


*నూనం వ్యాకరణం కృత్స్న మనేన బహుధా శ్రుతం,* 

*బహు వ్యాహరతాఽనేన న కించి దపశబ్దితమ్.*


*న ముఖే నేత్రయో ర్వాపి లలాటే చ భ్రువోస్తథా, అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్.*


ఈయన వాక్యజ్ఞుడు, స్నేహయుక్తుడు. స్వరసంపన్నమైన ఋగ్వేదంలో చక్కగా శిక్షణ పొందనివాడు, అనేక అనువాకాలుగల యజుర్వేదాన్ని ధారణ చేయలేనివాడు, గాన ప్రధానమైన సామవేదంలో విద్వాంసుడు కానివాడు ఈ విధంగా (హనుమ వలె) మాట్లాడజాలడు.


ఈయన వ్యాకరణశాస్త్రాన్ని మొత్తంగా అధికరించినట్లున్నాడు. ఇంత మాట్లాడినా, ఒక్క అపశబ్దం కూడ లేదు చూడు! ఈయన సంభాషించినంత సేపు కనుల చూపులలో మనోహరములు కాని, నొసలుపై కాని, బొమ్మల కదలికలలో కాని, ఇతర అవయవాలలో కాని ఏ వికారము కనబడడం లేదు


ఈయన మాటలను ఎక్కువగా సాగదీయడం లేదు. అట్లని మధ్యలో మాటలు కరువైనట్లు సంభాషణ అస్పష్టంగా లేదు. మాటలలో తొందరపాటు లేదు. అట్లని మాటల మధ్య అనవసరమైన ఆలస్యము లేదు.


మనకు పూర్తిగా వినబడనంత మెల్లగా మాట్లాడలేదు. అలాగని అనవసరంగా గొంతుచించు కోవడం లేదు. మధ్యమ స్వరంలో, మృదువుగా, మధురంగా, శుభప్రదంగా, మనోహరంగా ఉంది హనుమ సంభాషణము. హనుమ యొక్క చతుర సంభాషణము వింటే చంపడానికి కత్తి ఎత్తిన ఎంతటి శత్రువు అయినా కత్తిని దించక మానడు.


ఇటువంటి సచివుడున్న ఏ ప్రభువుకైనా అన్ని కార్యాలు సహజంగానే సిద్ధిస్తాయి”.


**


[రాముడు దర్శించిన హనుమ..


హనుమ మాటలలో శ్రీరాముడాతని వేద పాండిత్యమును గుర్తించినాడు. ఆతడు ఋగ్వేదమునందు బాగుగా శిక్షితుడు అనినాడు. ఋగ్వేదము ప్రతి వర్ణమునకు స్వరముండును. స్వరము అధికముగా ఉండుటచేత మనసును ఏకాగ్రముగ ఉంచుకొని అవధానముతో వివి ఉచ్చరింపదగినది ఋగ్వేదము. అందుచే హనుమను ఋగ్వేద వినీతుడు అవగా శిక్షితుడు అని గురువు వద్ద బాగుగ నేర్చినవాడు. అట్టివాడు గాని ఇట్లు మాట్లాడలేడు.


యజుర్వేదములో ప్రతి అనువాకములో వేరొక అనువాకమందలి వాక్యము వచ్చుచుండును. ఆ వాక్యములు ఎందులోనో సరిగ జ్ఞాపకము ఉన్నగాని ఒక అనువాకము చదువుచున్నప్పుడు మరియొక అనువాకములోనికి వెళ్ళిపోవుచుండును. అందుచే యజుర్వేదమునకు ధారణ అవసరము. అట్టి ధారణము దుష్కరము హనుమ యజుర్వేదధారి. అనగా యజుర్వేదమును ధారణ చేసినవాడని అనినాడు శ్రీరాముడు.


సామవేదము గాన ప్రధానమైనది. గానమున ఊహించు శక్తి ఎక్కువగ ఉండవలెను. రకరకముల గానములను బాగుగ ఎరింగినవారు గాని సామవేదమును గానము చేయజాలరు.అందుచే సామవేదమునకు వేదనము ఆవశ్యకము అందుచే హనుమను సామవేద విద్వాంసుడు అనినాడు. ఇట్లు మూడింటియందును తగిన పాండిత్యము గలవారుగాని ఇట్లు మాటాడజాలరని శ్రీరాముడు ప్రశంసిచినాడు.


హనుమ మాటాడిన మాటలలో *ఉభౌయోగ్యావహం మన్యే రక్షితుం పృధివీ మిమామ్* మీరు ఇరువురు ఈ భూమిని రక్షింప యోగ్యులని నేను తలంచుచున్నాను అనినాడు.


 దీనిచే సృష్టి, స్థితి, సంహారములు చేయగల వారుమీరని చెప్పినట్లు అయినది. ఈ విషయము ఋగ్వేదమునకు చెందిన ఐతరేయ ఉపనిషత్తు నందు 'ఇదమేక ఏ వాగ్ర ఆసీత్' అని మొదలు పెట్టి సృష్టి స్థితి లయములను చేయువాడు బ్రహ్మమే అని చెప్పినది. ఆ బ్రహ్మమే మీరు అని నాకు గోచరించుచున్నది. అని హనుమ గుర్తించినాడు. 


రాముడు దీనిని ఎరింగి ఇట్లు ఋగ్వేదమునందు శిక్షణ నొందినాడని ప్రశంసించినాడు. అట్లే *మానుషాదేవరూపిణా* అని మనుష్యులుగ దిగివచ్చిన దేవతా స్వరూపులే మీరని బహుథావిజాయతే' పుట్టనివాడు హనుమ పలికినాడు. యజుర్వేదములో 'అజాయమానో అగుచునే అనేక రూపములతో జన్మించును అని ఉన్నది. జన్మించినవాడు జన్మలేనివాడు బ్రహ్మము. ఆతడే తన సంకల్పముచే స్వేచ్ఛగ ఈ లోకములో తన స్వభావమును మార్చుకొనకుండ జన్మించును అని తెలుపుచున్నది. ఈ రహస్యమును ఎరింగినవాడు కానిచో ఇట్లు మాటాడలేడని రాముడు గుర్తించినాడు.....]

కామెంట్‌లు లేవు: