8, జులై 2022, శుక్రవారం

రామాయణానుభవం_ 90

 🌹రామాయణానుభవం_ 90


వాలి అంతిమ సమయంలో తనకు కావించిన హితోపదేశము సుగ్రీవుని మనస్సును మార్చివేసింది. ఆ సమయంతో వాలి తనకు వైరిలా అనుపించలేదు. ఆప్యాయత కల్గిన అన్నలా, తన హితాన్ని కోరే తండ్రిలా అగుపించాడు. ఆయన మరణము సుగ్రీవుని మనస్సుకు బాధ కలిగించింది. తారా విలాపము, అంగదుని దుఃఖము ఆయన విషాదాన్ని మరింత అధికం కావించాయి. ఆయన నయనాలు అశ్రుపూర్ణాలు అయ్యాయి. అంతవరకు అన్న పట్ల ఉన్న వైరభావము అంతరించి సోదరప్రేమ మహోన్నత తరంగంవలె సుగ్రీవుని మనస్సముద్రంలో ఉవ్వెత్తుగా పైకి లేచింది.


చేతిలో విల్లును, బాణాన్ని ధరించి, వీరశ్రీతో విరాజిల్లుతున్న శ్రీరాముని చూచి, "రాజపుత్రా! మన మైత్రీ బంధాన్ని అనుసరించి, నా ప్రార్ధనవలన నీవు వాలి వధ కావించావు. మహావీరుడైన మా అన్న మరణించి ఈ మహీతలంపై పడి ఉన్నాడు. మా అన్న మరణాన్ని కళ్లారా చూచాక, అనురాగ భరితమైన ఆయన అంతిమ సందేశాన్ని విన్నాక నా మనస్సు నిర్విణమైంది. తారాంగదుల విలాపం నా మనస్సును అల్లకల్లోలం కావిస్తున్నది.

నాకిప్పుడు రాజ్యముపై ఆశ అంతరించిపోయింది. భోగముల పట్ల కోరిక పూర్తిగా లేకుండా పోయింది.

*అస్యాం మహిష్యాం తు భృశం రుదన్త్యా"

*పురే చ విక్రోశతి దుఃఖతప్తే.*

*హతేగ్రజే సంశయితేఙ్గదే చ*

*న రామ! రాజ్యే రమతే మనో మే*


నేను తిరిగి ఋష్యమూకానికే వెళ్లి పోతాను. అక్కడే ఫలమూలాలను తింటు శేష జీవితాన్ని గడుపుకొంటాను. ఈ రాజ్యభోగాలు మా అన్న నెత్తురులో తడిసి ముద్ద అయ్యాయి. ఆ నెత్తుటి కూడును నేను తినజాలను.


మా అన్నను చంపించి నేను మహా పాపాన్ని మూటగట్టుకొన్నాను. ఆయనతో నేను అనేక పర్యాయాలు పోరుకుతలబడ్డాను. ఆహవంలోనేను అలసిపోగానే, “వెళ్లు ఇకనైనా బుద్ధి గల్గి జీవించుమని” నన్ను మన్నించి జాలితో వదలిపెట్టేవాడు. అంతటి దయాశాలి.

*న త్వాం జిఘాంసామి చరేతి యన్మా-*

*మయం మహాత్మా మతిమానువాచ.*

*తస్యైవ తద్రామ! వచోనురూప-*

*మిదం పునః కర్మ చ మేనురూపమ్*


తండ్రిని కోల్పోయి అంగదుడు బ్రతికేలాలేడు. అంగదునికి అణుమాత్రము ఆపద కల్గినా తార జీవింపదు. వానరులందరు శోక సాగరంలో మునిగి ఉన్నారు.


నేను ఋష్యమూకానికి తిరిగి వెళ్లి అక్కడే. ఆకులు అలములు తింటూ బ్రతుకును సాగదీసినా, లేక ఇప్పుడే జీవితాన్ని చాలించినా, నీకు నేనిచ్చిన మాట తప్పక నెరవేరుతుంది. నా అనుచరులు నీకు సీతాదేవి అన్వేషణలో తప్పక తోడ్పడుతారు. ఆవిధంగా అనుచరులను నేను శాసిస్తాను. మహాపాపినైన నాకు మరణమే మంచిదారి అనిపిస్తున్నది. అందువలన మహావీరా! మరణించడానికి నన్ను అనుమతించుమని” సుగ్రీవుడు అభ్యర్థించాడు.


సుగ్రీవుని దుఃఖాన్ని చూస్తుంటే రామునికి కూడ దుఃఖమాగలేదు. ఆయన కు ధారాపాతంగా కన్నీళ్లను వర్షించసాగాయి.


" *సంజాత బాష్పః పరవీరహంతా”* 


శ్రీరాముడు అజాత శత్రువు. ఆయనకు సహజంగా శత్రువులు లేరు. ఆయనను ఆశ్రయించిన వారే ఆయన మిత్రులు. ఆశ్రయించినవారి శత్రువులే ఆయన శత్రువులు


[పరులు ఏడుస్తుంటే తాను కూడ దుఃఖించడాన్ని " *పరదుఃఖ దుఃఖిత్వము"* అంటారు. అది కూడా స్వామి కల్యాణగుణాలలో ఒకటి అంటారు పెద్దలు.


దశరథ మహీపాలుని ముందు శ్రీరామచంద్రుని కల్యాణ గుణాలను వివరిస్తూ, " *వ్యసనేషు మనుష్యాణాం। భృశంభవతి దుఃఖితః"* 

అంటారువుఅయోధ్యాపౌరులు.


ప్రజలలో ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా, ఆ ఆపదను అప్పుడే తొలిగించే వాడు. అంతేకాదు. ఆ ఆపద కలిగినందుకు, వాళ్లకంటే తానే ఎక్కువగా దుఃఖించేవాడు కల్యాణగుణాభిరాముడైన శ్రీరామభద్రుడు.]

**


వానరాన వాలి శవంపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తారను వానర వీరులు లేపి ఓదార్చడం ప్రారంభించారు. ఆమె నిలదొక్కుకోవాలనుకొంది. అటుఇటు తన చూపులను సారించింది. 


ఆమె దృష్టి అకస్మాత్తుగా ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రునిపై పడింది.


శ్రీరామభద్రుడు భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిన తారను ఓదార్చాలను కొన్నాడు. ఆయన ఆమె వైపు మెల్లగా అడుగులు వేశాడు.


తనను సమీపిస్తున్న రాముని చూడగానే తార దుఃఖం మరింత అధికం కాసాగింది. తన భర్తను హత్య చేసిన వాడు తనకు ఎదురుగా నిలిచి ఉన్నాడు. ఆమెకు ఆగ్రహము అతిశయించింది. తన అక్కసు అంతా తీరేలా అతనిని దూషిద్దామనుకొంది. ఆమె తలెత్తి రామునివైపు చూచింది. ఆశ్చర్యము ఆయన కనులు కూడా బాష్పధారలను స్రవిస్తున్నాయి. ఆమె ఒక్క క్షణంలో అవాక్కు అయింది. ఆయన పరదుఃఖ దుఃఖిత్వము ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది. 


ఆయన అపార సానుభూతిని ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెలోని క్రోధము అంతరించిపోయింది. తామస గుణము తలవాల్చి సాత్విక గుణము ఆమెలో తల ఎత్తింది. ఆయన తామరనేత్రాలు అమెను తన్మయురాలిని చేశాయి. వాటిని చూచి ఆమె రాముని పురుషోత్తమునిగా గుర్తించింది. అప్రయత్నంగా " *శ్రీరామతత్వము* ” శూర్పణఖలో లాగే తారలో కూడ స్తుతి శీలాన్ని కల్గించింది. ఆశ్చర్య కరమైంది కదా భగవత్తత్వము! అనుకోకుండా ఆమె నోటి నుండి శ్రీరాముని విషయంలో ప్రశంసా వాక్యాలు రాసాగాయి.


 *త్వమప్రమేయశ్చ, దురాసదశ్చ, జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తి శ్చ, విచణశ్చ క్షితిక్షమావాన్* , *క్షతజోపమాక్షః|*


రామా...!

నీవు వేదములచే గూడ వర్ణింప శక్యము గాని మహామహామాన్వితు డవు, మనస్సుచే గూడ చేర శక్యముగాని వాడవు, జితేంద్రియుడవు, ధార్మికులలో నుత్తముడవు. తఱుగని కీర్తి కలవాడవు, వివేకివి, సహనమున భూమికి సాటియైనవాడవు, రక్తాంతనేత్రుడవు.......


ఇందులో శ్రీరామచంద్రుని పరత్వమును తార భావించి పలుకు చున్నది......

కామెంట్‌లు లేవు: