8, జులై 2022, శుక్రవారం

బోధాయన సంహిత

హరేరామ హరేరామ
  రామరామ హరేహరే
  హరేకృష్ణ హరేకృష్ణ
   కృష్ణకృష్ణ హరేహరే

పదహారు నామములతో కూడిన ఈ మహామంత్రము సర్వోత్కృష్టమైనది.  ఈ నామజపము వలన సర్వ సిద్ధులు లభించును. 
ఎవని నాలుకపై అహర్నిశము హరినామము తాండవము చేయునో వానికి కురుక్షేత్రము, కాశి, పుష్కర క్షేత్రము మొదలుగు తీర్ధ పర్యటనల అవసరమేమి? (స్కాంద పురాణము)

సహస్ర కోటి తీర్థ యాత్రలు చేసినంతటి ఫలితమును అతి శీఘ్రముగ నిరంతర నామ సంకీర్తన వలన పొందగలము (వామన పురాణము)

ఒకానొకప్పుడు కురుక్షేత్రములో విశ్వామిత్రుడు తన భక్త సమూహమునకు ఇట్లు చెప్పెను. 
"ఈ భూమండలము నందు గల అనేక తీర్థములను గురించి వింటిని.  కాని హరి నామము యొక్క కోటి అంశముతోనైనను అవి ఏవియు సమము కానేరవు.  నామము అంతటి విలువైనది". (విశ్వామిత్ర సంహిత)

వేద, ఆగమ, శాస్త్రాదుల పఠనము వలనను, అనేక తీర్థ పర్యటనల వలనను ఏమి ప్రయోజనము? ఒకవేళ నీకు ముక్తి కావలయునని నచో గోవిందా! యని అనుక్షణము స్పష్టముగా కీర్తించుము. (లఘు భాగవతము)

సూర్యగ్రహణ కాలమందు కోటి గోవులను దానము చేసినను, మాఘ మాస వ్రత నియమానుసారము ప్రయాగ లో గంగానదీ తీరమందు కల్పము వరకు నివాసము చేసినను, అసంఖ్యాకములైన యజ్ఞములు చేసినను, మేరు పర్వత సమానమగు సువర్ణ దానము చేసినను, గోవింద కీర్తనములో నూరవ అంశమునకు అవి అన్నియును సమము కానేరవు. (లఘు భాగవతము)

చెరువులు, నూతులు, తోటలు నిర్మించుట, మొదలగునవి పుణ్య కర్మలైనను బంధన హేతువులే అగుచున్నవి.  శ్రీహరి నామ సంకీర్తనమొక్కటే శ్రీహరి పాదారవిందముల యొద్దకు మనలను చేర్చగలదు.  (బోధాయన సంహిత)

రాజేంద్రా! సాంఖ్య, యోగ శాస్త్రములతో నీకు పని ఏమున్నది? నీకు ముక్తి కావలయునేని గోవిందనామ కీర్తనము చేయుము (గరుడ పురాణము)

కామెంట్‌లు లేవు: