10, అక్టోబర్ 2022, సోమవారం

రామాయణానుభవం_ 171*

 🌹 *రామాయణానుభవం_ 171* 


సుగ్రీవుని ఆజ్ఞతో అంగదుడు ముందుగా లేచి, "విభీషణుని పరీక్షింపవలసిందే! ఎందుకంటే శత్రువుల నుండి వచ్చిన వారిని అనుమానింపక వదలకూడదు. మోసగాళ్లు ఎప్పుడు తమ బుద్ధిని సులభంగా బయట పెట్టరు. ఎదుటివారి బలహీనతలను గ్రహించి పైబడుతారు. అప్పుడు చాల ప్రమాదం కలుగుతుంది.

*చాదయిత్వా ఆత్మా భవం హి చరన్తి శఠ బుద్ధయః*

*ప్రహరంతి చ రంధ్రేషు సో అనర్థః సుమహాన్ భవేత్*

అందువలన మంచి చెడులను విచారించి పనులను చేయాలి. ఒక వేళ విచారణలో వాళ్లు మంచివారని తేలితే స్వీకరించాలి లేదా వదలివేయాలి" అన్నాడు.


శరభుడు:- “మహాపురుషా! విభీషణుని విషయంలో చారుని నియమించాలి. సూక్ష్మబుద్ధితో ఆ చారుడు ఈయనను పరీక్షించాక, ఈయనను రానివ్వడమా? లేదా? అని నిర్ణయించాలి" అని తెలిపాడు.


జాంబవంతుడు శాస్త్రవిదుడు. ఆయన బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్దుష్టంగా తన అభిప్రాయం వెలిబుచ్చాడు.


"రామచంద్రా!మనకు, రాక్షసులకు మధ్య బద్ధవైరము ఉంది. అంతేకాదు వారు పాపబుద్ధులు, విభీషణుడు రాగూడని సమయంలో రాగూడని చోటుకు వచ్చాడు. కాబట్టి ఆయనను అన్ని విధాల అనుమానింపవలసిందే".


న్యాయకోవిదుడైన మైందుడు తన అభిప్రాయాన్ని తెలుపుతున్నాడు. "ముందుగా విభీషణుని నెమ్మదిగా రావణుని గురించి అడిగి చూద్దాము. ఆయన మాటల తీరును బట్టి ఆయన మనస్సును తెలిసికొని ఏదో ఒకటి నిర్ణయిద్దాము".


అందరి తరువాత సంస్కారవంతుడు సచివోత్తముడైన హనుమ అర్ధవంతములైన మాటలతో అందంగా తన అభిప్రాయాన్ని తెలుప సిద్ధమైనాడు.


"రామభద్రా! నీవు సమర్ధుడివి, మాటలలో నేర్పరివి, బుద్ధిలో బృహస్పతి కూడా నీతో తులతూగలేడు.


అందువలన నాతర్కకౌశలంతో నిన్ను మెప్పించాలని కాని, ఇది వరకు చెప్పిన వానరోత్తముల మాటలను కాదనడంకొరకని కాని, నేను గొప్పవాడిననే అహంకారంతో కాని, నాకు ఏదితోస్తే అదే చెప్పాలనే చాపల్యంతో కాని నేను మాట్లాడడంలేదు.

*న వాదన్ న అపి సంఘర్షన్ న ఆధిక్యాన్ న చ కామతః* |

*వక్ష్యామి వచనం రాజన్ యథా అర్థం రామ గౌరవాత్*

నేను నిజంగా నీపట్ల భక్తి ప్రపత్తులతో నా అభిప్రాయాన్ని నివేదిస్తున్నాను.


నీ సచివులంతా "మంచి చెడులు, నిర్ణయించాక, విభీషణుని పరీక్షించాక, ఆయనను రానివ్వాలి లేదా వదలాలి" అని అన్న మాటలు నాకెందుకో సరైనవి కాదని అని పిస్తుంది.


ఎందుకంటే ఎవ్వరి మంచి చెడులనైనా, సామర్థ్యాన్నైనా నిర్ణయించేది వారిని పనులలో నియోగించిన తరువాతే కదా! పోనీ ఆయనకు పనులను అప్పగించి చూద్దామంటే అందుకు తగిన సమయమిదికాదు.


చారులను పంపి పరీక్షించే అవసరము లేదు. ఎందుకంటే దూరంలో ఉన్న వాళ్లను పరీక్షించడానికి చారులు అవసరము. కళ్ల ఎదుటే ఉన్నవాడి విషయంలో చారులతో ఏమి పని? ఇక విభీషణుడు రాగూడని సమయంలో రాగూడని చోటుకు వచ్చాడనే మాట వచ్చింది కదా! ఆ విషయంలో నా ఆలోచనను స్పష్టం చేయాలని అనుకొంటున్నాను......

** 


హనుమ తన అభిప్రాయాన్ని తెలుపుతున్నాడు....


నిజానికి విభీషణుడు రావలసింది. ఇప్పుడే, ఇక్కడికే


*దౌరాత్మ్యం రావణే దృష్ట్వా | విక్రమంచ తథాత్వయి* । 

*యుక్త మాగమనం తస్య | సదృశం తస్య బుద్ధితః*


రావణుడా! దుర్మార్గుడు. ఆయన సీతను అపహరించి తెచ్చాడు. ఆయనకు ఎవ్వరు ఎన్ని విధాల నచ్చజెప్పినా వినక సర్వరాక్షస వినాశకరమైన సమరాన్ని ఆహ్వానిస్తున్నాడు.


ఇక నీవు అవక్రవిక్రముడవు. నీ పరాక్రమంతో నీకు ఎదురు పడ్డ, ఖర దూషణ, విరాధ కబంధాది రాక్షసులను, వాలి అంతటి మహావీరుని ప్రాణాలతో వదలలేదు. రావణుని దురాచారాన్ని,నీ పరాక్రమాన్ని రెంటిని చూచి విభీషణుడు తనకు ఏదికావాలో నిర్ణయించుకొని నీ దగ్గరికే వచ్చాడు. ఇక ఆయన రావలసిన సమయం కూడ ఇదే! ఎందుకంటే ఒకసారి యుద్ధము ప్రారంభమయితే శరణాగతి సులభసాధ్యంకాక పోవచ్చు. మారు వేషాలతో వెళ్లి ప్రశ్నిస్తే ఆయన స్వభావం తెలుస్తుందన్న మాట కూడ సరి అయింది కాదు.


కొత్త వాళ్లు వేసే ప్రశ్నలకు ఎవ్వరు కూడ మనస్సు విప్పి సమాధానాలివ్వరు. నమ్మిన వాళ్లతోనే కదా ఎవ్వరైనా మనస్సు విప్పి మాట్లాడేది. మనస్సు విప్పి మాట్లాడనప్పుడు అపార్ధాలు తోచవచ్చు. దానివలన మైత్రి కోరివచ్చిన విభీషణుని శత్రువుగా అనుకొనే ప్రమాదం ఉంది కదా !


రామభద్రా! ఇతరుల స్వభావాలను తొందరగా గ్రహింపజాలము. వారి మనస్సుల లోని మర్మాలను తొందరగా గ్రహింపలేము.

*అశక్యః సహసా రాజన్ భావో వేత్తుం పరస్య వై*

*అంతః స్వభావైర్గీతైస్తైర్నైపుణ్యామ్ పశ్యతా భృశమ్*


మహారాజా! ఈయన మాట్లాడుతున్నప్పుడు ముఖములో దుష్టత్వము కనబడలేదు. మాటలు దాచుకొన్నట్లు లేవు స్పష్టంగా ఉన్నాయి. ఈయన సజ్జనుడనడంలో సందేహం లేదు.


 మోసగాడు తన ఆకారాన్ని మారు వేషంతో కప్పిపుచ్చుకోవచ్చు. కాని తన స్వభావాన్ని ఎంతో సేపు విజ్ఞుల ముందు దాచుకోలేదు. అనుకోకుండా ఆయన స్వభావము మాటల ద్వారా హావభావాల ద్వారా బయటపడి తీరుతుంది.


ఎంత వెతికి చూచినా విభీషణుని మాటలలో, హావభావాలలో మోసము కనబడడం లేదు.


ఉచితములైన దేశ కాలాలలో, ఉచిత పురుషుని గురించి చేసిన పని వెంటనే ఫలిస్తుంది. అందువలన సరైన ఈ సమయంలో, ఈ స్థలంలో సమర్ధుడవు, శరణ్యుడవు అయిన నీ విషయంలో శరణాగతి తప్పక ఫలించాలి.


నీ ధర్మ సంస్థాపనోద్దేశ్యాన్ని, రావణుని అధర్మస్వభావాన్ని గమనించి, అధర్మాన్ని రూపుమాపడంలో వాలివధను, సుగ్రీవ పట్టాభిషేకాన్ని నీవు జరిపించడం విని నిన్ను బుద్ధిపూర్వకంగా విభీషణుడాశ్రయించాడు. కనుక ఆయనను చేరదీయడమే ఉత్తమము నాకు తోచింది నేను చెప్పాను. నిర్ణయించవలసింది నీవే ప్రభూ!" అని ముగించాడు.

[10/10, 7:28 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 172* 


సుగ్రీవాదుల అభిప్రాయాల వలన శ్రీరాముని మనస్సు కొంత కలత చెందింది. అయినా అవి ఆ మహానుభావుడి మనస్సుపై అంతగా ప్రభావం వేయలేదు.


అంతకు పూర్వమే రామచంద్రుడు వశిష్టాది మహర్షుల వద్ద “కపోతోపాఖ్యనము”, "కండూపాఖ్యానము" మొదలైనవి విన్నాడు. ఆయన మనస్సులో "శరణాగతుడిని రక్షించడమే పరమ ధర్మమనే" నిర్ణయం చోటు చేసికొంది.


ఇప్పుడు "విభీషణుని పరిశుద్ధి" గురించి హనుమ మాటలు విన్నాక ఆయన మనస్సులో ప్రసన్నత, స్థిర నిశ్చయం ప్రకాశించాయి.


అందువలన ఆయన సుగ్రీవాదుల ముందు తన నిశ్చయాన్ని వెల్లడిస్తున్నాడు.


"నా ప్రియాన్ని, హితాన్ని కోరే వానర మిత్రులారా! మీరందరు మీమీ అభిప్రాయాలను స్పష్టంగా తెలిపారు. ఇప్పుడు నా అభిప్రాయాన్ని కూడ తెలుపుతున్నాను వినండి.


*మిత్రభావేన సంప్రాప్తం* । *నత్యజేయం కథంచన*

*దోషోయద్యపి తస్యస్యాత్* | *సతామేతదగర్హితం*


మిత్రభావంతో సమీపించిన వ్యక్తిని నేను ఏనాడూ పరిత్యజించను. అతడిపట్ల దోషమే ఉండుగాక. ఆది సత్పురుషులకు అగర్హితం. శరణువేడితే దుష్టులనైనా రక్షించవచ్చునని సత్పురుషులు చెబుతున్నారు.


విభీషణుడు మిత్ర భావంతో వచ్చాడు. అందువలన రాముడు ఆయనను చక్కగా వచ్చిన వాడుగా (సంప్రాప్తడుగా) భావించాడు. అందువలన శ్రీరాముడు విభీషణుని అంగీకరిస్తున్నాడు.


అంతేకాని సుగ్రీవాదులు వద్దన్నందువలన కాదు. హనుమ అంగీకరించుమని చెప్పినందు వలన కూడ కాదు.

*

అయితే విభీషణునితో శ్రీరామునికి ఇంత వరకు ముఖపరిచయము కూడ లేదు. అటువంటప్పుడు విభీషణుడు మిత్రభావంతో వచ్చాడని ఎలా అనుకోవడం ?


మిత్ర భావమంటే “తన రక్షిస్తాడనే విశ్వాసము కలిగి ఉండడం".


 "తన్మిత్రం యత్ర విశ్వాసః" ఎవ్వరి విషయంలో నమ్మకం ఉంటుందో ఆయనే మిత్రుడు. తనకే శక్తి లేదని, తనకు వేరేగతి కూడ ఏదిలేదని, నిర్ణయించుకొని, శ్రీరామ చంద్రస్వామి శక్తి స్వభావాదులను గుర్తించి, ఆయనను శరణువేడిరావడమే మైత్రీభావము.......


సంప్రాప్తం : తనను ఆశ్రయించదలచాడంటేనే, జట్టువీడగా, కట్టుకొన్న బట్ట జారిపోతుండగా ఆయన ఉన్నచోటికి తానే పరుగెత్త వెళ్లవలిసి ఉండగా, విభీషణుడు ఆశ్రయించడమే కాక తాను ఉన్నచోటికే వచ్చాడే అని రాముడు అనుకొన్నాడు. "తాను చేయవలసిన పనిని ఆయనే చేశాడే " అని రాముడు చేతులు పిసుక్కుంటున్నాడు.


సత్యజేయం: "రక్షాపేక్షాంప్రతీక్షతే అన్నట్లు పరమాత్మ తన దగ్గరికి రక్షించుమని ఎవ్వరు వస్తారా ?" అని వేయికళ్లతో ఎదురు చూస్తుంటాడు. అటువంటిది తన దగ్గరికి వచ్చిన వారిని వదలుతాడా? నిజానికి విభీషణుని విడువడానికి వీలు ఉంటేనే గదా ఆయనను పరీక్షించేది!


విభీషణుని విడువడానికి ఎందుకు వీలులేదంటే? ఆయనను వదలివెళ్తే తన దగ్గరికి రక్షించుమని ఉండరు.


పరీక్షించకుండా స్వీకరించేవారు తమ క్షేమాన్ని గూడ చూచుకొండా రక్షిస్తారు కదా! "ఏమండీ! మీ క్షేమం చూచుకోకుండా మీరు రక్షిస్తామని చూస్తే, మిమ్మల్ని విడిచి ఉండజాలని మా సంగతేమి కావాలి?” అని సుగ్రీవాదులు రాముని ప్రశ్నిస్తే ఆయన అంటాడు మిమ్మల్ని విడిచి పెట్టే మాటేలేదు. కొత్తగా వచ్చినవానిని కూడ వదలిపెట్టను".


కథంచన: ఏ విధంగా కూడ వదలను ఆశ్రయించడానికి వచ్చిన వాడు దుర్మార్గుడైనా వదలను.


విభీషణుడు స్వయంగా రాక్షసుడు. దుర్మార్గుడైన రాక్షసేశ్వరుని తమ్ముడు. ఆయన ఏదైనా అపకారము చేస్తే ఎలాగా ? "దోషోయద్యపితస్యస్యాత్ " ఆయన అపకారము చేసే దుర్మార్గుడైనా పరవాలేదు. దోషాలు ఉన్నా శరణాగతుని వదలను. శరణాగతి చేసే వారిదగ్గర దోషాలు ఉండకూడదనే నియమేమిలేదు కదా! అందువలన నా స్వభావంలో దోషులైన శరణాగతుల పట్ల మార్పు ఏమీలేదు.


మీ దృష్టిలో విభీషణుడు దోషికావచ్చు. అయినా నేను అతనిని విడువను. దోషములేనివారినే రక్షించాలంటే, దోషాలు లేకపోవడమే గొప్పకదా ! గొప్పవారిని రక్షిస్తే ఏమి ప్రత్యేకత? దుష్టుని రక్షిస్తేనే కదా మా గొప్పదనము!


సతామేతదగర్హితం : విశ్వామిత్రుడు, కపోతము "తాము ఆపదల పాలయినప్పటికి శరణాగతులను రక్షించాలి" అని కదా తెలిపింది. అదే సజ్జనుల నీతి.......

[10/10, 7:29 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 173* 


"విభీషణుడు దుష్టుడా? శిష్టుడా?" అనే ప్రశ్నతో మనకు పనిలేదు. శరణాగతుడైతే చాలు ఆయనను రక్షిస్తాను" అని పలికిన శ్రీరాముని మాటలు సుగ్రీవునికి నచ్చలేదు.


“తండ్రి అంతటి పెద్దన్నను ఆపదలో వదలివచ్చిన వాడు మనతో మాత్రము కలిసిఉంటాడని ఏమి నమ్మకము? సమయం చూచి దెబ్బతీసేవాడితో మనకేమి లాభము?” సుగ్రీవుడు అడిగాడు.


సుగ్రీవుని మాటలకు లక్ష్మణుని వైపు చూచి శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు


అయితే సుగ్రీవుని ప్రశ్నను శ్రీరాముడు వెంటనే తేలికగా కొట్టి పారవేయలేదు. ఆయన మాటకు కూడ గౌరవమివ్వాలనుకొన్నాడు.


“శాస్త్రాలు, చదువకుండా పెద్దలను సేవించకుండా సుగ్రీవునివలె ఇంత చక్కగా ఎవ్వరు మాట్లాడలేరు. అయినా లోక సిద్ధమైన ఒక విషయము నా మదిలో మెదులు తున్నది.

*అమిత్రాస్తత్కులీనాశ్చ ప్రతిదేశ్యాశ్చ కీర్తితా*

*వ్యసనేసు ప్రహర్తారస్తాస్మాదయమిహాగతః*

సాధరణంగా ఒకే కులంలోని వారు, సమీప బంధువులు ఆపదలో ఉన్నఆపదలో ఉన్న తమవారిని వదలివెళ్లరు. అలా వదలి వెళ్లే వారు శత్రువులే. అయితే అలా బంధువులు వదలి వెళ్లవద్దను కొంటే ఆ బంధువుల మాటలను యజమాని గౌరవించాలి. ఇప్పుడీయన తనవాళ్లను వదలి వచ్చాడంటే, ఈయన తన అన్న అయిన రావణునితో తీవ్రంగా అవమానింపబడి ఇక అక్కడ ఏమాత్రం ఉండలేని స్థితిలో భార్యా పుత్రులను కూడ వదలివచ్చాడని అర్ధము. 


ఒంటరిగామనను కూడ అలాగే వదలి వెళ్లడానికి మనము విభీషణునికి పాలివాళ్లమో (జ్ఞాతులు), బంధువులమో, సామంతులమో కాదు. మనను వదలి వెళ్లితే మళ్లీ రావణుని దగ్గరికే వెళ్లాలి. అంత అవమానం జరిగాక, ప్రాణాలు పోయినా అక్కడికి తిరిగివెళ్లలేదు.


అందువలన మనను కూడ వదలి వెళ్లడానికి ఆయన మన దగ్గరికి రాలేదు. అంటే మన దగ్గరికి రావడానికి ఇంకేదో బలమైన కారణము ఉండి ఉంటుంది.


బహుశ ఆయనకు "రాజ్యకాంక్ష" ఉండి, దానిని సాధించుకోవడానికి మన దగ్గరకు వచ్చి ఉండవచ్చు. తన పనిని మన ద్వారా సాధించుకోవాలని అనుకొన్నప్పుడు ఆయన మనకు ఏ హాని తలపెట్టే అవకాశము లేదు. అందువలన మనము ఆయనను చేరదీయడం లో తప్పులేదు.


సుగ్రీవా! ఆపదలలో ఉన్నవారిని వదిలి వెళ్లక పోవడానికి లోకంలో అందరు భరతుని వంటి సోదరులు, నీవంటి మిత్రులు, నావంటి పుత్రులు ఉండరు కదా!


"తన తల్లి ద్వారా తనకు సంక్రమించిన రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి, దానికి అర్హుడైన అన్ననే సింహాసనాసీనుని చేయాలనుకొని, అందుకు ప్రాయోపవేశం చేసి. అయినా అన్నను ఒప్పించాలని ప్రయత్నించిన మహాత్ముడైన భరతుడే నిజమైన తమ్ముడు".


"తన శత్రువైన వాలిని సంహరించి, తనకు భార్యారాజ్య లాభాన్ని కలిగించిన శ్రీరామునికి కృతజ్ఞుడై మైత్రీ భావాన్ని నిలుపుకొని తన ప్రాణాలకు తెగించి స్నేహితుడికి సహాయం చేయడానికి సమస్త వానర గణంతో బయలుదేరిన సుగ్రీవుడే నిజమైన మిత్రుడు".


"భార్యకు ఎన్నడో ఒక మాట ఇచ్చి, ఆ మాటకు కట్టుబడవలసి వచ్చిన దశరధుని దయనీయ స్థితిని చూచి, ఆయన అసహాయతను అర్ధం చేసికొని స్వయంగా రాజ్యాన్ని పరిత్యజించి కారడవులకు బయలుదేరిన శ్రీరాముడే నిజమైన పుత్రుడు".


శ్రీరాముడు ఇంతచెప్పినా ఆయన మాటలు సుగ్రీవుడికి నచ్చలేదు. ఆయన తన ఆసనం నుండి లేచి, చేతులు జోడించి "ఇక్ష్వాకు వంశప్రభూ! నీ ఎన్ని రకాల చెప్పినా ఇంకా నాకీ విభీషణుడు రావణుని గూఢచారే" అనిపిస్తున్నది. ఈయన మనకు ప్రమాదం కలిగించాలనే పాప బుద్ధితోనే ఇక్కడికి వచ్చాడు. మన నమ్మకాన్ని పొందాక నిన్నో, లక్ష్మణునినో, నన్నో, తన చేతికి దొరికిన ఏవానర వీరులనో చాటుమాటుగా సంహరించవచ్చు. ఎంతయినా ఈయన రావణుని తమ్ముడే కదా" అని తన అనుమానాన్ని మళ్లీ వెలిబుచ్చాడు.....


** 


సుగ్రీవుని భయాన్ని, ఆయనకు తమపై ఉన్న ప్రేమను శ్రీరాముడు అర్ధం చేసికొని "మిత్రమా సుగ్రీవా! విభీషణుడు మేమనుకొన్నట్లు శిష్టుడే కావచ్చు లేదా నీవు అనుమానించినట్లు దుష్టుడేకావచ్చు. ఆయన ఎంత దుష్టుడైనా మనకేమి భయములేదు.


*పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం* *చైవ రాక్షసాన్* , *అంగుళ్యగ్రేణ తాన్ హన్యా మిచ్ఛన్ హరిగణేశ్వర,*


 సుగ్రీవా! సమస్త యక్ష, రాక్షస,

పిశాచ దానవగణాలు కలిసి నన్నెదిరించినా, నాకేమి ప్రమాదంలేదు. నేను తలచుకొంటే వాళ్లందరిని నావేలుకొనతో సంహరింపగల్గుతాను. ఒక్క లంకలోని రాక్షసులు అందులో విభీషణుడొక్కడు నాకు ఒక లెక్కా? అందువలన విభీషణునికి మనమాశ్రయ మిచ్చినా మన కొంపమునిగి పోయేదేది లేదు.


సుగ్రీవా! శరణాగతి విషయంలో “కపోతోపాఖ్యానాన్ని” తెలుపుతాను విను.


“ఒక అడవిలో రెండు పావురాలు ఉండేవి. అందులో భార్యాకపోతాన్ని ఒక వేటగాడు చంపాడు. దానిని తిన్నాడు. ఆ వ్యాధుడు అడవిలో ఉండగానే రాత్రి అయింది. అది చలికాలము ఎముకలను కొరికి తినే ఆచలికి ఆ వేటగాడు తట్టుకోలేక పోయాడు. వన్యప్రాణులన్నిటిని సహాయము అర్ధించాడు.


తన భార్యను చంపిన వేటగాని చలిబాధ మగ పావురానికి పాపమనిపించింది. అక్కడ ఉన్న కట్టెలను ప్రోగుజేసి మంటను రగిలించాడు. కట్టెలు అంటుకొని మండాయి. ఆమంటకు వేటగాని చలి ఎక్కడికో ఎగిరిపోయింది.


అయితే అంతవరకు దాగి ఉన్న ఆకలి మంటలు మండసాగాయి. ఆకలి బాధను కూడ వేటగాడు ఓర్చుకోలేక విలవిల కొట్టుకోసాగాడు.


దయామయమైన ఆ మగ పావురము వేటగాని ఆకలి బాధను చూచి సహించలేక పోయింది. ఆయనకు తనే ఆహారము కావాలని, ఆ కట్టెల మంటలో పడికాలిపోయింది.


మిత్రమా! సుగ్రీవా! చూచావా? "శరణువేడిన వారిని కాపాడితీరాలని ఆ పావురాని కెవ్వరైనా చెప్పారా? లేక అది శాస్త్రాలేవైనా చదివిందా?" శాస్త్ర జ్ఞానము కూడలేదే?


ఈ రెండు లేకున్నా వేటగానిని రక్షించదగిన శక్తి ఆపావురానికి ఉందా? లేదే! ఆయనను రక్షించాలంటే తాను చావాలి. తన ప్రాణాలను బలిపెట్టి ఆకపోతము శరణాగతుడైన వ్యాధుని రక్షించిందే! అల్పము అయిన ఒక పక్షి ఆచరించిన “శరణాగత రక్షా” ధర్మాన్ని జ్ఞానశక్తులు గల మనము ఆచరించక పోవడం న్యాయమా ?


ధర్మమూర్తి అయిన దశరధ చక్రవర్తి తనయుడను, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల, శిష్యుడను, శ్రీరామచంద్రుడను నా ధర్మాన్ని నేను కాపాడుకోవద్దా ?


*ఆర్తోవాయదివాదృప్తః పరేషాంశరణాగతః*

*అరి: ప్రాణాన్ పరిత్యజ్య* | *రక్షితవ్య : కృతాత్మనా..* 


పాప భయంతో పరుగెత్తి వచ్చిన ఆర్తుడు కాని, పాపభయాన్ని వీడి వచ్చినదృప్తుడుకాని, ఎవ్వరైనా వచ్చి శరణు వేడితే, తన ప్రాణాలను త్యాగం చేసి అయినా శత్రుప్రాణాలను కాపాడాలి. అలా కాపాడడమే సత్పురుషుల లక్షణము.


ప్రపన్నుని రక్షించక వదలి వేయడం వలన, అపకీర్తికి, నరకానికి కారణమవుతుంది".


కండుమహర్షి ఉపదేశాన్ని పాటించడం వలన ధర్మము, యశము(కీర్తి), పుణ్యము లభిస్తాయి.


సుగ్రీవా నా స్వభావాన్ని వివరిస్తాను విను.........

[10/10, 7:29 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 174* 


శ్రీరామ సుగ్రీవ సంవాదం కొనసాగుతోంది.


విభీషణుని పరం గా నా నిర్ణయం .....


*సకృదేవ ప్రపన్నాయ*

*తవాస్మీతి చయాచతే* | 

*అభయం సర్వభూతేభ్యోదదామ్యే* *తద్వ్రతంమమ* ||


ఈ శ్లోకం శ్రీరామ చరమ శ్లోకం అంతిమ ఉపాయం లేదా శ్రేష్ఠ ఉపాయంగా ప్రసిద్ధి.


"ఒక్కసారే నీవాడను నేను అని ప్రార్థించి నేనే ఉపాయమని నమ్మిచేరిన వానికి సర్వభూతములనుండి అభయమును ఇస్తాను. ఇది నా వ్రతము. వారి జాతిగాని, యోగ్యతగాని, దేవుడా, మనుష్యుడా, పశువా, పక్షియా అని కూడ నేను గుర్తింపను. నీవాడను అని నమ్మి శరణు పొందినవాడు ఎవ్వడైనను సరే వానికి నేను అభయమును అందిస్తాను" అని శ్రీరాముడు చెప్పినాడు. 


ఈ ఒక్క శ్లోకమును ప్రతివ్యక్తియు నిత్యము చదువుకొనవలెను. _రామా! నీ వాడనని మనసులో దృఢముగ నమ్మి ప్రార్థించుచున్నాను అనిన చాలును. తప్పక రక్షణ లభించును._


*సకృదేవ ప్రపన్నాయ*

 తనకు ఒకసారే ఆశ్రయించిన వాడికి,


*తవాస్మీతిచయాచతే* నేను నీ వాడినని శరణుకోరిన వానికి ఒక్కనికే కాక 

*అభయం సర్వభూతేభ్యోదదామి* అలాకోరిన వారందరిని రక్షణనిస్తానని చెప్పుతున్నాడు.


శరణాగతిలో రెండు లక్షణాలు:


1. శరణువేడి రావడం (శారీరక కర్మ)

2. నేను నీవాడినని శరణుకోరడం (వాచికకర్మ). 


అయితే రెండు కూడ (చ) ఉంటేనే రాముడు రక్షిస్తాడా? అంటే రెండు ఉండవలసిన అవసరంలేదు. ఇందులో "శరణువేడి రావడమో" (చ-వా) లేక “నేను నీవాడినని చెప్పడమో" ఏదో ఒకటి చేసినప్పటికీ నేను ఆయనను రక్షిస్తానని శ్రీరామ చంద్రస్వామి తెలుపుతున్నాడు. ఇది ఆ స్వామి రక్షాదీక్ష!


*అభయం* శరణాగతులు శరణుకోరితే స్వామి ఏమిస్తాడట ? అభయాన్ని ఇస్తానంటాడు. అభయం దేని నుండి ? అన్నిటి నుండి దుఃఖం నుండి, భయం నుండి బాధ నుండి, వ్యాధి నుండి, దారిద్య్రం నుండి, నరకం నుండి, కైవల్యం నుండి, పునర్జన్మ నుండి ఒకటేమిటి అన్ని అయిష్టాల నుండి 


"అధసోఽ భయంగతో భవతి" అంటుంది వేదము. సర్వభయాలను పోగొట్టే మోక్షాన్ని కూడ ప్రసాదిస్తాడు స్వామి అభయమంటే మోక్షంకూడ (అభయమేవమోక్షః)


*సర్వభూతేభ్యో* అభయాన్ని ఎవ్వరికిస్తాడు ? అభయాన్ని కోరెవ్వరు కావాలి? వారి అర్హతలేవి ? అభయాన్ని కోరేవారెవ్వరైనా కావచ్చు. వారికి ఏ అర్హతలు అవసరంలేదు. చివరకు అభయాన్ని కోరేవారు మనుష్యులే కావాలనే నియమం కూడ లేదు. ఏ ప్రాణులైనా కావచ్చు. పశువులైనా, పక్షులైనా ఫరవాలేదు. అభయం కోరిన ప్రాణులెవ్వరైనా కావచ్చు. ఎందరైనా కావచ్చు.


*పశుర్మనుష్యః పక్షివా* | *యేచవైష్ణవ సంశ్రయాః* *తేనైవతేప్రయాస్యంతి* 

*తద్విష్లో పరమపదం*


విభీషణుడు ఇప్పుడాశ్రయించింది శ్రీరామచంద్ర పరమాత్మనే అయినప్పుడు ఇప్పుడాయన అభయాన్ని పొందడంలో ఆశ్చర్యమేమిటి?....


పక్షి అయిన జటాయువుకు "గృధ్రరాజమదాజ్ఞప్త: గచ్ఛలోకా ననుత్తమాన్" “అపునరావర్తినాంయాచ” అని ఓ గృధ్రరాజా! నేను ఆజ్ఞాపిస్తున్నాను. నా ఆజ్ఞతో ఉత్తమోత్తమైన లోకాలకు వెళ్లు తిరిగిరాని వారికి లభించేగతిని పొందుమని” ఆజ్ఞాపించి అనుత్తమమైన పరమపదాన్ని కృపజేసిన కరుణా మూర్తి శ్రీరామ చంద్రమూర్తే కదా !


*దదామ్యేతద్ర్వతం మమ* అభయము అందరికి ఇస్తాడా ? ఓ తప్పక! "అభయాన్ని ఇవ్వడం నా వ్రతము" అంటున్నాడు. ఆ సత్యవచనుడు. "వ్రతం” అంటే దీక్ష పట్టుదల,


అయితే అలా అభయమివ్వడం శరణాగతులకు ఏదో మేలు చేయాలనా ? కాదు. తన ఆనందం కొరకు. "మమ” అంటే కేవలము “నాయొక్క" అనేకాదు “నాకొరకు” అని చతుర్ది అర్ధము కూడ. "తన కొరకే” అంటే తన ఆనందం కొరకే. తన ఆనందం కొరకే అభయమివ్వడమనే వ్రతాన్ని పెట్టుకొన్నాడట రామచంద్ర మూర్తి

** 


శ్రీరామ సుగ్రీవ సంభాషణ కొనసాగుతోంది....


*ఆనయైనం హరిశ్రేష్ఠ దత్త మస్యాభయం మయా* , *విభీషణో వా సుగ్రీవ యది వా రావణః స్వయమ్*


సుగ్రీవా నువ్వు వెళ్లి విభీషణుణ్ణి తీసుకొనిరా....నేను అతనికి అభయం ఇచ్చాను.అతడు విభీషణుడే కావచ్చు లేదా రావణుడే స్వయం గా వచ్చి కోరినా అభయం సమానమే.


"అలాగే ప్రభూ! మీ మాట ప్రకారమునేనిప్పుడు వెళ్లి విభీషణుని పిలుచుక వస్తానని"  ఆయన వెళ్లుతుంటే స్వామి ఆయనను ఆపి "సుగ్రీవా! విభీషణునితో పాటు తానుకూడ వస్తానంటే రావణుని కూడ పిలుచుకరావాలి సుమా" అని ప్రత్యేకంగా చెప్పి పంపుతున్నాడు.

*ఆనయ ఏనమ్ హరి శ్రేష్ఠ దత్తమ్ అస్య అభయం మాయా*

*విభీషణో వా సుగ్రీవ యది వా రావణః స్వయం*

ఒక్క విభీషణునికే అభయమిస్తే అదేమిగొప్ప? విభీషణుడు ధర్మాత్ముడు, శరణాగతుడు. రావణుడు దుర్మార్గుడు. అటువంటి వానికి కూడ అభయమిస్తేనే కదయ్యా మన గొప్పదనము!


అంతేకాదు విభీషణుని చేరదీస్తే సుగ్రీవునికి, ఆయన నల్గురు మంత్రులకు మాత్రమే లాభము. రావణుని చేరదీస్తే సమస్త రాక్షసజాతికే నా రక్షణ లభించి తీరుతుంది కదయ్యా


సుగ్రీవ! సుఖమైన, దుఃఖమైనా మన ఇద్దరిదికదయ్యా"! ఇప్పుడు సుగ్రీవుని శరణు నిచ్చిన ఘనత నాతోపాటు నీకు కూడ సమానంగా లభిస్తుంది కదయ్యా" అని పలికాడు. శ్రీరాముడు. రామభద్రుని దృఢరక్షాదీక్షకు ఆశ్చర్యపడి, అన్ని అనుమానాలు తొలిగి, "రామచంద్రా! అన్ని ఆలోచించి చూచాక నాకు కూడ విభీషణుడు అభయమివ్వదగిన వాడే అని అనిపిస్తున్నది. అందువలన విభీషణుడు కూడ మనతో సమానంగా  వుండదగిన వాడు! తక్షణమే గరుడుడు ఇంద్రునితో స్నేహము చేసినట్లు విభీషణుడు కూడ మాతోవచ్చి స్నేహం చేయుగాక!" అని సుగ్రీవుడు పలికాడు.


సుగ్రీవుని సూచన మేరకు శ్రీరాముని అభయం తనకు లభించిందన్న సంతోషముతో విభీషణుడు తన నలుగురు మంత్రులతో ఆకాశంలో నుండి క్రిందికి దిగి రామపాదాలను ఆశ్రయించాడు. సంతోషంతో తన ధర్మస్వభావానికి అనుకూలంగా ఈ విధంగా పలికాడు.

*అనుజో రావణస్య అహమ్ తేన చ అస్మి అవమానితః*

*భవన్తం సర్వ భూతానాం శరణ్యం శరణం గతః*

రామచంద్రా...!

నేను రావణుని తమ్ముడను. నన్ను మా అన్న  హీనంగా అవమానించి వెళ్లగొట్టాడు. సర్వప్రాణులకు ఆశ్రయణీయుడవైన నిన్ను నేడుఆశ్రయించాను, నేను లంకను, భార్యను, పుత్రులను, మిత్రులను, సంపందలను అన్నిటిని పూర్తిగా వదలివచ్చాను. ఇప్పుడు నారాజ్యము, జీవితము సుఖము అన్నినీవే”


శ్రీరామచంద్రుడు ఆయన సమయోచిత వాక్కులను విని చాలా సంతోషించాడు. ఆయనపై తన కన్నులనిండా ప్రేమను, ఆప్యాయతను వర్షించాడు. ఆయనను తన కన్నులతోనే త్రాగుతున్నట్లు ఉన్నాడు.


*లోచనాభ్యాం పిబన్నివ*


ఆయనను అత్యంత ప్రేమతో చూచి "విభీషణా! లంకానగరంలోని రాక్షసుల బలాబలాలను వివరించుమని” కోరాడు.....

*ఆఖ్యాహి మమ తత్వేన రాక్షసానాం బలాబలమ్*

[10/10, 7:29 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 175* 


విభీషణుడు మాట్లాడుతూ...

*అవధ్యః సర్వభూతానాం* *గంధర్వోరగపక్షినామ్* |

*రాజపుత్ర దశగ్రీవో* *వరదానాత్స్వయంభువః*

"రామప్రభూ! రాక్షసులకు రాజైన మా అన్న రావణుడు అమితశక్తి సంపన్నుడు, బ్రహ్మదేవుని వలన అమోఘమైన వరాలను పొందాడు. దేవదానవ గంధర్వాదులెవ్వరు ఆయనను వధింపజాలరు.


ఆయన పెద్ద తమ్ముడు ఇంద్రసమానుడు. కుంభకర్ణుడు సహజంగా అద్భుత దేహబలుడు. ఆయనను చూస్తేనే దేవతలంతా భయంతో వణికిపోతారు. ఆయన కూడ వరబల సంపన్నుడే. ఆయన సేనాని ప్రహస్తుడు అమిత దోర్బలుడు. కైలాసంలో జరిగిన మహాయుద్ధంలో కుబేరుని సేనాపతి అయిన మాణిభద్రుని చిత్తుగా ఓడించిన వాడు. మహోదరుడు, మహాపార్శ్వుడు, అకంపనుడు పరాక్రమంలో లోకపాలులతో సమానులు,


ఇక రావణుని పుత్రుడు ఇంద్రజిత్తు. ఆయన దేవేంద్రుని ఓడించి, బంధించి లంకలోకి తెచ్చి, బ్రహ్మదేవుని మాట వలన వదలిపెట్టాడు.


ఇంద్రజిత్తు అయి, ధనన్సును ఎత్తితే ఆయన ముందు దేవదానవులెవ్వరు నిలువలేరు. అగ్నిని అర్చించి, రణభూమిలో మాయమై ఉండి సమస్త శత్రువులను సంహరించగలడు.


ఇలాంటి మహావీరులు, పదికోట్ల మంది మాంస భక్షకులు, రక్త పిపాసులైన భయంకర రాక్షసులు లంకలో సమరానికి సిద్ధంగా ఉన్నారు. వారితో కలిసి రావణుడు. దిక్పాలకులనందరిని తన గుప్పిట్లో పెట్టుకొన్నాడు" అని ముగించాడు.


విభీషణుని మాటలు విని సత్యపరాక్రమ సంపన్నుడైన శ్రీరామచంద్రుడు మిత్రమా! ప్రహస్తునితో, సకల బంధువులతో కూడిన రావణాసురుని సంహరించి, నిన్ను లంకాధిపతిని చేస్తాను. ఇది ముమ్మాటికి సత్యము.


రావణుడు నాభయంతో క్రిందిలోకాలైన, రసాతల, పాతాళలోకి పారిపోవచ్చు గాక! భయభీతుడై బ్రహ్మదేవుని వద్దదాగి ఉండుగాక! నా శరాఘాతం నుండి ఏ పరిస్థితులలోను బ్రతికి బయట పడజాలడు”


"విభీషణా! నా ముగ్గురు తమ్ములపై ఒట్టుపెట్టుకొని చెప్పుతున్నాను. సపుత్ర బాంధవంగా, సకలసేనా సమేతంగా రావణుని సంహరించక నేను అయోధ్యలో అడుగు పెట్టెను. 


శ్రీరాముని అవక్ర పరాక్రమాన్ని, ఆయన దృఢదీక్షను గమనించిన విభీషణుడు తలవంచి, నమస్కరించి, లంకా విజయంలో తానుకూడ అండగా ఉంటానని మాట ఇచ్చాడు.


విభీషణుని సహకార వాక్కులను విని, ప్రేమతో ఆయనను తన కౌగిటచేర్చుకొని శ్రీరామచంద్రస్వామి తక్షణమే విభీషణుని పట్టాభిషేకం కొరకు సముద్ర జలాలను తెప్పించుమని లక్ష్మణునితో చెప్పాడు.


లక్ష్మణుడు శ్రీరాముని సన్నిధిలో సమస్త వానర సమక్షంలో సాగర జలాలతో విభీషణునికి పట్టాభిషేకం కావించాడు.

*ఏవముక్తస్తు సౌమిత్రిర్భ్యసించద్విభీషణమ్* 

*మధ్యే వానర ముఖ్యానాం రాజానం రామ శాసనాత్*

శ్రీరాముడు విభీషణునికి పట్టాభిషేకం జరిపించడాన్ని "బాగు, బాగు” అని సుగ్రీవ సమేతంగా వానరులందరు ప్రశంసించారు......

** 


సుగ్రీవుడూ హనుమంతుడూ కలిసి మన వానరసైన్యమంతా సులభంగా సముద్రాన్ని దాటే ఉపాయం చెప్పమని విభీషణుడిని అడిగారు. ఇక్ష్వాకువంశంలో పుట్టిన సగరుడు త్రవ్వడంవల్ల ఇది సాగరం అయ్యింది. కాబట్టి శ్రీరామచంద్రుడు సముద్రాన్ని శరణు వేడవచ్చు. అదే తేలిక ఉపాయమని విభీషణుడు అన్నాడు. అంగదుడూ లక్ష్మణుడూ అందరూ బాగా ఆలోచించి అంగీకరించారు. రాముడు సరే అని సముద్రతీరంలో దర్భాసనంమీద ధ్యాననిష్ఠతో కూర్చున్నాడు. యజ్ఞవేదికలోని అగ్నిలా ప్రకాశిస్తున్నాడు.


సుగ్రీవుని సంరక్షణలో సముద్రతీరంలో విడిదిచేసిన వానరసైన్యాన్ని అంచనా వెయ్యడానికి రావణాసురుని గూఢచారి శార్దూలుడు అనే రాక్షసుడు వచ్చాడు. అదృశ్యరూపుడై పరిశీలనగా అంతాచూసి లంకాపట్టణానికి తిరిగి వెళ్ళాడు.


రాక్షసరాజా ! వానర ఋక్షసైన్యాన్ని చూసివచ్చాను. దానిని లెక్కించడం ఎవరితరమూ కాదు. సముద్రం ప్రక్కన మరొక మహాసముద్రంలాగా ఉంది. ఉత్తమోత్తమాయుధాలను ధరించిన రామలక్ష్మణులు నిన్ను జయించి సీతాదేవిని తీసుకొని వెళ్ళడానికి సర్వసన్నద్ధులై ఉన్నారు. సామదానాలే తప్ప భేదదండాలు పనికిరావు.


శార్దూలుడు చెప్పిన ఈ మాటలు విని రావణుడు మండిపడ్డాడు. శుకుడు అనే మరొక గూఢచారిని పిలిచి- ఓశుకా ! నీవు తెలివైనవాడవు. ఎవరికంటా పడకుండా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మెల్లగా రహస్యంగా నా మాటగాచెప్పు. "సుగ్రీవా నీవు మహాబలసంపన్నుడవు. మహారాజకులంలో పుట్టావు. బ్రహ్మదేవుడికి పౌత్రుడవు (ఋక్షరజస్సుతుడు) ఇలా మనం బంధువులం, నాకు సోదరతుల్యుడవు. రామునిభార్యను నేను అపహరించానే అనుకో. దానివల్ల నీకు వచ్చిన బాధ ఏమిటి? ఆలోచించు. కిష్కింధకు  వెళ్ళిపో. దేవతలూ గంధర్వులూ కూడా ఈ లంకను సమీపించలేరు. ఇంకమీ కపిసేనకు సాధ్యమవుతుందా ! వృధాశ్రమ. తిరిగి వెళ్ళిపో!" అని చెప్పు,


ఈ సందేశాన్ని స్వీకరించి శుకుడు ఆకాశమార్గంలో సముద్రాన్నిదాటి వానరసేనను సమీపించాడు. సుగ్రీవుణ్ని దర్శించి ఆకాశంనుంచే రావణుడి సందేశాన్ని వినిపించాడు. అది చిన్న వానరులగుంపు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి వాడిని పట్టి పడగొట్టారు. ముష్టిఘాతాలతో కుళ్ళబొడిచారు. నేను దూతను. నన్ను చంపకండి వదిలిపెట్టండి అంటూ శుకుడు అరుస్తుంటే రాముడు విని వానరులను వారించాడు. శుకుడు ఆకాశంలోకి తుర్రుమన్నాడు. అక్కడ నిలబడి సుగ్రీవా ! రావణాసురుడికి ఏం చెప్పమంటావు? అని మళ్ళీ అడిగాడు. సుగ్రీవుడు కోపించి


"ఓరీ శుకా! రావణుడు నాకు బంధువూ కాదు. మిత్రుడు కాదు. ఉపకారీ కాదు. రామునితోపాటు నాకూ శత్రువే. వాలిలాగా వధార్హుడే రామలక్ష్మణులతో కలిసి రేపోమాపో లంకాపట్టణాన్ని భస్మీపటలం చేస్తాను. రావణుణ్ని బంధుమిత్రపుత్ర పరివారంతో నాశనం చేస్తాను. జరావృద్ధుడయిన జటాయువును చంపినడానికీ, రామలక్ష్మణులు లేని సమయంలో దొంగలా ప్రవేశించి సీతాదేవిని అపహరించినదానికి తగిన ప్రతీకారం చేస్తామనిచెప్పు. రాముణ్ని ఎదిరించిన నిన్ను దేవేంద్రుడే కానీ దిక్పాలకులే కానీ కాపాడలేరనిచెప్పు. సూర్యగోళంలో దాక్కున్నా పాతాళంలో దాగినా నిన్ను వెంటాడి మరీ చంపుతామని చెప్పు....."


అప్పుడు అంగదుడు శుకుని చూచి "వీడుదూతకాదు. గూఢచారి. వీడిని లంకకు పోనివ్వకుండా ఇక్కడే బంధిస్తాము. వానరులకు బద్ధుడైన శుకుడు వారి పిడికిలి పోటులను భరించలేక దీనంగా, భోరున విలపిస్తూ శ్రీరాముని ఆశ్రయించి " మహాత్మా! వీళ్లు నా కళ్లను పీకివేస్తున్నారు. నారెక్కలు విరగగొట్టుతున్నారు. నా గుండెపై కొడుతున్నారు. నా ప్రాణాలు నిలిచేలా లేవు. దయచేసి నాకు ప్రాణదానం చేయుమని" మొరబెట్టుకొన్నాడు. "దూతను హింసించకూడదని” దయా సముద్రుడైన రామచంద్రుడు వారి వారించి బంధించమని అజ్ఞాపించాడు.

** 


శ్రీరామచంద్రుడు సముద్రునికి నమస్కరించి తదభిముఖంగా దర్భాసనంమీద తన బాహువే తలదిండుగా నడుంవాల్చి పరున్నాడు. ఈ రోజు సముద్ర తరణం కానీ లేదా సముద్రుణ్ణి రూపుమాపడం  కానీ  జరిగేతీరాలి అని నిశ్చయించుకున్నాడు. యథావిధిగా సముద్రుణ్ని ధ్యానిస్తూ మౌనియై కూర్చున్నాడు.


 ఇలా మూడురోజులు గడిచిపోయాయి. రామునిచేత యథాశాస్త్రంగా భక్తితో పూజింపబడినప్పటికీ మందబుద్ధియైన సాగరుడు దర్శనం ఇవ్వలేదు.


శ్రీరామునికి పట్టరానికోపం వచ్చింది. విశాలమైన కన్నులు ఎర్రకలువల్లా మారిపోయాయి. లక్ష్మణా! సముద్రుడి గర్వం చూశావా ! ఓర్పు, సహనం, ఋజువర్తన, ప్రియంగా మాట్లాడడంవంటి సద్గుణాలు దుర్మార్గులపట్ల ఫలించవు. అదంతా అసమర్ధతగా మారుతుంది.

*అవలేపః సముద్రస్య న దర్శయతి యత్ స్వయం*

*ప్రశమశ్చ క్షమా చైవ ఆర్జవం ప్రియ వాదితా* 

*అసామర్థ్యం ఫలంతి ఏతే నిర్గుణేసు సతాం గుణాః*

సామోపాయంతో కీర్తిగానీ యశస్సుగానీ లభించవు. ఈ లోకంలో యుద్ధంచేసి జయాన్ని సాధించడమొక్కటే కీర్తికారణం. ఇప్పుడు చూడు నా బాణాలతో ఈ సముద్రాన్ని ఎగురగొడతాను. సముద్రంలో అట్టడుగున దాగిఉన్న మకర సర్పాదుల శిరస్సులు ఎలా తుత్తునియలు అవుతాయో ఎలా తెప్పున తేలుతాయో చూడు.


 ఓర్పుతో ఇన్నిరోజులు ప్రార్ధిస్తే నన్ను అసమర్థుడనుకుంటున్నాడు ఈ సముద్రుడు. సౌమిత్రీ! నా ధనుర్బాణాలు తీసుకురా. ఈ సాగరుణ్ని ఎండగడతాను. వానరసేనలు నడిచివెళ్ళాలి.


ఇలా పలుకుతూ క్రోధవిస్ఫారితనేత్రుడై ధనుస్సుకు నారి ఎక్కుపెట్టి టంకారంచేసి కాలాగ్నిలా ప్రజ్వరిల్లుతూ వజ్రాయుధాలవంటి బాణాలు విడిచిపెట్టాడు. సాగరమంతా అల్లకల్లోలమైపోయింది. తుఫాను వచ్చినట్టు తరంగాలు ఎగిరెగిరి పడుతున్నాయి. సర్పాలు- కళ్ళలోంచి అగ్నులూ నోటిలోంచి విషధూమాలూ కక్కుకుంటూ చచ్చిపోతున్నాయి. పాతాళలో కవాసులైన రాక్షసులు చచ్చి తేలుతున్నారు. బడబానలం ప్రజ్వరిల్లుతూ పైకివస్తోంది.


ఈ ఉత్పాతాలు చూసిన లక్ష్మణుడు వీరావేశంతో ఊగిపోతున్న అన్నగారిని వారించి ధనుస్సు పట్టుకున్నాడు.


*శరణిర్దగ్ధతోయస్య పరిశుష్కస్య సాగర*

*మాయా నిహతసత్త్వస్య* *పాంసురుత్పద్యతే మహాన్*

"లక్ష్మణా ! నన్ను ఆపకు. సాగరా ! ఇదిగో ఈ బ్రహ్మాస్త్రంతో నీ గర్వాన్నీ నీ బలాన్నీ శుష్కింపజేసి అట్టడుగు బురదను ఇసుకగా మార్చేస్తాను" అంటూ శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించేసరికి ప్రపంచమంతా కంపించిపోయింది. మహాపర్వతాలు గజగజలాడాయి. నదులూ సరస్సులూ కళవరపడ్డాయి. సూర్యుడూ చంద్రుడూ అంతర్ధానం చెందారు. చుక్కలు రాలిపడ్డాయి. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకున్నాయి.....

కామెంట్‌లు లేవు: