మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
మా నిషాదః అంటే "మాం" అంటే లక్ష్మీ దేవి, లక్ష్మీ దేవితో కూడినవాడు. రాముడు శ్రీ రాముడయ్యాడు సీతా కళ్యాణం తరువాత అందుకని శ్రీరాముడు, సీతారాముడు " కాబట్టి బాల కాండ" ప్రతిష్ఠాం త్వం తండ్రి యైనటువంటి దశరథ మహారాజుగారి యొక్క మాటనీ నిలబెట్టడం కోసమనీ, సత్యమునందు నిలబెట్టటం కోసమనీ అరణ్యవాసం చేసినటువంటి మహానుభావా ప్రతిష్ఠా త్వమగమః నీ యొక్క కీర్తి చిరకాలమూ ఉండిపోతుంది. నీ గురించి పిత్రువాక్య పరిపాలకుడని లోకం శ్లాగిస్తుంది. "కాబట్టి అయోధ్య కాండ" శ్శాశ్వతీస్సమాః మాట తప్పకుండా పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం చేసిటప్పుడు భరతుడే వచ్చి శత్రుజ్ఞుడే వచ్చి, సుమిత్రా, కౌసల్యా, కైకేయీ వచ్చి, వశిష్టుడొచ్చి, జాబాలి వచ్చి, ఋషులొచ్చి, పౌరులొచ్చి, జానపదులొచ్చి రాజ్యం తిరిగి తీసేసుకొమ్మ వరమడిగిన నేనే అంటున్నాను రామా మళ్ళీ రాజ్యం తీసుకో. ఎవరి కోసం అడిగిందో ఆ భరతున్ని చెప్తున్నాను రామా! రాజ్యం తీసేసుకో!... అన్నా సరే... సత్యమేశ్వరో లోకే సత్యే ధర్మం ప్రతిష్ఠితః ! సత్యమూలాని సర్వాణి సత్యాన్న పరమం పదం !! నాకు సత్యం తప్పా ఇంకోటి అక్కర్లేదు ఎవరు వరమడిగాడో ఆ నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వరాల్ని వెనక్కి తీసుకుంటున్నాను రామా రా అనిచెప్పడానికి తండ్రి లేడు. ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే, తండ్రి పై లోకాల్లో సంతోషించాలంటే నేను పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయడం వినా నాకు మార్గం లేదు. అని మాటకు కట్టుబడి పద్నాలుగేళ్ళు ఆరణ్య వాసం చేసి "తృణం" క్రింద రాజ్యాన్ని విడిచి పెట్టినటువంటి మహా పురుషుడిగా రామా నీ కీర్తి పది కాలములు శోభిల్లి రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చెయ్యబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది. "కాబట్టి అరణ్య కాండ". క్రౌఞ్చమిథునాదేకం క్రౌఞ్చమిథునాత్ క్రౌఞ్చము, క్రౌఞ్చి ఇవీ... వాలీ తార. వాలీ తార సక్రమం. వాలీ రుమ, సుగ్రీవుని భార్యమైనటువంటి రుమని వాలి అనుభవించాడు. కాబట్టీ, కామ ప్రధానముగా తిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపమున్నవాడా "కిష్కికింద కాండ". లేదూ... అందులోనే ఒక గమ్మత్తుంది క్రౌఞ్చౌ అంటే పరివేదనచేత కృషించి పోయిన ప్రాణి. ఎవరు తనకు కనపడాలని తాపత్రయ పడుతోందో వాళ్ళు కనపడక పోవడం వల్ల నీరస పడి బాగా కృషించి పోతే క్రౌఞ్చౌ అని పిలుస్తారు. ఏ రామ చంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకొని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీపక్కనున్న ఆరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో... ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసికెళ్ళి అశోక వనంలో శింశుపా వృక్షం కింద కూర్చోబెట్టినప్పుడు. మళ్ళీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనుసులో కలిసే ఉన్నా బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని, పరితపించి పరితపించి, శోకించి, ఉపవశించి, కృషించి పోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి "సుందర కాండ". కాబట్టి క్రౌఞ్చమిథునాదేకం ఒక్కడే... రామ నామాన్ని - రామ కథనీ ఒకటికి పదిమాట్లు ఎలా చెప్పాలో... ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో... ఎక్కడ వివరంగా చెప్పాలో... ఎక్కడ నామం చెప్పాలో.., ఎక్కడ భక్తి ప్రకటనం చెయ్యాలో, అక్కడ రామ నామ వైభవాన్ని ప్రకాశింపజేసి ఒక్కడే... ఎవ్వరూ చేయలేని సంకల్పం చేసి, ఒక్కడే నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంత మంది రాక్షసులను వధించి, ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి, ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి, ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకొని, ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగటార్చి, ఒక్కడే నిర్భయంగా రావాణాసురిడికి సందేశం చెప్పి, ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి "దృష్టా సీతా" నేను దృష్టాసీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్ ʻసీతమ్మ తల్లి చూడబడును సీతమ్మ తల్లీʼ అని క్షేమ వార్త చెప్పాడో... అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాధని ప్రకాశింపజేసిన సుందర కాండ అందులో ఉంది.కాబట్టి, అక్కడా... క్రౌఞ్చమిథునాదేకంమవదీః కామయోహితమ్ కామమోహితులైనటువంటి ఆ రావణాసురుని పడగొట్టినటువంటి సందర్భమైన యుద్ధ కాండ అందులోకొచ్చింది కాబట్టీ, ఆ తరువాత జరిగినటువంటి కథను కూడా చెప్పింది కాబట్టీ, ఎందు చేతనంటే రామ చంద్ర మూర్తి మీద మనసున్నటువంటి సీతమ్మని రాజ ధర్మం కోసం విడిచిపెట్టి బాధపెట్టిన సందర్భంతో కూడినటుంటి ఉత్తర కాండ కలిసింది కాబట్టీ ఒక్క శ్లోకంలోకి రామాయణం మొత్తం ఏడు కాండలూ వచ్చాయి.
-- బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి