10, అక్టోబర్ 2022, సోమవారం

Srimadhandhra Bhagavatham -- 12

 [10/10, 7:34 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 12 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ఉపసంహారం చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేసి రథంమీద పెట్టి విపరీతమయిన వేగంతో యుద్ధభూమి లోనికి వచ్చి రథమును నిలబెట్టాడు. అర్జునునికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి ఉన్నాడు. అశ్వత్థామ వణికిపోతున్నాడు. కృష్ణుడు 'అర్జునా ! నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతనిని బ్రాహ్మణుడని గురుపుత్రుడని చూడకు సంహరించు. కుత్తుక కత్తిరించు’ అన్నాడు. అర్జునుడు మారుమాట్లాడలేదు చంపలేదు.

ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు.

త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకువెళ్ళి అక్కడ పారవేశాడు. 'ద్రౌపదీ! వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకువచ్చి అశ్వత్థామను అక్కడ పడవేసి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను’ అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒకతల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గానీ తన పసుపుకుంకుమలకు గానీ, తన బిడ్డలకు గానీ, ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన అయిదుగురు బిడ్డలను చంపేశాడు. ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసి ఆవిడ 'మహానుభావా! అశ్వత్థామా! నా భర్తలైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. 'ఆత్మావైపుత్రనామాసి’ తండ్రి తన కొడుకు రూపంలో భూమిమీద తిరుగుతూ ఉంటాడు. నీవు మా గురుపుత్రుడవు. నాకు నీయందు నా భర్తల గురువు దర్శనమౌతున్నాడు. నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. నిన్ను నేను ఒక్కమాట అనను.’ ద్రౌపదీదేవి ఎంతో ధర్మం పాటిస్తున్నది. ఇదీ ద్రౌపది అంటే! ఆవిడ కోప్పడలేదు.

'కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్ర శస్త్రములు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకుపూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు. అపారమైన నిద్రలో ఉన్న నాకుమారులు యుద్ధము చేయడమునందు ఆసక్తి లేనివారై గాఢనిద్రలో ఉన్న వారిని చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకువు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నీవు పుత్రరూపంలో ఉన్న గురువని తలంచి, నా అయిదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను’ అన్నది. 'రాత్రి చంపేటప్పుడు నీకీవిషయములు జ్ఞాపకం రాలేదా? అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి ఉండవలసిన ధర్మములు తెలియదా? అని అడిగినట్లు అవుతుందని 'నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? అని అర్జునుని వంక చూసి

‘అర్జునా! నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా! అయిదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటివరకూ ఏడ్చాను. సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి రెండుచేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాండీవం పట్టుకొని రథము ఎక్కి పగబట్టి, అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి (ద్రోణుడి భార్య, అశ్వత్థామ తల్లి)కి వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒక ఎత్తు. చచ్చిపోతున్నాడని తెలిసి రక్షించుకోలేనని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామా! మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తోందో! తలచుకుంటే నా మనస్సు వికలం అయిపోతోంది’ అని ‘ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతనిని సంహరించకూడదు. ఆయనను విడిచిపెట్టేయండి ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చేయండి' అన్నది.

ఈమాట భీముడు విన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. 'ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకొని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను' అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే. కృష్ణుడు 'అర్జునా! నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పనిలేదు. చంపి అవతల పడేయవచ్చు. ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తున్నది. ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏమి చేయాలో నిర్ణచేయవలసింది నువ్వు ' అన్నాడు. అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపాడో అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టుకుని కాంతిహీనుడైపోయాడు. అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉన్నది. పుట్టుకచేత అశ్వత్థామకి శిరస్సుమీద ఒక మణి ఉన్నది. ఆ మణికాంతి శరీరము అంతా కొడుతున్నది. అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలడములో ధర్మం ఉన్నది. అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అర్జునుడు ఒక కత్తి తీశాడు. అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతోమంది నెత్తురు త్రాగింది. అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురకవృత్తికి వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను పుచ్చుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క త్రోపు తోస్తే అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు. హీనుడై, కాంతిపోయిన వాడై, తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సూతుడు అన్నాడు – శౌనకాది మహర్షులారా! వృత్తాంతమును విన్నారు కదా! ఇదీ కృష్ణలీల అంటే! ఇదీ కృష్ణుడు అంటే! ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అందుకని భాగవతం.

ఈ ఉపపాండవుల పార్థివ శరీరమును తీసుకువెళ్ళారు. దహనక్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలచుకొని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే!

కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖములను ఇస్తుంది. అలా ఇస్తున్న కాలమునకు నీవు పరతంత్రుడవు. నీవు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపములో జీవులు పుడుతూ, మరణిస్తూ ఉంటారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[10/10, 7:34 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 13 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


పరీక్షిత్తు జననము


ఇది జరిగిన పిమ్మట కృష్ణపరమాత్మ బలవత్తరమయిన కాల స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కలిగించారు. 'ఇంక నేను ద్వారకా నగరమునకు బయలుదేరతాను’ అని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు అందరూ కూడ ఆయనను స్తోత్రం చేసి బెంగపెట్టుకొని దీనవదనములతో నిలబడ్డారు. ఆ సమయములో ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరుగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చి కృష్ణపరమాత్మ పాదములమీద పడిపోయింది. అప్పటికి ఉత్తర గర్భంతో ఉన్నది. అభిమన్యుడు మరణించాడు.


ఉత్తర కృష్ణుని చూసి – 'కృష్ణా! నాకు ఏమీ తెలియడము లేదు. కానీ ఏదో దివ్యమయిన తేజస్సు, ఒక ఇనుపబాణం ఏదో వచ్చేస్తోంది. చిత్రం ఏమిటి అంటే అది బయటకు కనపడడము లేదు. నా కడుపులోకి ప్రవేశిస్తున్నది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తున్నది. లోపల ఉన్న పిండము మీద పగబట్టి ఆ బాణం ఆ పిండమును చంపడానికి వెళుతున్నది. నేను తల్లిని ఆ పిండము చచ్చిపోవడము నేను ఇష్టపడడము లేదు. పిండమును తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు. కృష్ణా! నువ్వు రక్షించు’ అని ప్రార్థించింది.

బయటకు వచ్చిన ఉపపాండవులకోసం ద్రౌపది ఏడ్చింది. లోపల వున్న పిండము పోతున్నదని ఉత్తర ఏడుస్తోంది.


ఉత్తర అలా అనగానే పాండవులు గబగబా ధనుస్సు పట్టుకున్నారు. ఎవరిమీద వేస్తారు? శత్రువు బయట ఎక్కడ ఉన్నాడు? ఉత్తర గర్భంలో పిండమును నరకడానికని బాణరూపములో వెళుతున్నది. ఉత్తర ఏమని ప్రార్థించింది? ‘కృష్ణా! నేను నీ చెల్లెలయిన సుభద్రకి కోడలిని. అభిమన్యుని భార్య ఉత్తరను. నా కడుపులో వున్న పిల్లవాడు నీకు మేనల్లుడి కొడుకు' అన్నది. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు. ఎవరో బాణం వేస్తే అది లోపలికి వెళ్ళిపోతున్నది. తామరపువ్వులవంటి నేత్రములు ఉన్నవాడా! నీవు కన్నువిప్పి చూశావంటే శత్రువు మడిసిపోతాడు. ఈ బాణం అగ్నిహోత్రములా ఉన్నది. ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తున్నది. బయట ఉన్నవాళ్ళకు ఏమి తెలుస్తుంది? కడుపులో వున్న పిండమును రక్షించవా! అని శరణాగతి చేసింది.

గాండీవమును ధరించిన అర్జునుడు, చేతి గద తిప్పితే అగ్నిహోత్రమును పుట్టించే భీమసేనుడు, నకుల సహదేవులు, అజాతశత్రువయిన ధర్మరాజు ఉన్నాడు. ఉత్తర వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు. (నీ వాళ్ళు నిన్ను రక్షించరు. నీరక్షణ నీఇంటి ఈశాన్య దిక్కున ఉన్నది.


అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని నీ బంధువులను నిర్లక్ష్యం చేయకు. వాళ్ళని భగవంతునిగా చూసుకో. లోపల పూనికతో ఈశ్వరుడిని శరణాగతి చేయడం నేర్చుకో. ఆయన నీకు రక్షకుడు.) ఆవిడ పాండవులను ప్రార్థన చేయలేదు. కృష్ణుడిని ప్రార్థన చేసింది.

కడుపులో ఉన్న పిండము ‘అగ్నిహోత్రము వచ్చేసింది. నన్ను ఇది కాల్చేస్తుంది, నన్ను రక్షించేవాడు ఎవరు? నేను గర్భంలో వున్నాను. నేను మొరపెడితే ఎవరికీ వినపడుతుంది’ అని ఏడుస్తున్నది. ఈయన ఆ పిండమునకు ఎదురువచ్చి ఉత్తర గర్భములోని పిండము కూడా సంహరింపబడాలని అశ్వత్థామ ఉపయోగించిన బ్రహ్మాస్త్రము లోపల ఉన్న పిండం దగ్గరకి వస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భములో ఉన్న పిండము ముందు భాగమునందు అంగుష్ఠమాత్రుడై నిలబడ్డాడు. గదను త్రిప్పుతున్నాడు. చక్రహస్తుడై వైష్ణవ మాయను ప్రకటించాడు. ఉత్తరగర్భంలో ఒక్కసారి తన తేజస్సును చూపించాడు. ఆ తేజస్సు పిండమునకు తప్ప మరెవరికీ కనపడడము లేదు. ఉత్తరకి గాని, పాండవులకి గాని, లోకమునకు గాని కనబడడము లేదు. స్వామి ఈ లీలను ఉత్తర కడుపులో ప్రదర్శిస్తున్నాడు. తాను బయట నిలబడి ఉన్నాడు. పాండవుల వంశము నిలబడడం కోసం పిండమునకు ఎదురువెళ్ళి నిలబడి బ్రహ్మాస్త్రమునుండి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకొని చాలా ఉల్లాసంగా, సంతోషంగా పిల్లాడి వంక చూస్తే, వాడు ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ‘ఎంత అందగాడు – బొటన వ్రేలు అంత ఉన్నాడు – పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రమును త్రాగేసి నన్ను రక్షించాడు’ అని స్తోత్రము చెయ్యడము కూడా చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానము అయిపోయాడు. అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రము నుండి పైకివచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడని సూతుడు చెప్పి – ‘ ఈమాట చిత్రంగా ఉన్నదా? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా? మీకు నేను మొదటే చెప్పాను. స్వామి ఇరవై రెండు అవతారములలో ఆవిర్భవించాడు. ఇవి అన్ని శాశ్వత స్వరూపుడయిన నారాయణునిలోంచి వచ్చినవే. నారాయణుని నాభికమలములోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన తేజస్సుని, ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్పకాదు. ఆవిధంగా తేజస్సును పుచ్చుకున్నాడు. ఈ పనిని పాండవులు చేయలేరు కృష్ణుడు చేశాడు. ఇప్పుడు మనం జరిగిన సంఘటనలను అనుసంధానము చేసుకోవాలి. ద్రోణాచార్యుల వారి కుమారుడయిన ఆశ్వత్థామను రథం మీదనుంచి దింపగానే వానిని చంపి వేయవలసినదని కృష్ణుడు సలహా ఇచ్చాడు. అర్జునుడు వెంటనే అశ్వత్థామని చంపివేసి ఉండి ఉంటే ‘వీనికి నేను పద్దెనిమిది అధ్యాయముల గీత చెప్పినా ధర్మము అంటే ఏమిటో అర్థం కాలేదు. నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండమును రక్షించనవసరం లేదు’ అని అనుకుని ఉండేవాడు. తను చెప్పినా అర్జునుడు అశ్వత్థామని చంపలేదు. ఈ ధర్మమును కృష్ణుడు తన దృష్టిలో పెట్టుకున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’ – ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాడిని తాను రక్షించాలి. ఎవరూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడు మాత్రమే చేయగలడు. కృష్ణుడు మాత్రమే చేయగలడు. కృష్ణపరమాత్మని నమ్ముకున్న వాడికి తన కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకోనవసరం లేదు. అనుమానం పెట్టుకున్న వానిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు.


ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషముతో ‘నా కడుపులో అగ్నిహోత్రము చల్లారి పోయింది. నా పిండము రక్షింపబడింది. పాండవవంశము రక్షింప బడింది’ అని పొంగిపోయింది.

శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భమునందు జన్మించిన వాడు పరీక్షిత్తు. ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరుపెట్టారు. ఆయనను ఎవ్వరూ విష్ణురాతుడు అని పిలువరు పరీక్షిత్తు అని పిలుస్తారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[10/10, 7:35 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 14 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


తదనంతరం కుంతీదేవి స్తోత్రం చేసింది. ఆవిడ ఆదినారాయణా అని ప్రారంభించింది. కృష్ణా నాభక్తి ఇంకా పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు. మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఏ మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదేవి అడుగుతోంది. ‘పాండురాజు కుమారులయిన ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదనము చేయవలసింది.

స్వామీ నీయందు నా నమస్సు రమించిపోవాలి. పూజామందిరంలోనే కాదు. నేను ఏపని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. నీ నామస్మరణము నుండి నా మనస్సు ఆగకూడదు. నీవు ఈశ్వరుడవు, నీవు సర్వ జగన్నియామకుడవు. నీవు తలచుకుంటే ఏమి ఇవ్వలేవు? కృష్ణా! నాకు అటువంటి భాగ్యమును కటాక్షించవా! నాకు మోహమును తెంపి అవతల పారవేయవలసింది. సంసారమనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి గండ్ర గొడ్డలితో తెంపి అవతల పారేయి’ అని అడిగింది.


కృష్ణ పరమాత్మ ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాడు. పొంగిపోయి ‘అప్పుడే ఎలా కుదురుతుంది ఇంకా మనవడు పుట్టాలి, నువ్వు సంతోషించాలి’ అనే భావం వచ్చేట్లుగా హేలగా చూసి, ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. అంతే ! మాయ ఆవరించింది. ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ మందహాసపు కాంతులలో మైమరచిపోయేటట్లు చేసేశాడు. ఆయన దర్శనానికి ఉండే శక్తి అటువంటిది. ‘స్వామీ! నిరంతరము నీ గురించి భావన చేసే అదృష్టమును ప్రసాదించవలసింది’ అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోయిన తరువాత పదినెలలకు ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించాడు.


భీష్ముని చరిత్ర:


కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజుగారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను తెగటార్చాను. దానివలన నాకు కలిగిన పాపం ఏవిధంగా పోతుంది’ అని బాధపడుతున్న సమయములో, ‘ధర్మసూక్షములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్యమీద పడుకుని ఉన్న మహానుభావుడు భీష్ముడు – అక్కడికి వెడదాం పద’ అని మహానుభావుడు కృష్ణభగవానుడు ధర్మరాజును తీసుకొని వెళ్ళినప్పుడు, భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంతబ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు. భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రం భాగవతంలో వివరించ బడింది.

భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథములలో చెప్పబడింది. భీష్ముని జీవితము అర్థము చేసుకోవడము అంత తేలికయిన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమయిన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది.

ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభనొక దానిని తీర్చారు. ఆ సభకు ఋషులు, ప్రజాపతులు మొదలయిన వారందరూ విచ్చేశారు. వారు ఆ సభయందు కూర్చుని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్లు చూడడము ఎలాగ? భగవంతునియందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించడం ఎలాగ? అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పథంలో నడిచినవారు అవుతారు. వీళ్ళందరికీ ఏవిధముగా కళ్యాణమును సాధించిపెట్టాలి అని సభ జరుగుతోంది.


సభ జరుగుతున్న సమయములో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్దకూతురు. పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమయిన అందగత్తె. మహాసౌందర్యరాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు. వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది.


గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో వున్న అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యకరముగా గంగమ్మకూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారిరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయమును మరచిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగిందని మాత్రము అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు అర్థం అయ్యేవి కావు.

బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యము వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడమేమిటి! రాజర్షి అలా ప్రవర్తించడమేమిటి! అని అనుకున్నారు. అనుకుని వారిద్దరినీ శపించారు. ‘ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనము కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించెదవు గాక’ అని రాజర్షిని శపించారు. గంగమ్మను ‘నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు జీవించెదవు గాక’ అని శపించారు. తదనంతరము ‘శరీరం విడిచిపెట్టిన తరువాత మరల స్వర్గలోకమునకు వస్తావు’ అని శాపవిమోచనము చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి తాను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు.

ఆ కాలంలో భరతవర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందికి వస్తోంది. ‘అయ్యో నేనెంత పొరబాటు చేశాను. నేనయినా ఆ సమయంలో పమిట సర్దుకుని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి’ అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్ట వసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత బాధగా ఉన్నారు? అని అడిగింది. వాళ్ళు ఒక చిత్రమయిన విషయమును ప్రతిపాదన చేశారు. ‘మేము అష్టవసువులము. భార్యలతో కలిసి ఆకాశమార్గములో వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమము మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము. మేము వసిష్ఠమహర్షి ఆశ్రమమును చూశాము. అందులో ‘నందిని’ అనే కామధేనువు ఉన్నది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ, తేజస్సుతోనూ ఉన్నది. దానిని ‘ద్యు’ అనబడే వసువు భార్య చూసి ‘అది మామూలు ఆవేనా’ అని భర్తను అడిగింది. అపుడు ఆయన అది మామూలు ఆవు కాదు – దానిని కామధేనువు అంటారు – దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికయినా తీరుతుంది’ అని చెప్పాడు. అపుడు ‘ద్యు’ భార్య అంది –‘నాకు ‘ఉసీనర’ అనే స్నేహితురాలు వుంది. ఆమె కొద్దిగా రోగగ్రస్తయై వార్ధక్యమును పొందింది. ఆవిడకు మరల యౌవనం వస్తే నాతోపాటు సంతోషముగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. వసిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామదేనువును అపహరించి తీసుకువెళ్ళి దానిపాలు ఉసీనరకి పట్టిద్దాము’ అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ‘ద్యు’ ఆ కామదేనువును అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వసిష్ఠమహర్షి సాయంకాలం పూజకోసమని దర్భలు మొదలయినవి సేకరించదానికని వెళ్ళారు. వారు తిరిగివచ్చి ఆశ్రమములో చూశారు. నందినీధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్ఠలో కూర్చుని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూశారు. అష్టవసువులు కామదేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు జన్మించెదరు గాక’ అని శపించారు. ఈ వార్త తెలిసి అష్ట వసువులు పరుగున వచ్చి వసిష్ఠమహర్షి పాదములమీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేటట్లు చేయండి’ అని ప్రార్థించారు. ఆయన – ‘మీరు ఎనమండుగురు వసువులు. మీ ఎనమండుగురిలో ఏడుగురియందు పాపము తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం ‘ద్యు’కి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమయిన కారణము ‘ద్యు’. అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు. కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరము వదిలిపెట్టేస్తారు. అలా వదిలి పెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధానపాత్ర పోషించిన ‘ద్యు’ మాత్రం పరాక్రమవంతుడై, కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకము నందు కొంతకాలము ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ‘ద్యు’ మాత్రము కొంతకాలము భూలోకము నందు ఉండవలసినదే’ అని ఆయన శాపవిమోచనమును కటాక్షించారు.


ఆ ఎనమండుగురు ఇపుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయింది. ‘అమ్మా! నీవు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు’ అని అడిగారు. గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి – ‘రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నాను’ అన్నది. వాళ్ళు –‘ అమ్మా! మాకు ఒక ఉపకారం చేసిపెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళుతున్నావు కనుక నీకడుపున మేము ఎనమండుగురం పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాపవిమోచనం కోసం మాకొక సహాయం చేసిపెట్టాలి. భూలోకములో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్నతల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాపవిమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము. నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరము విడిచి పెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు’ అని కోరారు. గంగమ్మ ‘తప్పకుండా అలాగే చేస్తాను’ అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా జరిగితే గంగాతీరము నందు భరతవంశములో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థియై తపిస్తున్నాడు. ఆయనకి సామ్రాజ్యం ఉంది. సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది. అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానము లేదు. ఈశ్వరానుగ్రహమును ఆపేక్షించి ఆయన గంగాతీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకుపూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుని ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియములను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. తన తొడమీద కూర్చున్న స్త్రీ ఎవరా! అని చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆయన – అమ్మా! నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడమీద కూర్చున్నావు? అని అడిగాడు. ఆవిడ – నన్ను గంగ అంటారు. నేను గంగానదికి అధిష్ఠాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అన్నది. ఆయన ‘నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణనాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చి ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. కుడి తొడమీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి, కోడలికి మాత్రమే ఉన్నది. ఎప్పుడయినా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమతొడమీద కూర్చోవాలి. ఇపుడు నీవు వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. ఇపుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలులేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. నాతో సామానమయిన వాడు నా కొడుకు. ‘ఆత్మావై పుత్రనామాసి’ నా తేజస్సు నా కుమారునియందు ఉంటుంది. అందుకని నీవు నా కుమారుడికి భార్యవు అవుదువు గాని అలా నీకు వరం ఇస్తున్నాను’ అన్నాడు.


ఆ పైనుంచి వస్తున్న గోభిషుడనే రాజర్షి చూశాడు. నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజుగారి కుమారుడిగా జన్మిస్తాను’ అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[10/10, 7:35 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 15 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శంతన మహారాజు పెరిగి పెద్దవాడయిన తరువాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకము చేసి ఒకమాట చెప్పాడు. ‘నేను ఒకప్పుడు గంగాతీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడితొడమీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకున్నది. నిన్ను నా కోడలిని చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చాను. గంగాతీరములో మెరుపు తీగవంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు’ అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు.


శంతనమహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటకి వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతికోసమని గంగాతీరములో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడను వివాహము చేసుకోవాలని ఆవిడతో మాట కలిపాడు. వసువులు బిడ్డలుగా పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరము వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ మాట ఇచ్చి ఉన్నది. భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడము కుదరదు. ఆవిడ – ‘నేను నీకు భార్యను అవుతాను. కానీ నాదొక షరతు’ అన్నది. శంతనుడు ‘ఏమిటి నీ షరతు’ అని అడిగాడు.

‘నేను ఏపని చేసినా అది శుభం అయినా అశుభం అయినా నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పనిచేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు నాకు ఎదురు చెపితే ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను’ అన్నది.

శంతనమహారాజు బాహ్యసౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహము చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు. ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహుఅందగాడు. మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడు. తనకి కొడుకు పుట్టాడు పుట్టీ పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండుచేతులతో పట్టుకుని గంగ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది. ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. ఏడుగురు వసువులకి ఆవిడ మరల సహజస్థితిని కల్పించాలి. పుట్టిన బిడ్డను నీటిలో విడిచి పెట్టింది. శంతనుడు గంగకి మాట ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేక ఊరుకున్నాడు.


ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాదు ఏడుగురు కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. ఎనిమిదవసారి మహా తేజోవంతమయిన కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డను తీసుకుని గంగవైపు వెళుతుంటే ఆయన – ‘ఛీ రాక్షసీ! ఎవరయినా మాతృత్వమును కోరుకుంటారు. నువ్వు ఏమిటి పుట్టిన కొడుకులను గంగలో పారేస్తున్నావు. ఇంక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలులేదు’ అన్నాడు.


గంగమ్మ నవ్వి – ‘నువ్వు నేను చేసినపనికి అడ్డుపెడితే అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డుపెట్టావు. అందుకని నేను వెళ్ళిపోతాను’ అన్నది. ‘నీవు వెడితే వెళ్ళిపో. నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు’ అన్నాడు. ఆవిడ – ‘అది కుదరదు. నీకొడుకు కాదు. అతడు నాకు కూడా కొడుకే. మహారాజా! నేను ఏదో చేశానని అనుకుంటున్నావు. నేను ఏడుగురు వసువులకి సహజస్థితిని ఇచ్చాను. వీడు ఎనిమిదవవాడు. వీడు బ్రతకాలి. వీనిని తీసుకువెళ్ళి వసిష్ఠమహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమయిన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పచెపుతాను. అప్పటి వరకు వీనిని నాదగ్గర ఉంచుకుంటాను’ అని చెప్పి కొడుకును తీసుకుని గంగ వెళ్ళిపోయింది.


శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యపరిపాలన చేస్తున్నాడు. వేటకి వెడుతున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. గంగ చెప్పిన మాట మరచిపోయాడు.


ఒకనాడు గంగాతీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యౌవనములో వున్న వ్యక్తి అద్భుతముగా బాణప్రయోగము చేయడము చూసాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. ‘నాకొడుకు కూడా వుంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉండేవాడు’ అని నీవెవరు ఏమిటి’ అని ఆరా తీశాడు. గంగ వచ్చి ఈయనకు దేవవ్రతుడని పేరు పెట్టాను. గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వసిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్నివిధములుగా రాశీభూతమయిన రాజనీతిజ్ఞుడు. ధర్మము తెలిసి ఉన్నవాడు. పైగా విలువిద్యా నేర్పరి. నీ కొడుకును నీకు అప్పచెపుతున్నాను’ అని ఆ కొడుకును ఆయనకు అప్పచెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది.

శంతనుడు వార్ధక్యములోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఎంతో సంతోషముతో ఉన్నాడు. సభచేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందముగా రోజులు గడిచిపోతున్నాయి.


ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ సత్యవతీదేవి కనపడింది. ఆమెకు యోజనగంధని కూడా ఒకపేరు. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినపుడు పరాశరమహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోటునుండి ఒక యోజనదూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగాతీరములో పడవమీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది.


శంతనుడు సత్యవతీ దేవిని చూసి వివాహము చేసుకోమని అడిగాడు. ఆవిడ – ‘ నేను స్వేచ్ఛావిహారిణిని కాను. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే నన్ను రాక్షస వివాహములో పాణిగ్రహణము చేసి తీసుకు వెడుదువుగాని. నా తండ్రి అనుమతి తీసుకోనవలసినది’ అని చెప్పింది.

శంతనమహారాజు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనుని చూసి దాశరాజు వంగివంగి నమస్కారములు చేసి ‘ మీకు నేను ఏమి చేయగలవాడను’ అన్నాడు. శంతనుడు ‘నీ కన్యకారత్నమును నాకు ఈయవలసింది’ అన్నాడు. దాశరాజు – ‘నాకూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా?’ అని అడిగితే శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్దకొడుకు ఉన్నాడు. మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు అయిన కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనములో ఈ సత్యవతీ దేవి కోసం తను కొడుకును ఎలా విడిచి పెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

శంతనుడికి సత్యవతీ దేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్రపట్టడం లేదు. ఆహారం తీసుకోవడం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి ‘నాన్నగారూ ఏమయింది’ అని అడిగాడు. ఈ విషయమును చూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగితే ‘మీనాన్న గారికి ఈ వయస్సులో మరల వివాహము మీదికి మనస్సు మళ్ళింది. సత్యవతిని వివాహము చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాశరాజు ఒక నియమము పెట్టాడు’ అని ఆ విషయములను తెలియజేశారు.


దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ‘ మీ కుమార్తె అయిన సత్యవతీ దేవిని మా తండ్రిగారికి ఇచ్చి వివాహం చేయండి’ అని అడిగాడు. దాశరాజు – ‘తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతనమహారాజుగారి రాజ్యం వస్తుందా?’ అని అడిగాడు. దేవవ్రతుడు ‘ తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యమును పరిత్యాగం చేస్తున్నాను. నేను రాజ్యం తీసుకొను. మానాన్నగారి కోర్కె తీరడము కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి’ అన్నాడు. దాశరాజు ‘ఇప్పటివరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజముగా చాలా పరాక్రమ వంతుడవు. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంత పరాక్రమ వంతుడయిన నీ కొడుకు సత్యవతీ దేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదము రాదని ఏమిటి హామీ?’ అని అడిగాడు.


దేవవ్రతుడు ‘నీకు ఆ అనుమానము ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవమును, తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత! మా తండ్రిగారి కోసం నేను పెళ్లి చేసుకోనని బ్రహ్మచారిగా జీవితము గడుపుతానని భీష్మమయిన ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అన్నాడు. అది సామాన్యమయిన ప్రతిజ్ఞకాదు. వృద్ధుడయిన తండ్రికోసం ప్రతిజ్ఞచేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుభులు మ్రోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞచేశాడు కనుక ఆ రోజునుంచి ఆయనను భీష్ముడని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు.


ఈ విషయమును తండ్రిగారయిన శంతన మహారాజు విని తెల్లబోయాడు. ‘నీవు నాగురించి ఎంతో త్యాగం చేశావు. అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను. ఒకటి – యుద్ధభూమిలో నీవు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండు – నీకు మరణము లేదు. మరణము నీవు కోరుకుంటే వస్తుంది లేకపోతే రాదు’ అని స్వచ్ఛందమరణమును నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: