10, అక్టోబర్ 2022, సోమవారం

అడుసు త్రొక్కనేల

అడుసు త్రొక్కనేల

 

మన సమాజంలో భిన్న భిన్న అభిరుచులు కలిగిన మనుషులు వుంటారు.  అంతదాకా ఎందుకు ఒకే కుటుంబంలో వున్న నలుగురికి నాలుగు రకాల అభిరుచులు  ఉండటం చూస్తూ ఉంటాము.  కొంతమందికి సంగీతం అంటే ఇష్టం కొద్దిమందికి సాహిత్యం అంటే ఇష్టం ఉండవచ్చు.  నిజానికి ఎవరి ఇష్టం వారిది. సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రతివారు ఇతరులను తమ అభిరుచులప్రకారం బేరోజు వేసుకొని ప్రవర్తిస్తారు.  ఉదాహరణకు నాకు నా కుమారుడు డాక్టారు కావటం   అంటే ఇష్టం అనుకోండి నేను నా కుమారుని నీవు డాక్టరువే కావాలని ప్రోద్బలం చేయలేను ఎందుకంటె అతనికి ఇంజనీరు కావటం  ఇష్టం ఉండవచ్చు.  కానీ చాలామంది వారి పెద్దరికాన్ని చుపెట్టుకోవటం కోసం వారి పిల్లలపై తమ పిల్లలపై వారి వారి అభిరుచులను బలవంతంగా రుద్దుతుండటం మనం గమనిస్తున్నాము. దాని వల్ల పిల్లలలో మానసిక ఘర్షణ పెరిగి చివరకు వారు ఎటూకాకుండా పోవటం మనం గమనిస్తున్నాం. పిల్లలు విద్యావంతులు కావలి అనే తల్లిదండ్రుల కోరిక సమంజసమైనదే ఎందుకంటె

 

విద్యానామ నరస్య రూపమధికం ప్రఛ్ఛన్నగుప్తం ధనం

విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః

విద్యాబన్ధుజనో విదేశగమనే విద్యా పరాదేవతా

విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యావిహీన పశుః…….భర్తృహరి.

 

విద్య నిఘూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్

విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్

విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్

విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?……..లక్ష్మణకవి.

 

పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు వారు జీవితంలో ఉన్నతస్థాయిలో ఉండాలనుకోవటం తప్పుకాదు.  కాకపొతే పిల్లల అభిరుచులను తెలుకొని తగువిధంగా వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది. విద్యావంతులైన పౌరులు అటు సమాజానికి ఇటు వారి ఇంటికి పేరుతెస్తారు ఆర్ధికంగా స్థిరపడి వారి జీవితాలను సుఖమయం చేసుకుంటారు.

 

స్వగృహే పూజ్యతే మూర్ఖస్స్వ గ్రామే పూజ్యతే ప్రభుః

స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే

స్వంత ఇంటిలో మూర్ఖుడు గౌరవింపబడతాడు. అధికారి స్వగ్రామంలో గౌరవింపబడతాడు, రాజు తన దేశంలో గౌరవింపబడతాడు, కాని విద్వాంసుడు అంతటా గౌరవింపబడతాడు.

 

కాగా కొంతమంది వ్యక్తులు సమాజంలో కొంత గుర్తింపు లభించగానే వారికి తెలియకుండానే అహంభావం వారిలో చోటుచేసుకుంటుంది.  దాని పరివ్యవసానంగా కొన్ని సందర్భాలలో వారిస్థాయికి మించి ప్రవర్తిస్తారు. దీనికి ఒక చక్కటి ఉదాహారణ చెపుతాను.  నేను బలవంతుడిని అని అనుకున్నాననుకోండి అప్పుడు ఏదయినా బలంతో చేయగలిగే పనిని నేను చేయగలను అనుకున్నాను అనుకోండి.  నిజానికి నాకు యెంత బలం వున్నదో నాకు తెలియదు. కేవలం నేను ఒక స్కూటర్ కదల్చగలను కానీ నేను స్టార్టు కాక ఆగివున్న లారీ దగ్గరికి వెళ్లి నేను దీనిని నెట్టుతాను అని నెట్టననుకోండి నేను దానిని ఒక ఇంచికూడా  కదల్చలేను. అప్పుడు నాకు అవమానం కావటం తథ్యం. ఇక్కడ లోపం ఎక్కడ ఉన్నదంటే నేను నా శక్తిని తప్పుగా అంచనా వేయటం వలన మాత్రమే. ఇదే విధంగా ఇతరులతో ప్రవర్తించే పరిస్థితులలో కూడా ఎదుటివారి స్థాయి తెలుసుకోక ప్రవర్తించటం చాలాసార్లు అవమానాలాపాలు కావటానికి దోహదం అవుతుంది.

 

విద్వాన్ సర్వత్రా పూజాయతే అనే నానుడి మనందరికీ తెలిసిందే నేను విద్వంసుడిని కాబట్టి నన్ను అందరు గౌరవిస్తారు అనే భావం యెప్పుడైతె మనస్సులో కలుగుతుందో అప్పుడు అతనికి అహంభావపు లక్షణాలు మొదలౌతాయి. దాని పర్యేవసానంగా ఎదుటివారి స్థితిగతులను బేరేజు వేయటంలో విఫలం అయి నోరుజారి ఇక్కట్లు కొనితెచ్చుకుంటాడు. 

 

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

 

బహుశాస్త్రాలు చదివి పండితుడు కావచ్చు కాని ఏసమయంలో ఏవిధంగా ప్రవర్తించాలో తెలియకపోతే తాను చదువుకున్న చదువు ప్రయోజనం ఉండదు కదా.  సమయస్పూర్తి ప్రతివారికి ఎంతో అవసరం.  అదిలేకపోతే వారి పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది.

 

ఎప్పటికెయ్యది ప్రస్తుత

 

మప్పటికా మాటలాడి యన్యుల మనముల్

నొప్పింపక తానొవ్వక

 

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!

 

సుమతి శతకకారుడు చక్కగా ఏపరిస్థితిలో ఎలా ప్రవర్తించి తప్పించుకోవాలో చాలా బాగా వివరించారు.  నిజానికి పండితుడికి అన్ని తెలిసినాకూడా సమయానికి స్ఫురించకపోవటం వాటిని ఆచరణలో పెట్టలేకపోవటం కష్టాలను కొని తెచ్చుకునేట్లు చేస్తుంది.

 

 

 

సమయస్పూర్తి: చాలా సందర్భాలలో చదువుకున్నవారు ఇమితజ్ఞనాన్ని కోల్పోయి మూర్కంగా ప్రవర్తించటం సాటివారికి బాధాకరంగా అవుతుంది. ఎదుటివాడు తనకన్నా చిన్నవాడు అయితే అతను బాధపడతాడు అదే తనకన్నా సమాజంలో పెద్దవాడు అయితే అతని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

 

 

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్రబాంధవాః!

జిహ్వాగ్రే బంధనం ప్రాప్తం జిహ్వాగ్రే మరణం ధ్రువమ్ !

 

నోటి మాటవలన ప్రపంచమే మారిపోతుంది.మనంమాట్లాడే మాటల వలన మన సంబంధ బాంధవ్యాలు ఆధారపడుతాయి! మన ఉనికి,పూనిక ఇవన్నీ మనంమాట్లాడే మాటలవలన ఏర్పడుతాయి. అందుకే మన సనాతన ధర్మం "శబ్దబ్రహ్మ"గా గుర్తించింది!అంటే మాటను చాలా పవిత్రంగా చూడుమని హెచ్చరించింది!

 

"ఏకః శబ్దః సుప్రయుక్తః సమ్యక్ ఙ్ఞాతః స్వర్గే లోకె కామధుక్ భవతి"అని

సంస్కృత న్యాయం!ఒక శబ్దమును తెలుసు కొని సరైన సమయంలో ,సరైన అర్ధం తో కనక ప్రయోగిస్తే అది స్వర్గ లోకంలో కామధేనువు లాగా నిలుస్తుంది! మనం మాట్లాడే మాటలవలన మనకు సమాజం తో ఏర్పడే అనుబంధం, సమాజం వలన పొందే లాభానష్టాలు ఆధారపడుతాయి! మనిషి మాట్లాడే మాటలకు అంత ప్రభావం ఉంటుందీ అన్నమాట!

 

ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః!

తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా!

 

మన మాటల వలనే మన చుట్టూ ఉన్న జంతువుల ప్రవర్తన ఆధార పడి ఉంటుంది! అవి ప్రియ వాక్య ప్రదానంతోనే సంతోషపడుతాయి! ఇక మనుషుల విషయంలో మంచిగా మాట్లాడితే వచ్చె నష్టం ఏముంటుంది! మాటల వలన నే మనం "అజాత శత్రుః"అన్న పేరు కూడా పొందవచ్చు!

రామాయణం లో మాట గొప్పదనం మహర్షి ఒక రాక్షసుని నోటితో చెప్పించాడు!

 

గర్వం పనికి రాదు: మనిషికి నా అంతవాడు లేడు నాకు అన్ని తెలుసు నేను ఏదిచెప్పినా సమాజం హర్షిస్తుంది, ఎల్లప్పుడూ నామాట చెల్లుతుంది అనే భావం ఎంతటివిద్వంసునికైనా ముప్పు  వాటింపచేస్తుంది. విషయం ఇటీవల మనం ప్రత్యక్షముగా తెలుసుకున్నాము.

 

కాబట్టి విద్వంసులు ఏంతనేర్చుకున్న వినయ విధేయతలతో ఉండాలి. 

 

విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం

పాత్రత్వా ద్ధన మాప్నోతి ధనా ద్ధర్మం తత స్సుఖం

 

విద్య యొసగును వినయంబు వినయమునను

బడయు పాత్రత పాత్రత వలన ధనము

ధనము వలనను ధర్మంబు దాని వలన

నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

 

కవిగారేమంటారూ! విద్య నేర్చుకుంటే వినయాన్నిస్తుంది, విద్య, వినయం తో పాత్రత అర్హత (ఎలిజిబిలిటీ,కేపబిలిటీ)వస్తుంది, దానివల్ల ధనం వస్తుంది దానివలన ధర్మం చేయాలి దానితో మానవుడు ఇహ పర సుఖాలు పొంది తరించాలి.

 

 స్థితప్రజ్ఞత: జ్ఞ్యాని అయినవాడు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి తనకు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనను వాటిని కేవలం పరమేశ్వరుడు తనకు చేసిన పనిగా భావించి అవమానాలకు కుంగక, సన్మానాలకు లొంగక స్థిరమనస్కుడైన వానికి ఈశ్వరుడు సదా వెన్నంటి ఉంటాడు.  అంతే కానీ అడుసు త్రొక్కనేల  కాలు కడగనేల అన్నతరి  మనుషులు వారి నోటిని అదుపులో ఉంచుకుంటే సర్వేత్ర అవమానాలపాలు కాకుండా వుంటారు.

 

కొంతమందితో మాటాడటం తప్పు, కొంతమందితో మాటాడకపోవడం తప్పు, ఎవరితో ఎంతవరకు మాటాడాలో తెలుసుకో లేకపోవడం పెద్ద తప్పు.  అది తెలుసుకొని మసలుకోవాలి.

 

 

 

 

కామెంట్‌లు లేవు: