అరుణాచల మాహాత్మ్యాన్ని తెలిపే చిన్న సంఘటన:
అరుణాచల మాహాత్మ్యం నుంచి ఒక భాగం చదువబడింది. 'పంగున్ని' అనే సాధువు కథ మహిమాన్వితంగా వర్ణింపబడింది. ఆపై భగవాన్ దానిని ఇలా కొనసాగించారు (శ్రీరమణ భాషణములు, 05-03-1938: 473).
పంగున్ని అనే పేదవాడు, రెండుకాళ్ళు చచ్చుబడిన కారణంగా 'పనికిరానివాడు' అయ్యాడు. దమ్మిడీ ఆదాయంలేక కన్నవారికే గుదిబండగా తోచాడు. అనుదినం, అనుక్షణం అవమానాలే... అదీ అయినవారి నుంచి!
బ్రతుకు భారమైంది, నిరర్థకమైంది. ఎవరికీ చెప్పకుండా, కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపోయాడు. గిరిప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి, దూరంగా ప్రాణత్యాగం చేద్దామనుకున్నాడు.
ఎటు చూసినా నిరాశా నిస్పృహలు రేపే తలపులే దృశ్యాలై, అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి.
అంతలో అతనికి ఎదురుగా ఓ సాధువు ... సాధువులకెందరికో అరుణాచలం నిలయం కదా ... ఇతనిని సమీపించాడు.
హఠాత్తుగా, “ఇలాంటివాడికి ఈ ఆభరణాలు కూడానా?” అంటూ పంగునికి ఊతమిచ్చే చేతికర్రలను లాగివేసాడు.
పంగున్ని అనుభవించిన అవమాన పరంపరలకు ఇది పరాకాష్ఠ. దానితో అసహనంతో ఊగిపోయి, సాధువుపైకి లంఘించాడు.
కానీ, అందుకొనేలోపే సాధువు మటుమాయం. అరే, ఇదేమిటీ! తాను నడువగలుగుతున్నాడు! చచ్చుబడ్డ తన రెండు కాళ్ళు చక్కబడి ... మరి ఆ సాధువు ఏదీ? కనిపించడే! ఆశ్చర్యోత్సాహాలతో పరుగులు పెట్టాడు.
ఆనందంగా గిరిప్రదక్షిణ పూర్తి గావించాడు.
అయినవారిచే ఆదరింపబడ్డాడు.
అరుణగిరీశ్వరుని అవ్యాజ కరుణకు సాక్ష్యమై, చరిత్రలో స్థిరంగా నిలిచాడు.
రమణ భగవాన్ తమ కాలంలో జరిగిన ఒక సంఘటనను ఇలా వివరించారు.
భగవాన్ గురుమూర్తంలో వుండగా, 'కుప్పు అయ్యర్' అనే వృద్ధుని చూసారు. అతనికంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి, నడవలేక చట్టపై డేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై డేకుతూ, వేత్తావలం వెళుతున్నాడు.
హఠాత్తుగా ఒక ముదుసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతని వాలకం చూస్తూ, "ఏమిటా చట్టపై జరగటం? లేచి నడవవోయ్!" అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి, సులువుగా నడవసాగాడు. జరిగినదానిని నమ్మలేకపోయాడు. నాలుగడుగులు వేసాక చుట్టూ చూసాడు. ఎక్కడా ముసలివాడు. కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తుంటే, ఊరివారందరూ సంభ్రమాశ్చర్యాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి, తాతలు దిగివచ్చినట్లయింది.
ఇది, భగవాన్ తిరువణ్ణామలై రావడానికి రెండు సంవత్సరాలకు పూర్వం జరిగింది. కుప్పు అయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి, ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు.
ఓం అరుణాచల శివ
ఓం అరుణాచల శివ
ఓం అరుణాచల శివ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి