16, నవంబర్ 2022, బుధవారం

Srimadhandhra Bhagavatham

 [15/11, 5:42 pm] +91 81055 36091: Srimadhandhra Bhagavatham -- 74 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అఘాసుర వధ

ఒకనాడు కృష్ణపరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు ఒక ఊహ వచ్చింది. ‘రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనములకు వెడదాము. రేపు పొద్దున్న మీరందరూ బయలు దేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని, అందులో మీకిష్టమయిన మధుర మధురమయిన పదార్థములు పట్టుకొని రండి. మనందరం కలిసి వెడదాము. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము’ అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెపితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధరకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. కొలనులలో నీళ్ళల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునే వారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వానిపేరు అఘాసురుడు. అఘము అనగా పాపము. అతను బకాసురుని సోదరుడు. ‘నా సోదరుడైన బకాసురుని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికి ప్రాణ సమానమయిన వాడు కృష్ణుడు. ఈ కృష్ణుని చంపి తినేస్తాను’ అనుకున్నాడు.

వాడు వచ్చి కొండచిలువరూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండచిలువ వెంటాడి ఏ ప్రాణినీ చంపదు. అది పట్టింది అంటే మ్రింగి వేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. అఘాసురుడనే కొండచిలువ మార్గమునకు అడ్డంగా పడుకుని ఉన్నది. దాని నోటి పైదవడ ఆకాశమునకు పెట్టింది. క్రింద దవడ భూమిమీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడివున్న దానిని గుర్తించి దానిని కొండచిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగిచూశారు. వెనక చిన్నికృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. వీళ్ళు ‘బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదురు కొండచిలువ ఉంటే మనకేమిటి భయం! మనం వెళ్ళిపోదాం’ అని వారు నవ్వుకుంటూ, వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడలని, ఎద్దులని, అన్నింటిని ఆ కొండచిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండచిలువ అఘాసురుడని కృష్ణుడికి తెలుసు. ‘దూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నాని గోసంపదతో సహా అఘాసురుని నోటిలోపలికి వెళ్ళిపోయారు. నా కోసమే ఇంకా దవడలను మూయలేదు. వారినందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి’ అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్లేసరికి, వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మ్రింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల ఉన్న విషజ్వాలలకి వారు మరణించారు.

కృష్ణుడు దాని కంఠం దగ్గరకి వెళ్ళగా కృష్ణుని కూడా మ్రింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామి నిటారుగా పెద్దస్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభంలాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరమును పెంచాడు. డానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు గిలగిల కొట్టుకుంది. అటు తిరిగి ఇటు తిరిగి తిరుగుడు పడిపోయి గిలగిల కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారినందరినీ కృష్ణుడు చూశాడు. అసురసంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశమునందు ప్రకాశిస్తున్న చంద్రబింబములా కేవలము తన కన్నులనుండి కారుణ్యామృత దృష్టిని చిన్నికృష్ణుడు వాళ్ళమీద ప్రసరింప చేసాడు. ఆయన కారుణ్యామృతదృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచిలువ నోట్లోంచి ఇవతలికి వచ్చేశారు. బయరకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొనప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమయిన వెలుగు వెలువడి పైకిలేచి చిన్నికృష్ణుడి లోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి.

ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మనుండి దుఃఖము వస్తుంది. పాపకర్మ కొండచిలువలా నోరు తెరుచుకుని మనదారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్ములను మింగలేదు. ‘నేను పాపము చేయను’ అని మీరు అనుకుంటే పాపము మీచేత చెడ్డపనిని చేయించలేదు. మనలో మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి ఫరవాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. కొండచిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ, పుణ్యకర్మ అంటే ఏమిటో తెలియాలన్నా, సత్కర్మకీ, దుష్కర్మకీ భేదం తెలియాలంటే వేదము తెలియాలి. ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. పాపకర్మ యందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. వెడుతున్నప్పుడు ఒకపని చేశారు. ‘వెనక కృష్ణుడు ఉన్నాడు’ అని కృష్ణ భగవానుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా! పుణ్యమా! అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి పాపమును చేస్తే ఆ పాపఫలితమును అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుందని చెపుతోంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది అయితే అకాలమృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్యచేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు, పుణ్యనదీ స్నానం చేసినప్పుడు ‘అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం’ ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపమును అనుభవములోనికి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. ప్రతిజీవికీ మరణం తథ్యం. చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యములు మృత్యు సమయమునందు తెలుస్తాయి’ అని పెద్దలు అంటారు. వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ప్రవరించగలిగితే చాలు. చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడయినా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది.

అఘాసుర వధ ఘట్టంలో గోపబాలురను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమాత్కృష్టమయిన కథ ఇది మనకందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజూ భగవంతుని యందు పూనికను పెంచి, ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది.

బ్రహ్మ గోవత్సములను, గోప బాలకులను అంతర్దానంబు చేయుట

శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెపుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని ‘కౌమార పౌగండ లీల’ అంటారు అని చెప్పారు. మొదటి అయిదేళ్ళ వయస్సును కౌమారము అంటారు. తరువాతి అయిదేళ్ళను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారములో జరిగినది పౌగండములో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ అయిదవ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. ఈ లీలను శుకుడు ‘కౌమారపౌగండలీల’ అని చెప్పారు. పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకీ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది’ అని మహర్షిని ప్రార్థించాడు.

ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. శుకమహర్షి నీ ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తున్నది వినవలసింది’ అని దానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. గోపాలురను బ్రతికించిన కృష్ణపరమాత్మ వీరినందరినీ తీసుకొని బృందావనం లోపలి వెళ్ళాడు. బాగా ఎండగా ఉన్నది. అపుడు కృష్ణుడు గోపబాలురతో

“ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపఁగా

రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ

దండన్ లేగలు నీరు ద్రావి యిర వందం బచ్చికల్ మేయుచుం

దండం బై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?”

మీరు ఇప్పటివరకు ఎండలో తిరిగారు బాగా ఆకలివేస్తోంది, దాహం వేస్తోంది. మనం చల్దులు తెచ్చుకున్నాం కదా! నీడలో కూర్చుని వాటిని తిందాము’ అన్నాడు.

జలజాంతస్థితకర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే

కుల చందంబున గృష్ణునిం దిరిగిరా గూర్చుండి వీక్షించుచున్

శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా

కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!

గోపాలబాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామరపువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలనీ ఒకదానిమీద ఒకటి ఉండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరి మధ్యలో కూర్చుండ చేసారు. గోపబాలురు కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని తను తినే ఆహార పదార్ధమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు నాలుగు చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డికోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి, దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కమును పరుచుకుని ఆ చిక్కంమీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొన్న పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడివిపువ్వును కోసితెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు.

మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొక్క

డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి చూడు లేదని నోరు చూపునొక్క

డేగు రార్గురి చల్దు లెలమి బన్నిద మాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్క

డిన్ని యుండగ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడునొకఁడు

కృష్ణు జూడు మనుచుఁ గికురించి పరుమ్రోల, మేలి భక్ష్యరాశి మెసగు నొకడు

నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు, ముచ్చటాడు నొకడు మురియు నొకఁడు.

ఒకడు వాని ఇంటినుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమచెయ్యి పూజయందు గాని, భోజనమునందు కానీ దూష్యము. వాడు చల్దిముద్ద ఎడమచేతిలో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చల్దిమూటనుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితే నోరు చూపించి ‘నేనెక్కడ తిన్నాను?’ అనేవాడు. ఒకడు పక్కవాళ్ళు విస్తళ్ళకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ళ చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా అయిదారుగురి చల్ది తననోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననే వాడు. బంతెన గుండ్లు అంటే అందరి విస్తళ్ళనుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుని చూపించి ‘ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా’ అనేవాడు పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటలచేత పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.


: Srimadhandhra Bhagavatham -- 75 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి

విమల శృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి

మీగడపెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయ నునిచి

చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి, నర్మభాషణముల నగవు నెఱపి

యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె!

అందరి మధ్య నిలబడి కృష్ణపరమాత్మ తనమీద ఉన్న ఉత్తరీయం తీసి, నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి, ఆవులను తోలే కర్ర, ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని, ఎడమచేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ళ సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టికున్నది గతరాత్రి వండిన పదార్ధం. నిలవున్న పదార్థం ఈశ్వర నివేదనమునకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. దానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ‘ఓం నమోనారాయణాయ స్వాహా’ అని మంత్రం చెప్పి స్రుక్కు, సృవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే, అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకములనుండి వచ్చేశారు. ‘ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ గోపబాలురతో కలిసి స్నానం చెయ్యకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలిచేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము’ అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలు అందరూ ఆనందముతో ‘గోవిందా గోవిందా’ అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకంనుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ‘ఈ ఎంగిలి ముద్దలు ఎడమచేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మా? అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బ్రతికించాడా? యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఇంత సులభుడయినాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు’ అని అనుకున్నాడు.

‘నేను చతుర్ముఖ బ్రహ్మను ఇంటి పెద్దను. నాలుగు ముఖములు కలవాడిని. వేదములు చదివినవాడిని. నామాయ తప్పించుకోలేడు’ అని వెంటనే ఒక మాయ చేసాడు. అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరముగా తీసుకువెళ్ళి మాయం చేసేసి, వాటినన్నిటిని ఒక కొండగుహలో పెట్టేసాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణా మన ఆవులను దూడలు కనపడటము లేదని చెపితే నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ ఉండండి’ అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడక పోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాలబాలురు లేరు. అక్కడ ఆవులు, దూడలు, ఎద్దులు లేవు. సాయంకాలం అవుతున్నది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవని అడుగుతారు. అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూసాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మోహబుద్ది పుట్టింది. ఆయన తనమీద మాయ చేసాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయొ అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అయిపోయాడు. తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి ఇంటికి వెళ్ళాడు.

ఒక్కొక్క తల్లిదగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాలబాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలా గే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సరకాలం. సంవత్సరం తరువాత కృష్ణుడు ఏమిచేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాలబాలురు ఇక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనయిన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను.నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడయినా ఉన్నాడా’ అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉన్నది. తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. ‘నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో ఆతడు చిన్నికృష్ణునిగా ఉన్నాడు. వాని మాయముండు నా మాయ తుత్తునియలయిపోయింది. నేను దీనిని తెలుసుకోలేక పోయాను’ అని అనుకోగానే ఒక్కసారి మోహబుద్ది విడిపోయింది. చిన్నికృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటు చూసాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో నాలుగు భుజములతో, శంఖచక్రగదాపద్మములను పట్టుకొని పట్టు పీతాంబరములతో శ్రీవత్సముతో కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో, వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేనిమీద పనిచేయ్యదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను’ అనుకుని ‘స్వామీ! దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు’ అని ప్రార్థించాడు. ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు.

ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి

శంపాలతికతోడి జలదంబు కైవడి మెఱుగు టొల్లియతోడి మేనివాని

కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నంబుల వెలయువాని

గుంజా వినిర్మిత కుండలంబులవాని శిఖిపింఛవేష్టిత శిరమువాని

వనపుష్పమాలికా వ్రాత కంఠమువాని నలినకోమల చరణములవాని

గరుణ గడలుకొనిన కడకంటివాని గో, పాలబాలుభంగి బరగువాని

నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని, నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!

శంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలములోని నల్లనిమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉన్నది. ఎడమచేతిలో పెరుగు అన్నపు ముద్ద ఉన్నది. ఎడమచంకలో కొమ్ము బూర ఉంది. చేతిలో కర్ర ఉన్నది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మెడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదములమీద పడి బ్రహ్మగారు స్తోత్రం చేశారు.

ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని

న్నీలోకంబున నీ వనాంతరమునం దీమందలో గృష్ణ యం

చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ

వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?

నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీ కృతమయిన నీవు, ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతోకలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మపదవి వద్దు’ అన్నాడు.

ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా, సంతోషముతో చూస్తూ, తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మములో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈవిధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాదిపాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: