16, నవంబర్ 2022, బుధవారం

రెండు డైరీలు* భార్యాభర్తల కధ

 *రెండు డైరీలు*  

(హృదయానికి హత్తుకునే ఒక భార్యాభర్తల కధ )


*ఆ రోజు ఆ దంపతుల పెళ్లి రోజు*,ఇద్దరూ కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు! తెలిసినవారందరికి ఆ ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దంపతులు  ! వారిద్దరి మధ్య ఎంతో  ప్రేమ  ఉండేది, అందరూ అనుకుంటున్నట్లుగానే, కానీ ప్రస్తుతం రాను రాను ఇద్దరి మధ్య కొంచెం కొంచెం దూరం పెరుగుతోంది, ఒకరి తీరు రెండో వారికి నచ్చకపోవటమే దానికి కారణం! 

     

       ఆ రోజు ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణాక్రమంలో అకస్మాత్తుగా భార్య, భర్తతో "  మన  ఇద్దరం చాలా మాట్లాడుకోవాలి , కానీ ఇద్దరికీ సమయం సరిగ్గా అనుకూలించటం లేదు,అందుకే నాకు 

ఒక  ఆలోచన వచ్చి ఇద్దరి  గురించి రెండు  డైరీలు  కొనుక్కుని  వచ్చాను, ఆ  డైరీలో, ఒకరిమీద ఒకరం పరస్పరం ఏమి  అనుకుంటున్నామో, అంటే మీరు ఈ డైరీలో నాగురించి తమరి మనసులో  ఏమనుకుంటున్నారో ఓ  సంవత్సరం పాటు ఎప్పటికప్పుడు రాస్తూండండి, నేనుకూడా అలానే రాస్తాను , సంవత్సరం అయ్యేక మళ్ళా వచ్చే మన పెళ్ళి రోజున ఒకరి డైరీ ఒకరు చదువుదాం, అప్పుడు మనకు అసలు లోపం యేమిటో అర్ధం అవుతుంది కదా" అని అంది,భర్తకు కూడా ఆ ఆలోచన నచ్చి ఒప్పుకున్నాడు ! 

  

    రోజులు,నెలలు గడచి పోయి, ఆ పెళ్లి రోజు రానే వచ్చేసింది, ఇద్దరు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు, ముందు భర్త, భార్య రాసిన డైరీ చదవటం మొదలు పెట్టాడు ... 


మొదటి రోజు .. 

మీరు నాకు ఈ పెళ్లిరోజు సందర్భంగా మంచి గిఫ్ట్ తేలేదు! 


రెండో రోజు .... 

ఈరోజు  హోటల్ కు  వెళ్లి డిన్నర్  చేసేసి వద్దాం అని అన్నా తీసుకెళ్ల లేదు! 


మూడవ రోజు.... 

ఈరోజు ఇద్దరం సినిమాకు వెళదాం అనిచెప్పి, తీరా సాయంత్రం అయ్యేటప్పటికి ,"నేను చాలా అలసి పోయాను,ఇప్పుడు కాదులే ఇంకోరోజు చూద్దాం అని అనేసారు " 


... మా  రెలెటివ్స్ ఇంటికి వస్తేవారితో సరిగ్గా మాట్లాడలేదు ! 


... ఈరోజు మీరు నా గురించి తెచ్చిన డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు, బాగా ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్ అది ! 


     ఈవిధమైన పితూరీలే ఉన్నాయి సంవత్సరం అంతా ఆ డైరీ నిండా ! అలా భార్య రాసినది అంతా చదివేసరికి, అతగాడికి కళ్ళల్లో నీళ్లుపైకి ఉబికేయి, " అయ్యో నేను ఇంతగా నిన్ను బాధ పెట్టానని గ్రహించలేదు డియర్, నాకు విషయం అర్ధం అయ్యింది కదా, ఇక ఇప్పటి నుంచి మళ్ళా అలా నిన్ను బాధ పెట్టను, ఇటువంటి  బాధాకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను , ప్రామిస్ " అని నిజాయితీ గానే చెప్పాడు అతగాడు భార్యతో ! 


  ఇక భార్యవంతు వచ్చింది, చదవటానికి తన భర్త రాసిన డైరీ తెరిచిందామె ! 


..మొదటి పేజీ ... ఖాళి ఏమీ రాయలేదు  


 ..రెండో పేజీ , మూడో పేజీ అంతే !


తరువాతి యాభై అరవై పేజీలు గబ గబా తిప్పేసి చూసేస్తోందిగాని అన్నీ అంతే ఏమీ రాయలేదు వాటిలో ! 

      ఇంతలో ఆమె భర్త నవ్వుతూ "నేను రాయాలననుకున్నదంతా ఆఖరి పేజీలో రాసేసాను, చదువు"  అనటంతోనే ఆఖరి పేజీ తెరిచి చూసింది ఆతృతతో  ! 

  

" నాకు నీమీద కోపంవచ్చినన్నిసార్లు, తిట్టేద్దాం అనుకునే వాడిని కానీ....నీముఖం చూసేటప్పటికి....నువ్వు నా తల్లిదండ్రులను వారి చరమాంకం వరకూ చేసిన సేవా,చూపించిన నీ అనిర్వచనీయమైన ప్రేమా  అదే కాకుండా సంవత్సరాలపాటు మా కుటుంబంపట్ల అలుపులేని నీ భాద్యత,ప్రేమాభి మానాలు గుర్తుకొస్తూ ఉంటే, నాకు నీమీద ఉన్న పిర్యాదులు ఎంత అల్పమైనవో అనిపించి ఈ డైరీలో నేనేమీ రాయలేక  పోయాను !  అలా అని లోపాలు లేకపోలేదు కానీ నీ సహనం, నీ త్యాగం,నీ ప్రేమాభిమానాలముందు అవన్నీ సముద్రంలో నీటి బొట్టు లాంటివేనని ఏమీ రాయలేదు ! నేను నీ యెడల బాధ్యత లేకుండా ఎన్ని సార్లు క్షమించరాని తప్పులు చేసినా నువ్వు నాకు ప్రతి విషయంలోనూ తోడుగా, ఓ నీడలా ఉంటూ సహకరిస్తూనే ఉన్నావు , అలాంటి నా నీడనే నేను ఎలా చీదరించు కుంటాను ?" 


తనభర్త రాసింది చదివే సరికి ఆమెకి  దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెగిన నదిలా పెల్లుబికి పోయింది, కాసేపటికి ఆ దుఃఖం ఉపశమించేక ఒక్కసారిగా లేచి ఆ డైరీలు రెండూ తగల బెట్టేసింది, ఆ పిర్యాదులు, ఆ ఆవేశాలు ఆ అపార్థాలు,ఆ కోపాలు, ఆ తాపాలూ అన్నీ కూడా వాటితోపాటు కాలి బూడిద అయిపోయాయి ! 

 

   వారి మధ్య మళ్ళా ప్రేమ చిగురించింది కొత్తగా పెళ్ళైన దంపతులకు మల్లే !


*ఆంగ్ల మూలంలో వచ్చిన ఒక కధకు తెలుగులో  స్వేచ్ఛానువాదం !*

కామెంట్‌లు లేవు: