8, ఫిబ్రవరి 2023, బుధవారం

సన్యాసాశ్రమం

 శాస్త్రం విధించిన సన్యాసాశ్రమం


మన దేశంలో నానావిధాలవారు సన్యాసులెందరో వున్నారు. వీరెవ్వరూ ఫలప్రదం, లాభకరం అయినపని ఏదీ చేయరు. గృహస్తులు పెట్టే భిక్షవల్లజీవిస్తూ వుంటారు. ఈ భిక్షసన్యాసులందరు పరోపజీవనులనీ, వీరివల్ల దేశానికేమీ లాభించదనీ మనపరిపాలకులలోనే కొందరు అభిప్రాయపడుతూ వుంటారు. ఈ సన్యాసి జనసమూహాన్ని కూడగట్టి ప్రజోపయోగకరమైనపని చేయిస్తే మంచిదను తలంపుతో “అఖిల భారత సాధు సంఘమ”నే సమాజాన్ని ఇటీవల నెలకొల్పారు. వీరిలో కొందరిని సంచార ప్రచారకులుగా నియమించి వారికి కొంత ప్రతిఫలం ముట్టచెప్పుతూ ప్రజాహితం సాధించాలని ఆలోచించారు. 


అవును, దేశంలో ఈ సన్యాసిమూక ఎక్కువగా నున్నమాటనిజమే. వీరు పరోపజీవనం చేస్తున్నమాట నిజమే. అలావుండటం మంచిది కానిమాట సత్యమే. కాని సన్యాసులు పరోపజీవనం చేయకూడదనే అభిప్రాయాన్నీ, సన్యాసులు భిక్షాటనవల్లనే జీవించాలనే శాస్త్రవిధిని- ఈరెంటినీ సమన్వయించడం ఎలాగూ అనేదే ప్రశ్న. 


నాలుగాశ్రమాలవారిలో సన్యాసులకు, బ్రహ్మచారులకూ మాత్రమే భిక్షాజీవనం అర్హమనీ, విహితమనీ శాస్త్రం చెప్పుతున్నది. బ్రహ్మచారులు గురుకులవాసం చేసేటప్పుడు చాలా కొలది గృహములందు 'భవతిభిక్షాందేహి' అని ఇల్లాండ్రనడిగి, తమకోసం గురువుకోసం అన్నమును తెచ్చుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నవి. విద్యార్థి తన చదువుకోసం వినియోగించుకోడానికి ఎంతో కాలమూ, శక్తి దీనివల్ల కలిసివస్తవనేది ఒకటి; రెండోది విద్యార్జనకవసరమైన వినయమూ, చిత్తశుద్ధీ దీనివల్ల అలవడుతవనేది. గురుకుల వాసమందు ఈ భిక్షాటనం రాచబిడ్డలకూ విధింపబడింది. బ్రహ్మచారులిలా తెచ్చిన భిక్షాన్నమును గురువుకర్పిస్తే దానిని గురువు అందరికీ పంచిపెడతాడు. విద్యార్థులు గురువులకు జీతాలివ్వడమనేది ఆనాడులేదు. విద్య పూర్తి చెందిన పిమ్మట శిష్యుడు గురువునకు శక్తి కొలది దక్షిణ సమర్పిస్తాడు. దేశంలో ఉన్న రాజులవల్ల, సంపన్నులవల్ల శిష్యులు ఈ దక్షిణను సంపాదించి భక్తిపూర్వకంగా గురువులకు అర్పించేవారు. 


సన్యాసి గూడా ఇలా భిక్షాన్నంవల్ల జీవించవలసిందే. చిత్తవృత్తులను విషయజాలమునుండి మరలించి పరమాత్మ ధ్యానమందు నిరంతరంగా లగ్నం చేసివుంచడమే అతనికి విహిత కృత్యం, సన్యాసులు జీవనార్థం ఏదో వృత్తి నవలంబించి అందరివలె లాభకరమైన పనులుచేస్తూ ఉంటే, వారికి విహితమైన బ్రహ్మనిష్ఠకు భంగం కలిగితీరుతుంది. సన్యాసి సప్తభిక్ష చేసి జీవించాలని శాస్త్రం విధించింది. సప్తభిక్ష అంటే ఏడు ఇండ్లయందు మాత్రమే భిక్షనర్థించాలి. ఆ అర్థించడం గూడా ఇంటి ముందు నిలిచి అడగాలి. ఆ నిలవడం గూడా గోదోహనకాలమాత్రం నిలవాలి అంటే, ఆవును పాలుపిదుకుట కెంతకాలము పట్టునో అంతసేపే నిలవాలి. ఈ విధంగా లభించిన భిక్షాన్నముచే అతడు జీవించాలి భిక్ష దొరకనినాడు ఉపవసించాలి. సన్యాసి అల్పాహారముతో బ్రతకాలని, కష్టించి విద్యార్జనం చేయవలసిన బ్రహ్మచారి కడుపునిండా తినవలెనని కూడా దీనివల్ల ఏర్పడుతున్నదని మనం గ్రహించాలి. 


''యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్నస్వామినా వుభౌ||'' 


అనే శాస్త్రం యతులకు, బ్రహ్మచారులకు పక్వాన్న జీవనం విధిస్తున్నది. కనుక వారికి అన్నం పెట్టే బాధ్యతను గృహస్థులకు కూడా విధిస్తున్నదన్నమాట. ఇలాభిక్షాన్నముచే జీవించే ఈ ఉభయుల వల్లా సంఘానికి కలిగే హాని ఏమీ లేకపోగా, ఎంతో మేలు కలుగుతున్న విషయం మనం గమనించాలి భిక్షాటనంచేస్తూ చదువుకొన్న విద్యార్థి వినీతుడగుటేకాక, అట్లు సంపాదించిన విద్యావినయములచే సద్గృహస్థుడై సంఘానికి మిక్కిలి ఉపయోగిస్తాడు. ఇక సన్యాసుల మాట అడుగుతారా? సంసారభారం మోయలేక భిక్ష వల్ల అనాయాస జీవనం జరుగుతుందికదా అని కావులుగట్టిన వారందరు సన్యాసులు కారు. అట్టివారు భిక్షార్హులు కారు. ఐహికాముష్మిక ఫ భోగవిరాగియై ఆలుబిడ్డలను, ఇల్లూవాకిలిని, సౌఖ్యములను విడనాడి, యధావిధిగా ఆశ్రమస్వీకారం చేసినవారే నిక్కపు సన్యాసులు. అట్టిసన్యాసం అందరికి సుకరంగాదు. అట్టియతులే భిక్షార్హులు. బ్రహ్మనిష్ఠతో కాలంగడిపే అట్టి మహనీయులు ఉత్తమగతులకు మార్గం చూపెట్టుతూ వుంటారు. కనుక వారి వల్ల లోకాలకి మేలే కలుగుతుంది. అట్టి యతులు అరుదుగా ఉంటారు. వారిని భరించడం సంఘాని కొక కష్టంలోదికాదు. 


లోకంలో మనకు కన్పించే సన్యాసులందరు అట్టి మహనీయులు కారు. బౌధ్ధమతాన్ని అవలంబించినకొన్ని దేశాలలో ప్రజలందరు నియమనిగ్రహముల కోసం కొన్నాళ్ళు భిక్షుక వృత్తి స్వీకరించాలనే నియమం ఉన్నది. వ్రతపరిసమాప్తియైన పిమ్మట కొందరు గృహస్థాశ్రమం స్వీకరిస్తారు. తక్కినవారు భిక్షులుగానే ఉండిపోతారు. అట్టి యథార్ధభిక్షులనుచూచి, పనిపాటులొల్లని సోమరులు గూడా కొందరాదేశాలలో కావులుగట్టి భిక్షాటనం వల్ల ఆశ్రమజీవనం చేస్తూ ఉండడం కద్దు. 


ఆట్లే మన దక్షణ దేశంలో కొందరు పరదేశులమనీ, ఉత్తరదేశంలో సాధులమనీ బయలుదేరి భిక్షాటనముచే సుఖంగాజీవిస్తూ ఉంటారు. సన్యాసులకువిహితమైన వ్రతపాలనంకానీ, నియమనిష్ఠలుకాని, సంప్రదాయంకాని, ఆశ్రమస్వీకారంగాని వీరికక్కరలేదు. పొట్టకోసం దేవులాటేతప్ప వీరికి బ్రహ్మనిష్ఠతో పనిలేదు. పరోపజీవనం చేసే ఈ సోమరులను పరిహరించవలసిందే. మేము కాదనము. కానీ ఈ కలుపు మొక్కలను ఊడబెరికేయత్నంలో పైరు మొక్కలనుగూడా పీకివేయవలదనే మేము చెప్పేది. లోకసంగ్రహార్థం ఆశ్రమస్వీకారం చేసిన యధార్థ యతులను సోమరులని తెగనాడదగదు. దండ కమండులు ధారణంవల్ల, వైరాగ్యవర్తనంవల్ల గుర్తింపదగిన యదార్థసన్యాసులు ఒకానొక అచ్చమైన సంప్రదాయంలో వారై ఉంటారని కూడా మనం గ్రహించాలి. 


సన్యాసులకొక సంఘమంటూ అక్కరలేదు. ఏకాంతవాసం చేయుటేతప్ప సంఘాలుగాకూడటం సన్యాసుల లక్షణంకాదు. సంఘములుగగూడిన సన్యాసులు ఆశ్రమధర్మభ్రష్ఠులై తామూ లోకసామాన్యంలో చేరిపోతారు. 


కాబట్టి సన్యాసులకు, బ్రహ్మచారులకేతప్ప ఇతరులకు భిక్షాజీవనం పనికిరాదు. పనిపాటులొల్లక భిక్షాటనంచేసే సోమరితనాన్ని మాన్పుటకు రెండు ఉపాయములు కన్పిస్తున్నవి (1) బహుజనులకు విరివిగా పనికల్పించటం (2) సంపన్నల భోగానుభవాలకు నిరుపేద కష్టజీవనానికి వుండే వ్యత్యాసాన్ని తగ్గించడం వీనిలో మొదటిపని ప్రభుత్వానిది, రెండవది ప్రజలది జీవనపుటంతస్తు (స్టాండర్డు ఆఫ్ లివింగ్) పెరుగవలెనంటూ నేడుపఠించే మంత్రాలకు ఫలితమేమిటంటే, భోగసక్తి పెరగడమే భోగాలను విడనాడి, గ్రాసవాసోదైన్యం లేకుండా, మితంగా, సౌమ్యంగా బ్రతకడమే నిజమైన సోషలిజమనిపించుకుంటుంది. శీతావాతాతపముల నుండి రక్షించే సముచిత వస్త్రధారణం, జిహ్వచాపల్యం కోసం కాక శరీరధారణం కోసం భుక్తి. ఇదే సోషలిజపు లక్షణము దేహధారణ మాత్రమైన భుక్తియే అపరిగ్రహమనిపించుకొంటుంది. దేశసంపదను విజ్ఞానాభివృద్ధికి, దేశరక్షణకు వినియోగించాలేకాని భోగానుభవాలకై వెచ్చించకూడదు. జీవనవ్యయాన్ని సరళజీవనానికిసరిపడేటట్లుతగ్గించాలిగాని పెంచకూడదు. అలాచేస్తే ప్రజలందరకు సరిపడ్డ కూడు గుడ్డలు, నివాసమూ లభిస్తవి. 


నేడు అదనపు సంపదగల దేశాలు, పురుషులు ఆ సంపదను రాజకీయంగా తమతో ఏకీభవించే దేశాలకు, యుధ్ధంలో తమకు తోడ్పడే దేశాలకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది కూడనిపని. అదనపుసంపదను పేదదేశాలకు, ప్రజలకు ఇవ్వడం న్యాయం. ఏ దేశానికాదేశం తమకున్న సంపదతో తృప్తి పడటం నేర్చుకుంటే, జీవనపుటంతస్థుననుభవించే దేశాలు ఆ యంతస్తును కాపాడుకోవడాని కెప్పటికప్పుడు విదేశ విపణులను ఆక్రమించుకొంటూ వుండటం, ఆ కృత్రిమపు వాపు ఎప్పుడు బుస్సున తీసిపోతుందో అని భయపడతూ వుండడం తప్పదు. మింటిఎత్తు పెరిగినవానికి పడిపోతానేమో అనే భీతి వెంటాడుతూనే వుంటుంది. ఇతర దేశాలను అనుకరిస్తే, ఎప్పటికైనా మనకూ ఈ దురవస్థ పట్టుతుంది. 


ఇంతకూ సన్యాసానికి, సంఘటనకు చుక్కెదురనేది ప్రస్తుతం. సన్యాసులను పోషించే భారాన్ని సంఘం వహించక తప్పదు. పొట్టకోసం భిక్షాటనం చేసేవారికి పనిపాటులు చూపించాలి. యధావిధిగా ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసులను, పరోపజీవనం చేసే సోమరులను నిందింపరాదు. సన్యాసులను సంఘటితపరచి, ప్రభుత్వం చేయవలసిన పనులను వారిచే చేయింప బూనడం కూడా యుక్తంగాదు.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: