15, జూన్ 2023, గురువారం

గోరోజనం అంటే ఏమిటి?

 నిత్యాన్వేషణ:


గోరోజనం అంటే ఏమిటి?


చిన్నపుడు మా నాయనమ్మ అంటూ వుండేది, ఎవరైనా మాట వినకపోయినా, గర్వంగా మాట్లాడినా వీడికి *గోరోజనం* ఎక్కువరోయ్ అనేది. గర్వం అని అనుకునే వాడిని కానీ దాని పూర్వా పరాలు నాకు ఈ రోజే తెలిశాయి. 🤣

గోరోజనం/గోరోచనం అంటే ఆవు పిత్తాశయం (Gall Bladder) లో ఏర్పడ్డ రాయి అని నిఘoటువు చెప్తోంది. సనాతనధర్మంలో ఆవు నుండి లభించిన గోరోజనాన్ని కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తారు. ఉషశ్రీగారి రామాయణంలో సుగ్రీవుడి పట్టాభిషేకానికి సమకూర్చున్న సంబారాలలో గోరోజనం ఉందని ప్రస్తావించబడింది.

సుగ్రీవ పట్టాభిషేకం:

రాముని ఆజ్ఞతో సుగ్రీవుడు కిష్కింధలో అడుగుపెట్టాడు. వానర ప్రముఖులు ప్రధానులు తమ నూతన ప్రభువుకు సముచితరీతిని స్వాగతం పలికారు. పాధాభివాదం చేసినవారందరినీ మర్యాదతో లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు అనంతరం దేవ నిజాలు నింద్రుని అర్చించినట్లు వానరులు సుగ్రీవుని అభిషేకించారు.

స్వర్ణ దండమీద శ్వేతపత్రం, హేమదండానికి కట్టిన చమరీవాలాలు, శ్రీర పూర్ణములయిన వృక్షాంకురాలు, రత్నాలు, ఓషధులు, శ్వేతవస్త్రం, శ్వేతమాల్యాను లేపనాలు, వ్యాఘ్రచర్మం, తేనె, ఆవాలు, పెరుగు, గంధాక్షతలు, సూకరచర్మంతో కుట్టిన పాదరక్షలు, గోరోచనం, మణి(ల....ఇలా పెట్టాలి. షేక సామగ్రి క్షణాలలో సమకూర్చారు. రూప యౌవన సంపన్నులయిన పోడక కన్యకాజనం నిలబడింది.

పంచతంత్రం కూడా ఆవు నుండే గోరోజనం లభిస్తుందని చెప్తోంది.

శ్లోకం: కౌశేయం కృమిజం సువర్ణముపలాద్ దూర్వావ్ గోరోమతః పజ్కాత్తామరసం శశాఙ్క ఉదథెరిన్దవరం గోమయాత్. కాష్ఠాదగ్నిర హేః ఫణాదపి మణిర్గోవి త్తతో రోచనా ప్రాకాశ్యం స్వగుణో దయేన గుణినో గచ్చంతి కిం జన్మనా. 103

తాత్పర్యం: 'ఇది నక్క' అని తలంచి ప్రభువులు నన్ను తిరస్కరించడం సైతం సముచితంగాదు. ఏలననగా విద్వాంసులిలా అన్నారు - పురుగులనుండిపట్టు, రాతినుండి బంగారం, గోరోమాల నుండి గరిక, బురదనుండి కమలం, సముద్రంనుండి చంద్రుడు, ఆవు పేడనుండి నల్లకలువ, కఱ్ఱనుండి అగ్ని, పాముపడగనుండి మణి, గోవైత్యరసం నుండి (గోవుక్రొవ్వునుండి) గోరోచనం పుట్టుతున్నాయి (ఇందుచే గుణవంతులు తమ గుణగరిమచే ప్రకాశిస్తా రేగాని జన్మచేగాదు ( అని తెలియుచున్నది).

కానీ ఈ గోరోజనం రాళ్ళు కేవలం ఆవులలోనే కాకుండా ఎద్దులు, గేదెలు, బైసన్, యాక్, అడవిదున్న మొదలైన పశువుల పిత్తభాగంలో కూడా లభిస్తాయి.

పశువులలో లభించే గోరోజనం రాళ్ళు చూడటానికి నది ప్రక్కన దొరికే గులకరాళ్ళల్లా ఉన్నాకానీ, పక్షి ఈక అంత బరువుతో తేలికగా ఉంటాయి. జంతువు శరీరంలోంచి వీటిని తీసినప్పుడు ముప్పావువంతు నీరే ఉంటుంది.

ఈ రాళ్ళు కొన్ని గుండ్రంగా, కొన్ని త్రిభుజాకారంలో, మరికొన్ని చతురస్రాకారంలో ఉంటాయి.వీటి ఆకృతుల్లాగే రంగుల్లో కూడా రకాలుంటాయి. కొన్ని పసుపు కలిసిన ఎరుపు రంగులో ఉంటే మరొకొన్ని గోధుమరంగు కలగలిసిన నారింజపండు రంగులో ఉంటాయి.

చైనీస్ మెడిసిన్, ఆయుర్వేద మందులలో ఈ గోరోజనాన్ని ఉపయోగిస్తారు. కొన్ని ఆసియా దేశాలలో ఈ గోరోజనాన్ని వయాగ్రాలా భావిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గ్రాము $65 దాకా ఉంటుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. సరఫరా తక్కువగా ఉండటమే ఈ గిరాకీకి కారణం.

అంతర్జాతీయంగా ఎన్నో పశువుల వధశాలలున్నాకానీ, అన్ని పశువులలోనూ ఈ రాళ్ళు లభించవు (మనలో కూడా అందరికీ పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడవు కద, అలాగే అన్నమాట). ఆస్ట్రేలియాలో దాదాపు 250-300 కమర్షియల్ వధశాలలున్నా కూడా సంవత్సరానికి కేవలం 200 కేజీల గోరోజనం మాత్రమే లభిస్తుంది.

పశువు శరీరంనుండి వీటిని సేకరించాకా, పేపర్ న్యాప్కిన్ మీద ఆరబెట్టి, రంధ్రాలున్న అట్టపెట్టెలో పెడతారు. ఈ అట్టపెట్టెని ఒక చీకటి ప్రదేశంలో ఫ్యాను వేసి ఉంచి ఆరపెడతారు. మధ్య మధ్యలో ఈ రాళ్ళని కదుపుతూ పూర్తిగా ఆరేవరకూ ఉంచుతారు. ఒకవేళ ఇంకా ఏమన్నా కాస్త తేమ, ఫంగస్ లాంటివి కనుక ఆ రాళ్ళమీద ఉండిపోతే, పొయ్యి మీద ఒక గిన్నెలో అడుగుభాగంలో సున్నంపొడి వేసి, ఆ సున్నం మీద ఇంకొక గిన్నెలో ఈ తేమగా ఉన్నరాళ్ళని వేసి ఆరపెడతారు. ఈ రాళ్ళు పూర్తిగా ఆరాకా, వీటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో మాత్రమే ప్యాక్ చెయ్యాలి. ప్యాకింగ్ సమయంలో మరి ఏ ఇతర పదార్ధాలతోనూ ఈ రాళ్ళని కలపకూడదు.

ఫస్ట్ గ్రేడ్ గోరోజనం రాళ్ళ పరిమాణం 2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది, సెకండ్ గ్రేడ్ గోరోచనం రాళ్ళు 2.5 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇక మూడవరకంవి విరిగినవి, నారింజరంగులో ఉన్నవి. పొడి రూపంలో ఉన్న గోరోజనం రాళ్ళు దేనికీ ఉపయోగపడవు.

పులి పిత్తాశయంలో లభించే రాయిని కూడా గోరోజనం అంటారు[1] .

ఇంక మన యూట్యూబ్ యూనివర్సిటీలో చూస్తే గోరోజనం కుంకుమ ధరిస్తే అలా ఇలా అని ఏదో చెప్తున్నారు, కానీ అదంతా నమ్మకండి. అసలు సిసలు గోరోజనం లభించడం చాలా చాలా అరుదు, పైగా దాని ధర సామాన్యులకి అందుబాటులో ఉండదు.

కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే, వెంటనే అది చేసేసి ఆ కష్టంలోంచి బయటపడాలనిపిస్తుంది. అది మానవ సహజం. కానీ గోరోజనం అని చెప్పి మీకు నకిలీవి అంటగట్టేవాళ్ళే నూటికి తొంభైతొమ్మిది మంది ఉంటారు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఆలోచించో, పెద్దల సలహాతోనో, కష్టంనుండి బయటపడే మార్గం ఆలోచించండి తప్ప ఇలాంటి మాటలు విని మోసపోకండి. పైగా గోరోజనం కుంకుమనీ, సాత్విక పూజలు చేసేవాళ్ళు ధరించరనీ, మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. దీనిని విడమరచి చెప్పడం అనవసరం.

మర్చిపోయానండోయ్, మాట విననివాళ్ళని/ గర్విష్టివాళ్ళని "వీడికి గోరోజనం ఎక్కువరోయ్" అనడం కూడా వినే ఉంటారు. బహూశా ఆవు పిత్తాశయంలో ఏర్పడ్డ రాయిని గోరోజనం అంటారు కాబట్టి, రాయిలా ఉండి మనసు మార్చుకోనివాళ్ళని అలా పిలుస్తారేమో!

కామెంట్‌లు లేవు: