15, జూన్ 2023, గురువారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 91*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 91*


"కానీ .... సంకర నందులు ఆశించినట్లు జరగలేదు. భగవంతుడు దయామయుడు. దుష్టులు, దుర్మార్గుల ఆట కట్టించడానికి ఆ దేవుడు అప్పుడప్పుడూ తన ఉనికిని చాటుతుంటాడు. మహానందుల వారి ఆదేశానుసారం ఆ అగ్ని ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు మహారాణి మురాదేవి తన కుమారునితో సహా మహారాజుల వారు చూపించిన గుప్తమార్గం ద్వారా ఆ చెరనుంచి తప్పించుకుపోయారు. ఆ తదనంతరం నందులు జరిపించిన అగ్నిప్రమాదంలో ఏకాంత దుర్గంతో పాటు మహారాజు మహానందుల వారు ఆహుతైపోయారు.... ఇది నిజం... ముమ్మాటికీ నిజం.... ఇది నిజమని నిరూపించగల ప్రత్యక్షసాక్షి... అరుగో మీ మహారాణి మురాదేవి...." 


ఆనాటి మహారాణి, నేటి రాజమాత మురాదేవి సభా సదుల ముందుకు వచ్చింది. సబికులు ఆమెను గుర్తించి భక్తి గౌరవాలతో లేచి నిలబడి వందనాలు సమర్పించారు.


మురాదేవి ప్రతినమస్కారం చేసి "ఆర్యచాణక్యుల వారు చెప్పిందంతా ప్రత్యక్షరసత్యం.... 

మా ప్రియతమ చక్రవర్తి మహానందుల వారి జీవితాశయాన్ని నెరవేర్చడానికే నేనింకా బ్రతికున్నాను..." అని చెప్పింది ఆవేదనగా దుఃఖపూరిత స్వరంతో.... 


మహారాణిని ఆ స్థితిలో చూసిన పౌరులు కొందరు కంటతడి పెట్టారు. చాణక్యుడు మళ్ళీ ప్రసంగిస్తూ.... 


"మీ చక్రవర్తి మహానందుల వారు విజ్ఞులు. కాబట్టే తన మనోవాంఛను స్వదస్తూరితో రాసిన ఒక లేఖద్వారా తమ ప్రియతమ మగధ పౌరులకు తెలియపరచారు. ఇదే ఆ లేఖ...." చాణక్యుడు లేఖనుt) పైకెత్తి ప్రదర్శిస్తూ "మీలో పెద్ద వయస్సు గల వారికి ఆనాటి మహామంత్రి శకటాలుని గురించి తెలిసి ఉంటుంది. మహానందుల వారికి అపకారం చేసిన నవనందులపై తిరగబడిన శకటాలుని చెరసాలలో బంధించి, ఆయన ఏకైక పుత్రుడిని వధించారు మహాపద్మనందుడు. వృద్ధులైన శకటాల మహామంత్రుల వారు విడుదలై ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు" అని చెప్పాడు. 


శకటాలుడు సభమధ్యకు వచ్చి "చాణక్యుల వారు చెప్పిందంతా సత్యం. నందుల దూరహంకారానికి, దౌర్జన్యాలకి నేనే ప్రత్యక్షసాక్షిని" అని చెప్పాడు. పౌరులు ఆ వృద్దునికి సానుభూతిగా నిట్టూర్పులు విడిచారు. 


"మహానందుల వారికి మహామంత్రి శకటాలుడు ఆప్తుడు. వారు ఈ లేఖలోని దస్తూరిని గుర్తిస్తారు." అని చెప్పి ఆ లేఖను శకటాలునికి అందజేశాడు చాణక్యుడు. 


శకటాలుడు ఆ లేఖను విప్పి దస్తూరి గుర్తించి లేఖని భక్తితో కళ్ళకు అద్దుకొని "సందేహం లేదు. ఇది మహారాజు మహానందుల వారి చేతివ్రాతే... లేఖ అడుగున వారి చేవ్రాలు, రాజముద్ర కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి..." అని చెప్పి ఆ లేఖని మరికొందరు పెద్దలకు ఇచ్చాడు. వారందరూ లేఖలోని దస్తూరిని గుర్తించారు. 


చాణక్యుడు గొంతు సవరించుకొని "పూజ్యులు శకటాలుర వారు ఆ లేఖను చదివి వినిపిస్తారు" అని ప్రకటించాడు.  


సభ యావత్తూ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. మహానందుల వారి లేఖాంశాలను తెల్సుకోవాలన్న ఉత్కంఠ ప్రతి ఒక్కర్లోనూ స్పష్టంగా కాన వచ్చింది. 


శకటాలుడు ఆ లేఖను చదవనారంభించాడు.... 

(ఇంకా ఉంది)..🙏🏻


*సేకరణ: శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: