15, జూన్ 2023, గురువారం

పూజ గదిలో

 కొన్ని దేవుని ప్రతిమలను ఆయా పర్వదినాలలో కొంటాం. అంటే వినాయక చవితి పండుగ సమయంలో వినాయకుడి విగ్రహం కొంటాం. అది మట్టితో చేసింది కావొచ్ఛు లేదా ప్లాస్టర్ ఆఫ్ పారీసు కావొచ్చు. ఆ ప్రతిమకు అలంకరణలు చేసి పుష్పాలు తొడిగి ధూపదీప నైవేద్యాలతో పూజించి మూడవరోజో లేదా ఐదవ రోజో లేదా పురజనులందరు నిమజ్జనం చేసే సమయంలో మనం గూడా ఆ ప్రతిమలను నీటిలో కలిపేస్తాం. 


కాని పూజ గదిలో ఎన్నో ఏళ్ళుగా ఉంచిన దేవుని ఫోటోలు, ఛాయాచిత్రాలు, విగ్రహాలు వాటి రంగు పోవడం గాని లేదా ఆ ఫ్రేములు ఊడిపోవడం గాని లేదా చిరిగిపోవడం గాని లేదా ఆకర్షణలను కోల్పోవడం గాని జరిగితే వాటిని ఎలా పారేయాలి. ఇన్ని రోజులుగా పూజ చేసినవి కదా. ప్రతిరోజు మన పూజా కార్యక్రమాలలో వాటికి ప్రాణప్రతిష్ట గావించాము కదా. అలాంటి తరుణంలో మనం ఏం చెయాలి. 


ఇదే కాకుండా ఈ రోజుల్లో ఏ వస్తువు కొన్నా వాటి ప్యాకింగ్ కవర్లలో దేవుడి ఫోటో ఉండగలదు. అంటే ఆ వస్తువు తయారీదారులకు అది ఒక శుభప్రదమైన మార్కెట్టు డిమాండు పోషించగలదన్న ఓ నమ్మకం కొద్దీ అలా దేవుని ఫోటోలతో ఆ ప్యాకేజీలను ప్రింటు చేస్తారు. 


వారు ఎలాంటి నెపంతో అలా చేసినా మనం ఆ వస్తువును కొని మన డబ్బాల్లో భద్రపరిచిన తర్వాత ఆ కవర్లను ఏంజెయ్యాలి. చెత్తకుండీలలో పడెయ్యాలనా. 


ప్రతి రోజు ఇలాంటిదేదో ఒక సమస్య తయారవుతునే ఉంటుంది. వీటన్నిటికి పరిష్కార మార్గం శెలవివ్వరా. 


ముందస్తుగా అందరికి ధన్యోస్మి


2007 ఏడాది అనుకుంటాను..ఇదే ప్రశ్నను వారణాసిలో ఓ వేద పండితుడిని(వారు తెలుగు వారే .తర్వాత కాలం చేసారు) అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం నాకు వెంటనే గుర్తుకు వొచ్చింది. పటాలు, కేలండర్లు, మెటల్ విగ్రహాలు...ఇత్యాది దేవతా ప్రతిమలు సహజంగానే ఇళ్ళలో ఉంటాయి. వాటికీ పూజలుకూడా చేయవచ్చు. ఐతే ఇవేవీ ఆగమశాస్త్ర పరిధిలోకి రావు కాబట్టి, అవి దేవతా ప్రాణ ప్రతిష్టలు కావు. అవి కేవలం కాగితాలు అట్టముక్కలు. మాత్రమే. కానీ మన భావన వల్ల అవి జీర్ణం అయినప్పుడు మార్చటానికి మనసు పీకుతుంది. తీసి అవతల వేసేయచ్చు. ఎం తప్పు లేదు. వినాయక వ్రతం, వరలక్ష్మి వ్రతం..ఇత్యాది అనేక వ్రతాలలో ఆయ దేవత విగ్రహ స్థాపన,, కలశ స్థాపన .... వాటి ఉద్వాసన ఇత్యాది విధానం ఆవ్రతంలో చెప్పినట్లు చేయాలి. అది కూడా ఆగమ శాస్త్రానికి సంబంధం లేదు. కాబట్టి సులువుగా మార్చవచ్చు. అయితే కొద్ది మందికి వంశానుచారం పరంగా విగ్రహారాధన, దేవతార్చన విధానాలు ఉండేటట్లు ఐతే.. ఆయా విగ్రహాలు జీర్ణం అయితే..వారి పెద్దలను సంప్రదించి సవరణలు చేసుకోవాలి. అని ఆయన చెప్పారు. అలాంటివి ఆగమ శాస్త్ర పరిధిలోనివే. అయితే ఇక్కడ వేద పండితుల మధ్య విభేదాలు వున్నాయి. విగ్రహం నందు ప్రాణ ప్రతిస్ట్ట అనేది క్షేత్రమందే సాధ్యం తప్ప గృహము నందు సాధ్య పడదు అని. ఇలా చెబుతూనే... బుగ్వేదంలో ప్రథమ సూక్తంలో రెండవ మంత్రంలో.. దేవతలను ఎలా ఆవిష్కరించాలో/ ఆవిష్కరింప బడతారో వివరంగా చెప్పారు. నా బుద్దికి అంతగా అందలేదు. గుర్తుంది కానీ అర్థం కాలేదు ఇప్పటికీ. 🙏🙏

కామెంట్‌లు లేవు: