15, జూన్ 2023, గురువారం

సంస్కారములు

 సంస్కారములు


మనం వసిస్తున్న ఈ లోకం మిశ్రలోకం. అంటే సుఖదుఃఖాలు కలసినదని అర్థం. సుఖమనేది లేక ఒకేఒక దుఃఖంతో కూడినలోకంఒకటిఉన్నది. దుఃఖమేలేక, ఎప్పుడూసుఖంగానే ఉండే లోకమూ ఉన్నది. మనది రెండూకలసిన లోకమన్న మాట. వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము మొదలయినవి సుఖలోకాలు. నరకం దుఃఖంతోనే కూడుకొన్నది. అందులో మరీ కఠోరమయినదిరౌరవం, పితృదేవతలు ఎక్కడ ఉన్నా అమావాస్యా తర్పణఫలం వారిని చేరుతుంది. కాని నరకంలోవారికి చేరదు. నరకలోకంలో ఉండేవారికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి. మురికిగుడ్డలనీరు, వెంట్రుకలనుండికారే జలం, హస్తప్రక్షాళనం చేసుకున్న ఉదకం - నరకంలో ఉన్న వారిని ఉద్ధేశించి ఇస్తే వారికితృత్తికలుగుతుంది. అందుకోసమే ధోవతిని పిండేందుకూ, శిఖోదకాన్ని పిండేందుకూ మంత్రాలున్నాయి. ఆంధ్రదేశంలో ఉత్తరాపోశనకు వెనుక మిగిలిన నీటిని విస్తరి కూడిభాగంలో వదలుతూ 'రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం' అంటూ ఒకమంత్రం చెబుతారు. 


పద్మం, అర్బుదం అనేవి సంఖ్యలు. ''పద్మార్బుదాలు ఎన్నికోట్లసంవత్సరాలు. అన్నిఏండ్లుగా రౌరవనరకంలోబాధ పడుతున్నవారికి ఈజలం ఇస్తున్నాను, అక్షయమైన వారి దప్పి దీనితో తీరుగాక'' అని ఉత్తరాపోశనానంతరం పై మంత్రం చెబుతున్నారు. దాక్షిణాత్యులు వైశ్యదేవం చేస్తారు. దానికి బదులు ఆంధ్రదేశంలో భోజనకాలంలో ఈదుబలుల నిస్తున్నారు. దీనిని 'చిత్రాదిబలి' అని అంటారు. అంటే ప్రత్యేకంగా అన్నం తీసి ప్రక్క ఉంచుతారు. ఆపోశనానంతరం మంత్రంచెప్పి జలం వదలి ఉపసంహారం చేస్తారు. 


ఈ లోకంలో సంతోష మున్నది. దుఃఖ మున్నది. మహాత్ముల సాన్నిధ్యంలో ఉన్నంతసేపు సంతోషం ఉంటుంది. తరువాత యథాప్రకారం చింతలు ఆవరిస్తాయి. మనం ప్రయత్నిస్తే సుఖం అధికం చేసుకోగలం. ప్రతిఒక్కరికి సుఖదుఃఖాలు ఇంచుమించు సమానంగా ఉంటున్నవి. కొందరికి సుఖం ఎక్కువ, కొందరికి తక్కువ. ఏకష్టంవచ్చినా మనోనిగ్రహంతో నిర్లిప్తంగా ఉండేవాళ్ళు కద్దు. అట్లుకాక ఎపుడూ ఏదోఒకబాధతో దుఃఖపడేవాళ్ళూ ఉన్నారు. సుఖదుఃఖాల హెచ్చుతగ్గులలో పరిమాణభేదం మాత్రం ఉంటుంది. సుఖదుఃఖాలు శీతోష్ణాలవంటివి. పై చెప్పినలోకాలు ధర్మామీటర్లవలె (ఉష్ణమాపకములు)ఉన్నవి. బాయిలింగు పాయింటును చూపేది నరకలోకం. ఫ్రీజింగు పాయింటును చూపేది స్వర్గలోకం. ఒకదానిలో మరొకటి ఉండదు. ఈరెంటి మధ్యస్థితికి ఒకటి-వైకుంఠం, కైలాసం, సత్యలోకం. ఇవన్నీ ఒకేవిధాలైన లోకాలని ఉపనిషత్తులు చెపుతున్నవి. అధోలోకం, నరకం మధ్యలో ఉన్నది మిశ్రలోకం. మనశాస్త్రాల ప్రకారం తక్కినలోకాలకంటే మనలోకమే ప్రశస్తమయినది. ఈలోకంనుండి మనం ఇంకో లోకానికి పోవచ్చు. మిగతా లోకాలలో అట్లు ఇష్టానుసారం పోయేవీలు ఉండదు. ఫలానారోజు ఇంతసేపు ఉండాలంటూ ధర్మరాజు నిర్దేశం ఒకటి ఉంది. కానీ ఇక్కడ మన ఇష్టప్రకారం పుణ్యకార్యాలూ, పాపకార్యాలూ రెండూ చేయవచ్చు, నాలుకతో నామజపం చేయవచ్చు, నలుగురినీ పడతిట్టవచ్చు, చేతులారా పూజలు చేయవచ్చు, లేదా కానివారిని హింసించనూవచ్చు. భగవంతుడు ప్రతి ఇంద్రియానికీ రెండు విధాలైన శక్తులు ఇచ్చాడు ఈస్వాతంత్ర్యం ఇతరత్రా లేదు. అవి అన్నీ భోగభూములు. మనం జంతువులుగా పుట్టితే పుణ్యం చేసుకోగలమా? దేవతలున్నూ అట్టి జంతువులను పోలినవారే. జంతువులకు పాపపుణ్యాలు లేవు. ఈలోకంలో కర్మానుష్ఠానం చేసి సద్గతిపొందే మార్గం ఉన్నది. దేవలోకంలో అది సాధ్యం కాదు. కృషిస్థానం ఇది భోగభూమి. అక్కడ ఉత్పత్తి లేదు. ఒక్క ఫలానుభవం మాత్రం ఉన్నది. పాపపుణ్యాలు ఎంత చేసుకొన్నామో అంతా అనుభవింపవచ్చు. అంతే కృషికి వలసిన శక్తి ఈ లోకంలోనే ఉంది. అదీ మనుష్యజన్మకే. ఇతర లోకవాసులకు కర్మాధికారం లేదు. 


కర్మ, గుణము - ఈ రెండూ చేరి జీవుణ్ణి ఇతరలోకాలకు తీసుకొని వెడుతున్నవి. కర్మ చేయవలెనంటే దానికి దేశకాలాలున్నవి. మనం శ్రాద్ధాన్ని నడిరేయి పెట్టం. అట్లా వాడుక లేదు. దానికై నిర్దేశించిన కాలంలోనూ, దేశంలోనూ అది జరగాలి. ఆకర్మలను పుణ్యభూమిలోనే చేయగలం. ముఖ్యంగా భారతదేశంలో వైదికకర్మలు తప్పక చేయాలి. ఇతరములు భోగభూములు. ఈ దేశాలలోనూ కొన్ని నిషిద్ధ దేశాలున్నవి. కొన్ని కర్మలకు కొన్ని కాలములు నిషిద్ధములు. కర్మ పరిశుద్ధదేశంలో, పరిశుద్ధకాలంలో చేయాలి. 

కర్మ అంటే ఏమి? పని ఒక బట్ట తయారుకావాలంటే, పూర్వాంగంగా ఎన్నో పనులు చేయాలి. అట్లే ఒకడు ఆత్మవేత్త కావాలంటే ఎన్నో పనులు చేయవలసి ఉన్నది. గుణకర్మలతో ఈ పనులుచేయాలి. ఇట్లా చేసే పనులకే సంస్కారాలని పేరు. ఒక పదార్థానికున్న దోషం పోగొట్టి దానిని గుణవంతం చేసేదే సంస్కారం. జీవాత్మకున్న దోషాలను పోగొట్టి గుణపూర్ణం చేయడానికేర్పడిన కార్యాలే సంస్కారాలు. 


ఆత్మ దేహంలో చిక్కుకొని ఉన్నది. ఒకప్పుడు అది ఆనందంగాఉంటుంది. మరొకపుడు దుఃఖాక్రాంతంగా ఉంటుంది. ఆత్మకు ఆనందం వచ్చిపోయేదిగా కాక, సార్వకాలికంగా ఉండేటటులు చేయడానికి మనం ప్రయత్నించాలి. జీవుడు ఈశ్వరసాన్నిధ్యం చేరుకుంటే అప్పుడు ఈ దుఃఖం ఉండదు. ప్రళయానంతరం ఐక్యమైపోతుంది. ఈశ్వరసాన్నిధ్య ప్రాప్తికి ఋషులు నలభై సంస్కారాలనూ, ఎనిమిది ఆత్మగుణాలనూ ఏర్పరచారు. ఇవేకాక ఎన్నో ధర్మసూత్రాలనూ చెప్పారు. ఇవి అన్నీ స్మృతిరూపాలు. స్మృతులు28. వానిలో పదునెనిమిది ప్రధానమయినవి. తక్కినవి ఉపస్మృతులు, మను, యాజ్ఞవల్క్య; హారీత, పరాశరాదులు స్మృతికర్తలు. 

గౌతముడూ, ఆపస్తంబుడూ ధర్మసూత్రాలు రచించారు. గౌతముడు స్మృతికూడా చెప్పాడు. 

జీవుడు దేహానంతరం బ్రహ్మలోకం చేరుకోడానికి ఈ నలభైయెనిమిదీ కారణాలుగా ఉన్నవి. వీని సాయంచేత ఈశ్వర సాన్నిధ్యం చేరగలం. అది బ్రహ్మజ్ఞాని సన్నిధివలె ఉంటుంది. ఆ సాన్నిధ్యంలో సదా ఆనందంగా ఉంటూ అతడు అరూపుడైనపుడు మనమున్నూ ఐక్యం కావచ్చును. 

ఈ సంస్కారాలను మనం కరచరణాద్యంగ సహాయంతో చేయాలి. 


''యస్యైతే చత్వారింశత్ సంస్కారాః అష్టావాత్మగుణాః 

బ్రహ్మణః సాయుజ్యం సలోకతాం జయతి''. 


ఈనలభైయేనిమిది సంస్కారాలనూ అనుసరించినవారు బ్రహ్మలోకం చేరుకొంటారు. సుఖదుఃఖాలు లేకపోవాలనుకుంటే వానిని సృజించిన ప్రభువువద్దకు చేరితే వానిబాధలుండవు. 

ఆత్మగుణాలనే ఆత్మశక్తి అని వ్యవహరిస్తున్నారు. కాని అది లౌకికంగా చెప్పే మాట. ఆత్మకు శక్తిలేదు. పురాతన సంస్కృతగ్రంథాలలో ఆత్మశక్తి అన్న పదం కనిపించదు. ఆత్మగుణాలనియే అన్నారు. నిషేకాది శ్మశానాంతమూ జీవుడికి నలభై సంస్కారాలు చెప్పారు. అనగా తల్లిగర్భంలో మరో శరీరాన్ని ధరించే పదార్థం ఉండటం ఎప్పుడు ప్రారంభించిందో, అప్పటినుండీ దేహం అగ్నికిఆహుతి అయ్యేంతవరకు చత్వారింశత్ సంస్కారాలు చేయాలి. నిషేకం అగ్నిసాక్షిగా చేయబడుతున్నది. కడపట శ్మశానకర్మయూ అగ్నిసాక్షిగానే చేయబడుతున్నది. అందుచే అగ్నిని మనం ఆరిపోనీరాదు. 


బ్రహ్మచారి ప్రతిదినమూ అగ్నికార్యం అనగా సమిధాధానం చేయాలి. గృహస్థునికి ఔపాసన విధి. వానప్రస్థునికి కక్షాగ్ని అని ఒకటి ఉన్నది. అది అడవిలో చేసేది. సన్యాసాశ్రమంలో అగ్ని లేదు. వానిలో జ్ఞానాగ్ని ఉన్నది. సన్యాసి దేహానికి అగ్నిసంస్కారమున్నూ లేదు. సన్యాసి దేహాన్ని ఖననంచేయడం మర్యాదకోసం. న్యాయముగా వాని దేహాన్ని నాలుగు ముక్కలుగా చేసి, నాలుగు దిక్కులలో అచటఉన్న ప్రాణులకు ఆహారమయేటట్లు చేయాలి. జనుల కేవిధమైన ఉపద్రవమూ ఉండరాదని ఈ కార్యం అడవిలో చేయాలి అని నియమం ఉన్నది. లేకపోతే వాని దేహం భూమిలో పాతి ఆ చోట చెట్లను నాటాలి. అడవిలో అతనిదేహం ప్రాణులకు ఆహారమవుతుంది. ఇట్లా చేస్తే, చెట్టుకు ఎరువుగా ఉపయోగపడుతుంది, మారేడు రావి మొదలైన పెద్దచెట్లను అచట నాటాలి. బృందావనం కట్టడం గౌరవంకోసం, వివాహకాలం నుండీ అగ్నిని ప్రతివారూ సంరక్షించుకోవాలి. ఆ అగ్నిలోనే దేహం ద్రవ్యంగా ఆహుతికావాలి. అగ్ని అందరికిన్నీ కద్దు. వివాహకాలంలో అన్ని వర్ణాలవారూ ఔపాసన చేయాలి. అందరూ అగ్నిని రక్షించాలి. ప్రస్తుతం అగ్నిరక్షణ పారసీకులొకరు చేస్తున్నారు. అగ్ని ఆరిపోతే విశేషవ్యయంతో వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. మనదేశంలో అగ్ని కార్యం సుమారు అరువదేళ్ళుగా తగ్గిపోయింది. ఈ దేహంవల్ల ఏవిధమైన ప్రయోజనమున్నూ లేదు. అందుచే దీనిని కడపటి కాలంలో దేవతలకు అగ్నిలో ఆహుతి చేయాలి. ఘృతయుక్తంగా దేహాన్ని ద్రవ్యం చేసి హోమం చేయాలి. నిషేకమాది అంత్యేష్టివరకూ చెప్పబడిన నలభై సంస్కారాలను అందరూ పాటించాలి.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: