23, సెప్టెంబర్ 2023, శనివారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 55

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 55🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల పుష్కరిణి:*


శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణంచెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానంతర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నదీ గమనార్హం.


*తిరుమల హుండీ:*


తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకుని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనాస్థలంగా తిరుమల ప్రసిద్ధి కలిగింది.

తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తుల్లో ఉన్న వడ్డీకాసులవాడు, ఆపదమొక్కులవాడు వంటి పేర్లు ధనరూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవడాన్ని సూచిస్తాయి. పౌరాణిక గాథల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బులేకుంటే పెళ్ళిఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మిదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపదలేకపోయింది. పెళ్ళికి అవసరమైన డబ్బు కుబేరుడువేంకటేశ్వరునికి అప్పుపెట్టారు. వేంకటేశ్వరస్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి.


ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని నమ్మిక. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు. శంకరాచార్యులవారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ క్రింద 'శ్రీచక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి. 1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయంలో పూర్వం నేలపై వున్న రాళ్ళను (ప్లోరింగ్) తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీచక్రాన్ని అలానే వుంచి దానిపై రాళ్ళను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక "సప్తగిరి" పేర్కొంది

తిరుమల సంకీర్తనా భాండాగారం

తిరుమల తిరుపతి దేవాలయంలో బంగారు వాకిలికి ఎదురుగా కుడిచేతి వైపు భాష్యకారుల సన్నిధి, దానిని ఆనుకొని తాళ్ళపాక వారి అర అనే పేర ఒక సంకీర్తన భండగారము ఉంది.

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారంలో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకల గది.


దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

పూచి నీ కీరితి రూపు పుష్పము లివియయ్యా !

ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగ

తక్కినవి భండారాన దాచి ఉంచనీ...

అన్నమయ్య రచించిన పై ఆధ్యాత్మ సంకీర్తనను పరిశీలించినట్లయితే అన్నమయ్యే ఈ రచనలను ఈ భాండాగారములో దాచేవాడని తెలుస్తుంది.



*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: