23, సెప్టెంబర్ 2023, శనివారం

నవగ్రహా పురాణం🪐* . *34వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *34వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

 

*శుక్రగ్రహ జననం - 1*


భృగుమహర్షి ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు నీడలో అరుగు మీద కూర్చుని , ప్రాతఃకాల అనుష్టానం పూర్తి చేశాడు. అది గమనించిన పులోమ ఆయన దగ్గరగా వచ్చింది.


*"చూశావా , నీ కొడుకులు మనం చెప్పకుండానే దర్భలూ , సమిధలూ సేకరించడానికి వెళ్తున్నారు !”* ఆశ్రమం నుండి , అరణ్యం వైపు వెళ్ళే కాలిబాటలో నడుస్తున్న కుమారుల్ని చిరునవ్వుతో చూస్తూ అన్నాడు భృగుమహర్షి. ఆయన కంఠంలో పుత్రోత్సాహం లీలగా ధ్వనించింది.


*"మీరన్నట్టు , వాళ్ళు నా కొడుకులు కారు. మీ కొడుకులు. ముమ్మార్తులా !"* పులోమ చిరునవ్వుతో అంది.


భృగుమహర్షి కళ్ళు ఆమె వైపు చూస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. *"అంటే...?”*


*“అంటే - ఆ తాపస లక్షణాలూ , ఆ సాత్వికగుణం , ఆ సౌమ్యతా - మీలో వున్నాయి. మీ కొడుకుల్లో కనిపిస్తున్నాయి !"* పులోమ నవ్వుతూ అంది.


*"అంటే... అవన్నీ నీ లక్షణాలు కావా , పులోమా ?"* భృగువు నవ్వాడు. 


*“మీరే చెప్పండి... ఒకసారి నేను జన్మించిన వంశాన్ని గుర్తు చేసుకుని !"* పులోమ ఆయన మొహంలోకి చిలిపిగా చూస్తూ అంది.


భృగుమహర్షి పెద్ద పెద్ద కళ్ళు ఆశ్చర్య దర్పణాల్లా అయ్యాయి.


పులోమ నవ్వింది. *“అర్థం కాలేదా స్వామీ ?* మన బిడ్డలు కేవలం సాత్వికులు !...


నేను కోరుకున్న లక్షణాలున్న పుత్రుడు నాకు ఇంకా పుట్టలేదు !"* పులోమ నునుసిగ్గుతో తల కొద్దిగా వాల్చుకుంటూ అంది.


భృగువు బొమలు ముడివేస్తూ చూశాడు. *"నువ్వు కోరుకున్న లక్షణాలా ! రా... ఇలా కూర్చో.... చెప్పు !”*


పులోమ భృగుమహర్షి సమీపంలో కూర్చుంది. *“ఎంత అమాయకులు స్వామీ , మీరు ? చ్యవనుడితో ప్రారంభించి , ఇప్పటిదాకా మనకు పుట్టిన కొడుకులు నలుగురూ సత్వగుణం పాలు ఎక్కువగా వున్నవాళ్ళే...”*


*"ఔను... ,"* భృగువు అన్నాడు ఆమెనే చూస్తూ.


*"నేను కోరుకుంటున్న కుమారుడు కేవలం సాత్వికుడే కాకూడదు. ఆత్మవిశ్వాసం , ఆత్మగౌరవం , ఆత్మాభిమానం , స్వయం నిర్ణయశక్తి , శాసించే లక్షణం , సునిశితమైన తీక్షణమైన బుద్ధి , సాహసం , పట్టుదలా , కార్యదక్షతా - ఇంకా ఇలాంటి ప్రత్యేక లక్షణాలన్నీ కలిసి మూర్తీభవించిన 'అగ్నికోణం' లాంటి అద్వితీయుడైన పుత్రుడు కావాలి నాకు !"* తనలోంచి పొంగిపొర్లుతున్న ఆవేశాన్ని గుర్తించి , ఆశ్చర్యపోయింది. పులోను తీక్షణంగా మెరుస్తున్న ఆమె కళ్ళలోకి క్షణంలో ప్రశాంతత వచ్చి చేరింది. ముఖం మీద అంతసేపూ నాట్యం చేసిన గాంభీర్యాన్ని చిరునవ్వు చెరిపి వేసింది. *"నాకు... నాకు అలాంటి కుమారుణ్ణి ప్రసాదిస్తారా , స్వామీ ?”*


*"పులోమా ! నీకు తెలుసా ? సాత్విక , రాజస , తామస లక్షణాల సమ మేళన స్వరూపాన్ని కోరుతున్నావు నువ్వు"* భృగువు ఆమెనే చూస్తూ అన్నాడు. 


*"ఆ నిష్పత్తి నాకు అంతగా తెలీదు. సునిశితమైన ఖడ్గధారలాంటి మేధస్సుతో , రాజసం ఉట్టిపడే ప్రవర్తనతో నీతినీ , నియమాలను నిర్దేశించే శక్తితో - గొప్పవాడైన కొడుకు కావాలి , స్వామీ నాకు !"*


*"కోరిన కొడుకుని ఎత్తుకునే అధికారం ప్రతి తల్లికీ వుంటుంది. పులోమా !"* అంటూ భృగుమహర్షి అరుగుమీంచి కిందికి దిగి , ఆశ్రమం వైపు అడుగులు వేశాడు.


పులోమ ఆశ్రమ ప్రాంగణంలోని పూల మొక్కలకు నీళ్ళు పోస్తోంది. లేడి శరీరాన్ని వాత్సల్యంగా నిమురుతున్న భృగుమహర్షి చూపులు పులోమను వెంటాడుతున్నాయి. సాయంకాలం నీరెండ ఆమె శరీరం మీద పడి ప్రతిఫలిస్తోంది. గతంలో వివాహానికి ముందు ఆమె ఆర్జించిన తపశ్శక్తి - ఆమె మనసునే కాకుండా తనువునూ పటిష్టంగా వుంచింది ! చూపుల్ని ఆలోచనల్నీ ఆకర్షించే పులోమ శరీర సౌష్టవం తనను ఆశ్చర్య పరుస్తూనే వుంది.


లేడి తన శరీరాన్ని భృగుమహర్షి కాళ్ళకేసి రుద్దుతూ , ఆయన దృష్టిని మళ్ళించింది. భృగుమహర్షి ఆప్యాయంగా లేడి కళ్ళల్లోకి చూశాడు. ఆశ్యర్యం ! ఆ కళ్ళల్లో పులోమ కళ్ళు ప్రత్యక్ష మవుతున్నాయి !


చల్లటిగాలి శరీరానికి గిలిగింతలు పెడుతోంది. చతుర్దశి చంద్రుడు నీలాకాశం లోంచి భూ సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఆశ్రమ సమీపంలోని పూల తోటలోని పువ్వులు రకరకాల సౌరభాల సమ్మేళనంతో మత్తెక్కిస్తున్నాయి.


ప్రశాంత వాతావరణంలో తోటలో అటుయిటూ అడుగులు వేస్తున్న భృగుమహర్షి , ఆగి , కిందికి చూశాడు. ఆకాశం వైపు తలయెత్తి , బొమ్మలా కూర్చుంది పులోమ. అడుగుల చప్పుడు వినిపించక పోయే సరికి , తల వాల్చి చూసింది. తన ఎదురుగా తననే చూస్తూ నిలుచున్న పతిదేవుణ్ని చూస్తూ , లేచి నిలుచుంది.


*"రండి ! మీకు నిద్రా సమయం అయ్యింది"* అంటూ ఆశ్రమం వైపు తిరిగి నడవ బోయింది.


భృగుమహర్షి కుడి చెయ్యి , ఆమె ఎడమ చేతిని పట్టుకుని ఆపింది. పులోమ తలతిప్పి , ప్రశ్నార్థకంగా చూసింది. భృగువు చెయ్యి ఆమె చేతిని పట్టుకునే వుంది. భర్త మొహంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ పులోమ ఆయన వైపు తిరిగింది.


భృగుమహర్షి మాట్లాడకుండా వెనక్కి తిరిగి , కొంచెం దూరంలో వున్న పొదరిల్లు వైపు నడవసాగాడు. పులోమ పాణి గ్రహణాన్ని కొనసాగిస్తూ. 


వృషభరాజాన్ని వెన్నంటి నడిచే హోమధేనువులా అడుగులు వేస్తూ అనుసరిస్తోంది భర్తను పులోమ.


నిండు చూలాలైన హోమధేనువు , చప్పుడు విని , తలతిప్పి చూస్తూ పలకరింపుగా 'అంబా' అంది.


రెండు చేతుల్లో క్షీరాన్న పాత్రను పట్టుకున్న పులోమ నవమాసాల గర్భభారాన్ని మోస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తోంది.


భృగుమహర్షి ఆశ్రమంలోంచి గుమ్మంలోకి వచ్చాడు. ఆగి , అటు యిటూ చూసి , తన చూపుల్ని ఒక వైపు తిప్పి ఆపాడు. ఆయన ముఖం మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఇద్దరు నిండు గర్భిణులు ఒకేచోట వున్నారు , కళ్ళకు విందులు చేస్తూ. ఒకరు ఆశ్రమ ధేనువు , ఒకరు ఆశ్రమ లక్ష్మి !


భృగుపత్ని పులోమ బాలుణ్ని ప్రసవించింది. ఒక శుభ ముహూర్తంలో. ఆశ్రమంలో ఆనందం తాండవం చేస్తున్న ఆ శుభదినాన , నారదుడు ఆగమించాడు. పంచమ పుత్ర జననాన్ని పురస్కరించుకుని భృగు దంపతులను అభినందించాడు. నామకరణ మహోత్సవానికి బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులు సతీ సమేతంగా వస్తారని తెలియజేశాడు.


*"త్రిమూర్తులా ! నా బిడ్డడి నామకరణానికి !"* భృగుమహర్షి నిలువునా ఆశ్చర్యపోయాడు.


*"దేవదేవుల రాకకు ప్రత్యేక కారణముంది ! అది వారే మీకు తెలియజేస్తారు !"* అన్నాడు నారదుడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: