శు భో ద యం 🙏
*విశ్వనాథ సీత*
కల్పవృక్షంలో విశ్వనాథ వర్ణించిన అశోక వనంలో సీత సీతారామాద్వైతానికి ప్రతీక!
*అశోక వనంలో సీత*!!
కల్పన అంటే ఊహ. ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్కోణం. మనందరికీ తెలిసున్న విషయాల గురించి మనకి తెలీని ఒక కొత్త అంశాన్ని ఆవిష్కరించ గలగడమే కల్పనా చాతుర్యం. ఉదాహరణకి అశోకవనంలో సీతాదేవిని వర్ణించే యీ పద్యం చూడండి :
ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా
పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే
హాకృతి, సర్వ దేహమున యందును రాఘవవంశమౌళి ధ
ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై
సీతాదేవి ఎలా ఉందీ అంటే, ఆమె ఆకారం రామచంద్రుని విరహానికి రూపంలా ఉందట. కనుబొమలేమో రాముని విల్లులా ఉన్నాయి. రాముని కరుణ కన్నులలో మూర్తికట్టింది. జడేమో రాముని శరీరకాంతితో మెఱుస్తోంది.
రామాయణ కల్పవృక్షం
సీతాదేవి శరీరమంతా కూడా రఘువంశ చంద్రుడైన రాముని ధర్మం రూపుకట్టినట్టుగా ఉంది. ఆ కూర్చున్న విధానమేమో రాముని ప్రతిజ్ఞ మూర్తీభవించినట్టుగా ఉందట! ఎంత ఉదాత్తమైన ఊహ యిది! అంత ఎడబాటులో కూడా ఎప్పుడూ ఆ సీతారాములు కలిసే ఉన్నారన్న ఆలోచన గొప్పది. కనుబొమలని ధనుస్సుతో పోల్చడం మామూలే. అలాగే కురుల సౌందర్యాన్ని చెప్పడానికి వాటి నల్లని నిగనిగలు వర్ణించడమూ సామాన్యమే. కాని వాటిని సీత విషయంలో రాముని విల్లుగా, రాముని శరీర కాంతిగా అభివర్ణించడం అసామాన్యం. బాహ్య రూపంతో మొదలుపెట్టి, చివరికి ఆమె శరీరమంతా రాముని ధర్మానికి ప్రతిరూపంలా ఉందనడం, ఆమె కూర్చున్న తీరులో రాముని ప్రతిజ్ఞ కనిపిస్తోందనడం సాధారణ కవులు చెయ్యలేని ఊహ. ఇది సీతారాముల అద్వైతాన్ని నిరూపించే పద్యం. కల్పవృక్షం నిండా ఇలాంటి ఊహలే. అవి ఎంత విచిత్రంగా ఉంటాయో అంత సముచితంగా ఉంటాయి. అంత ఉదాత్తంగా ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి