*ఖరీదైన వైద్యం*
రచన : డి. వి. ఎస్. రావు
రామాపురంలో జగన్నాధశాస్త్రి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన వైద్యం చేస్తే తగ్గని రోగమంటూ లేదు. కాని ఆయన ఆ వూరిలో వున్న ఇతర వైద్యులందరి కంటె ఎక్కువ డబ్బు తీసుకొనేవాడు. ఎంత ప్రాణం మీదకు వచ్చిన రోగమైనా ఆయన వైద్యం వల్ల తగ్గేది. కొందరు రోగులు డబ్బు తక్కువ పుచ్చుకుంటారని ఇతర వైద్యుల వద్దకు వెళ్ళినా ఆ రోగం తగ్గక ముదిరితే శాస్త్రి గారి వద్దకు రాక తప్పేదికాదు.
జగన్నాధశాస్త్రి ధనవంతుల వద్ద విపరీతంగా డబ్బు గుంజేవాడు. ఆయన బీదవారి వద్ద, సామాన్యుల వద్ద కొంత తక్కువ తీసుకున్నా అది ఇతర వైద్యులు తీసుకునే దానికంటే ఎక్కువగానే ఉండేది. ప్రజలు ఆయన్ని ధనాశాపరు డని, కక్కుర్తి మనిషని తిట్టుకునేవారు. కాని వైద్యానికి మళ్ళీ ఆయన వద్దకే వెళ్ళేవారు.
శాస్త్రిగారికి కృష్ణశాస్త్రి, రామశాస్త్రి అని ఇద్దరు కొడుకులు. వారిద్దరూ తండ్రి వద్దనే వైద్య విద్య నేర్చుకొంటుండేవారు.
శాస్త్రిగారికి తాతలనాటి ఆస్తి అయిదెక రాల పంట పొలం. రెండెకరాల కొబ్బరి తోట. ఒక ఇల్లు వున్నాయి. ఆయన ఒక ఎకరం భూమి కొని దానిలో వైద్యానికి కావలసిన మూలికలకై చెట్లు, మొక్కలు, తీగలు పెంచారు.
శాస్త్రిగారికి పాతికేళ్ళ ప్రాయంలో వివాహమయింది.అప్పటి నుండీ వైద్య వృత్తి చేపట్టి విపరీతంగా డబ్బు సంపాదించాడాయన. కానీ ఆయన సంసారం పొదుపుగానే చేస్తుండేవాడు. గడించిన డబ్బేమయ్యేదో ఎక్కడ దాస్తున్నాడో ఎవరికీ తెలినేది కాదు.
ఒక రోజు శాస్త్రిగారు రోగుల నుండి వసూలైన డబ్బు పుచ్చుకుని తన పడక గదిలోకి వచ్చాడు.
ఇంతలో .. ఎవరో “శాస్త్రిగారున్నారా?” అంటూ రావడంతో అక్కడే వున్న బల్లపై ఆ డబ్బు వుంచి బయటికి వెళ్ళాడాయన.
శాస్త్రిగారి భార్య మీనాక్షమ్మ ఏదో పని మీద శాస్త్రిగారి పడకగదిలోకి వచ్చింది. బల్లపై వున్న డబ్బు కనిపించగానే, ఆమె ఆతృతతో లెక్కపెట్టి చూసింది. దగ్గర దగ్గర వెయ్యి రూపాయలున్నాయి. ఆమెకు ముందు రోజు బట్టల వ్యాపారి వద్ద చూసిన చీర జ్ఞాపకం వచ్చింది. ఆ చీర కొనుక్కోవాలని పుబలాటపడి ఒక యాభై రూపాయలు తీసుకుంది. అంతగా భర్త అడిగితే చెప్పవచ్చు అనుకుంది.
జగన్నాధశాస్త్రి వచ్చి, డబ్బు దొంతర పెట్టి ఉండడం చూసి, కోపంతో భార్యను పిలిచాడు. ఆమె వచ్చింది.
“నీ బాబు సొమ్మనుకున్నావా ?” అంటూ ఆమె చంపపై కొట్టాడు. ఆమె కళ్ళు నీళ్ళు తిరగగా తీసుకున్న ఆ డబ్బు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది.
మరొకసారి శాస్త్రిగారి పెద్దకొడుకు కృష్ణ శాస్త్రి ఒక బీదవానికి ఉచితంగా వైద్యం చేసి, మందులిచ్చి పంపాడు.
అది చూసిన జగన్నాధశాస్త్రి కొడుకు పై మండిపడ్డాడు. అతడు సిగ్గుపడి పోయాడు.
కొంత కాలం గడిచింది. జగన్నాధ శాస్త్రికి వృద్ధాప్యం వల్ల అలసట పెరిగింది. దాని తో ఆయన తన వైద్యాన్ని కుమారులకు అప్పగించి, డబ్బు మాత్రం తనే వసూలు చేయడం మొదలుపెట్టాడు. రోగులను చూడడం, మందులివ్వడం వరకే కొడుకుల పని. ఇలా వుండగా మరికొంత
కాలానికి శాస్త్రిగారు మంచం పట్టారు. అయినా ఆయన లెక్క ప్రకారమే కొడుకులు డబ్బు వసూలు చేయవలసి వచ్చేది.
ఒకరోజు శాస్త్రిగారు కొడుకులిద్దరినీ పిలిచి తనకు వయస్సు అయిపోయిం దనీ, తన తదనంతరం ధనాన్ని ఏ విధంగా భాగాలు చేసుకోవాలి, ధన మంతా ఎక్కడ వున్నదీ తెలియజేసే
విల్లు వ్రాసి వుంచాననీ, దానికి ఒక నకలు ధర్మాధికారి వద్ద వుందని, విల్లు తన దిండు క్రింద వుందనీ తెలియచేశాడు. ఆ మరునాడు తెల తెలవారుతుండగా శాస్త్రిగారు మరణించారు.
శాస్త్రిగారి కొడుకులు తండ్రి వ్రాసిన విల్లు ను తీసి దాచి, ఆయన కాయానికి దహన సంస్కారాలు ముగించారు. కార్యక్రమాలు ముగిశాక ధర్మాధికారి విల్లు నకలుతో వారి ఇంటికి వచ్చాడు.
శాస్త్రిగారు వ్రాసిన విల్లు ఆ రోజు ధర్మాధికారి చదువుతున్నాడని తెలిసి ఊరిలో జనమంతా శాస్త్రిగారి ఇంటి అరుగులపై ప్రోగుపడ్డారు. ఆయన
సంపాదించిన డబ్బు ఎంతుందో, ఏక్కడ దాచాడో, ఏమి చేయదలచుకున్నాడో తెలుసుకోవాలని ప్రజలకు వుబలాటంగా వుంది. ఆ డబ్బంతా అన్యాయంగా తమ వద్ద గుంజిందేనని ప్రజలు ఆయన్ను తిట్టుకోసాగారు.
ధర్మాధికారి విల్లు నకలు తీసి ఇలా చదవడం మొదలు పెట్టాడు:
“నేను వైద్యం వల్ల ఎంతో ధనాన్ని గడించాను. అదంతా నా పడక గది క్రిందనున్న నేలమాళిగలో వుంది. ఆ నేలమాళిగకు ప్రవేశం గదిలో గోడ వారనున్న భోషాణం క్రిందగల నాపరాయి తీయాలి. భోషాణంలో కొన్ని దస్తర్ల కాగితాలున్నాయి. నేను సంపాదించిన ఆ ధనంలో నా సొంతానికి ఒక్క పైసా కూడా వెచ్చించుకోలేదు. ఆది నా సొమ్ము కాదు. అది ప్రజలది. నా వద్ద వైద్యం చేయించు కున్న సామాన్య బీద ప్రజల పేర్ల జాబితా వివరాలతో సహా ఆ భోషాణపు పెట్టెలో వున్నవి.
ఆ పేర్లు చదివి వారివారి సొమ్మును ఇచ్చి వేయాలి. వైద్యం ఉచితంగా చేస్తే ప్రజలకు దాని మీద గౌరవం, విలువ ఏర్పడదు. అంతేకాక ఆ విధంగా మిగిలిన డబ్బును వారు దాచుకోక వృధా చేస్తారు. అందుకై వారి తరఫున నేను ఆ సొమ్మును దాచాను. ఆ డబ్బు తిరిగి ఇవ్వడం వల్ల వారిప్పుడు సొంత ఇళ్ళు కట్టుకొనడానికి అవకాశం కలుగుతుంది. ఇక మిగిలిన సొమ్ముతో ఉచిత వైద్యాలయాన్ని నిర్మించి నా కొడుకులు వైద్యులుగా ప్రజాసేవ చేయగలరని ఆశిస్తున్నాను. తాతలనాటి ఆస్తి వారి జీవితానికి చాలు. ఊరిలోని ఇతర వైద్యులను వైద్యాల యంలో జీతాల పై ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి.
నేను ఉచిత వైద్యాలయాన్ని నిర్మించి ప్రజాసేవ చేయాలని వైద్య వృత్తి చేపట్టినప్పుడు భావించాను. దానికై వూరిలోని ధనవంతులను సహకరించ వలసిందిగా కోరాను కానీ వారు సహకరించలేదు, ప్రజలలో కూడా వైద్యాలయం పై ఒక గౌరవభావం లేదు. అందుకై రోగుల నుండి డబ్బు వసూలు చేస్తూ వచ్చాను. ఇప్పటికై నా వైద్యం అన్నది ప్రజా జీవితంలో ఒక భాగంగా అందరూ గుర్తించి ఉంటారనుకొంటాను.
ఏ వూరిలో దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం వుంటాయో ఆ వూరి ప్రజలు అభివృద్ధి చెందుతారు. మానసిక పరివర్తనకు దేవాలయం. జ్ఞానార్జనకు విద్యాలయాలు, గ్రంథాల యాలు, శారీరక ఆరోగ్య పరిరక్షణకు వైద్యాలయం ఎంతో అవసరం. నా సహోదరులైన నా గ్రామ ప్రజలు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే!”
విల్లు చదివిన ధర్మాధికారికి కళ్ళ నీళ్ళు కారాయి. ప్రజలు శాస్త్రిగారిని తప్పుగా భావించినందుకు ఎంతో బాధపడ్డారు. ఆయన గుణగణాలను, హస్త వాసిని పొగుడుతూ అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
జగన్నాధశాస్త్రిగారి పేరుపై ఒక ఉచిత
వైద్యాలయం ఏర్పడి ప్రజాసేవ చేయడం మొదలుపెట్టింది.
🙏
*శుభం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి