19, ఆగస్టు 2024, సోమవారం

అపరోక్షము

 అపరోక్షము



ప్రమాణ విచారణలో ప్రమాత - ప్రమాణము - ప్రమేయము అన్న మూడు అత్యంత కీలకమైనవి. సాంప్రదాయంలో వీటినే త్రిపుటి అని అంటారు. ప్రమాత అంటే తెలుసుకొనే వాడు అని. జ్ఞాత, విషయి, ద్రష్ట అన్న పదాలూ తెలుసుకునే వానికి వర్తించే పదాలే. చూచేవాడు, తెలుసుకునే వాడు అన్నవి సమానార్థకాలు. తెలుసుకునే సామర్ధ్యం కలిగి, తనను - తనకన్యమైన వాటినీ కూడా తెలుసుకుంటాడితడు. తనకు అన్యమైన వాటిని గురించి తెలుసుకోడానికైతే ప్రమాతకు ఆ పనికి అవసరమైన పరికరాలు, పద్ధతులు అవసరమవుతాయి. వాటినే ప్రమాణాలు (జ్ఞాన సాధకాలు) అంటారని ముందే చెప్పుకున్నాం. ఇకపోతే తన గురించి తాను ఎరుక కలిగి ఉండడానికి ప్రమాణావశ్యకత లేదుగనుక, ప్రమాతకు సంబంధించిన ఏ విషయాలైనా త్రిపుటితో పనిలేకుండానే తనకు తనకుగానే తెలుస్తూ ఉంటాయి. కనుకనే ఈ భాగానికి సంబంధించిన తెలివిని (జ్ఞానాన్ని లేదా ఎరుకను) అపరోక్షజ్ఞానం అంటున్నాము.


దీనికి సంబంధించిన క్షేత్ర దర్శనం


ఒక్కసారి నిద్రనుండి మెలకువలోకి వచ్చే సందర్భాన్ని గుర్తుచేసుకోండి. మెలుకువ వచ్చిందని తెలుస్తుంది మొదట. గమనించడం ఆరంభమైందని దానర్ధం. నేను అన్న భావన కూడా పుట్టకముందే ఎరుకలోకి రావడం జరుగుతుంది. అంటే గమనించడం మొదలైంది. ఆ క్షణంలో గమనిస్తున్నాను అన్న స్పృహకూడా ఉండదు. రెండో దశలో నేను అన్న భావన, నేను గమనిస్తున్నాను అనిగాని, నాకు మెలుకువ వచ్చింది అనిగాని అనిపిస్తుంది లేదా తెలుస్తుంది. తెలుసుకునే దానికి / వానికి తనకు అన్యమైన వాటి గురించి తెలుసుకునేందుకున్న విధానాలు, సాధనాలనే ప్రమాణాలనుకున్నాం కదూ! ఒక ముఖ్యమైన విషయమేమంటే త్రిపుటిలోని ప్రమాణాలు, ప్రమేయాలూ కూడా ప్రమాతకు అన్యమైనవే అవుతాయి. ఆ దృష్టినుండి చూస్తే; తెలుసుకునే వాడు, తెలియబడేటివి అన్న రెండుగానే వీటిని అర్థంచేసుకోవచ్చు.


ఓ   జ్ఞాత (ప్రమాత) : ఎవరన్న విషయంలో రకరకాల 'సిద్ధాంతాలు - రాద్ధాంతాలు' ఉనికిలో ఉన్నా శరీరంలో తెలుసుకునే పని జరుగుతూనే ఉందనీ, మనందరికీ ఆ పని మనమే చేస్తున్నామని అనిపిస్తుంటుందనీ అనేంతవరకు ఏకాభిప్రాయమే ఉంటుంది. నేనే తెలుసుకుంటున్నాను. ఈ శరీరంలో తెలుసుకుంటున్నది 'నేనే' అని మనందరికీ అనిపిస్తుంటుంది. తెలుసుకునే పని తలలో జరుగుతుంటుందనీ మనందరకూ తెలుసు. భారతీయ ఆస్తిక సాహిత్యంలో జ్ఞాన లక్షణం ప్రకృతికి, ప్రకృతి సంబంధితాలకూ ఉండదన్న దృష్టిఉండడంతో, శరీరభిన్నము (జడ భిన్నము) అయినది ఒకటుండక తప్పదనీ, దానినే ఆత్మ అంటారని, కనుక తెలుసుకునే నీవే ఆ ఆత్మవు అనీ చెప్పబడింది. మన ప్రస్తుతాంశం శరీర భిన్నమైన ఆత్మ ఉందా లేదా? అన్నది కాదు. ఈ శరీరంలో నేను అన్న భావనతో కూడి తెలుసుకునే పని చేస్తున్నదొకటి ఉందని, అది మనందరికి, ఆ తెలుసుకుంటున్నది నేనేనని అనిపిస్తుంటుందని, సందేహ రహితంగా తెలుసు. కనుక తెలుసుకునేది ఏది? లేక ఎవరు? అన్నది ప్రస్తుతానికి ప్రక్కనుంచుదాం.


అంటే; జ్ఞాతను నేనే. తెలుసుకునే లక్షణము గల నేను పరిమిత సామర్ధ్యముతో తెలుసుకుంటుంటాను. నన్ను నేను తెలుసుకుంటూ, నాకు సంబంధించిన విషయాలూ తెలుసుకుంటూ, నాకితరమైన వాటిని వివిధ పరికరాలూ, పద్ధతులాధారంగా తెలుసుకుంటూ ఉంటాను. ఇంతవరకు ఇదంతా మీమీ అనుభవం (ఎరుక)లో ఉందో లేదో ఎవరికి వారుగా, మీమీ అనుభవాలను తరచిచూసుకోండి. తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు మనకెవ్వరికీ అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను. కనుక నేను ఉన్నాను, తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు ప్రమాణాపేక్ష లేకుండానే తెలుస్తుంటుంది.


ఈ ప్రమాత లేదా జ్ఞాత (అహం) కు సంబంధించిన తెలివినే (ఎరుకనే) అపరోక్షం అనంటారు. జ్ఞాన సాధకాల తీరుతెన్నులను విచారించుకునే సందర్భంలోనూ, ఏఏ జ్ఞాన సాధకాల అంటే ఏఏ పరికరాల, పద్ధతుల ద్వారా ఏ రకమైన జ్ఞానం కలుగుతుంటుందో విచారించే సందర్భంలోనూ ఈ ప్రమాత స్వరూప స్వభావాల విచారణ అంత ప్రధానం కాదు. అయినా మనకు కలిగిన జ్ఞానరాశినంతటినీ పరిశీలించి చూస్తే. మూడు ప్రమాణాల ద్వారా కలిగిన జ్ఞానం కాక, మరికొంత జ్ఞానమూ ఉన్నట్లు తేలుతుంది. ఆ జ్ఞానానికి మనం ప్రమాణాల పేరిట చెప్పుకున్న పరికరాలు గానీ, పద్ధతులు గాని అవసరపడలేదని తెలుస్తుంది. అదిగో ఆ భాగాన్నే అపరోక్షం అనంటున్నాం. ఇదంతా ఇక్కడెందుకు విచారించు కుంటున్నామంటే ప్రమాణబద్ధమైన జ్ఞానానికీ, అది ఒప్పు జ్ఞానం కావచ్చు, తప్పు జ్ఞానం కావచ్చు, అపరోక్ష జ్ఞానానికీ, అంటే ప్రమాణాల క్రింద చెప్పుకున్న పరికరాలు, విధానములన్న వాటి ప్రమేయము లేకుండనే కలిగే జ్ఞానానికి తేడా ఉందని గమనించి, ఆ అపరోక్ష జ్ఞాన రాశిని విడిగా ఉంచడానికే.  ముందుగా ఆ పని చేసుకుంటేనే ప్రమాణాల విషయాన్ని వివరంగా పరిశీలించగలుగుతాం. మరి 1, 2 ఉదాహరణలు చెబుతాను. అపరోక్ష జ్ఞానాన్ని గురించి అర్థం చేసుకోడానికి (స్పష్టత రావడానికి) ప్రత్యక్షం ద్వారా ఏదో ఒక విషయానికి చెందిన అనుభూతి కలుగుతుందను కుందాం. అంటే ఏదో ఒక దానిని గురించి ఏదో ఒకటి అనిపించింది. ఇంతవరకు ఇది ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానమే. ఆ తరువాత ఆ విషయం మనకు తెలిసిందని తెలుస్తుంటుంది. ఒక విషయం తెలియడం - అది తెలిసిందని తెలియడం ఇది మీమీ అనుభవాలలో ఉందో లేదో చూసుకోండి. తెలిసిందని తెలియడానికి మూడు ప్రమాణాలలో ఏ ప్రమాణంతోనూ పనిలేదు. అది తెలుసుకునే మనకు, మనకుగానే తెలుస్తుంది. దానితో పాటు తెలుసుకుంటున్నాను అన్న తెలివీ కలుగుతుంటుంది. ఈ జ్ఞాన భాగాన్ని అపరోక్ష జ్ఞానమనే అనాలి. ఇక ప్రమాణజన్య జ్ఞానమంతా ప్రమాతకు - ప్రమేయ స్థానంలో ఉన్న విషయానికి సంబంధం ఏర్పరిచే వ్యవహారం జరిగి ఏర్పడ్డదై ఉంటుంది. ప్రస్తుతానికీ వ్యత్యాసాన్ని గమనించుకొని ప్రమాణాలను, తద్వారా కలిగే వివిధ రకాల జ్ఞానాలను వివరించుకుందాం.


అపరోక్షాన్ని మినహాయించితే, మిగిలిన జ్ఞాన రాశీ, అదేర్పడేందుకు అవసరమైన పరికరాలు, పద్ధతుల విచారణే ప్రమాణ విచారణంతా. అదిన్నూ ప్రత్యక్షమూ - పరోక్షమూ అన్న రెండు రాశులుగానూ, ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము అన్న భేదంతోటీ ఉంటుంది. ప్రత్యక్ష పద్ధతిననుసరించి కలిగే జ్ఞానం ఇంద్రియాల తేడావల్ల మరల 6 విధాలుగా ఉంటుంది. ఇక పరోక్ష జ్ఞానం అనుమాన పద్ధతిన, భాషనాధారం చేసుకునీ, రెండు రకాలుగా కలుగుతూ ఉంటుంది. భాషనాధారం చేసుకునేదంతా మానవుడు తమారుచేసుకున్నదే. అదికాక మిగిలిన రెండూ అంటే ప్రత్యక్షమూ - అనుమానమూ అన్న రెండూ శరీర నిర్మాణంలోనే అమరిఉన్న వ్యవస్థ రూపాలు. కనుకనే మండలి అవైవున్న ప్రమాణాలు రెండనీ, భాష ఆధారంగా మనిషి చేసుకున్నదొకటనీ అంటూ ప్రమాణ పద్దతులు మూడని నిష్కర్షిస్తోంది. మొత్తంమీద, మానవ జీవితానికి ముడిపెట్టి చూసుకుంటే, మూడు విధానాలను వాడుకోకుంటే జీవితంలో జ్ఞానపరంగా లోటుఏర్పడుతుంటుందనీ, నాలుగో ప్రమాణంతో పనిలేదని, మూటికంటే అధిక సంఖ్యలో ప్రమాణాలున్నాయనే వారంతా ఉన్న వాటినే అనవసరంగా అధిక భాగాలు చేసి సంఖ్యను పెంచే పనిచేసినట్లేనని మండలి సిద్ధాంతీకరిస్తోంది.

కామెంట్‌లు లేవు: