19, ఆగస్టు 2024, సోమవారం

దొంగతనం

 దొంగతనం 


మనయూరిలోనో మన కాలనీలోనో ఎక్కడో ఎవరింట్లోనో దొంగతనం జరిగింది అని తెలిసిన వెంటనే మనం జాగరూకులవటం సర్వ సాధారణం వెంటనే మన ఇంటి గడియలను సరి చేసుకుంటాము, ఇనపపెట్టె సరిగా ఉన్నదా లేదా అని చూసుకుంటాము. మనం తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము.  నిజానికి ఒకసారి ఒక ఇంట్లో దొంగతనం చేసిన వాడు వెంటనే ఆ సమీపంలోని ఇంకో  ఇంట్లో దొంగతనం చేయడు, కొంతకాలం అందరు మరచిన తరువాత తిరిగి తన పని మొదలు పెడతాడు.  కానీ మనం మాత్రం వెంటనే స్పందించి మన జాగ్రత్తలో మనం ఉంటాము. ఎక్కడికైనా వీళ్ళవలసి వస్తే మన పెట్టెలో వున్నవిలువైన వస్తువులను బ్యాంకు లాకరులో ఉంచి వెళ్ళటం కద్దు. 


బౌతికంగా జరిగే దొంగతనాలను మనం మన జాగ్రత్తలతో కొంతవరకు ఆపగలుగుతున్నాము.  కానీ ఇంకొక దొంగ అనాదిగా అందరి ఇళ్లలో పడి మనుషులను ఎత్తుకొని పోతున్నాడు. మనం నిత్యం మనుషులను మోసుకొని పోవటం చూస్తున్న అయ్యో పాపం అని వూరుకుంటున్నాం కానీ ఆదొంగ నా  ఇంటికి వస్తాడని నన్ను కూడా ఎత్తుకొని పోతాడని మాత్రం మనం తలవం. ఇంట్లో పడిన దొంగమీద పొలిసు స్టేషనులో ఫిరియాదు చేస్తాము వాడిని కోర్టులు విచారించి శిక్షిస్తాయి. కానీ ఈ రెండో రకం దొంగ మీద ఎలాంటి ఫిరియాదులు లేవు, చేయలేరు వాడిమీద ఫిరియాదుచేస్తే పోలీసులు తీసుకోరు, కోర్టులు వాడిని దండించవు. ఎందుకంటె ఈ దొంగ మన లోకపు వాడు కాదు వాడు వేరే లోకం వాడు అంటే యమలోకం వాడు.   కానీ ఒక్కటిమాత్రము నిజం వాడు ప్రతి వాని జీవితంలో ఆఖరుకి వస్తాడు. ప్రతి మనిషిని తీసుకొని  పోతాడు. వాడికి స్త్రీ పురుష భేదం లేదు చిన్న పెద్ద విచక్షణ లేదు. వాడు నిర్దయుడు. మరి ఈ దొంగనుంచి మనలను మనం కాపాడుకోవటం ఎలా, ఎలా అని మన మహర్షులు అనాదిగా ఎంతో కాలం ప్రయత్నించి మనకు ఒక చక్కని ఉపాయం చెప్పారు అదేమిటో యిప్పుడు చూద్దాం. 


మనం  పెట్టెలో ద్రవ్యాన్ని వుంచామనుకోండి ఆ పెట్టెని దొంగ ఎత్తుకొని పొతే పెట్టెతోపాటు ఆ ద్రవ్యం కూడా పోతుంది కాబట్టి తెలివయిన వాడు పెట్టెని ఇంట్లో భద్రంగా ఉంచి తాళం వేసి అందులోని విలువైన ద్రవ్యాన్ని మాత్రం బ్యాంకు లాకరులో ఉంచుతాడు దొంగ పెట్టెని తస్కరించినా ద్రవ్యం మాత్రం మనదగ్గరే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆలోచనే మన ఋషులు చేశారు పెట్టెలోని ద్రవ్యాన్ని (ఆత్మను) బ్యాంక్ లాకరులో (ఈశ్వరుని సన్నిధిలో) ఉంచితే దొంగ పెట్టెని (దేహాన్ని) ఎత్తుకొని పోయిన ద్రవ్యం (ఆత్మ ) పరమేశ్వరుని సన్నిధిలో క్షేమంగా ఉంటుంది (మోక్షప్రాప్తి) కానీ ఇది చెప్పినంత సులువు కాదు సాధించటం మరి ఎలా సాధ్యం. (ఇక్కడ దేహం పెట్టెతో దేహి ద్రవ్యంగా పోల్చి చెప్పటం జరిగింది) . 


రోజులో కేవలం 24 గంటలు ఈశ్వర సన్నిధిలో ఉంటే మాత్రమే అది సాధ్యం..  నీకేమైనా పిచ్చి పట్టిందా రోజుకు ఉండేది కేవలం 24 గంటలు మాత్రమే కదా ఆ 24 గంటలు ఈశ్వరుని సన్నిధిలో ఎలా ఉంటాము అది పూర్తిగా అసాధ్యం అని మీరు  అనవచ్చు. కానీ మనసుపెట్టి పనిచేస్తే అది పూర్తిగా సాధ్యం. ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను రోజు నా నిత్యవృత్తులకోసం పనిచేయాలి అలాంటప్పుడు ఎల్లప్పుడు ఈశ్వర సాన్నిధ్యంలో ఉండటం ఏల కుదురుతుంది.  దీనికి మన జ్ఞ్యానులు ఇలా చెప్పారు మీరు ఉషోదయ కాలంలోనే నిద్ర లేవండి.  మీ కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వెంటనే సంకల్పం చేయండి యేమని అంటే ఈ రోజు నేను తీసుకునే శ్వాస (ఉచ్వాస నిశ్వాస) రెండు కూడా ఈశ్వర జపంగా అనుకుంటూ చేస్తాను.  (ఈ జపాన్ని అజపాజపం అంటారు) మరుసటి రోజు అదే సమయానికి నిన్న చేసిన అజపాజపమును ఈశ్వరార్పణ గావించాలి తిరిగి మరుసటి రోజుకి అజపాజపానికి సంకల్పం చేయాలి.  ఇలా చేస్తే ఒక రోజు నీవు తీసుకున్న ఉచ్వాస నిశ్వాసలు ఈశ్వర జపంగా మారి ఈశ్వరార్పణం చెందుతాయి.  చూసారా మీరు ఏరకంగా జపంచేయకుండా జప ఫలితాన్ని పొందారు. అంటే మీరు రోజులోని 24 గంటలు ఈశ్వర జపం చేశారన్నమాట. 


ఇక జీవన వ్యాపారాల గూర్చి తెలుసుకుందాము. మనం నిత్యం అనేక జీవన వ్యాపారాలు అంటే పనులు చేస్తుంటాము అంటే మన ఇంద్రియాలతో అనేక వ్యాపారాలు (వృత్తులు అంటే పనులు) చేస్తుంటాము. చూస్తుంటాము, వింటుంటాము, మాట్లాడుతుంటాము, తింటుంటాము తాగుతుంటాము ఇలా అనేకానేక పనులు చేస్తుంటాము మరి అవి అన్నీకూడా ఈశ్వరపరంగా మనం చేయము కదా మరి వాటి సంగతి యెట్లా?. ఉషోదయకాలంలో ఒక సంకల్పం చేయాలి అదేమిటంటే ఈ రోజు నేను చూసేది పూర్తిగా భగవత్ రూపాన్నే, వినేది ఈశ్వర వాణినే,  మాట్లాడేది ఈశ్వర పరమైనదే నేను తినే తిండి తాగే నీరు కేవలం ఈశ్వర తీర్ధ ప్రసాదాలు మాత్రమే నేను స్నానం చేస్తున్నాను అంటే ఈశ్వరునికి అభిషేకం చేస్తున్నాను అని, నేను మల, మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే ఈశ్వరుని మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని నేను నిద్రిస్తున్నాను అంటే ఈశ్వరుడు నిద్రిస్తున్నాడు అని, నాకు ఎవరిదగ్గరినుండి ఐనా ద్రవ్యం వచ్చిందంటే అది ఈశ్వరుడు  ప్రసాదించింది. నాకు కలిగే సుఖము, దుఃఖము కేవలము అది ఈశ్వరుని అనుగ్రహంగా భవిస్తూ జీవితాన్ని  గడపాలి. రోజులో ఒక్క క్షణం కూడా ఇది నేను, ఇది నాకు అనే భావన మనసులోకి రానియ్యకూడదు. ఇలా చేసినవాడు నిత్య  ముక్తుడు అవుతాడు.ఇలా చేస్తే నీకుతెలియకుండానే నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆహార విహారాదులలో పూర్తిగా మార్పు వస్తుంది.  నీవు తినేది ప్రతిదీ ఆ ఈశ్వరుని ప్రసాదంగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు ఈశ్వరుని ప్రసాదానికి అర్హమైన పదార్ధాన్ని మాత్రమే భుజిస్తావు అంటే పూర్తిగా సాత్విక ఆహారమే   తత్ ద్వారా నీకు తెలియకుండానే నీవు సాత్వికునిగా మారుతావు, నీవు చూసేది పూర్తిగా ఈశ్వర స్వరూపంగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీకు ఏ మనిషి మీద లేక వస్తువు మీద మోహము కలుగదు.  ఉదాహరణకు నీకు ఒక అందమైన స్త్రీ కనపడినది అనుకో ఆమెను  నీ దృష్టిలో ఈశ్వరుని స్వరూపం భావిస్తావు అంటే ఆ తల్లి మీద నీకు కేవలము ఈశ్వరుని మీద కలిగే ప్రేమే ఉంటుంది తప్ప తత్ భిన్నంగా ఐహికమైన మొహం కలుగదు.  అంటే ఆ స్త్రీ సాక్షాతూ ఈశ్వరుడే.  నీ మనస్సు ప్రశాంతంగా పరి శుద్ధంగా ఉంటుంది.  అన్ని వస్తువులలోను, అందరిలోనూ నీకు కేవలం ఈశ్వరుడే కనపడతాడు.  నీవు ఎలాంటి పరిస్థితిలోను ఆవేశానికి, కోపానికి గురికావు నీ వదనం ప్రశాంతంగా ఉంటుంది.  నిన్ను పొగిడే వాడు నిన్ను దూషించే వాడు నీకు ఒకేవిధంగా కనపడతాడు.  ఎవరి పట్ల మమకారం కానీ ద్వేషం కానీ కలుగవు. నీకు తెలియకుండానే నీ జీవన సరళి మారుతుంది నీవు పూర్తిగా సాత్వికుడిగా మారతావు, తరువాత సుద్ధసత్వ గుణం కలిగి ఈశ్వర సన్నిదానాన్ని (మోక్షాన్ని) పొందుతావు.ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే సాధన మొదలిడు. 


గమనిక ఇది వ్రాసిన వాడు కూడా ఒక దొంగే వాడు ఇది చదివిన వాళ్ళను ఏమార్చి వాళ్ళ మనస్సులను దోచి ఈశ్వరుని పరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.  తస్మాత్ జాగ్రత్త. 


ఓం తత్సత్

కామెంట్‌లు లేవు: