19, ఆగస్టు 2024, సోమవారం

పదవీ విరమణ వ్యధ!!

 


పదవీ విరమణ వ్యధ!!


 వయసు రీత్యా  నేను 60 లోకి వచ్చినట్లు ప్రపంచానికి తెలిసిపోయింది..ఇదొక బ్రేకింగ్ న్యూస్ గా నలుగురి నోళ్ళలో నానడం రిటైర్ అయిన దానికంటే అత్యంత బాధాకరం. 


ఏజ్ 40 వస్తే ఓమూడునాలుగేళ్ళు 39గా మైంటైన్ చేయొచ్చు... బాటా చెప్పుల ధర లాగా! 

ఆనక 45 వస్తే 40ప్లస్ అని మరికొంతకాలం కప్పెట్టచ్చు వయసుని.


 50కి వచ్చినప్పుడు ఇంకా సర్వీస్ ఎంతకాలం ఉంది? అని ఆడిగితే... ఆ ప్రశ్నకి ఆశ్చర్యం నటిస్తూ, ఇప్పుడెక్కడ?ఇంకా 10ఏళ్ళు ఉందిగా..అంటూ “పదేళ్ళు” మీద గట్టిగా స్ట్రెస్ చేసి పలుకుతూ  సైకలాజికల్ గా ఎదుటివారిని మభ్యపెట్టడమో, హిప్నటైజ్ చేసి  వాళ్ళ చేత అయితే "చిన్నవారే" అనిపించుకోవడమో జరిగిపోయేది. ఆ విధమైన పరవంచన, స్వీయ మానసిక తృప్తి తో మరో ఐదారేళ్ళు లాగిపారేసా!


 కానీ విధి బలీయమైనది గా! 

"సూర్యుడు పడమర రాగా దిగిపోవును" అన్న సత్యంలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 60 ఏళ్ళు రాగానే ఉద్యోగంలో దిగిపోతాడు  అన్న విషయం సమాజానికి తెలుసు.


ఇక ఎంతమాత్రమూ నేను నా వయసుని కప్పెట్టలేనన్న భావన నన్ను చింతాక్రాంతుడిని చేసింది😣.

ఆ బాధతో తెల్ల గడ్డం పెంచి రిటైర్ అయినప్పుడు కప్పిన శాలువా చుట్టుకొని ఉండగా ఇప్పుడు వయసు 70 లా కనిపిస్తున్నారు ! అని మా పుత్రరత్నం అదిలించేటప్పటికి ఉలిక్కిపడి  ఆ ప్రయత్నం విరమించా! 


ఆఫీస్ లో తెలిసిందంటే పెద్ద బాధ లేదు కానీ నా ఈ బాధ  ఎక్కువవ్వడానికి మా వాడకట్టులో  నేను రిటైర్ అయినట్టు, 60 లో ఉన్నట్టు తెలిసిపోవడమే! 


ఇన్నాళ్లూ శమీవృక్షం మీద రహస్యంగా ఆయుధాలు దాచినట్టు దాచిన నా వయసు గుట్టు భళ్లుమనడమే!


శత్రువులు ఎక్కడో లేరు..మన ఎదురుగుండానో, మధ్యలో నో ఉంటారనేది  చరిత్ర మళ్లీ నిరూపించింది.


రోజూ మా ఎదురింటాయన ,నేను వెళ్ళేది ఒకటే టైం. ఆయనకి వాళ్ళావిడ ఎదురు రావడం సెంటిమెంట్. ఏదో ప్రైవేట్ జాబ్ అని తెలుసు.  నేను టక్ చేసుకుని కుసింత జాపత్రి పూసుకుని వీలైతే కారు లేదంటే బైక్ మీద స్టైల్ గా వెళ్తుంటే వాళ్లిద్దరూ చూసేవారు. 

ఆయన, నేను ఇద్దరం నవ్వుతూ విష్ చేసుకునేవాళ్ళం. కానీ ఆవిడ బాడీలాంగ్వేజ్ లో ఏదో ఆక్రోశం కనిపించేది. 


ఆవిడ చుట్టుపక్కల ఇళ్లల్లోగల అందరి గుట్టుమట్లు బాగా పసికడుతుందని మా పనిమనిషి ద్వారా సమాచారం అందింది. 


“ఫలానా వారి అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నాడని, పక్కఇంట్లో ఆయన రాహుకాలంలో మందుకొడతాడని,  ఈచివరి ఇంటావిడ మణిప్పురం లో  గొలుసుపెట్టి వడ్డీలు కడుతుందని, మా ఇంట్లో కడియం నుంచి పూలమొక్కలు తెచ్చామని, ఆ పక్కావిడ తెనాలి బంగారంతో దుద్దులు చేయించు కుందని..”ఇలా.


అసలు నా అనుమానం ఆవిడ “ఇస్రో “ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని భారత ఉపగ్రహ వ్యవస్థని మా కాలనీ లో ఉపయోగించుకుంటుందేమో అని!! 

ఆ తరహాలోనే నేను కొంతకాలంగా  నియమిత సమయానికి ఆఫీస్ కి వెళ్లడం లేదని గ్రహించింది. తర్వాత పరిణామం నేను ఊహించిందే! 

వాళ్ళాయన మా ఇంటికి వచ్చేశాడు ఓరోజు. విషయం తెలుసు కాబట్టి ఇబ్బందిగానే పలకరించా. 


హోటల్లో ఏమున్నాయి? అని మనం ఆడిగినప్పుడు  సర్వర్ యాంత్రికంగా ఎలా చదువుతాడో ఆయన కూడా  మొహాన చిరునవ్వు వేసుకుని " ఎలా ఉన్నారు? పిల్లాడు బాగున్నాడా? ఎప్పుడొస్తాడు? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా?"  వంటి సాదాసీదా ప్రశ్నలు అడుగుతూ వాటికి నేనిచ్చిన జవాబుల్ని పెద్దగా లక్ష్య పెట్టకుండా అసలు ప్రశ్న వేసేసాడు!


" ఈ మధ్య ఆఫీస్ కి సెలవు పెట్టారా?? " వెళ్తున్నట్లు లేదు? అని అడిగాడు. ఇప్పటివరకు వేసిన ప్రశ్నల తాలూకు నిర్లిప్తత ఈ ప్రశ్నలో అకుంఠిత ఆసక్తి గా మారడం గ్రహించా! 


బైటకి చూసా.. రాత్రి పెట్టుకున్న జాజిచెండు  పై నుంచి విసిరితే చెట్టు పై కొమ్మలో చిక్కుకుని వేలాడుతున్నట్లు,   మేడ మీద వరండాలో ఈయన గారి శ్రీమతి బాల్కనీ లో నుంచొని ఉంది మా ఇంటివంక చూస్తూ.. ఈవిడ ప్రశ్నలకి వాళ్ళాయన జవాబులు ఎప్పుడు తెస్తాడోనని!


లాభం లేదు ఇంక.. నా పిచ్చిగానీ! ఆవిడ ఇప్పటికే మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ సాఫ్ట్ వేర్ హ్యాక్ చేసి నేను రిటైర్ అయ్యినట్లు,  రిటైర్ అయ్యాక  నాకెంతవచ్చింది..పెన్షన్ ఎంత రాబోతోంది? ఇత్యాది ఆసక్తికర అంశాలు లాగేసి ఉంటుంది. 


జస్ట్ శంఖం లో పోస్తేనే కదా! అర్ధం కావడం కోసం వాళ్ళాయన్ని పంపింది.


"రిటైర్ అయ్యానండీ..అని ఏకలవ్యుడు ద్రోణుడికి ముఖ్యమైన బొటనవేలు సమర్పించినట్లు అతనికి ...అదే ..అతనిలో దాగి ఉన్న ఆవిడగారికి కావాల్సిన సమాధానం అర్పించా. 

మొబైల్ లో మెసేజ్ వస్తే వచ్చే వెలుగు లా అతని కళ్ళలో క్షణకాలం మెరుపు.తర్వాత ఏదో అన్నట్లు, గేటు ధబీలుమని వేసిన శబ్దం మాత్రమే నా మనసుకు తెలిసింది.


ఇక రేపు ఏరియా అంతా పాకిపోతుంది కాబోలు!

నా రిటైర్ ఆవిడకి సెటైర్ అన్న విషయం తెలుసు.


పర్యవసానమే మరుసటి రోజు నుంచి నన్ను చూడగానే సమాజం చేసే పలకరింత లో బోలెడు మార్పులు!


తెల్లవారుఝామున రోడ్లెక్కి పూలు దోచేసుకుందాం తోడు వస్తారా? అని ఒక వయో వృద్ధుడు ఆత్రత!


చేసే పనేం లేదుగా? శంకరమఠంలో వధూవరుల లిస్టు అప్ గ్రేడ్ చేద్దాం రమ్మని ఇంకో సగటు జీవి ఆహ్వానం!


కమీషన్ మీద రియల్ ఎస్టేట్ పాంఫ్లెట్స్ రోడ్డు మీద పంచుతారా...టైం పాస్ అవుతుందని ఒక  పైసాజీవి ఉచిత సలహా!


 రిటైర్ అయినవాళ్ళందరూ వాకింగ్ చేస్తున్నాం రమ్మని, ఆదివారం పెన్షనర్ గ్రీవన్సెస్ కి అట్టెండ్ అవ్వమని, శ్రీరాంచిట్స్ లో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీ ట, చేరకూడదూ అని ! సాయంత్రం పెద్దవాళ్ళందరూ పార్కులో మంచీ మాట చెప్పుకుందాం వస్తారా ?? అని, ..ఇలా వేధింపులు!


హతవిధీ!, ఇన్నాళ్ళు హీరో గ్లామర్ బండి, జీన్స్ పాంట్, నైకీ షూ తో వెలిగిన నేను నేనేనా?? సమాజం ఇంత సడన్ గా నన్ను వృద్ధుడిని చేసేసింది ??!! 


మీరు రిటైర్ అయ్యారుగా ఇప్పుడు లోన్ కష్టమని, సీనియర్ సిటిజన్ కాబట్టి వేరే లైన్ లో నుంచోమని, డ్రైవింగ్ లైసెన్స్ ఇంక ఐదేళ్లు మించి extend చేయమని, అబ్బే.. LIC పాలసీ ఇక ఇవ్వలేమని..ఇలా నాకు మానసికంగా కూడా వార్ధక్యం తెప్పించేస్తున్నారు!!😢


నేను బాగా ఉన్నానని, రక్తదానానికి ఇప్పటికీ రెడీ అని, కళ్ళజోడు లేకుండా డ్రైవింగ్ అర్ధరాత్రి ఐనా చేస్తానని, కృష్ణా నది అడ్డంగా ఈదగలనని చెప్పటమే కాక, 


"కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు" అవ్వొచ్చు కానీ “కొంతమంది వృద్ధులు ఎప్పటికీ కుర్రవాళ్ళు “ అన్న విషయమే నేను చెప్పదల్చుకుంది, నిరూపించదల్చుకుంది.

అయినా, ప్రపంచం పట్టించుకోవడం లేదు!


అందుకే , రాజకీయ నాయకుల్లా రిటైర్మెంట్ అనేది  ఉద్యోగులకు కూడా ఉండకూడదని, "వాళ్ళంతకు వాళ్ళు ఇక చేయలేము మొర్రో" అంటేనో, లేదూ, ప్రభుత్వం, ఎవరినైనా తీసివేయదల్చుకుంటే " వయసు బహిర్గతం"  చేయకుండా తీసేయాలని, ఆసందర్భాల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ గుట్టుచప్పుడుగా చేయాలని నా డిమాండ్. ఒకవేళ RTI ఆక్ట్ ప్రకారం ఫలానా వారి వయసు ఎంత? అని ఎవరైనా  పనికిమాలిన వాళ్లు అడిగినా "కాన్ఫిడెన్షియల్"  అని చెప్పి నిరాకరించాలి!😊


ఏది ఏమైనా, 40 వచ్చేటప్పటికి ఆడవాళ్లు,  60 వచ్చేటప్పటికి మగవారు పడే బాధ త్రాసులో తూస్తే సమానంగా ఉంటుంది. 

అంతిమంగా రిటైర్మెంట్ ఆపై "గోప్యత కోల్పోయిన వయసు"  తద్వారా వచ్చే బాధ పగవానికి కూడా వద్దనే ఈ మగవాని బాధ...😜!

కామెంట్‌లు లేవు: