9, ఆగస్టు 2024, శుక్రవారం

నాగపంచమి లేక గరుడ పంచమి!#

 #నేడు నాగపంచమి లేక గరుడ పంచమి!#


శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువులకు గరుత్మంతుడు, నాగులు జన్మించారు. ఆ రోజునే గరుడ పంచమి, నాగ పంచమిగా హిందువులు పూజలు చేస్తున్నారు.


శ్రావణ శుక్ల పంచమినే నాగ పంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. సనాతన భారతీయ సంస్కృతిలో నాగ పూజకి ఓ విశిష్టత ఉంది. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే.. తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.


"నాగ పంచమి" రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. నాగ పంచమి రోజున


‘విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ 


ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజచేసిన వారికి విష బాధలుండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజూ, నాగ పంచమి రోజున చదివినవారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు, రోగాలు రావు. వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలిగి కాలసర్ప దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయి.


కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకి గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని‘నాగ పంచమి’గా పిలుస్తున్నారు. ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి, శ్రావణ శుద్ధ పంచమిని ‘గరుడ పంచమి’గా పేర్కొంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది. కాబట్టి సర్పభయం పోవడానికి నాగపూజ చేస్తారు. అలాగే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.

కామెంట్‌లు లేవు: