9, ఆగస్టు 2024, శుక్రవారం

సూరి మరణం లేక బండిరా పల్లకీ

 సూరి మరణం లేక బండిరా పల్లకీ 

ఈ పేరే చిత్రంగా ఉంది కదూ ? తెలుగు వ్యాకరణం చదువుకోని యువకులకు సూరి పేరు పరిచితమైనది కాకపోవచ్చు.కాని స్కూల్లోనో కాలేజీలోనో తెలుగు పాఠ్యాంశంగా చదువుకున్న వారికి చిన్నయ సూరి పేరు తెలిసే ఉంటుంది.చిన్నయ సూరి గారి ఇంటి పేరు పరవస్తు వారు.ఈయన చాలాకాలం క్రిందట (పందొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో) మద్రాసులో కాలేజీలో తెలుగు అథ్యాపకులుగా పని చేసేవారు. ఈయన రచించినదే తెలుగు బాల వ్యాకరణం. తెలుగులో ఆది కవి నన్నయగారు ఆంద్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. అదే మన మొదటి వ్యాకరణ గ్రంథం. అందుకే ఆయన వాగను శాసనుడయ్యాడు. ఆ తరువాత తెలుగు లో మరికొన్ని వ్యాకరణ గ్రంథాలు రాక పోలేదు గాని వాటన్నిటిలోకీ నవ్యాతి నవ్యమైనది పేరు పడ్డదీ మన చిన్నయసూరి గారి బాల వ్యాకరణమే.దాదాపు ఒక వంద సంవత్సరాలుగా మన తెలుగు పండితులందరి మన్ననలు పొంది నేటికీ మన తెలుగు గ్రాంథిక భాషను శాసిస్తున్నది ఈయన గారి వ్యాకరణమే.శ్రీ గిడుగు మున్నగు భాషా సంస్కర్తల పుణ్యాన మన తెలుగు వచనం ఈ గ్రాంథికాన్ని తోసిరాజని శిష్ట వ్యావహారికాన్ని తలకెత్తుకుని మన నెత్తిన పాలు పోసింది. లేక పోతే ఈ నాటికీ కృతక భాషలో రచనలు చదవ లేక యాతన పడేవారము. సరే ఇప్పటికి సూరి అంటే ఎవరో ఆయన వ్రాసిన వ్యాకరణమేదో తెలిసింది కదా? తాను శాసించిన తెలుగు గ్రాంథికము ఎలా ఉండాలో తెలుపడానికన్నట్లు ఆయన నీతి చంద్రిక పంచతంత్రము అనబడే రెండు గ్రంథాలను వెలువరించాడు. వాటిలో ఉన్నవి బహు చక్కని నీతి కథలే అయినా ఆ భాష మనం మాట్లాడుకునే తెలుగు భాషలా ఉండక ఏదోలా ఉంటుంది.సామాన్యులెవరికీ అర్థం కాదు. అవే కాదు గ్రాంథిక భాష లోని ఏ రచనైనా ఏ కొద్ది మంది పండితులకో అర్థ మౌతుంది కాని సామాన్య ప్రజానీకానికి కొరుకుడు పడదు. ఇటువంటి పరిస్థితుల్లో గిడుగు వారు సారథ్యం వహించగా తెలుగు దేశాన వ్యావహారిక భాషా ఉద్యమం రూపు దిద్దుకుంది.కొందరు ఛాందస పండితులు అడుగడుగునా అడ్డు తగిలినా జన బాహుళ్యం ఆమోదాన్ని పొంది తెలుగు వచనం గ్రాంథికాన్ని వీడి చక్కని వ్యావహారిక బాషను అక్కున చేర్చుకుంది.అయితే అది అంత సులువుగా జరగ లేదు.ఎంతో మంది కృషి ఫలితమిది. వీరిలో ఆంద్ర విశారద శ్రీ తాపీ ధర్మారావుగారు కూడా ఒకరు. వీరు పండితులు.భాషావేత్త.తెలుగులో చేమకూర వెంకట కవి కావ్యం విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వ్రాసిన వారు. వీరు మొదట్లో గ్రాంథిక వాదులైనా గిడుగు పండితుని వాదనలోని స్వారస్యాన్ని గ్రహించి వ్యావహారిక భాషా వాదియై ఉద్యమం తోడ్పాటుకై ఎన్నో వ్యాసాలను వ్రాసి ప్రచురించారు. వాటిలో కొన్ని 1936 ప్రాంతంలో ప్రజామత పత్రికలో ధారా వాహికగా ప్రచురించబడ్డాయి. వాటిలోని కొన్నిటి సంకలనమే కొత్త పాళీ అనే పేరుతో 1955 ప్రాతంలో ముద్రింపబడి ఐదారు ముద్రణలకు నోచుకుంది.ఇదిగో ఈ పుస్తకంలోనే ఆయన వ్రాసిన సూరి మరణం లేక బండిరా పల్లకీ అనే ప్రహసనం చోటు చేసుకుంది.కేవలం నాలుగు రంగాలుగా విభజించి వ్రాయబడ్డ ఈ ప్రహసనం సూరి గారు అనారోగ్యంతో మంచాన పడి ఉండి గడియో క్షణమో అని ఉండగా ప్రారంభమౌతుంది.అక్కడ ఆయన విధవరాలైన కూతురూ మరో ఇద్దరు శిష్యులూ మాత్రం ఉంటారు.వైద్యుడు వచ్చి చూసి ఏమీ చెప్పకుండానే వెళ్లి పోతాడు.మరి కొద్ది సేపటికే సూరి గారు కన్ను మూస్తారు. నక్షత్రం మంచిది కాదని సూరి పార్థివ దేహాన్ని ఇంటి బయట అరుగు మీదకి చేరుస్తారు.అక్కడ చేరిన వారెవరూ పెద్దగా విలపించినట్లు తోచదు. వారిలో వారు మాట్లాడుకుంటూ ఉండగా మూర్తి అనే ఆయన సూరి గట్టివాడే కాని పాఠాలు చెప్పేటప్పుడు అరసున్నల గురించి బండిరాల గురించి తమను కాల్చుకు తినే వాడని ఒక ఉదాహరణ చెబుతాడు. చెరువులో ఏ “ర” ఉందని ఆయన అడిగి ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చేప్ప లేక పోగా ఓ కుర్రాడు బండరాయుంటుందని అన్నాడుట. సూరిగారు శాబాసని వాడిని మెచ్చుకున్నారుట. ఆ అబ్బాయి అన్నది బండి’ఱా’యని కాదని బండరాయని పిల్లలందరూ గోల చేసారట. సూరి మరణించాక అందరూ “కతిపయ దివసములు గతించిన యనంతరంబ” అని కృతకంగా కాకుండా “కొన్నాళ్లు గడిచేక” అని అందరికీ అర్థమయేలాగ వ్రాసుకుంటారన్నమాట అనుకుంటారు. అక్కడ చేరిన వారు ఇటువంటి సరదా మాటలాడుకుంటూ సూరి మరణించిన రోజు నిజంగా తెలుగు జాతికి శుభ దినమని అందుచేత తామేదైనా చిరకాలం గుర్తుండి పోయే కార్యక్రమమేదైనా చేయాలని నిశ్చయించుకుంటారు .నాలుగో రంగంలో వారి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది. వారిలో ఒకరైన రావుగారి ఇంటివద్ద బండి రా ఆకారంలో ఒక పల్లకీని ఏర్పాటు చేసి దానిలో సూరి ఆకారం గల బొమ్మనోకదానిని తయారు చేసి తీసుకు వచ్చి దానిలో పడుక్కోబెడతారు.అది అసలు సూరిగారు కాదు కదా? అన్నవారితో అది సూరిగారి రూపాంతరమనీ రూపాంతరాలు సూరిగారి వ్యాకరణ సమ్మతమేననీ సమర్థించుకుంటారు. ఆ పల్లకీ బండిఱా ఆకారంలో (బొమ్మ చూడండి)తయారు చేయబడి ఉంటుంది.దానికి వారు శకట రేఫ పల్యంకిక అనీ అర్థాను స్వారాల అనంత శయనం అనీ ముద్దు పేర్లు పెట్టుకుంటారు. పల్లకీ బండిరా రూపంలో ఉండడమే కాదు దానికి మీదని చంద్ర వంకల వంటివి తగిలించి ఉంచారు. అవి అర్థాను స్వారాలట.కర్ర మీదనున్న కట్లు నుగాగమాలూ టుగాగమాలూ అనీ ముందున్నవి ఆదేశాలనీ వెనకున్నవి ఆగమాలనీ అంతా వ్యాకరణ పరిభాషలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.

“సూరి మరణము చూడగా రండి జనులార మీరు

దారి పొడుగున వేడ్క చూడండి||

సూరి మరణముతోనె బంధాల్ పారిపోయె, వ్రాత కోతలు

 తేరుకుని దేశానికున్నతి తెచ్చు నిశ్చయమింక మీదట ||సూరి|| 

అని పాడుకుంటూ భజన చేసుకుంటూ పల్లకీని ఊరేగిస్తూ ముందుకు సాగుతారు.

ఇదీ బండిరా పల్లకీ కథ.ఈ బండి రా లేక శకటరేఫ తెలుగు రచనల్లో ఎప్పుడో కనిపించకుండా పోయింది.మన తెలుగు పెద్ద బాల శిక్ష గ్రంథంలో అక్షర మాలలో ఈ శకటరేఫ (బండిరా) ఉండదు చూడండి. కొంత మంది ఇంకా ఛాందసంగా దాన్నివారి రచనల్ల ప్రయోగిస్తూ ఉండవచ్చు. తప్పేమీ లేదు.అది వారి ఇష్టం. కాని మనం గుర్తించ వలసిన విషయం ఏమిటంటే ‘ర’ ‘ఱ’ ల ఉచ్చారణలో భేదం తగ్గిపోయింది .ఆ రోజుల్లోనే శకటరేఫా నిర్ణయ కుఠారము వంటి గ్రంథాలు వెలుడ్డాయంటే వాటి సరైన నిర్ణయం తెలియక ఎన్ని తర్జన భర్జనలు జరిగాయో తెలుస్తుంది. కొందరిప్పటికీ అనవచ్చు కొన్ని పదాల్లో రేఫ ఉంటే ఒక అర్థం శకట రేఫ ఉంటే ఇంకొక అర్థం వస్తాయని అందువల్ల అది కొన సాగ వలసిందేనని.ఈ బండిరా అరసున్నల నిష్ప్రయోజకత్వం గురించి విపులంగా మరో పోస్టులో వ్రాస్తాను. సెలవు.

కామెంట్‌లు లేవు: