9, ఆగస్టు 2024, శుక్రవారం

దేవాలయాలు - పూజలు 5*.

 *దేవాలయాలు - పూజలు 5*.


గత వ్యాసంలో పూజల ఉద్దేశ్యము మరియు అతరార్థం తెలుసుకున్నాము. భక్తులు దేవాలయం వెళ్లేలోపు అర్చక స్వాములు దేవాలయ పూజాచరణలో ఉంటారు. దేవాలయాలలో భగవంతుడికి తొలి మేలుకొలుపు ఆహ్వానం, సుప్రభాతం మరియు తదితర కార్యక్రమాల ప్రారంభం, కొనసాగింపు, ఆ దేవాలయంలో నియమింప బడిన అర్చక స్వాముల విద్యుక్తధర్మము. 


అర్చక స్వాముల గురించి కొంత అవగాహన కల్గి ఉందాము. దేవాలయాలలో ఆగమ శాస్త్రానుసారము మంత్రాలు, వేద మంత్రాలు పఠించడానికి మంత్రానుష్ఠానం చేయడానికి నిర్దిష్టమైన అర్హతలుండాలన్నది శాస్త్ర నియమము. అర్చక స్వాములు నియమ, నిష్ఠలతో తమ గురువుల ఉపదేశము ప్రకారమే పూజాదికాల నిర్వహణ అభ్యసించి ఉంటారు. *సాధకులకు మాత్రమే ఇది సాధ్యము*. 


బ్రాహ్మణ అర్చక స్వాముల ప్రాశస్త్యమును దిగువ చూపిన శ్రీ కృష్ణ వచనంలో చెప్పబడినది, గమనిద్దాము. 


*శ్లో! దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రహ్మణో మమ దేవతా*.

అర్థం:- ఈ జగత్తు మొత్తం దైవం ఆధీనంలో ఉంటుంది. ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది మంత్రముల ఆధీనంలో ఉంటారు. ఆ మంత్రములు శుద్ధ సాత్విక లక్షణములు గల బ్రాహ్మణుల అధీనంలో ఉంటాయి. అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపాలని గ్రహించాలి, *అర్చకోహరిఃసాక్షాత్* అని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. వారిని గౌరవించాలి. వేద మంత్రముల నెరిగిన బ్రాహ్మణులు భక్తులకు దైవ సమానులు. హైందవ ధర్మాలను అనుసరించే ప్రతి మానవుడు, తన జీవిత కాలంలో తప్పనిసరిగా బ్రాహ్మణుల సహకారంతో ఆచరించే కార్యక్రమాలు... *పూజాదికాలు, వివాహాది శుభకార్యాలు, షోడషకర్మలు*. ఈ కార్యక్రమాలన్ని మంత్ర యుక్తంగా, శాస్త్ర విహితంగా ఆచరింప జేయడానికి వేద మంత్ర దృష్టలైన బ్రాహ్మణుల ఆవశ్యకత అనివార్యము. *అందరు బ్రాహ్మణులు వందనీయులే*.


*మాన్యులకు విజ్ఞప్తి* 

*దేవాలయములు - పూజలు* అను విషయంపై ధారావాహిక రచనా వ్యాసంగము బహు సున్నితమే గాక బహు విస్తృతము, క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు.... ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ప్రమాణాలు కూడా జరపర్చిన చదువరులకు మరింత జ్ఞాన దాయకంగా ఉంటుంది.


ధన్యవాదములు.

*(సశేషము)*

కామెంట్‌లు లేవు: