4, జులై 2020, శనివారం

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర

                                                                      శ్రీ గణేశాయ నమః

 శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం
 ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయేత్


 వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
 నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!


 శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-1


ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది?

శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి.

అంతట సూతులవారు – మునులారా!

భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును

తన  భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు.

అనగా విని శౌనకాదులు మహానుభావా

ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము,
 ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి.

అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను,

 కాని మీరు ఆసక్తితో భక్తిశ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన యేవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను.

 అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను. అనంతరము శౌనకాది మహర్షులతో యిట్లు చెప్పసాగినారు.

మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మఱి యెవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడువారిని ఒక చూపు చూసి గర్వపు కోరలనుతీసి వినోదించు స్వభావము కలవాడు.

నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ యెచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును.

నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.

ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు.

పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణ పై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది.

ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.

అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుననుగ్రహించి దీవించినారు.

నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా!

 అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది.

అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను –

 కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు. లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు.

నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమన...

మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి యిష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు.

తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట యివి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి.

ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము యీ సర్వలోకము లకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే.

పైగా యీ కలియుగమందు శ్రీమహావిష్ణువుయొక్క అవతారము లేకపోయెను. కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి యెట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను.

దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను.

 సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తానా పనిని చేయబూనుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.

కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు.
 యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను
 క్రతువు దేనికొరకు చేస్తున్నారు,
యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని

ప్రశ్నను వదలి నారదుడు వెడలిపోగా వారలు చర్చించుకొనసాగిరి.

కొందరు మునులు ‘‘బ్రహ్మ గొప్పవాడని కొందరు ‘‘కాదు విష్ణువే గొప్పవా’’డనిరి. మరికొందరు ‘కాదు’ శంకరుడు గొప్పవాడనిరి.

 తుదకు ఆయన గొప్పవారు, ఈయన గొప్పవారని అనుట నుండి ఈయన తక్కువవారు ఆయన తక్కువవారని అనుటవరకు దిగినది. చిలికి చిలికి గాలివాన అయినది.

వాదోపవాదములు పెచ్చు పెరిగినవి. ఇవి వినిన కొందరు పెద్దలు ‘‘ఋషులారా! న్యాయా న్యాయములు, ధర్మసూక్ష్మములు, నీతి సూత్రములు ప్రకటించు అర్హత గలిగిన మీరు ఈ విధముగ తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పని మరచుట న్యాయమా? నారదుడు విజ్ఞాన సంపన్నుడు, ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెడలినాడు.

మనము కార్యశూరులమయి సమస్యను పరిష్కరించు మార్గమును కనుగొనవలెనే కాని వ్యర్ధ వాదోపవాదములు కిది తగిన కాలము కాదు గదా అనిరి.

‘‘సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములందున సత్త్వగుణమే మహోన్నతము కదా! అందువలన త్రిమూర్తులలో సత్త్వ గుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము.

మునులారా! మీ యందరి యందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవ్వరో యాతనిని ఎంపిక చేసి పంపుడు, అందువలన మన సందేహము తీరుట జరుగును’’ అని కూడ ప్రవచించిరి.

మునులు దాని కంగీకరించినారు. కాని అది కత్తి పై సాము వంటిది అని వారికి తెలియకపోలేదు.

సరే ఎవ్వరిని పంపిన బాగుండునని బాగుగా యోచించసాగిరి మునీశ్వరులు, అంతలో కొంతమంది మన మునులలో ఘనుడగువాడు ఒక్క భృగువు మాత్రమే, అతడు మహా తపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు.


ఆయన మాత్రమే ఈ మహా కార్యమును నిర్వహించుటకు సమర్ధుడు అని వారు పలికినారు

ఇది అంతయు శ్రద్ధతో ఆలకించు చున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి ,విష్ణుస్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయ వలసినదిగా కోరినారు

దానికి సూతమహర్షి చిరు మందహాసముతో ఆ వృత్తాంత మంతయు తెలియజేయుటకు సంకల్పించినారు


 శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా,
 భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; |

 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం

కామెంట్‌లు లేవు: