7, సెప్టెంబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 13


                                       ***
            శ్లో:- జీర్యంతే  జీర్యతః  కేశా: ౹
                   దంతాః  జీర్యంతి జీర్యతః ౹
                   జీర్యతః  చక్షుషీ  శ్రోత్రే ౹
                   తృష్ణా ఏకా తరుణాయతే౹౹
                                       ***
భా:- మనిషి శైశవ, బాల్య,కౌమార, యౌవన దశలను  జవ సత్త్వాల జోరులో  సంతోషంగా  గడిపి, వృద్ధాప్యంలోకి రాగానే, మనప్రమేయం లేకుండానే క్రమంగా శిరోజాలు  తెల్లబడి,   రాలిపోతుంటాయి.  కొన్ని టన్నుల ఆహారాన్ని నమలడంలో అలసి, సొలసిన దంతాలు  ఊడిపోతుంటాయి. సమస్త ఇంద్రియాలలో తలమానికమై, ప్రకృతి రామణీయకతని పసందైన విందుగా అందించి, జీవితానికే చుక్కాని యైన  "కళ్ళు" కనబడని పరిస్థితి దాపురిస్తుంది. ఇష్టమైనా, కష్టమైనా పంఖానుపుంఖాలుగా ఎన్నో విషయాలు విని, విని    "చెవులు" వినబడకుండా పోతాయి. కాని మనం పుట్టగానే మనతో పుట్టిన "ఆశ" మాత్రము కరగని, తరగని  నిత్య నూతన యౌవనంతో  మిసమిసలాడుతున్నది. కాన బాల్యంలో భక్తిబీజాలను అంకురింపజేసుకొని, కౌమారంలో బలపరచుకొని, యౌవనంలో స్థిరపరచుకొని,   పలు క్షేత్రాలు, తీర్ధాలు దర్శించి, ముదిమిలో  ఆశలను విడనాడాలి. జీవన్ముక్తికి సాధన చేయాలి. పోతన గారు సెలవిచ్చినట్లు "అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తు"లమై నిరంతరం ఆధ్యాత్మిక పథంలో నడవగలగాలని సారాంశము.
                                    ***
                     సమర్పణ  :  పీసపాటి
**********************

కామెంట్‌లు లేవు: