నిత్య జీవితంలోని ప్రతీపనిని ఆచారంగా సనాతన సంప్రదాయంలో నిర్దేశించారు. దాన్ని ఒక మతంలా కాకుండా జీవనవిధానంగా ఉండేట్లుగా ఆచరింపజేశారు. కొన్నింటిని ప్రకృతి పరంగా.. మరికొన్నింటిని శాస్ర్తీయకోణంలో.. ఇంకొన్నింటిని పౌరాణిక దృక్కోణంతో.. ఖగోళ దృష్టితో చూడవచ్చు. ఇవన్నీ ఎవరూ కదల్చలేనంతగా మన మనస్సుల్లో నాటుకుపోయాయి. వాటిని ఒక ఆచారంగా పరిగణిస్తూ కాకుండా.. అంతరార్థం తెలుసుకుని పాటించడం ద్వారా.. సత్యం దిశగా వెళ్లేందుకు దోహదపడుతుంది.
మనం ఏ పని ప్రారంభించినా తొలుత గణపతిని పూజిస్తాం. ఆ గణేశుడు గణాలకు అధిపతి. మూలానికి లేదా ఆధారానికి ఆది దైవం. యోగ శాస్త్రం ప్రకారం గణపతి మూలాధార చక్రానికి అధిపతి. ఆధారమన్నా, మూలమన్నా ఒక్కటే. ఏ పనికైనా మూలం.. అంటే.. ఏదో ఒక కారణం; దాని కోసం ఏదో ఒక ఆధారం లేకుంటే అది జరగదు. కాబట్టి మూల-ఆధార అనే రెండు శబ్దాలు గణపతి ఏ పనికైనా ప్రథమ పూజర్హత గలవాడని సూచిస్తాయి. ఏది ఆధారమో అది మొదట పట్టుకొవాలన్నది అంతరార్థం.
అలాగే మన పూర్వికులు జుట్టు-బొట్టుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు జుట్టు పరుషుల్లో అంత ప్రాధాన్యం లేకున్నా.. ముత్తయిదవులకు పాపెట ఒక ముఖ్య నియమం. గర్భిణీ స్ర్తీలకు మూడో నెలలో జరిగే ఒక చిన్నపాటి ఉత్సవంలో భర్త భార్యకు పాపెట తీస్తాడు. సీమంతంలో.. సీమ అనగా ఎల్ల లేదా పొలిమేర. అప్పుడే ఈ పాపెట ప్రాధాన్యతను మరోసారి గుర్తించవచ్చు. పాపెటకు నడినెత్తిన బ్రహ్మరంధ్రానికి దగ్గరి సంబంధం ఉంది. స్ర్తీలకు పాపెట ఎక్కడ ఆగుతుందో అక్కడి నుండి శిఖ అనగా జుట్టు ప్రారంభమయ్యేది.
పూర్వం కులాలకు అతీతంగా పురుషులంతా అర్ధముండ శిరస్కలే. తలపై గల ఈ సీమాంతం అనగా శిఖ స్థానాన్ని బ్రహ్మరంధ్ర స్థానం అంటారు. అది శరీరానికి దశమ ద్వారం. శరీరంలోకి జీవుడు అక్కడి నుంచే ప్రవేశిస్తాడు కాబట్టి మళ్లీ అక్కడి నుండే వెళ్లాలి. యోగులు తమ యోగ సాధనతో అలా కపాలాన్ని ఛేదించుకొని దేహ త్యాగం చేస్తారు. ఈ బ్రహ్మరంధ్ర స్థానం ప్రధాన ఆయువుపట్టు స్థానం. అక్కడ దెబ్బ తగిలితే సద్యోమరణం సంభవిస్తుంది. కాబట్టి భౌతిక ప్రయోజనంగా శిఖను పెట్టారు.
అలాగే వైదిక కర్మల్లో శిఖ ప్రాధాన్యం చాలా ఉంది. దేవాలయానికి ధ్వజ స్తంభంలా, ధ్యాన శరీరానికి ఆధ్యాత్మిక ప్రపంచతో సంబంధం కలిపేది శిఖ. అలాగే భ్రూమధ్య స్థానంలో ధరించే బొట్టు- కుంకుమ, గోరోచనం, కేసరి, కస్తూరి, భస్మం, విభూతి, గంధం, గోపీచందనం.. ఏదైనా ఏ సంప్రదాయం ప్రకారం ధరించినా ముఖానికి అందాన్ని కలిగిస్తుంది. ఆ బొట్టు ధరించే స్థలం ఆజ్ఞా చక్రస్థానం. దీనికి త్రివేణి సంగమం, త్రికూట స్థానం అని పేర్లున్నాయి.
జాగ్రదవస్థలో దేహంలోని జీవుడు ఆజ్ఞా చక్రస్థానంలోనే ఉంటాడు. జీవుని రంగు ఎరుపు. అందుకే ఇక్కడ కుంకుమ ధరించాలనే అంతరార్థం ఉంది. ఉదాహరణకు శివుడు భస్మ స్వరూపుడు. బ్రహ్మ రాసిన రాత నుదిటిపై ఉంటుంది అంటారు. దీనిని కన్పించకుండా చేయగల శక్తి శివతత్వానికి ఉంటుందని, అలాగే ఊర్ధ్వ పుండ్రాలు మనం పొందాల్సిన ఊర్ధ్వగతిని సూచించే సంకేతాలు. ఇలా ప్రతీ సంప్రదాయంలో ఎన్నో సంకేతాలు, అంతరార్థాలున్నా.. వాటిని ఆచరించే విషయాలుగా మనకు అందించారు ఋషులు. వాటి వెనుక ఉన్న నిగూఢార్థాన్ని గ్రహించి.. ఆచరిస్తే అదే పరమానందం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి