7, సెప్టెంబర్ 2020, సోమవారం

సాహిత్యంలో 'పకోడీ'


కాసింత సెనగ పిండి,నాలుగు వులిపాయలు,కొన్ని
పచ్చిమిరపకాయలు,ఉప్పు కలిపి నూనెలో వేయిస్తే వేడి వేడి పకోడీ
తయార్!వొహ్ నూరూరిపోతూంది కదూ!ఆ అమోఘమైన పకోడీని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు యిలా పొగిడేశారు.
.
వనిత పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదన
కనుగొన నీ యందమృతము గలదు పకోడీ!

ఆడవారి మాటల్లో అమృత ముందని అంటారు గానీ చల్లని వేళ పకోడీ తింటుంటే ఆ మజాయే వేరు.పకోడీలోనూ
అమృతముందని జనం గుర్తించరెందు కనీ?అని చిలకమర్తి వారు ప్రశ్నిస్తున్నారు.
ఆయన పకోడీ అభిమానం యింకోచోట ఎలా దర్శన మిస్తూందంటే

ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమ ఘుమను యా
పొంకములా రాకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండి వంటలెల్లను హా!నీ
ముందర దిగదుడుపునకవి
యందును సందియము కలుగదరయ పకోడీ!

ఎందుకు పరమాన్నాలు,పిండివంటలన్నీ నీ ముందు దిగ దుడుపే గదా!అంటూ ఆకాశానికి ఎత్తేశారు
.
ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చెమును సంజీవిన్
మారుతి యెరుగడుగాక య
య్యారే నిను గొనిన బ్రతుక దటవె పకోడీ!
రామ రావణ యుద్ధము లో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు మారుతి సంజీవి పర్వతాన్ని తెచ్చాడు కానీ పకోడీ నిన్ను
తీసుకెళ్ళినా లక్ష్మణుడు స్పృహలోకి వచ్చేవాడన్న సంగతి తెలియదు పాపం.
ఇంకా  ఆయన పకోడీ ప్రియత్వాన్ని చూడండి.

పురహరుడు నిన్ను దిను నెడ
కరుగదె యొక వన్నె నలుపు గళమున మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్ళు యుండగలదె పకోడీ!
పరమేశ్వరుడు కాలకూట విషాన్ని మింగడం తో కంఠము నలుపెక్కినది అది పోయెందుకూ,చంద్రునిలో మచ్చలు
పోయేందుకు నిన్ను తింటే బాగుండే దేమో.

కోడికి బదులు పకోడీ తిని సరిపెట్టుకోమని శాకాహారులకు సలహా కూడా యిచ్చారు.
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును శాకాహార్లు వేదన పడుచున్
కోడి వలదా,బదులుగ ప
కోడిం దిను మనుచు జెప్పె కూర్మి పకోడీ

చిలకమర్తి ఒకరేనా పకోడీ యిష్టపడేవాడుమాకూ యిష్టమే పకోడీ అంటే మేమూ ఏమీ తక్కువ తినలేదు అంటూ తిరుపతి వెంకట కవులు రంగం లోకి దిగారు.ఓ శతావధానం లో పకోడీ మీద పద్యం చెప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కర కర లాడు కొంచెమగుకారము గల్గు బలాండు వాసనా
హరమగు గొత్తిమీరయును,నల్లము గన్పడు నచ్చటచ్చట
ధరను బకోడి బోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞులా
దరమునబల్కు చుందురదితా దృశమే యగునంచు దోచేడిన్

కొంచెం కారం,కొంచెం అల్లం వేసి కర కర లాడే పకోడీ ని తింటే భలే వుంటుందట.అయినా తెలుగు వాళ్లకు
పకోడీ రుచిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యాలా ఏంటి?గట్టి పకోడీ అయినా మెత్త పకోడీ అయినా వాయి దిగిందో లేదోక్షణాల్లో తిరిగి 'వాయి'(నోరు)లోకి ఎక్కేస్తుంది గదా!
**************************

కామెంట్‌లు లేవు: