7, సెప్టెంబర్ 2020, సోమవారం

అరటి ఆకులు - ప్లాస్టిక్ పోట్లాలు


కాంచి మహాస్వామి వారు 1960లో తిరుచ్చి నేషనల్ కాలేజ్ హైస్కూలులో మకాం చేస్తున్నారు. స్వామివారి అనుగ్రహం కోసం ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చినవారందరికీ మంచి రుచి అయిన భోజనం పెడుతున్నారు.

ఉదయం పదకొండు గంటలకు మొదలయ్యే ఈ అన్నదానం సాయంత్రం నాలుగ్గంటల వరకూ జరిగేది. ఏర్పాట్లు చేసే బృందం సభ్యులు ఈ భక్తుల తాకిడిని నియంత్రించడానికి, భోజనాలు అయ్యాక వారిని పంపడానికి చాలా తంటాలు పడుతున్నారు.

వారి సమస్యను స్వామివారికి చెప్పి, భోజనానికి వచ్చే భక్తులకు పంక్తి భోజనం కాకుండా ఆహార పోట్లాలను ఇచ్చే విషయమై స్వామివారికి తెలిపారు.

పరమాచార్య స్వామివారు ఆ కమిటీ సభ్యులను ముందర కూర్చొబెట్టుకుని రెండు ప్రశ్నలను అడిగారు.

మొదటిది: ఆహార పోట్లాలోని పదార్థాన్ని తిన్న తరువాత ఆ అరటి ఆకులను వారు ఎక్కడ పడవేస్తారు?

రెండవది: దాహాన్ని తీర్చుకోవడానికి గ్లాసు నీళ్ళకోసం వారు ఎక్కడకు వెళతారు?
స్వామివారు ముందర కూర్చున్నవారు ఎవ్వరూ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు.

వారి మౌనాన్ని గమనించి స్వామివారే చెప్పారు, “ఖర్చును, పని ఒత్తిడిని తగ్గించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. ఆకలిగా ఉన్నవాడు మాత్రమే మొదటి బంతిలో కూర్చోవాలని చూస్తాడు. ఇతరులు చివరి బంతిలో కూర్చుంటారు”

“నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్లినప్పుడు, భోజనం తరువాత ఆ అరటి ఆకులను ఒక తొట్టెలో పడవేస్తారు. నేను చూశాను ఆ ఆకులలో మిగిలిపోయిన పదార్థాలను నారికురవలు సేకరిస్తారు. మరియు ఆ ఆకులకు అంటుకున్న ఆహార పదార్థాలను ఆవులు తింటాయి. మీరు గమనించండి, ఆకులు వేసి భోజనం పెట్టడం వల్ల ఎందరో ఇతరుల ఆకలి కూడా తీరుతోంది”.

“ఆహార పోట్లాలను తయారుచెయ్యాలన్న మీ ఆలోచనను విరమించుకొని, అందరికీ అరటి ఆకులు వేసి భోజనం పెట్టండి. ఇంతమంది ప్రజలు ఆహారం స్వీకరించడాన్ని చూడటం, దానికోసం ఖర్చు పెట్టుకోవడం కూడా మీకు పుణ్యం. నాకు ఆనందం కూడా”

అన్న సమారాధనలు చెయ్యడం చూశాము కానీ, దానియొక్క గొప్పదనాన్ని ఇటువంటి మహాత్ములు చెప్పిన తరువాతనే అర్థం చేసుకున్నాము.

--- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ ఆగస్ట్ 15, 2004 ప్రచురణ

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: