28, అక్టోబర్ 2020, బుధవారం

సంయమనం

 *సంయమనం*


తాటక వధ అనంతరం రాముడికి విశ్వామిత్రుడు అస్త్రవిద్యను ఉపదేశించాడు. విశ్వామిత్రుడి ఉపదేశం ధనుర్వేదానికి సంబంధించినది. అది ఉపవేదం. రుగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం ఉపవేదాలు. ధనుర్వేదానికి అధిదేవత రుద్రుడు. ఆయన నుంచి క్రమంగా ఆ విద్య విశ్వామిత్రుడికి సంక్రమించింది. ఈశానసంహిత పేరుతో అది ఈ లోకానికి అందింది. పరశురాముడి ద్వారా వ్యాప్తిలోకి వచ్చిన భాగం ‘శాండిల్య భాష్యం’. త్రేతాయుగంలో ఈశాన సంహిత, ద్వాపరం(భారతకాలం)లో  ప్రాచుర్యాన్ని పొందాయి. తాటకను రాముడు సంహరించింది శస్త్రంతో. శస్త్రమంటే బాణం మాదిరి ఆయుధం. దాన్ని ఏదైనా మంత్రంతో అనుసంధానిస్తే అది అస్త్రం అవుతుంది. రాముడు శస్త్ర, అస్త్ర విద్యాకోవిదుడు. గడ్డిపరకను అస్త్రంగా అభిమంత్రించగల జగదేక ధానుష్కుడు.


ఐంద్రం, శైవాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణం, గాంధర్వం, మానసం వంటి ఎన్నో రకాల అస్త్ర మంత్రాలను విశ్వామిత్రుడు ఉపదేశించినా- రాముడు సంతృప్తి చెందలేదు. వాటి ఉపసంహార విద్యనూ తనకు ప్రసాదించమని అభ్యర్థించాడు. అస్త్రవిద్యలో సంధానం, ప్రయోగం, ఉపసంహారమనే మూడు దశలుంటాయి. సాధారణ విలుకాడైతే మొదటి రెండింటితోనే సంతృప్తి పడిపోతాడు. కానీ రాముడు సంపూర్ణ ధనుర్విద్యావేత్త. ప్రత్యర్థి తనపైకి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే, దానికి  ప్రతిగా దేన్ని ప్రయోగించాలో ధనుర్వేత్తకు తెలియాలి. అంతేకాదు, అవసరమైతే తాను ప్రయోగించిన అస్త్రాన్ని వెనక్కి రప్పించడం తెలియాలి. ఉపసంహారం తెలియకుండా అస్త్రప్రయోగం చేయడం ఉత్తమ విలువిద్యావేత్త లక్షణం కాదు. ఈ మాట అన్ని విద్యలకు, అన్ని శాస్త్రాలకు వర్తిస్తుంది.

అణుబాంబులాంటి వాటిని తయారు చేయడం, ప్రయోగించడం రెండే తెలిస్తే, వాటివల్ల జరిగే విధ్వంసాన్ని నిరోధించడం అసాధ్యం అవుతుంది. ఒక మందును కనుగొని లోకానికి పరిచయం చేసేటప్పుడు- ముందుగా దాని వాడకంవల్ల వచ్చే చెడు పరిణామాలను సైతం క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ఉపసంహార విద్యలూ  అలాంటివే.  ఆయుర్వేద మందులు కొన్నింటిని తేనెతోనో, పంచదారతోనో తీసుకొ మ్మంటారు. దాన్నే ‘అనుపానం’గా చెబుతారు. అనుపానం వల్ల ఔషధాల దుష్ప్రభావాలను అరికట్టే వీలుంటుంది.

ఉపసంహారం నేర్చుకోకుండానే అస్త్రవిద్యను దుర్వినియోగం చేసిన ఆవేశపరుడు అశ్వత్థామ. పాండవ వంశం నాశనం కావాలని సంకల్పించి, బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ఫలితం అనుభవించాడు.

రామాయణంలో రాముడు, భారతంలో అర్జునుడు... ఇద్దరే సంపూర్ణ విలువిద్యావేత్తలుగా గుర్తింపు పొందారంటే- వారిద్దరికీ అనుసంధాన, ప్రయోగ, ఉపసంహార విద్యలు పూర్తిగా పట్టుపడటమే కారణం.

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దుర్యోధనుడు ‘ఏడు అక్షౌహిణుల పాండవ సైన్యాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే మీకు ఎన్నిరోజులు పడుతుంది’ అని భీష్ముణ్ని అడిగాడు. పదిరోజులు కావాలన్నాడు ఆయన. తనకూ అంతేనన్నాడు ద్రోణాచార్యుడు. ఈ విషయం తెలిసి ధర్మరాజు పదకొండు అక్షౌహిణుల కురుమహా సైన్యాన్ని మట్టి కరిపించాలంటే ఎన్నాళ్లు పడుతుందని అర్జునుణ్ని ప్రశ్నించాడు. ‘ఒక్క క్షణం చాలు’ అన్నాడు అర్జునుడు. ‘అన్నయ్యా! పరమశివుణ్ని మెప్పించి సాధించిన పాశుపతం ప్రయోగిస్తే అటు పదకొండు, ఇటు ఏడు మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం క్షణంలో బూడిదైపోతుంది. అందుకే పరమశివుడు దాన్ని మానవులపై  ప్రయోగించవద్దని ఆదేశించాడు’ అన్నాడు. అనడమే కాదు, శివుడి ఆజ్ఞను శిరసావహించాడు. నాడు సంయమనం వహించగలవారే సిసలైన యోధులనిపించుకున్నారు. నేడు సామాన్య మానవులూ అటువంటి లక్షణం అలవరచుకోవడం ఎంతో అవసరం

✍ఎర్రాప్రగడ రామకృష్ణ

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828*

కామెంట్‌లు లేవు: