28, అక్టోబర్ 2020, బుధవారం

చాలా చాలా ప్రేమించి ఉంటారు.

 ఇప్పటిదాకా బంగారాన్ని ఆస్తుల్నీ హోదాల్నీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని ....ఇంకా వేటి వేటినో చాలా చాలా ప్రేమించి ఉంటారు....ఆ ప్రేమతోనే ఒక్కసారి కన్నయ్యను ప్రేమించి చూడండి..ఇంకా దేన్ని ప్రేమించాల్సిన అవసరం బహుశా రాదేమో, ఆ సుందర మోహనకారుడి అద్వీతీయ మనోహర అనుపమాన రూపలవణ్యాలను మనోనేత్రాలతో మీ హృదయ వాకిట ప్రతిష్ట చేసుకోండి,ఇంకా దేనిని ద్వేషించాల్సిన అవసరం మునుముందెన్నడూ మీకు కలగకపోవచ్చు..ఉట్టిమీద పాలమీగడలు దొంగిలించిన  ఆ అమాయక మానస చోరుడిని మీ మనసులోకి ఆవాహన చేసుకొండొక్కసారీ...అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతం ఎత్తి పట్టుకున్న ఆ పరందాముడి లీలా వినోదాలను చేతులు జోడించి కృష్ణా... కృష్ణా....అని ప్రేమతో మీ కంటిలో నిలుపుకోండి, ఆ కంటిలో ఆనంద భాష్పాలే తప్ప విచారాలు నేలారాలవు...   

ఆ కృష్ణ ప్రేమప్రవాహంలో గోపికలై తరించిండి, కాళింది కదిలినప్పుడు తకదిమి తకదిమి అంటూ నాట్యం చేయడానికి,ఆ విషపునాగులను పారద్రోలాడానికి మీ చెంత వేణుగానాన్ని అలపిస్తూ ఉంటాడు,కానీ నువ్వే గుర్తించట్లేదు....పసిబాలుడు,అందునా ముద్దుగారే యశోదాతనయడు,దేవకినందనుడు...కోటి సూర్యకాంతి ప్రభలతో వెలిగే ఆ ముద్దుమోమును తుదముట్టించడానికి ఎన్ని పన్నగాలు పన్నారు,బకాసురుడు తృణావర్తుడు శకాటసురుడు కంసచాణురాది రక్కసులు...అయినా ఆ తుంటరి కిట్టడు ఆసురులను పావులుగా చేసుకుని హాయిగా చందరంగం ఆడేసుకున్నాడు...ఆ ధైర్యాన్ని ఆ 

గుండెబలాన్ని కన్నయ్య రూపాన ఆవాహన చేసుకుని సమస్యలకై మనం పోరాటం చేద్దాం..కన్నయ్య మన జీవితాల్లోకొస్తే ద్వేషం అనే పదం మనం ఉపయోగించాల్సిన అవసరం ఉండదేమో...అంతా కృష్ణమయమే అవుతుంది, ప్రేమమయమే అవుతుంది.... ఆ కన్నయ్యే మన సమస్యలకు గీతాచార్యుడు, ఆ కన్నయ్యే మన నుదుటి నొసల గీతలు మార్చే గీతాగోవిందుడు.....ఆ కన్నయ్య పాదాలు పట్టుకుందాము, ఇంకా దేనిని పట్టుకోవాల్సిన అవసరం మనకు జన్మలో రాదు...కృష్ణా నీ ప్రేమ బృందావన ధూళినైనా మామీద కురియించు...ఆ మధూళి ధూళిలో నిర్జరులమై నీ చెంత సేదతీరుతాము కన్నయ్య.... అవకాశమివ్వు......

కామెంట్‌లు లేవు: