*భాగవతామృతం*
ధృతరాష్ట్రాదులనిర్గమనంబు
1-317-వ.వచనము
అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తిమార్గం బుపదేశించిన, నతండు ప్రజ్ఞాచక్షుండై, సంసారంబు దిగనాడి, మోహపాశంబు వలన నూడి విజ్ఞానమార్గంబునం గూడి దుర్గమం బగు హిమవన్నగంబునకు నిర్గమించిన.
అని = అని; విదురుండు = విదురుడు; ధృతరాష్ట్రున = ధృతరాష్ట్రున; కు = కు; విరక్తి = విరక్తి {విరక్తి - దేని అందు తగులము లేకపోవుట}; మార్గంబు = పద్దతిని; ఉపదేశించిన = తెలియజేసిన; అతండు = అతడు; ప్రజ్ఞా = జ్ఞానముతో కూడుకొన్న; చక్షుండు = దృష్టి కలవాడు; ఐ = అయి; సంసారంబు = సంసార బంధములను; దిగనాడి = విడిచిపెట్టి; మోహ = భ్రాంతితో కూడిన; పాశంబు = పాశముల; వలనన్ = నుండి; ఊడి = విడివడి; విజ్ఞాన = జ్ఞానయోగ; మార్గంబునన్ = పద్దతితో; కూడి = కలసి; దుర్గమంబు = దాటుటకు చాల కష్టమైనది; అగు = అయిన; హిమవన్నగంబు = హిమాలయము; కున్ = కు; నిర్గమించిన = బయలుదేరిన.
ఈ విధంగా విదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. ఆ ప్రబోధంతో కురురాజు జ్ఞాననేత్రం విప్పారింది. అతడు సంసార సౌఖ్యాలను విసర్జించి, మోహ బంధాలను త్రెంచి, జ్ఞాన మార్గాన్ని అవలంబించి, దురంతాలైన హిమవత్పర్వత ప్రాంతాలకు ప్రయాణం సాగించాడు.
1-318-శా.శార్దూల విక్రీడితము
అంధుండైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ
బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమప్రఖ్యాతయై యున్న త
ద్గాంధారక్షితినాథుకూఁతురును యోగప్రీతి చిత్తంబులో
సంధిల్లం బతివెంట నేఁగె, నుదయత్సాధ్వీగుణారూఢయై.
అంధుండు = గ్రుడ్డివాడు; ఐన = అయినట్టి; పతిన్ = భర్తను; వరించి = ప్రేమించి; పతి = పతి యొక్క; భావా = స్థితిని అనుసరించు; ఆసక్తి = ఇష్టపూర్వక నిర్ణయముతో; నేత్ర = కన్నులు; ద్వయీ = రెంటికిని; బంధ = కట్టుటవలన; ఆచ్ఛాదనమున్ = కప్పియుంచునది; ధరించి = కట్టుకొనిన; నియమ = నియమము కలిగి ఉండుట లో; ప్రఖ్యాత = కీర్తి పొందినది; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; తత్ = ఆ; గాంధార క్షితి నాథు కూఁతురును = గాంధారి కూడ {గాంధార = గాంధార; క్షితి = దేశ; నాథు = రాజు; కూఁతురు = పుత్రిక, గాంధారి}; యోగప్రీతి = యోగమును అనుసరించు ఇష్టము; చిత్తంబు = మనసు; లోన్ = లో; సంధిల్లన్ = కూడిరాగా; పతి = భర్త; వెంటన్ = వెనుకనే; ఏఁగెన్ = వెళ్ళెను; ఉదయత్ = ఉద్భవించిన; సాధ్వీ = సాధు స్త్రీ; గుణ = గుణములు; ఆరూఢ = స్థిర పరచుకొన్నది; ఐ = అయి.
గాంధారి ఉత్తమ ఇల్లాలు, పుణ్య పురంధ్రి, గాంధార మహారాజు గారాబు పుత్రిక. పుట్టంధు డైన భూ భర్తను భర్తగా వరించి, పతి చూడ లేని ప్రపంచాన్ని తను మాత్రం ఎందుకు చూడాలనే పట్టుదలతో కళ్లకు గంతలు కట్టుకొని, లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్వీమణి అతిశయించిన వైరాగ్యభావంతో పతి వెంట బయలుదేరి వెళ్ళింది హిమాలయలకి.
(విదురుడు విరక్తిమార్గం ఉపదేశించగా అతని వెనుక ధృతరాష్ట్రుడు, అతని సతి గాంధారి హిమాలయాలకు బయలుదేరిన సందర్భలోని పద్య మిది)
1-319-చ.చంపకమాల
వెనుకకు రాక చొచ్చు రణవీరునికైవడి, రాజదండనం
బునకు భయంబు లేక వడిఁ బోయెడి ధీరుని భంగి, నప్పు డా
వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంతభూమికిం
బెనిమిటితోడ నించుకయు భీతి వహింపక యేగెఁ బ్రీతితోన్.
వెనుకకు = వెనుకకు మరలి; రాక = రాకుండగ; చొచ్చు = దూసుకొని వెళ్లు; రణ = యుద్ధము చేసే; వీరుని = యోధుని; కైవడిన్ = వలె; రాజ = రాజు చేత; దండనంబు = శిక్షింపబడుట; కున్ = కు; భయంబు = భయము; లేక = లేకుండగ; వడిన్ = వేగముగ; పోయెడి = వెళ్ళు; ధీరుని = ధీరుని; భంగిన్ = వలె; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; వనిత = స్త్రీ; దురంతము = అంతుపట్టుటకు కష్టము; ఐన = అయినట్టి; హిమవంతము = హిమాలయము; పొంతన్ = దగ్గరి; వన = అడవి; అంత = లోపలి; భూమి = ప్రదేశము; కిన్ = నకు; పెనిమిటి = భర్త; తోడన్ = తో; ఇంచుకయు = కొంచెముకూడ; భీతిన్ = భయమును; వహింపకన్ = చెందకుండ; ఏగెన్ = వెళ్ళెను; ప్రీతి = ఇష్ట; తోన్ = పూర్వకముగ.
సందేహం లేకుండా ముందుకు చొచ్చుకొనిపోయే సమర వీరుని రీతిగా, జంకూ గొంకూ లేకుండా రాజదండాన్ని అనుభవించటానికి చకచక సాగిపోయే మగధీరుని మాదిరిగా, తిరుగులేని నిర్భీతితో, తరిగిపోని ప్రీతితో, తన వల్లభుని వెంట హిమవంతం ప్రాంతంలోని దుర్గమవనాంతాలకు ఆమె నిర్గమించింది.
1-320-వ.వచనము
ఇట్లు విదురసహితులై గాంధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు సేసి, నిత్యహోమంబు గావించి, బ్రాహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబులు సేసి నమస్కరించి, గురువందనముకొఱకుఁ పూర్వ ప్రకారంబునం దండ్రి మందిరమునకుఁ జని యందు విదురసహితు లయిన తల్లిదండ్రులం గానక మంజుపీఠంబునఁ గూర్చున్నసంజయున కిట్లనియె.
ఇట్లు = ఈ విధముగ; విదుర = విదురునితో; సహితులు = కూడినవారు; ఐ = అయి; గాంధారి = గాంధారి; ధృతరాష్ట్రులు = ధృతరాష్ట్రులు; వనంబున = అడవి; కున్ = కి; చనిన = వెళ్లగ; మఱునాఁడు = తరువాతి రోజు; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ప్రభాతంబున = ఉదయము నందు; సంధ్యావందనంబు = సంధ్యావందనము; చేసి = చేసికొని; నిత్య = ప్రతి నిత్యము చేయు; హోమంబు = హోమము; కావించి = పూర్తిచేసుకొని; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; ఉత్తములు = ఉత్తములు; కున్ = కు; గో = ఆవులు; హిరణ్య = బంగారము; తిల = నువ్వులు; వస్త్ర = వస్త్రములు; ఆది = మొదలగు; దానంబులున్ = దానములను; చేసి = చేసి; నమస్కరించి = నమస్కరించి; గురు = పెద్దలకు చేయు; వందనము = నమస్కారము; కొఱకున్ = కోసము; పూర్వ = ఇంతకు ముందు; ప్రకారంబునన్ = వలె; తండ్రి = తండ్రి యొక్క; మందిరము = భవనము; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = అందులో; విదుర = విదురునితో; సహితులు = కూడిన వారు; అయిన = అయినట్టి; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; కానక = కనుగొనలేక; మంజు = చక్కటి; పీఠంబునన్ = ఆసనమున; కూర్చున్న = కూర్చుండి యున్న; సంజయున = సంజయున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
ఆ ప్రకారంగా గాంధారీ ధృతరాష్ట్రులు విదురునితో కూడి అరణ్యాలకు వెళ్లారు. ఆ మర్నాడు ధర్మరాజు ప్రాతఃకాల కృత్యాలు తీర్చుకొని, సంధ్యవార్చుకొని, అగ్నికార్యాలు నెరవేర్చుకొన్నాడు. అనంతరం ఉత్తములైన విప్రులకు గోదాన సువర్ణదాన తిలదాన వస్త్రదానాదులు నిర్వర్తించి, పెద్దలకు నమస్కరించే నిమిత్తం యాథావిధిగా పెదతండ్రిగారి భవనానికి వెళ్లాడు. అక్కడ విదురుడూ, గాంధారీ ధృతరాష్ట్రులూ కనిపించలేదు. ఒక సురుచిరపీఠం మీద సుఖాసీనుడై ఉన్న సంజయుణ్ణి చూసి ధర్మరాజు ఇలా అడిగాడు…
1-321-సీ.సీస పద్యము
"మా తల్లిదండ్రు లీ మందిరంబున లేరు;
సంజయ! వా రెందుఁ జనిరి నేఁడు
ముందఱ గానఁడు ముదుసలి మా తండ్రి;
పుత్రశోకంబునఁ బొగులుఁ దల్లి
సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి;
మందబుద్ధులమైన మమ్ము విడిచి
యెటఁ బోయిరో మువ్వు రెఱిఁగింపు గంగలోఁ;
దన యపరాధంబుఁ దడవి కొనుచు
1-321.1-ఆ.
భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ
గపట మింత లేదు కరుణ గలదు
పాండుభూవిభుండు పరలోకగతుఁడైన
మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు."
మా = మాయొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ఈ = ఈ; మందిరమునన్ = భవనములో; లేరు = లేరు; సంజయ = సంజయ; వారు = వారు; ఎందున్ = ఎక్కడికి; చనిరి = వెళ్ళితిరి; నేఁడు = ఇవేళ; ముందఱన్ = ఎదురుగ ఉన్నదే; కానఁడు = చూడలేడు; ముదుసలి = ముసలి వాడు; మా = మాయొక్క; తండ్రి = తండ్రి; పుత్ర = పుత్రుల వలని; శోకంబునన్ = వేదనతో; పొగులున్ = దుఃఖించును; తల్లి = తల్లి; సౌజన్య = మంచితనమునకు; నిధి = నివాసము; ప్రాణ = ప్రాణముతో సమానమైన; సఖుఁడు = స్నేహితుడు; మా = మాయొక్క; పినతండ్రి = చిన్నాన్న; మంద = మందగించిన; బుద్ధులము = బుద్ధి కలిగిన వారలము; ఐన = అయినట్టి; మమ్మున్ = మమ్ములను; విడిచి = వదలివైచి; ఎటన్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; మువ్వురు = ముగ్గురు; ఎఱిఁగింపు = తెలియజేయుము; గంగ = గంగానది; లోన్ = లో; తన = తనయొక్క; అపరాధంబున్ = తప్పులను; తడవికొనుచు = తలచుకొనుచు;
భార్య = భార్య; తోడన్ = తోపాటు; తండ్రి = తండ్రి; పరితాపమునన్ = వేదనలో; పడున్ = పడును; కపటము = అబద్ధము; ఇంత = ఇంతకూడ; లేదు = లేదు; కరుణ = దయ; కలదు = కలదు; పాండు = పాండు; భూవిభుండు = రాజు; పరలోకగతుఁడు = చనిపోయిన వాడు; ఐన = అయినట్టి; మమ్మున్ = మమ్ములను; పిన్నవాండ్రన్ = పిల్లవాళ్ళను; మనిచె = పెంచి పోషించెను; అతఁడు = అతడు.
"సంజయా!. మా తల్లీ తండ్రీ ఈ మేడలో కన్పించటం లేదు. వారెక్కడికి వెళ్లారో తెలియదు. మా తండ్రారు కంటిచూపు కరవైన మూడకాళ్లముసలి. మా తల్లిగారు కడివెడు శోకంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటుంది. మా పినతండ్రిగారు మాకు ప్రాణ సమానుడు. సౌజన్యమూర్తి. ఈ ముగ్గురూ మందమతులమైన మమ్మల్ని వదలిపెట్టి ఎటు పోయినారో చెలియదు. మాపెదతండ్రిగారు ఒకవేళ తాము చిసన తప్పులకు పశ్చాత్తాపం చెంది భార్యతో కూడా గంగలో దూకాడేమోనని అనుమానంగా ఉంది. తెలిస్తే చెప్పు. ఆయిన చాలా అమాయకుడు, కరుణాఱ్ఱ్థహృదయుడు. మా తండ్రి పాండుభూపాలుడు పరలోకగతుడు కాగా పిన్నవాళ్లమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేశారు."
1-322-వ.వచనము
అనిన సంజయుండు దయాస్నేహంబుల నతికర్శితుం డగుచు దన ప్రభువు వోయిన తెఱం గెఱుంగక, కొంత దడ వూరకుండి తద్వియోగ దుఃఖంబునఁ గన్నీరు దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి, తన భర్తృ పాదంబుల మనంబుల నెన్నుచు ధర్మజున కిట్లనియె.
అనిన = అనగా; సంజయుండు = సంజయుండు; దయా = దయ; స్నేహంబులన్ = స్నేహములకు; అతి = మిక్కిలి; కర్శితుండు = దిగులుచెందినవాడు; అగుచున్ = అవుతూ; తన = తనయొక్క; ప్రభువు = యజమాని; పోయిన = వెళ్ళిన; తెఱంగు = విధము; ఎఱుంగక = తెలియక; కొంత = కొంచెము; తడవు = సమయము; ఊరకన్ = ఊరకనే; ఉండి = ఉండి; తత్ = ఆ; వియోగ = ఎడబాటు వలని; దుఃఖంబునన్ = బాధతో; కన్నీరు = కన్నీళ్ళని; తుడిచికొనుచున్ = తుడుచికొనుచు; బుద్ధి = మనో; బలంబునన్ = బలమువలన; చిత్తంబు = మనసుని; ధైర్య = ధైర్యముతో; ఆయత్తంబున్ = కూడినదిగ; చేసి = చేసి; తన = తన యొక్క; భర్తృ = యజమాని యొక్క; పాదంబులన్ = పాదములను; మనంబులన్ = మనసులో; ఎన్నుచున్ = ఎంచుకొనుచు; ధర్మజున్ = ధర్మరాజు {ధర్మజు - యముని కొడుకు, ధర్మరాజు}; కున్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
ధర్మజుని మాటలు విని సంజయుడు కనికరంతోనూ, ప్రేమతోనూ నిండిన గుండెతో తన ప్రభువు ఎక్కడికి పోయాడో తెలియక కొంచెము సేవు మౌనం వహించాడు. ఆ మహారాజు వెళ్లిపోయినందుకు పొంగివచ్చే కన్నీరు తుడుచుకొన్నాడు. గుండె దిటవుపరచుకొని తన ప్రభువు పాదాలు మనస్సులో ధ్యానిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు సంజయుడు.
1-323-తే.తేటగీతి
"అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు
నడుగఁ డీ రేయి మీ తండ్రి యవనినాథ!
మందిరములోన విదురుతో మంతనంబు
నిన్న యాడుచు నుండెను నేఁడు లేఁడు.
అఖిల = సమస్తమైన; వార్తలు = వార్తలు; మున్ను = ఇంతకు ముందు; నన్ను = నన్ను; అడుగుచుండున్ = అడుగుతుండేవాడు; అడుగఁడు = అడగలేదు; ఈ = ఈ; రేయి = రాత్రి; మీ = మీయొక్క; తండ్రి = తండ్రి; అవనినాథ = రాజ {అవనినాథుడు - భూమికి ప్రభువు, రాజు}; మందిరము = అంతఃపురము; లోనన్ = లోపల; విదురు = విదురుని; తోన్ = తో; మంతనంబు = ఇష్టాపూర్వక సంభాషణములు; నిన్న = క్రిందటి రోజు; ఆడుచున్ = మాట్లాడుచును; ఉండెను = ఉండెను; నేఁడు = ఈ రోజు; లేఁడు = లేడు.
"ధర్మరాజా! నీపెద తండ్రిగారు ప్రతిదినమూ వార్తలేమిటని నన్ను అడుగుతుండేవారు. ఈ రాత్రి ఆయన నన్నేమీ అడగలేదు. నిన్నటివరకూ రాజమందిరంలో విదురునితో కలిసి రహస్యాలోచనలు చేస్తూ ఉండేవాడు. ఈనాడు కంటికి కన్పించకుండా వెళ్ళిపోయాడు.
1-324-వ.వచనము
విదురగాంధారీధృతరాష్ట్రులు నన్ను వంచించి యెందుఁ బోయిరో వారల నిశ్చయంబు లెట్టివో యెఱుంగ" నని సంజయుండు దుఃఖించు సమయంబునఁ దుంబురు సహితుండై నారదుండు వచ్చిన; లేచి నమస్కరించి తమ్ములుం దానును నారదుం బూజించి కౌంతేయాగ్రజుం డిట్లనియె.
విదుర = విదురుడు; గాంధార = గాంధారి; ధృతరాష్ట్రులు = ధృతరాష్ట్రులు; నన్ను = నన్ను; వంచించి = మోసగించి; ఎందున్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; వారల = వారియొక్క; నిశ్చయంబులు = నిర్ణయములు; ఎట్టివో = ఎలాంటివో; ఎఱుంగను = నాకు తెలియదు; అని = అని; సంజయుండు = సంజయుడు; దుఃఖించు = బాధపడు; సమయంబునన్ = సమయములో; తుంబురు = తుంబురుని; సహితుండు = కూడినవాడు; ఐ = అయి; నారదుండు = నారదుడు; వచ్చినన్ = రాగా; లేచి = లేచి; నమస్కరించి = మ్రొక్కి; తమ్ములున్ = తమ్ముళ్ళును; తానును = తానును; నారదున్ = నారదుని; పూజించి = పూజించి; కౌంతేయాగ్రజుండు = ధర్మరాజు {కౌంతేయాగ్రజుడు - కుంతి పెద్ద కొడుకు, ధర్మరాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
విదురుడూ గాంధారీ ధృతరాష్ట్రులూ నాకు చెప్పకుండా నా కన్నుగప్పి ఎక్కడికి వెళ్లిపోయారో, ఏ ఉద్దేశ్యంతో వెళ్లిపోయారో తెలియదు” అని సంజయుడు బావురుమన్నాడు. ఆ సమయంలో తుంబురనితో నారదుడు అక్కడికి విచ్చేసాడు. ధర్మరాజు లేచి తమ్ములూ తానూ వారికి నమస్కారం చేసి పూజించాడు. అనంతరం అజాతశత్రుడు బ్రహ్మమానన పుత్రునితో.....
1-325-ఉ.ఉత్పలమాల
"అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ! వారు నేఁ
డెక్కడ వోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ
బొక్కుచునుండుఁ దల్లి యెటు వోయెనొకో? విపదంబురాశికిన్
నిక్కము కర్ణధారుఁడవు నీవు జగజ్జనపారదర్శనా!"
అక్కట = అయ్యో; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; గృహంబునన్ = ఇంటిలో; లేరు = లేరు; మహాత్మ = గొప్ప ఆత్మ కలవాడా; వారు = వాళ్ళు; నేఁడు = ఈ రోజు; ఎక్కడన్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; యెఱుఁగన్ = నాకు తెలియదు; ఎప్పుడు = ఎల్లప్పుడు; బిడ్డల = పుత్రుల యొక్క; పేరు = గొప్పదనము; గ్రుచ్చి = గురించి / నొక్కి; తాన్ = తాను; పొక్కుచున్ = దుఃఖ పడుచు; ఉండున్ = ఉండును; తల్లి = తల్లి; ఎటు = ఎక్కడకు; పోయెనొకో = పోయెనో పాపం; విపత్ = ప్రమాదములు అను; అంబు = సముద్రము; రాశి = దాటుట; కిన్ = కు; నిక్కము = నిజముగ; కర్ణధారుఁడవు = తరింపజేయువాడవు {కర్ణధారుడు - పడవ చుక్కాని పట్టు సరంగు, తరింపచేయువాడు}; నీవు = నీవు; జగత్ = లోకములోని; జన = ప్రజలకు; పార = గమ్యము(ఒడ్డు); దర్శనా = చూపువాడా.
"దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. ముల్లోకాలలో నీకు తెలియని ఏమీలేదు. ఆపదలనే సముద్రం దాటించటానికి నిజంగా నీవు కర్ణధారుడవు. అయ్యో మహాత్మా! ఏమని చెప్పమంటావు. తెల్లవారి చూసే సరికి మాతల్లిదండ్రులు ఇంటిలో లేరు. వారు ఇల్లు వదలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది. సర్వదా తనబిడ్డలను పేరు పేరునా తలచుకొని తల్లడిల్లే మా తల్లి ఎటుపోయిందో ఏమయిపోయిందో."
1-326-వ.వచనము
అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె ”నీశ్వరవశంబు విశ్వంబు ఈశ్వరుండ భూతముల నొకటితో నొకటిఁ జేర్చు నెడఁబాపు, సూచీ భిన్ననాసిక లందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టబడిఁన బలీవర్ధంబులంబోలెఁ గర్తవ్యాకర్తవ్యవిధాయక వేదలక్షణ యగు వాక్తంత్రి యందు వర్ణాశ్రమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులైన లోకపాలసహితంబు లై, లోకం బీశ్వరాదేశంబు వహించు గ్రీడాసాధనంబు లగు నక్షకందుకాదుల కెట్లు సంయోగ వియోగంబు లట్లు క్రీడించు నీశ్వరుని క్రీడాసాధనంబులైన జంతువులకు సంయోగ వియోగంబు లగుచుండు, సమస్త జనంబును జీవరూపంబున ధ్రువంబును, దేహరూపంబున నధ్రువంబునై యుండు;మఱియు నొక్క పక్షంబున ధ్రువంబు నధ్రువంబునుం గాక యుండు, శుద్ధబ్రహ్మస్వరూపంబున ననిర్వచనీయంబుగ రెండునై యుండు, అజగరంబుచేత మ్రింగంబడిన పురుషుం డన్యుల రక్షింపలేని తెఱంగునఁ బంచభూత మయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు గాదు, కరంబులు గల జంతువులకుఁ గరంబులు లేని చతుష్పదంబు లాహారంబు లగుఁ; జరణంబులు గల ప్రాణులకుం జరణంబులు లేని తృణాదులు భక్షణీయంబు లగు; నధిక జన్మంబుగల వ్యాఘ్రాదులకు నల్పజన్మంబులుగల మృగాదులు భోజ్యంబులగు; సకలదేహి దేహంబు లందు జీవుండు గలుగుటం జేసి జీవునికి జీవుండ జీవిక యగు; అహస్త సహస్తాది రూపంబైన విశ్వ మంతయు నీశ్వరుండు గాఁ దెలియుము;అతనికి వేఱు లేదు; నిజమాయా విశేషంబున మాయావి యై జాతిభేద రహితుండైన యీశ్వరుండు బహుప్రకారంబుల భోగిభోగ్యరూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించు, గాన యనాథులు దీనులు నగు నాదు తల్లిదండ్రులు ననుం బాసి యేమయ్యెదరో యెట్లు వర్తింతురో యని వగవం బని లేదు, అజ్ఞాన మూలం బగు స్నేహంబున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు" మని మఱియు నిట్లనియె.
అనినన్ = అనగా; విని = విని; సర్వజ్ఞుండు = సర్వము తెలిసినవాడు; ఐన = అయినట్టి; నారదుండు = నారదుడు; ధర్మజున = ధర్మరాజు; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = చెప్పెను; ఈశ్వర = భగవంతునికి; వశంబు = ఆధీనము అయి ఉండునది; విశ్వంబు = విశ్వము; ఈశ్వరుండ = భగవంతుడే; భూతములన్ = జీవులను; ఒకటి = ఒక; తోన్ = దానితో; ఒకటిన్ = ఒక దానిని; చేర్చున్ = చేరువ చేయును; ఎడఁ బాపున్ = దూరము జరుపును; సూచీ = సూదితో; భిన్న = పొడిచిన; నాసికలు = ముక్కులు; అందున్ = అందు; రజ్జు = త్రాడు; ప్రోతంబులు = గుచ్చబడినవి; అగుచున్ = అవుతూ; కంఠ = మెడలను; రజ్జువులన్ = తాళ్ళచేత; కట్టబడిఁన = కట్టబడినట్టి; బలీవర్ధంబులన్ = ఎడ్లను; పోలెన్ = వలె; కర్తవ్య = చేయతగినది; అకర్తవ్య = చేయతగనిది లలో; విధాయక = విధివత్ప్రకారమైనదానిని; వేద = తెలియజేయు; లక్షణ = లక్షణములు కలది; అగు = అయినట్టి; వాక్తంత్రి = మాట అను తంత్రి; అందున్ = లోని; వర్ణ = వర్ణములయొక్క; ఆశ్రమ = ఆశ్రమములయొక్క; లక్షణంబులు = లక్షణములు; కల = ఉన్నట్టి; నామంబులు = నామములు; చేన్ = చేత; బద్ధులు = కట్టబడినవారు; ఐన = అయినట్టి; లోక = లోకులను; పాల = పాలించువారితో; సహితంబులు = కూడినవి; ఐ = అయి; లోకంబు = లోకములు; ఈశ్వర = భగవంతుని; ఆదేశంబు = ఆజ్ఞను; వహించున్ = శిరసావహించును; క్రీడా = ఆటకు; సాధనంబులు = పనికివచ్చు వస్తువులు; అగున్ = అయిన; అక్ష = పాచికలు; కందుక = బంతి; ఆదులు = మొదలగు వాని; కున్ = కి; ఎట్లు = ఏ విధముగనైతే; సంయోగ = కలయికలు; వియోగంబుల్ = ఎడబాటు లగునో; అట్లు = ఆ విధముగ; క్రీడించు = క్రీడించే; ఈశ్వరుని = భగవంతుని; క్రీడా = ఆటకు; సాధనంబులు = పనికివచ్చు వస్తువులు; ఐన = అయిన; జంతువులు = జీవులు {జంతువులు - పుట్టుక కలవి}; కున్ = కు; సంయోగ = కలయిక; వియోగంబులు = ఎడబాటులు; అగుచుండు = అవుతాయి; సమస్త = సమస్తమైన; జనంబును = జనమును; జీవ = జీవుని; రూపంబునన్ = రూపములో; ధ్రువంబును = స్థిరమైనదిగను; దేహ = దేహము; రూపంబునన్ = రూపములో; అధ్రువంబును = అస్థిరమైనదిగను; ఐ = అయి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఒక్క = ఒక; పక్షంబునన్ = విధముగ; ధ్రువంబున్ = స్థిరమును; అధ్రువంబునున్ = అస్థిరమును; కాక = కాకుండగను; ఉండున్ = ఉండును; శుద్ధబ్రహ్మ = శుద్ధబ్రహ్మ; స్వరూపంబునన్ = స్వరూపములో; అనిర్వచనీయంబుగన్ = వివరింపవీలుకానిదిగ; రెండును = రెండూకూడను; ఐ = అయి; ఉండున్ = ఉండును; అజగరంబు = కొండచిలువ; చేతన్ = చేత; మ్రింగంబడిన = మింగబడిన; పురుషుండు = మానవుడు; అన్యులన్ = ఇంకొకరిని; రక్షింపలేని = కాపాడలేని; తెఱంగునన్ = విధముగ; పంచ = ఐదు; భూత = భూతములతో; మయంబు = కూడినది; ఐ = అయి; కాల = కాలమునకును; కర్మ = కర్మలకును; గుణ = గుణములకును; ఆధీనంబు = వశములో ఉండునది; ఐన = అయిన; దేహంబు = శరీరము; పరులన్ = ఇతరుల; రక్షింపన్ = రక్షించుటకు; సమర్థంబు = శక్తి కలది; కాదు = కాదు; కరంబులు = చేతులు; కల = కలిగిన; జంతువులు = జీవులు; కున్ = కు; కరంబులు = చేతులు; లేని = లేనట్టి; చతుష్పదంబులు = నాలుగు కాళ్ళు ఉన్నవి; ఆహారంబులు = ఆహారములు; అగున్ = అగును; చరణంబులు = కాళ్ళు; కల = కలిగిన; ప్రాణులు = జీవులు; కున్ = కు; చరణంబులు = కాళ్ళు; లేని = లేనట్టి; తృణ = గడ్ఢి; ఆదులు = మొదలగునవి; భక్షణీయంబులు = తినదగినవి; అగున్ = అగును; అధిక = పెద్ద; జన్మంబు = పుట్టుక; కల = కలిగిన; వ్యాఘ్ర = పులులు; ఆదుల = మొదలగు; కున్ = వానికి; అల్ప = చిన్న; జన్మంబులు = పుట్టుకలు; కల = కలిగిన; మృగ = లేడి; ఆదులు = మొదలగునవి; భోజ్యంబులు = తినదగినవి; అగున్ = అగును; సకల = సమస్త; దేహి = జీవుల యొక్క {దేహి - శరీరము కలిగినది / జీవి}; దేహంబులు = శరీరములు; అందున్ = లో; జీవుండు = జీవుడు; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; జీవుని = జీవి; కిన్ = కి; జీవుండ = జీవే; జీవిక = జీవించుటకు ఆధారము; అగున్ = అగును; అహస్త = హస్తములు లేనివి; సహస్త = హస్తములు ఉన్నవి; ఆది = మొదలగు; రూపంబు = రూపములు కలవి; ఐన = అయినట్టి; విశ్వము = విశ్వము; అంతయు = సమస్తమును; ఈశ్వరుండుగాన్ = ఈశ్వరుడు అని; తెలియుము = తెలిసికొనుము; అతని = అతని; కిన్ = కి; వేఱు = అన్యమైనది ఏమియును; లేదు = లేదు; నిజ = తన; మాయా = మాయ యొక్క; విశేషంబున = విశిష్టత వలన; మాయావి = మాయకలవాడు; ఐ = అయి; జాతి = జాతి / పుట్టుకతో వచ్చిన; భేద = భేదములు; రహితుండు = లేనివాడు; ఐన = అయిన; ఈశ్వరుండు = భగవంతుడు; బహు = అనేక; ప్రకారంబులన్ = విధములుగా; భోగి = అనుభవించునది; భోగ్య = అనుభవింపబడునవి అనబడే; రూపంబులన్ = రూపములతో; అంతరంగ = లోపటలను; బహిరంగంబులన్ = బయటల యందును; దీపించున్ = ప్రకాశించును; కాన = కావున; అనాథులు = దిక్కులేనివారు; దీనులున్ = దీనులును; అగు = అయిన; నాదు = నాయొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ననున్ = నన్ను; పాసి = వదలి; ఏమి = ఏమి; అయ్యెదరో = అవుతారో; ఎట్లు = ఏ విధముగ; వర్తింతురో = ఉండెదరో; అని = అని; వగవన్ = దుఃఖ పడుటకు; పనిలేదు = అవసరములేదు; అజ్ఞాన = అజ్ఞానమునకు; మూలంబు = మూలమైనట్టిది; అగు = అయిన; స్నేహంబునన్ = స్నేహభావమువలన; ఐన = అయినను; మనస్ = మనసు యొక్క; వ్యాకులత్వంబు = చీకాకుపడుటను; పరిహరింపుము = తొలగించుము; అని = అని; మఱియున్ = మళ్ళా; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = చెప్పెను.
ఆ పలుకుల విని నారదుడు ఇలా అన్నాడు.”ధర్మరాజా! ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. ముక్కుత్రాళ్లు పొడిచి, మెడకు పలుపులు తగిలించి, పగ్గాలు చేత పట్టుకొని, కర్షకుడు ఎద్దులను త్రిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్యాకర్తవ్యాలను బోధించి, వేద వాక్కులనే త్రాడు బిగించి, వర్ణాశ్రమధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్పాలకులతో సహా ప్రాణులను ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతుంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలూ, బంతులూ మొదలైన ఆటవస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు, భగవంతుని ఇచ్ఛానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తుంటాయి. సమస్త దేవలోకమూ ఆత్మరూపంలో నిత్యమైనదై దేహరూపంలో అనిత్యమైనదై ఉంటుంది. మరోవిధంగా చూస్తే రెండు కాకుండా ఉంటుంది. అనిర్వచనీయమైన బ్హహ్మస్వరూపం పొందినప్పుడు నిత్యానిత్యమై కాలకర్మాధీనమై, సంసారపంక నిర్మగ్నమైన దేహం పరులను కాపాడలేదు. చేతులున్న ప్రాణులకు చేతులులేని చతుష్పాద జంతువులూ, కాళ్లుండి కదలగల ప్రాణులకు కాళ్లులేని తృణాదులూ, ఆహార మవుతున్నాయి. పెద్దజంతువులైన పెద్దపులులు మొదలైనవి లేళ్లు మొదలైన చిన్న జంతువులను తింటున్నవి. సమస్త దేహధారుల దేహాల్లో జీవుడు ఉన్నందువల్ల జీవికి జీవియే జీవనాధార మగుతున్నాడు. చేతులున్న ప్రాణులతోనూ, చేతులులేని ప్రాణులతోనూ నిండిన ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు, ఆయనకంటే అన్యం లేదు. తన మాయావిశేషంచేత మహామాయావి అయిన పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే భోక్తయై, భోజ్యమై; లోపలా, వెలుపలా అంతటా తానై విరాజిల్లుతున్నాడు. అందువల్ల మహారాజా! నా తల్లిదండ్రులు దీనులే! దిక్కు లేనివారే! నన్ను వదలి ఏమైపోతారో? ఏలా జీవిస్తారో? అనే విచారం మాను, అజ్ఞానమూలకమైన మమకారం పెంచుకొని అనవసరంగా మనస్సును క్లేశపెట్టుకోవద్దు.
1-327-ఆ.ఆటవెలది
అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁ డగు విష్ణుఁ
డసురనాశమునకు నవతరించి
దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కిన పని
కెదురుసూచుచుండు నిప్పు డధిప!
అట్టి = అటువంటి; కాల = కాలము; రూపుఁడు = రూపముగ కలవాడు; అఖిల = సమస్తమైనది; ఆత్ముఁడు = తానే ఐన వాడు; అగు = అయిన; విష్ణుఁడు = భగవంతుడు; అసుర = రాక్షస; నాశమున = నాశనము; కున్ = కొరకు; అవతరించి = అవతరించి; దేవ = దేవతల; కృత్యము = పని; ఎల్లన్ = సమస్తము; తీర్చి = పూర్తిచేసి; చిక్కిన = మిగిలిన; పని = పని; కిన్ = కోసము; ఎదురుసూచుచు = ఎదురుచూచుచు; ఉండున్ = ఉండును; ఇప్పుడు = ఇప్పుడు; అధిప = గొప్పవాడా;
కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయిన భగవంతుడు అసురులను సంహరించటంకోసం అవతరించాడు. దేవకార్యం తీరిపోయింది. ఇప్పుడు మిగిలిన పనికోసం నిరీక్షిస్తున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి