అగస్త్య మహర్షి శ్రీలు పొంగిన పుణ్యభూమి . భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి . ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు . అగ్నిదేవుడూ , వాయుదేవుడూ ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్ళున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి . అందుకే ఆయనకి పేరు ఏం పెట్టారో తెలుసా ? కలశజుడు . కుంభసంభవుడు , ఔర్వశేయుడు , మిత్రావరణ పుత్రుడు , వహ్నిమారుత సంభవుడు అని ఇంకా అనేక పేర్లున్నాయి . అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం , ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం అన్నీ దేవతలే చేసేశారు . ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు . ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకీ చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్న మునులని చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి . ఆ మునులు అగస్త్యుణ్ణి చూసి నాయనా ! మమ్మల్ని పితృదేవతలంటారు . నీకు పెళ్లయి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకి వెళ్ళే అర్హత వస్తుంది . నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలనంటున్నావు . మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి . లేకపోతే మా గతి ఇంతే అన్నారు . అగస్త్యుడు ఇది విని మరి పెళ్ళి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా ! అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు .శ్రీమతి భమిడిపాటి వి.బాలాత్రిపుర సుందరి ఆ అమ్మాయి పేరు లోపాముద్ర . లక్ష్మీదేవంత అందంగా సరస్వతీ దేవికున్నంత విద్యతో సుగుణాల రాశిలా ఉంది . ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్ళి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు . మరి పెళ్ళి చేసుకున్నాక కొంచమయినా ధనం వుండాలిగా . అగస్త్యుడు తన తపశ్శక్తిని నష్టపోవడం ఇష్టం లేక ' శ్రుతర్వుడనే రాజుని అడిగాడు . ఆ రాజు దగ్గర కూడ సరిపడ ధనం లేదని ఇద్దరూ కలిసి ' ప్రధృశ్వుడు ' దగ్గరికి వెళ్ళారు . ఆయన దగ్గర కూడ అదే జరిగింది . ముగ్గురు కలిసి ' త్రిసదన్వుడు ' అనే రాజు దగ్గరకి వెళ్ళారు . ఆయనది కూడా అదే పరిస్థితి . మణిమతీ పురానికి రాజు ' ఇల్వలుడు ' . ఆయనకి ' వాతాపి ' అనే తమ్ముడుండే వాడు . ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకి వండి పెట్టేవాడు . తర్వాత వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులో నుంచి బయటకి వచ్చేవాడు . ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులని చంపేసేవాళ్ళు . అగస్త్యుడు తను కలిసిన రాజులు ముగ్గుర్నీ తీసుకుని ఇల్వలుడి ఇంటికి వెళ్ళాడు . మామూలుగానే ఇల్వలుడు వాతాపిని చంపి , వండి పెట్టి , మళ్ళీ వాతాపిని పిలిచాడు . కానీ అగస్త్యుడు భోజనం చెయ్యగానే ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ' అన్నాడు . వాతాపి జీర్ణం అయిపోయాడు . ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటికి రాలేదు . ఉంటే కదా ! ... రావడానికి ! మీరెప్పుడయినా గమనించారా . పసిపిల్లలకి పాలుపట్టగానే ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ' అని పసిపిల్లల పొట్ట మీద రాస్తారు . వాతాపిని కూడా అరగించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లలకి రావాలని అలా అంటారు . అప్పటి అగస్త్యుడి మంత్రం ఇప్పటి పిల్లలకి కూడా ఉపయోగపడుతోంది చూశారా ! ఇల్వలుడు అగస్త్యుడికి ధనం , బంగారం , ఆవులు అన్ని ఇచ్చి పంపించాడు . తర్వాత అగస్త్యుడికి ధృడస్యుడు అనే కొడుకు , తేజస్వి అనే మనుమడు కలిగారు . పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు . ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చాడు . అగస్త్యుడు ఎదురువెళ్ళి తీసుకువచ్చి ఆయన్ని తగిన విధంగా సత్కారం చేసి ఆజ్ఞాపించండి స్వామీ ! అన్నాడు . నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది . ఇప్పుడు విష్ణుమాయ కవేరరాజుకి ముక్తి నివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోరతపస్సు చేస్తోంది . ఆమెను నువ్వు పెళ్ళి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు . అగస్త్యుడు బ్రహ్మదేవా ! నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు . పెళ్ళి అవగానే కవేరకన్య కావేరీ నదిగా ప్రవహించింది . కావేరి నదిలో స్నానం చేసిన కవేరరాజుకి ముక్తి కలిగింది . వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహర్షులందర్నీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవాడు .మహర్షులందరూ కలిసి ఆ సముద్రజలాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు . అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో త్రాగేశాడు వృత్రాసురుడు బైటపడ్డాడు . దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుణ్ణి చంపేశారు . అగస్త్యమహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెడుతూ అగస్త్యమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు . ఖడ్గము , విల్లు , బాణాలు , అక్షయమైన అమ్ములపొది రాముడికి ఇచ్చి దీవించాడు అగస్త్యుడు . కొంతకాలం తర్వాత రామరావణ యుద్ధంలో రావణ బాణాలకి రాముడు గాయపడి బాధపడుతుండగా అగస్త్యుడు రాముడిని విష్ణుమూర్తిగా గుర్తుచేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్యహృదయం అనే మహాస్తవం ఉపదేశించాడు . అంటే మనం ఇప్పటికీ ఉదయాన్నే చదువుకుంటున్న ఆదిత్యహృదయం అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిందేనన్నమాట . పూర్వం నహుషుడనే రాజు నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడు . కానీ , ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు . శచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మంది . నహుషుడు శచీదేవి దగ్గరికెడుతూ మునులని రథం మొయ్యమని చెప్పాడు . పూర్వాచార్యుల మంత్రాల్నీ , బ్రాహ్మణుల్నీ నిందించటం తప్పని చెప్పిన అగస్త్యుడి తల మీద తన్నాడు నహుషుడు . నహుఘడిని క్రూరసర్పంగా మారమని శపించాడు అగస్త్యుడు . తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు . అగస్త్యుడు ' ద్వాదశ వార్షిక యజ్ఞం ' చేశాడు . అంటే ఆ యజ్ఞం పన్నెండు సంవత్సరాలు జరిగింది . దానికి ఇంద్రుడు సహకరించలేదు . అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్రపదవి పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు . మునులు ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు . సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్యపర్వతం కోపగించి సూర్య , చంద్ర , నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదలలేక వదిలి వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు . పర్వతరాజా ! మా దంపతులం పెద్దవాళ్ళం . నీ మీద ఎక్కడం దిగడం మాకు కష్టం . మేం తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు . మేమిప్పుడు దక్షిణాపథం వెడుతున్నామని చెప్పాడు . ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని అణిగించాడు అగస్త్యుడు . తర్వాత అగస్త్యుడు భార్యతో కలసి యాత్రలు చేస్తూ గోదావరీ తీరంలో ఉన్న పంపాసరోవరం , దండకారణ్యం , గోదావరీ తీరం , కోటిపల్లి , పలివెల , భీమేశ్వరం ,ద్రాక్షారామం , వీరభద్రశిఖరం మెదలయినవి చూసి కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు . లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపర యుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాశిలో ఉంటావని దీవిస్తుంది . లోపాముద్ర అగస్త్య మహర్షిని ఏఏ తీర్థాలు ముక్తినిస్తాయని అడిగింది . బాహ్య తీర్థాలకంటే మానస తీర్థాలే ముక్తినిస్తాయి . ఎందుకంటే బాహ్య తీర్థాలలో ఎప్పుడు ఉండే కప్పలు , తాబేళ్ళు , చేపలు , మొసళ్ళు లాంటివి అన్నీ మోక్షం పొందాలి కదా ! అలా జరగట్లేదేం ? మానసికంగా పవిత్రంగా వున్నప్పుడే తీర్థాలలో మునిగిన ఫలితం కూడ ఉంటుంది అన్నాడు అగస్త్యుడు . అగస్త్యుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనం ఇచ్చి కాశీ మహత్మ్యం గురించి తెలియచేశాడు . శిష్య సమేతుడైన వ్యాస మహర్షి కూడా కనిపించాడు . మహర్షులిద్దరు కుశలప్రశ్నలు వేసుకున్నారు . వ్యాసుడు తాను కాశీ వదిలి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో ఈ దక్షిణకాశికి వచ్చిన కారణం చెప్పాడు . అగస్త్యుడు తన తపోమహిమతో వ్యాసుడికి ద్వాదశ క్షేత్రాల గురించి చెప్పి పంచతీర్థాలలో స్నానం చేయించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు . పరశురాముడు అగస్త్యుడు ఇచ్చిన కృష్ణకవచాన్ని ధరించే ఇరవై ఒక్కసార్లు రాజుల్ని చంపగలిగాడు . అందుకు అగస్త్యుడి ప్రోత్సాహ ప్రోద్బలాలు కూడా ఉన్నాయన్నమాట ! ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడం చూడలేదు . అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగువై పుట్టమని శపించాడు . శ్రీ మధ్భాగవతంలో గజేంద్రమోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు . కుబేరుడు కుశపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెడుతూ కుబేరుడి స్నేహితుడు మణిమంతుడు క్రిందకి ఉమ్మేశాడు . అది తపస్సులో ఉన్న అగస్త్యుడి మీద పడింది . అతణ్ణి అతని బలగాలని ఒకే మనిషి చేతిలో చనిపోయేట్లుగా అగస్త్యుడు శపించాడు . అదేవిధంగా వాళ్ళందరూ భీముడి చేతిలో చచ్చిపోయారు . కొంతకాలం అగస్త్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామిని పూజచేసి అందిలావృతవర్షంలో ఉండగా నారాయణుడు అగస్త్యుడికి కనిపించి నీకు ఎప్పుడు ఏలోటూ ఉండదని చెప్పి వెళ్ళిపోయాడు . అగస్త్యుడు రాసిన గ్రంథాలు ' అగస్త్యగీత ' ' అగస్త్యసంహిత ' .. అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డాడు . ఎంతో మందికి విద్యాదానం చేశాడు . ఎంత చెప్పినా అయిపోని గొప్పతనం ఆయనది . ఇప్పటికీ అగస్త్య మహర్షి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్ర రూపంలో కనిపిస్తాడు . నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్త్యుడి బొమ్మ చేసి పూజ చేసి రాత్రి జాగారం చేస్తారు . అలా చేస్తే అగస్త్యలోపాముద్రల అనుగ్రహం వుంటుందని వారి నమ్మకం .ఇద ! అగస్త్య మహర్షి దివ్య చరిత్ర . ముందే చెప్పానుగా ! అగస్త్యుడు మహర్షులందరిలోకి గొప్పవాడని . చదివారా ! ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది . ఎప్పుడూ ఎవరికో ఒకళ్ళకి సహాయపడూ , ముక్తి పొందడానికి ఉపదేశాలు చేస్తూ , ఇప్పటికీ మనకి కూడా ఉపయోగపడేలా విష్ణుపూజా విధానం , ఆదిత్యహృదయం మొదలయినవి చెప్పిన గొప్ప మహర్షి . మనం చూసి ఉంటే తరించేవాళ్ళం . అదెలాగా లేదు కాబట్టి కనీసం ఆయన గురించి చదువుదాం . కొంచెం ఫలితమైనా ఉండదా ... ? తప్పకుండా వుంటుంది !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి