🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 63*
*****
*శ్లో:- కన్యా వరయతే రూపం ౹*
*మాతా విత్తం ౹ పితా శ్రుతం ౹*
*బాంధవా: కుల మిచ్ఛన్తి ౹*
*మృష్టాన్న మితరే జనాః ౹౹*
*****
*భా:- తరాలు, అంతరాలు మారుతున్నా, పెళ్లి అనగానే ఎవరెవరి అంతరంగాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. 1."వధువు" వరుని యొక్క ఉట్టిపడే అందచందాలను మాత్రమే చూస్తుంది. మనసుకు నచ్చాడా! లేదా! అనేదే కన్యకు ప్రధానం. మిగతా విషయాలు పట్టించుకోదు.2. "వధువు తల్లి" వరుని ప్లాట్లు- ఫ్లాట్లు ; నగలు-నగదు ; ఉపాధి- జీతం ; ఆదాయము- వ్యయము ఇత్యాది ఆర్థికప్రతిపత్తిని మదింపు చేస్తుంది. 3. "వధువు తండ్రి" వరుని బాగోగులు, మంచీచెడు, గుణగణాలు, మైత్రీబంధం ఆధారంగా అతని బలాలు- బలహీనతలు, సామాజిక పరపతిని,యోగ్యతను విచారణ చేస్తాడు. 4.ఇక చుట్టాలు-పక్కాలు వివాహము సువర్ణమా! అసవర్ణమా! సాంప్రదాయికమా! ప్రేమబంధమా! సంతకాలా! దండలా! మున్నగు విషయాలపై మిక్కిలి మక్కువ కనబరుస్తారు. 5. వధువు, వరుని వైపు నుండి భారీ సంఖ్యలో విచ్చేసిన మిత్రులు, హితులు, సన్నిహితులు షడ్రసోపేతమైన, దేశ విదేశీ రుచుల ఘుమఘుమలతో, చవులూరించే పసందైన విందుభోజనం పట్ల మనసారా ఆసక్తి చూపుతున్నారు. ఇదండీ పెళ్లి సందడి. ఆధునిక,సాంకేతికత వెల్లి విరిసినా, పై మౌలిక,సామాజిక ఆంతరంగికసూత్రాలలో మార్పు కనబడకపోవడం విశేషం*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
చూచునుముందు కన్య వరు
సుందర రూపము పెండ్లి నాడగన్
చూచును కన్య తల్లి వరు
సొమ్మును స్తోమత కూతు నీయగన్
చూచును కన్య తండ్రి వరు
సూనృత గుణ్య విశేష పద్ధతుల్
చూచును బాంధవాళి వరు
సుప్రజవంశపు లోటుపాటులన్
చూచుదు రన్య బాంధవులు
చోష్య విశేషపు భక్ష్య వంటలన్
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి