28, అక్టోబర్ 2020, బుధవారం

పరమాచార్య స్వామి – వినోబా భావే

 పరమాచార్య స్వామి – వినోబా భావే


ఇరువురు మహాపురుషులు సమావేశమై మాట్లాడుకున్నప్పుడు లోకానికి వారొక కొత్త వెలుగు చూపిస్తారు. ఒక నవీన సందేశాన్ని వినిపిస్తారు.


పరమాచార్య స్వామి, ఆచార్య వినోబాభావే మధ్య జరిగిన సంభాషణ అందుకు చక్కని ఉదాహరణ.


శ్రీ వినోబాభావే గాంధీ అనుయాయులలో ప్రథమ శ్రేణిలోని వారు భూదానోద్యమ నాయకులు. అయినా, కేవలం రాజకీయనాయకుడే కాదు బహుశ్రుతుడు, బహుభాషాకోవిదుడు.


కాషాయం కట్టలేదు, కౌపీనం పెట్టలేదేకాని, ఆజన్మ బ్రహ్మచారి, సర్వసంగ పరిత్యాగి. కారాగృహంలో భగవద్గీతకు భాష్యం చెప్పిన తత్త్వజ్ఞడు.


1956 జూన్ 7వ తేదీన మహనీయులిరువురూ ఒక చిన్న పూరిపాకలో సమావేశమైనారు. ఇద్దరి సంభాషణ కొన్ని నిముషాల్లొ ముగిసింది. సంభాషణ సంస్కృతంలో జరిగింది.


‘నారాయణ నారాయణ’ అంటూ నారాయణ స్మరణతో స్వామి, వినోబాకు స్వాగతం పలికారు. తమ ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు. వరి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్న చేసారు.


”ఇక్కడికి రావడంలో మీకేమి శ్రమ కలగలేదు కదా? మీకు ఆటంకం లేకుంటే ఇక్కడ మఠంలోనే మీరు బస చెయ్యవచ్చు” అని అన్నారు.


”మీ దర్శనానికే నేనిక్కడికి వచ్చాను. మీ ఆశీస్సు కోరుతున్నాను” అని భావే అన్నారు.


”నారాయణ నారాయణ. పరుల సేవ వల్ల ప్రపంచం అంతగా ఉద్ధరించబడుతున్నట్టు నాకు తోచదు. ఒక్కొక్క వ్యక్తీ తన ప్రవృత్తినిబట్టి, తన మనోభావాలను అనుసరించి సమాజానికి సేవచేస్తాడు. అది అక్షేపణీయం కాదు. అయితే లోకులకు తాను ఏ ఉపకారం చేసినా, అది కేవలం తన చిత్తశుద్దికేనని, ఆత్మోద్ధరణకేనని అతడు భావించాలిఅదే తన లక్ష్యం కావాలి.


ఇతరులవల్ల ఏ విధమైన ఉపకారం పొందని వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. వారంతా తమ జీవితాలను యధోచితంగా కొనసాగిస్తూనే ఉన్నారు.


మాటవరసకు, అడవుల్లో మృగాలూ, పక్షులూ అసంఖ్యాకంగా జీవిస్తున్నవి. వాటన్నిటికి ఎవరు సహాయం అందిస్తున్నారు? వాటి జీవిత సరళిని క్రమబడ్దం చెయ్యడానికి ఒక సంఘం ఉన్నదా? ఒక ప్రభుత్వం ఉన్నదా?అయినా, ఆ ప్రాణులన్ని మానవులకంటే సుఖంగానే బతుకుతున్నవి. సమస్త జీవరాశిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతున్నాడు. సంఘంలో ఉండే ప్రతి వ్యక్తీ తన విధాయక ధర్మమేదో తెలుసుకుని, స్వధర్మాన్ని నిర్వర్తించినట్లయితే అదే పరమేశ్వరుడికి నిజమైన సేవ.”


ఈ మాటలను విని “నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను” అని వినోబా అన్నారు.


”నారాయణ నారాయణ నాకెంతో సంతోషం”


పరమాచార్య స్వామి వారు శ్రీవినోబాకు ఈ క్రింది రెండు ఉపమానాలు కూడా వినిపించారు.


”చెట్టును పోషించాలంటే చెట్టు కుదుట్ళో నీరు పోస్తే చాలు. చెట్టు తాలూకు వేళ్ళు ఆ నీరు తాగి, కొమ్మలకూ, రెమ్మలకూ, ఆకులకూ, మొగ్గలకూ అన్నింటికీ ఆహారం అందజేస్తాయి. ప్రత్యేకంగా ఒక్కొక్క ఆకుకూ, ఒక్కొక్క మొగ్గకూ ఆహారం అందించనక్కరలేదు.”


"నోటితో మనిషి భుజిస్తాడు. అయినా, అతని చెవి, ముక్కు, కళ్ళు, కాళ్ళు అన్నిటికీ ఆహారం అందినట్టే. ఈ సృష్టి సమస్తం శ్రీమన్నారాయణుని అవయవాలు మాత్రమే. జీవులంతా పరమాత్మ ప్రతిబింబాలు. పరమాత్మను అలంకరిస్తే జీవులందరినీ అలంకరించినట్టే. లోకసేవ చెయ్యడానికి భగవత్సేవ సులువైన మార్గం.

‘సర్వేజనాః సుఖినోభవంతు’ అని దేవుణ్ణి ప్రార్థిస్తాము” అన్నారు స్వామి.


”స్వామి వారు నాకు భగవంతునితో సమానుడు – కాదు భగవంతుడే” అంటూ ఆచార్య వినోబా స్వామి వద్ద సెలవు పుచ్చుకున్నారు.




అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

కామెంట్‌లు లేవు: