మహాభారతము ' ...70 .
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
అరణ్యపర్వం.
దేవతలను కాదని, నలమహారాజును దమయంతి వరించిందని, దేవతలద్వారా తెలుసుకుని, కోపోద్రిక్తుడైనాడు కలిపురుషుడు. దమయంతి దండనార్హురాలని తేల్చి చెప్పాడు. ' కలిపురుషా ! తొందరపడకు. మా సమ్మతితోనే నలుడు ఆమెను వివాహమాడాడు. నలమహారాజు పురుషశ్రేష్ఠుడు. అతన్ని వరించుటకు యే యువతి అయినా ముందుకువస్తుంది. అతడు దేవతలకు యెందులోనూ తీసిపోడు. వారి దాంపత్యానికి యేవిధమైన విఘ్నము కలిగించకు. వారికి హాని తలపెట్టేవారు యెవరైనా నరకకూపం లో పడతారు. ' అని దేవతలు హెచ్చరించి వెళ్లిపోయారు.
కానీ కలిపురుషుడు ఆ దంపతులని యిబ్బంది పెట్టవలెనని నిశ్చయించుకున్నాడు. ద్వాపరయుగ పురుషుడిని కలిపురుషుడు స్మరించుకుని, తనవద్దవున్న పాచికలలో ఆయనప్రవేశించి నలునితో ఆడబోయే జూదంలో తనకు గెలుపు ప్రసాదించమని కోరాడు. నలదమయంతులను విడదీసే పనిలో ప్రధమఘట్టంగా నలుడు నివసిస్తున్న ప్రదేశానికి వచ్చాడు.
నలుడు యెప్పుడైనా యేదైనా ధర్మవిరుద్ధమైన పని చేస్తాడేమో, అతనిలో ప్రవేశించాలని కలిపురుషుడు ఆత్రుతతో సమయం కోసం యెదురు చూడసాగాడు. కానీ కలిపురుషుడికి ఆ అవకాశం నలుడు యివ్వలేదు. అయినా ఓపికగా యెదురు చూడసాగాడు కలి. ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇలా ఉండగా ఒకనాడు. నలమహారాజు, మూత్రవిసర్జన చేసి, చేతులు, ముఖము మాత్రమే శుభ్రం చేసుకుని, కాళ్ళు కడుగుకొనకుండా, సంధ్యావందనా కార్యక్రమాలు చెయ్యడానికి ఉపక్రమించాడు. అంతే ! సమయం కోసం యెదురుచూస్తున్న కలిపురుషుడు శౌచభంగము కలుగగానే, నలుని హృదయంలోకి స్వేచ్ఛగా ప్రవేశించాడు.
ఆ విధంగా నలుడు తన వశమవ్వగానే, కలి, పుష్కరుడనే వాడివద్దకు వెళ్లి అతనిని నలుని జూదమాడడానికి పిలవమని ప్రేరేపించాడు. కలిప్రభావంతో పుష్కరుడు కూడా, నలుడిని తనతో జూదమాడవలసినదిగా ఆహ్వానించాడు. నలుడు యెంత వద్దనుకుని వారిస్తున్నా, అప్పటికే కలిపురుషుని ప్రభావం సోకిన అతని మనస్సు జూదక్రీడకు లొంగక తప్పలేదు. పుష్కరునికీ, నలునికీ జూదక్రీడ కొన్ని మాసాలపాటు జరిగింది. ఒక్కొక్క సంపద, క్రమంగాపుష్కరునికి జూదంలో సమ్పర్పించుకున్నాడు నలుడు.
దమయంతీ, రాజపురోహితులు యెన్నివిధాల చెప్పినా నలుడు జూదక్రీడ ఆపలేదు. రాజ్య వ్యవహారాలపై ధ్యాస పోనివ్వలేదు. ఇది గమనించి దమయంతి తమ యిద్దరు పిల్లలను, తన తండ్రిగారింట వదలి, మాకు రాజ్యం దక్కే అవకాశం లేనందున, నీవు ఆతరువాత ఎటైనా వెళ్ళమని తమ రధసారధి అయినా వార్ష్ణేయుని తో చెప్పి,పిల్లలను అతనితో, పంపివేసింది, దమయంతి.
అన్నీ ఓడిపోయిన నలునితో, యింకా యేమైనా మిగిలివున్నదా పందెములో ఓడడానికి ? నీ భార్య అయినా సరే ! మళ్ళీ అన్నీ గెలుచుకోవచ్చు, అని రెచ్చగొట్టాడు పుష్కరుడు. నీళ్లు నిండిన కళ్ళతో, పుష్కరునికి జవాబు చెప్పకుండా,తన దేహం పై వున్న ఆభరణాలన్నీ ఒలిచి పుష్కరునికి యిచ్చి, పైకండువా కూడా లేకుండా, రాజసౌధాన్ని వదలి దమయంతితో సహా, నగర పొలిమేర్లలోనికి వచ్చాడు నలుడు.
నలునికీ, దమయంతికీ యేవిధమైన సహాయం చేసినా, వారితో మాట్లాడినా, దండనకు అర్హులని చాటింపు వేయించాడు ప్రజలకి, పుష్కరుడు. దానితో, యెవ్వరూ నల దమయంతులను పలకరించిన వారుకూడా లేరు. నగర పొలిమేరలలో మూడుపగళ్లు, మూడురాత్రులు కేవలం దగ్గర వున్న సరస్సులో జలపానముచేసి వున్నారువారు.
ఎంతకాలం కేవలం నీటితో వుండగలరు. కొద్దిదూరంలో వున్న అరణ్యంలో యేవైనా కందమూలాలు దొరుకుతాయేమోనని, వారు అరణ్యం వైపు ప్రయాణం సాగించారు. అలా పోతూ వుండగా, బంగారురెక్కలతో వున్న కొన్నిపక్షులు అతనికి కనిపించాయి. ఆ పక్షులను పట్టి ఆహరంగా సేవించవచ్చని, ఆ బంగారురెక్కలను స్వంతం చేసుకుందామని తలంపుతో, నలుడు తన వంటి మీద వున్న ఏకవస్త్రాన్ని, వాటిపై విసిరాడు, లాఘవంగా. అయితే, ఆ పక్షులు ఆ వస్త్రానికి చిక్కకుండా, ఆ వస్త్రాన్నే తమతో గాలిలో తీసుకునిపోతూ, ' ఓ మూర్ఖ శిఖామణీ ! యెక్కడైనా బంగారురెక్కలున్న పక్షులను చూశావా ? మేము నీవు ఆడిన పాచికలము. నీ వైరిపక్షం పంపగా, నీ వద్ద వస్త్రం కూడా లేకుండా చెయ్యాలని వచ్చాము. దిగంబరునిగా ఈ అరణ్యాన్ని యేలుకో ! ' అని చెప్పి ఆ వస్త్రంతో సహా తుర్రుమన్నాయి.
నలమహారాజు దిగంబరుడై దిక్కులు చూస్తూ వున్నాడు. ఆహా ! కలిప్రభావం. ఇంతలో దమయంతి అక్కడికి వచ్చి పరిస్థితి గ్రహించి, తాను కట్టుకున్న చీరలో కొంతభాగం నలునికి యిచ్చి అతని మానం కాపాడింది. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలకు ఖిన్నుడై, నలుడు, ' దేవీ దమయంతి ! ఇక్కడనుండి నాలుగు దారులు నాలుగు నగరాలకు మార్గం చూపుతున్నవి. అందులో యీ మార్గం విదర్భరాజ్యం వైపు వెళ్తుంది. ' అని నర్మగర్భంగా ఆమెను తన పుట్టినింటికి వెళ్ళమని చెప్పాడు నలుడు. ఇది గ్రహించిన దమయంతి, ' రాజా ! నా పుట్టినింటికి నేను ఒక్కదానను వెళ్ళను. మీరుకూడా వస్తే నాకు సమ్మతమే, ఎందుకంటె, మన పిల్లలు యిప్పటికే అక్కడ వున్నారు. మనకు మంచిరోజులు వచ్చే వరకు అక్కడ వుండవచ్చును. ' అని చెప్పింది.
' నేను యీ పరిస్థితులలో రాలేను. రాకూడదు. ' అని చెప్పి, ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని, కేవలం సుఖాలలోనే కాదు, దంపతులు దుఃఖాలలో కూడా ఒకరికొకరు చేదోడుగా వుండాలని భావించి, ఒక చెట్టు క్రింద విశ్రమించారు నలదమయంతులు. దమయంతి నిద్రపోయింది గానీ, నలునికి నిద్రపట్టలేదు. తాను ప్రక్కన వుండగా దమయంతి పుట్టినింటికి వెళ్ళదు, తాను నిష్క్రమిస్తే, ఆమె తండ్రిగారి వద్దకు వెళ్తుందని తలచి, ఆమె ఒంటరితనంలో ఆమె పాతివ్రత్యమే ఆమెకు రక్ష అని తలపోసి, దమయంతి యిచ్చిన వస్త్రఖండాన్నే మొలకి చుట్టుకుని, నెమ్మదిగా అక్కడనుంచి నిష్క్రమించాడు నలుడు.
దమయంతి లేచి చూసేసరికి నలుడులేడు. జరిగినది గ్రహించింది దమయంతి. బిగ్గరగా రోదించింది. నీవు లేకుండా నేను సుఖాలు యెలా అనుభవిస్తాను అనుకున్నావు రాజా ! ఇది నీకు తగునా ! అని విలపిస్తుండగా, ఆఅలికిడికి, అక్కడవున్న కొండచిలువ ఆమె కాలు దొరకగానే పట్టేసుకుని, దగ్గరగా లాక్కొసాగింది, దమయంతిని. దమయంతి పెద్దగా అరవసాగింది, భయంతో.
అదేసమయంలో, వేటకు వచ్చిన ఒక వేటగాడు, కొండచిలువను చంపి, ఆమెను రక్షించాడు. కానీ, ఆమె రూపలావణ్యాలు చూసి, దురాలోచనతో, మీదకు రాసాగాడు. దమయంతికి యేమి చేయవలెనో పాలుపోవక, వెంటనే అగ్నిదేవుని ప్రార్ధించి, నా పాతివ్రత్య ప్రమాణంగా, ఈ కిరాతకుని భస్మం చెయ్యమని వేడుకొన్నది. ప్రాణం రక్షించి తండ్రి స్థానం లో వుండవలసినవాడు, కామంతో కులకాంతను చెరచ ప్రయత్నించి, అగ్నికి ఆహుతి అయ్యాడు, ఆ కిరాతకుడు.
ఆ తరువాత, దమయంతి అడవులలో జీర్ణవస్త్రయై, రేగినజుట్టుతో, శుష్కించిన దేహంతో, నలునికోసం వెదుకుతూ వుండగా, కొందరు వ్యాపారులు ఆమెను చూసి, తాము సుబాహుడనే రాజు పరిపాలిస్తున్న చేదినగరం వెళ్తున్నామని, అక్కడ ఆమె సుఖంగా జీవించవచ్చని చెప్పి ఆమెను చేదినగరం తీసుకువెళ్లారు. నగరంలో ఆమె వారితో కాలినడకన వెళ్తుండగా, రాజసౌధం నుండి, రాజమాత ఆమెను, ఆమె రూపలావణ్యాలను చూసి, ఆమెను తన దగ్గరకు తీసుకురమ్మని చెలికత్తెలను పంపింది.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి