పోతన తలపులో 106
విష్ణుమూర్తి లీలావిభూతుల్ని పరీక్షిత్తు కు
వివరిస్తున్నారు శుకయోగీంద్రులవారు...
***
సుర, సిద్ద, సాధ్య, కిన్నర, వర చారణ,-
గరుడ, గంధర్వ, రాక్షస, పిశాచ,
భూత, వేతాళ, కింపురుష, కూశ్మాండ, గు-
హ్యక, డాకినీ, యక్ష, యాతుధాన,
విద్యాధరాప్సరో, విషధర, గ్రహ, మాతృ-
గణ, వృక, హరి, ఘృష్టి, ఖగ, మృగాళి,
భల్లూక, రోహిత, పశు, వృక్ష యోనుల-
వివిధ కర్మంబులు వెలయఁ బుట్టి
జల నభో భూ తలంబుల సంచరించు
జంతు చయముల సత్త్వరజస్తమో గు
ణములఁ దిర్యక్సురాసుర నర ధరాది
భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర!
***
రాజోత్తమా!
జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మల్ని అనుసరించి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, బేతాళాలు, కింపురుషులు, , , విద్యాధరులు, అచ్చరలు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, సూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు మున్నగు బహు జాతులలో పుట్టి నీటిలోను, నింగిలోను, నేలమీద సంచరిస్తారు. సత్త్వగుణ, రజోగుణ, తమోగుణాలు కలిగి ఉంటారు. ఈ ప్రాణిజాతి అంతా విభిన్న రూపాలతో ఉంటుంది
***
ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబుసు
స్థిరతం జేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్త ప్రజో
త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయున్
హరియించుం బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్.
***
లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు.
విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు.
సంహార సమయంలో హరునికి అంతర్యామిగా ఉంటూ, వాయువు మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు.
***
ఈ పగిదిని విశ్వము సం
స్థాపించును మనుచు నడఁచు ధర్మాత్మకుఁడై
దీపిత తిర్యఙ్నర సుర
రూపంబులు దాన తాల్చి రూఢి దలిర్పన్.
***
ఈ విధంగా ఆ దేవుడు ధర్మస్వరూపుడై తానే పశుపక్ష్యాదులు, నరులు, సురలు మున్నగు సమస్త రూపాలు ధరిస్తాడు. తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు
***
హరి యందు నాకాశ; మాకాశమున వాయు-
వనిలంబువలన హుతాశనుండు;
హవ్యవాహను నందు నంబువు; లుదకంబు-
వలన వసుంధర గలిగె; ధాత్రి
వలన బహుప్రజావళి యుద్భవం బయ్యె-
నింతకు మూలమై యెసఁగునట్టి
నారాయణుఁడు చిదానంద స్వరూపకుం,-
డవ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁ,
డాదిమధ్యాంతశూన్యుం, డనాదినిధనుఁ,
డతని వలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ
జాల రెంతటి మునులైన జనవరేణ్య!
***
శ్రీహరినుండి ఆకాశం పుట్టింది.
ఆకాశం నుండి వాయువు పుట్టింది.
వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు పుట్టాయి.
నీటి నుండి భూమి పుట్టింది.
భూమి నుండి నానావిధ జీవజాలము పుట్టింది.
దీనంతటికి మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే.
ఆయన జ్ఞానానంద స్వరూపుడు,
అవ్యయుడు, పుట్టుకలేని వాడు, అంతంలేనివాడు,
ప్రభువు, ఆదిమధ్యాంత రహితుడు,
జనన మరణాలు లేనివాడు.
ఆయననుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో,
దాని స్వరూపా మెలాంటిదో ఎంత పరీక్షించినా
ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు.....
🏵️పోతన పద్యం🏵️
🏵️పరమాత్మ తత్వావిష్కరణం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి