విదురనీతి 38
అతిథిసేవ:
అతిథి అనగా తిథి, వార నియమాలు లేకుండా ఇంటికి వచ్చినవాడు, అంటే ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా మన ఇంటికి వచ్చినవాడన్నమాట. అతిథిని దైవంగా భావించి సగౌరవంగా సేవించి సాగనంపడం భారతీయ సనాతన సంస్కృతిలో భాగం. ఇది పెద్దల ఆచరణ ద్వారా తరువాతి తరాలకు అందుతున్న సంస్కార భాగ్యం.
అతిథికి ఎదురువెళ్ళి స్వాగతం పలికి ఇంటిలోనికి తీసుకురావాలి. అభిమానం గౌరవం మేళవించి అతిథి యోగక్షేమాలు ప్రశ్నించాలి. కుటుంబ సభ్యులందరికీ అతిథిని పరిచయం చేసి పిల్లలచే మ్రొక్కించి వారి దీవెనలను స్వీకరింప చేయాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అందించాలి. ఆ తరువాత సుఖాసీనుణ్ణి చేయాలి. ప్రయాణపు శ్రమ పోగొట్టాలి. చల్లని నీళ్ళు అందించి దాహం తీర్చాలి. అతిథికి స్నానం ఏర్పాట్లు చూడాలి. స్నానానంతరం అతిథికి ఏకాంతతను సమకూర్చాలి. ఆయన అధ్యాత్మిక భావనలకు తగు ఏకాంత వాతావరణం కల్పించాలి.
శక్తిమేరకు కాలానుగుణంగా దొరికే ఫలాలతో మధుర భక్ష్య భోజ్యాలతో అతిథికి అన్నం పెట్టాలి. ఇంటి ఇల్లాలు అన్నపూర్ణాదేవియై అతిథికి ఆప్యాయంగా వడ్డిస్తూ ఆదరంతో మెలగాలి. అతిథికి ఇష్టమైన పదార్థాలేవో గ్రహించి వడ్డించాలి. సన్యాసులకు మౌనంగాను, మిగిలినవారికి ఆహ్లాదకరమైన సంతోషదాయకమైన సంభాషణలతోనూ ఎలాంటి తర్క వితర్కాలకు తావివ్వని విధంగా భోజనం పెట్టాలి.
భోజనానంతరం శయ్యను ఏర్పాటు చేయాలి. కాస్సేపు సుఖనిద్ర పోనీయాలి. ఆ సమయంలో యజమాని కూడా భోజనం పూర్తి చేసుకొని వచ్చి అతిథి తమ ఇంటికి వచ్చిన పనేమిటో, తాను చేయగలిగిందేమిటో అడిగి తెలుసుకుని శక్త్యానుసారం అతిథి కోర్కెను తీర్చాలి. సంతుష్టుడై ఇల్లు వదిలివెళ్ళే అతిథి, ఆతిథ్యం ఇచ్చిన ఇంట్లో పుట్టెడు భోగభాగ్యాలు వదిలివెళతాడని పెద్దల నమ్మకం.
(ఇంకా ఉంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి