మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
సుఖ దుఃఖాలు..
"ఏమండీ..మీరు శ్రీధరరావు గారి కుమారుడా?.." నా వద్దకు వచ్చి అడిగాడు..ఆయనను అంతకు ముందు నేనెప్పుడూ చూసి వుండలేదు..అప్పుడే తలనీలాలు ఇచ్చినట్లుగా వున్నాడు..బోడిగుండుతో.. చిరునవ్వు నవ్వుతూ నన్నే చూస్తున్నాడు..
"అవునండీ..రెండవ కుమారుడిని..ఇంతకూ మీరూ...?" అని సందేహంగా అడిగాను..
"అనుకున్నాలే..ఆ పోలికలు చూసి..నా పేరు కొండూరు మునుస్వామి..దాదాపు ముప్పై ఏళ్ల నుంచీ ఇక్కడికి వస్తున్నాను..అప్పుడు మీ నాయనగారు ఈ గుడిని నిర్వహించేవారు..ఈ మధ్య ఐదారు ఏళ్ల నుంచీ నేను రాలేదు కానీ..మా పిల్లలు వచ్చి పోతున్నారు.." అని చెపుతూ..
"అయ్యా!..ఈ స్వామి చాలా మహత్తు కలవాడు..మాది మర్రిపూడి మండలం జువ్విగుంట వద్ద మా ఊరు..మేము మొత్తం ఏడుగురు సంతానం.. ఆరుగురు అక్కాచెల్లెళ్ల మధ్య నేనొక్కడినే మొగపిల్లవాడిని..ముప్పై ఏళ్ల క్రిందట మొదటిసారి ఇక్కడికి వచ్చాము..అప్పుడు మా చెల్లెలికి ఆరోగ్యం సరిగా లేకపోతే..ఈ స్వామిని నమ్ముకుంటే బాగవుతుందని మా చుట్టుప్రక్కల వాళ్ళు చెపితే..ఆమెను తీసుకొని మా అమ్మా, నేనూ వచ్చాము..తీరా ఇక్కడికొచ్చాక మాకు తెలిసింది..మా చెల్లెలికి శారీరిక బాధ కాదు..అది గాలి చేష్ట అని..పూర్తి గా మండలం రోజులు ఇక్కడే ఉన్నాము..రోజూ ఆ అమ్మాయి 108 సార్లు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేది..ఇరవై ఐదు రోజుల కల్లా అమ్మాయి కోలుకున్నది..ఆ గాలిచేష్ట అనేది కనబడకుండా పోయింది..ఆ తరువాత కూడా మండలం పూర్తి అయ్యేదాకా ఇక్కడే వుండి.. ఆఖరి రోజు స్వామికి పొంగలి పెట్టుకొని..మొక్కు చెల్లించుకొని మా ఊరు వెళ్ళాము..ఆ ప్రక్క సంవత్సరం ఆ అమ్మాయికి పెళ్లి చేసాము..ఈ స్వామి దయవల్ల లక్షణంగా పిల్లా పాపలతో సంసారం చేసుకుంటున్నది.. " అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు..
"అదిగో! అప్పటినుంచీ ఈ స్వామినే పూర్తిగా నమ్ముకొని ఉన్నామయ్యా..మధ్యలో నా ఆరోగ్యం కూడా సరిగా లేకపోతే..నేను కూడా వచ్చి ఇక్కడ నెల రోజుల పాటు ఉన్నానయ్యా..ఏ డాక్టర్ వద్దకు పోలేదు..నేరుగా ఈ స్వామి సమాధి వద్దకు వచ్చి మొక్కుకున్నాను..తగ్గిపోయింది.." అన్నాడు..
శ్రీ స్వామివారిని అంతగా నమ్ముకున్న మునుస్వామికి జీవితంలో ఏ కష్టాలూ రాలేదా?..అంటే..వచ్చాయి..తీవ్రమైనవే వచ్చాయి..మునుస్వామికి నలుగురు కుమార్తెలు పుట్టారు..మొగ పిల్లలు లేరు..తనకున్నంతలో ఆ పిల్లలను పెంచుకున్నాడు..ఒక కూతురికి పన్నెండేళ్ల వయసులో హఠాత్తుగా జబ్బుచేసి..మరణించింది..ఆ పిల్ల చనిపోయిన తరువాత..ఇంకొక కూతురు ఇరవై..ఇరవైరెండేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం తో మరణించింది..మునుస్వామి తన ప్రారబ్ధం అంతే అనుకున్నాడు గానీ..మొగలిచెర్ల లోని శ్రీ స్వామి వారి దర్శనానికి రావడం మాత్రం మానలేదు..మిగిలిన ఇద్దరు కూతుళ్లకూ వివాహాలు చేసాడు..
ఈ విషయం కూడా మునుస్వామి నాతో చెప్పి.."అయ్యా..ఆ స్వామి దయ వల్ల ఇప్పుడు అందరమూ బాగున్నాము..ఆ స్వామి మమ్మల్ని ఇలాగే చల్లగా చూస్తే చాలు..ఈరోజు వచ్చి మొక్కు తీర్చుకున్నాను.." అన్నాడు..
తన ఇద్దరు కూతుళ్ళూ చనిపోయినా.. మునుస్వామి మనసులో శ్రీ స్వామివారి మీద విశ్వాసం కొంచెం కూడా సడలిపోలేదు..పైగా మరింత భక్తి పెరిగింది..ఆ స్థితప్రజ్ఞత అందరికీ సాధ్యం కాదు అనిపించింది..
మునుస్వామి లాంటి వాళ్ళను చూసినప్పుడు.."ఇంత భక్తి, విశ్వాసాలతో మనం వుండగలమా?..కొద్దిపాటి కష్టం వస్తేనే..దేవుడిని నిందించే ప్రస్తుత సమాజం లో మునుస్వామి లాటి వాళ్ళు చాలా అరుదు.." అని..
నిజమే కదా?..
సర్వం..
దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి