మహాభారతము ' ...69 .
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
అరణ్యపర్వం.
దమయంతి అంత:పురానికి నలుడు, దేవతలు పంపగా వచ్చాడు. ' రాకుమారీ ! నేను నిషిధదేశ రాకుమారుడను. నాపేరు నలుడు. దేవతలు పంపగా దూతగా నీవద్దకు వచ్చాను. నేను మీ స్వయంవరం కొరకై వస్తూ వుండగా, దేవతలు నన్ను సమీపించి, నీవద్దకు దూతగా పంపించారు. నీవు ఇంద్ర, యమ, వరుణ, అగ్ని దేవతలలో యెవరో ఒకరిని స్వయంవరంలో వరించాలని వారు కోరుతున్నారు. ' అని చెప్పాడు.
ఈ మాటలు వినగానే, దమయంతి, యెంతో బాధపడింది. ' ఏమిటి యీదుస్థితి నాకు ! ' అని అడిగింది. నేను యెంతో ప్రేమగా, నలమహారాజును వరించాలని కలలు గంటున్నాను. నాకు యీ పరీక్ష పెట్టడం తగునా ! 'అని వాపోయింది. ' నలమహారాజా ! దేవతలు పూజార్హులే గానీ, పరిణయమాడడానికి అర్హులు కారు. నా హృదయంలో మీరే కొలువై వున్నారు. మీరు నన్ను భార్యగా స్వీకరించకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం. ఆత్మహత్యకు అనేక రకాల విధాలు వున్నాయి. ఏదో ఒకదానిని ఎంచుకోవడమే, నాకు విధిగా తోస్తున్నది. ' అని నలునితో అన్నది.
' దమయంతీ ! దేవతలు కోరి నిన్ను వరించారు. నేను వారి కాలిగోటికి సరిపోను. వారితో విరోధం ప్రాణహానికి దారితీస్తుంది. వారిని తిరస్కరించడమంటే ప్రాణాలతో చెలగాటమే ! ' అని నలుడు దమయంతి కి చెప్పాడు. అయితే, ఆమె చేతులు జోడించి నలునికి నమస్కరించి, అట్టి కర్ణ కఠోరమైన మాటలు మాట్లాడవద్దని చెప్పింది.
' రాకుమారీ ! నా దౌత్యం నేను నిర్వహించాను. నేను ధర్మం తప్పలేదు. దేవతలకు యిచ్చిన మాట మనసా వాచా నిలబెట్టుకున్నాను. నీమనోవాంఛ నెరవేరేటట్లు నీవే, యేదైనా ఉపాయం ఆలోచించు. ' అని ఆమెను సమాధానపరచాడు నలుడు.
అందుకు దమయంతి ' నలమహారాజా ! నాకొక ఉపాయం తోస్తున్నది. స్వయంవరంలో దేవతలతో పాటు తమరు కూడా మీ ఆసనంపై ఆసీనులు కండి. నేను నా ఇష్టప్రకారం స్వయంవరంలో మిమ్ములను వరిస్తాను. ఇందులో మిమ్ములను తప్పు పట్టే పరిస్థితి రాదు. నా మనోవాంఛ నెరవేరుతుంది.' అని మనసులో మాట చెప్పింది.
నలుడు దేవతల వద్దకు తిరిగివెళ్లి, ' దమయంతి తమకందరకూ ప్రణామములు చెప్పింది. స్వయంవరంలో ఆమె నన్ను కూడా పాల్గొనమని చెప్పింది. ఆమె నన్నే వరిస్తానని చెప్పింది. లేకుంటే ఆత్మహత్యే శరణ్యమన్నది. ' అని కల్లాకపటం లేకుండా వారితో చెప్పాడు. నలుని నిజాయితీకి దేవతలు అచ్చెరువొంది, నోటమాటరాక మౌనంగా వుండిపోయారు.
స్వయంవర సమయంలో, దమయంతి పూలహారంతో, ఆశీనులైన పలుదేశాలరాజుల ముందు నుండి వెళుతూ వుండగా, రాజపురోహితుడు వివిధదేశాల రాజులను క్లుప్తంగా పరిచయం చేస్తున్నాడు. చెలికత్తెలు ఆమెవెంట నడుస్తున్నారు. అలా నడుస్తున్న దమయంతి, నలమహారాజు కూర్చున్న సింహాసనం వద్దకు రాగానే, వరుసగా, అయిదు సింహాసనాలలో నలుని రూపం తో అదే వర్చస్సుతో వున్నవారు అయిదుగురు కనిపించారు. వీరిలో అసలు నలమహారాజు యెవరో దమయంతి గుర్తించ లేకపోయింది. ఆమెకు దేవతల పన్నాగం అర్ధమైంది. నలుడు చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. వారితో వైరం మంచిది కాదని, దమయంతి హఠాత్తుగా, చేతులు జోడించి,
' దేవతలారా ! నాకు నలుని వద్దనుండి హంస రాయబారం వచ్చినప్పటినుండి, నేను నలుని త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నాను. వేరెవరినీ నాభర్తగా వూహించలేకున్నాను. కాబట్టి నా సదాచార నియమవర్తన జీవితం పై ఆన. దయచేసి, మీరు మీ నిజ రూపాలలో సాక్షాత్కరించి నలమహారాజును నేను స్వయంవరంలో వరించేటట్లు నాకు తోడ్పడండి. ' అని కోరింది.
ఆమె చిత్తశుద్ధికి, సంకల్పబలానికి సంతోషించి, దేవతలు నలుగురూ, నలుని రూపంలో వుండికూడా, ఆమెకు అర్థమయ్యేటట్లు మార్గం సుగమం చేశారు. ఒక్క నలుని దేహం మాత్రమే, మానవ సహజమైన స్వేద బిందువులతో కనబడేటట్లు, కనురెప్పలు కొట్టుకునేటట్లు, భూమి పై పాదాలు అనేటట్లు,స్ఫుటంగా కనబడసాగాయి. మిగిలిన వారు దేవతలగుట వలన వారికి స్వేద బిందువులు లేవు, అనిమేషులు అవడం వలన, రెప్పల కదలికలు లేవు. వారి శరీరాలు భూమిని తాకడం లేదు. అంతే ! క్షణం ఆలశ్యం చెయ్యకుండా దమయంతి నలుని గుర్తించి, అతని కంఠసీమలో పూలహారం వేసి, తన అంతరంగం సభికులందరి ముందు ఆవిష్కరించింది. దేవతలూ, వచ్చిన వారందరూ, అభినందించారు, దమయంతి కి శుభాకాంక్షలు చెప్పారు.
దేవతలు నలదమయంతులను దీవిస్తూ, నలునికి అనేక వరాలు ప్రసాదించారు. అగ్నిదేవుడు, నలుడు యెప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై, అతని కోరిక తీరుస్తానని వరమిచ్చాడు. ఇంద్రుడు, నలుడు చేసే అన్ని యజ్ఞాలలో కనబడి దర్శనమిస్తానని, జన్మాంతమున పుణ్యలోకాలు ప్రసాదిస్తానని చెప్పాడు. యమధర్మరాజు, నలుడు యెప్పుడూ ధర్మ నిష్టలో ఉండేటట్లు, పాకశాస్త్రం లో అతనిని ప్రవీణుడుగా వుండేటట్లు అనుగ్రహించాడు. వరుణదేవుడు, నలుడు కోరుకున్నంతనే వర్షాలు పడేటట్లు అనుగ్రహించి, సుగంధమైన, యెప్పటికీ వాడని పూలమాలలు అనుగ్రహించాడు.
ఈ విధంగా, నలదమయంతుల పరిణయ ఘట్టం సుఖాన్తమై, యెవరి ప్రదేశాలకు వారు ఆనందంగా వెళ్లారు. నలుడు దమయంతితో సహా, నిషిధ చేరుకొని రాజ్యం జనరంజకంగా పరిపాలించసాగాడు. అశ్వమేధయాగాలు అనేకం చేశాడు. అలా ఆనందంగా నలదమయంతులు ఇంద్రసేనుడు అనే పుత్రుని, ఇంద్రసేన అనే పుత్రికను కన్నారు.
ఇక్కడ, యిలా వుండగా, దేవతలు స్వయంవరం నుండి తిరిగి వెళ్తుండగా, వారికీ దారిలో కలిపురుషుడు కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నావని కలిని వారు ప్రశ్నించగా, ' నేను దమయంతీ స్వయంవరానికి వెళ్తున్నాను ' అని కలి సమాధానం చెప్పాడు. ' అయ్యో ! మేము దమయంతీ స్వయంవరం నుండి వస్తున్నాము. ఆమె నలమహారాజును వరించింది. ' అని దేవతలు చెప్పేరు. నలదమయంతుల అందచందాలను పొగిడారు. వారిరువురి జంట యెంతో బాగున్నది మెచ్చుకున్నారు.
ఈమాట వినగానే, కలిపురుషుని ముఖంలో కోపం ప్రస్ఫుటం అయ్యింది.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
విజయ దశమి శుభాకాంక్షలు తో, శుభాశీస్సలు తో ...
తీర్థాల రవి శర్మ
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి